తాత్కాలిక కోవిడ్19 కేర్ సెంటర్ గా రైల్వే బోగీలు!

కేంద్ర రైల్వే శాఖ ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న కోవిడ్ సమస్యకు తమవంతు సేవగా రైల్వే బోగీలను తాత్కాలిక కోవిడ్19 కేర్ సెంటర్ గా మరియు కోవిడ్ చికిత్స కేంద్రాలుగా మార్చి బోగీలలో అనుమానిత లేదా స్వల్ప లక్షణాలతో బాధపడే రోగులకు అవసరమైన అదనపు బెడ్ లు సౌకర్యం కల్పించడానికి ముందుకు వ‌చ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 215 రైల్వే స్టేషన్లలో ఒక ప్రత్యేక రైలు ను ఏర్పాటుచేసి అందులో గల బోగీలను కేంద్ర ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా సూచించబడిన మార్గదర్శకాల ప్రకారం ఆ రైలులో గల బోగీలను కోవిడ్ చికిత్స అందించేందుకు అనువుగా మార్పు చేసి క్రిమి రహితం చేసి కోవిడ్ కేర్ మరియు కోవిడ్ చికిత్స కేంద్రాలుగా మార్చి నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కేంద్ర రైల్వే అధికారులు స్థానిక రాష్ట్ర నోడల్ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరపడం ద్వారా రాష్ట్రం లో అవసరమైన చోట ఈ ప్రత్యేక రైలు లో కోవిడ్ హెల్త్ సెంటర్ లేదా కోవిడ్ చికిత్స కేంద్రం లను ఏర్పాటు చేసి స్థానిక అధికారులకు అప్ప గించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించిన విధంగా బోగీలలో పైప్ మార్గాలతో ఆక్సిజన్, పడకలు, దుప్పట్లు మరియు ఇతర అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. అంతే కాకుండా ఈ ప్రత్యేక రైలు లో కోవిడ్ అనుమానితులు మరియు కోవిడ్ నిర్ధారించబడిన వ్యక్తులకు సంబంధించి వేరు వేరుగా కోచ్ లను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రత్యేక కోవిడ్ చికిత్స రైలు నందు కోచ్ లలో క్యాబిన్ కి ఒక కోవిడ్ రోగిని అనుమతిస్తారు మరియు .కొన్ని ప్రత్యేక సందర్భం లో క్యాబిన్ కు ఇద్దరినీ అనుమతిస్తారు. ఇప్ప‌ట్టికే దేశం లో సుమారు 85 స్టేషన్లలో ఏర్పాటు చేయబడిన కోవిడ్ చికిత్స ప్రత్యేక రైల్వే బోగీలలో రైల్వే శాఖ వైద్య సిబ్బంది చే సేవలు అందించబడుచున్నది. ఈ రైల్వే స్టేషన్ లలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కోవిడ్ రైలు స్థానిక డేడికేటెడ్ కోవిడ్ ఆసుపత్రికి అనుసంధానము ఉండేలా చూస్తారు. ఒకవేళ ఈ రైలులో చికిత్స పొందుతున్న వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో స్థానిక కోవిడ్ ఆరోగ్య కేంద్రానికి తరలించుటకు గాను అన్నీ వేళల అందుబాటులో ఉండే ఆక్సిజన్ సౌకర్యం గల అంబులెన్స్ ని సైతం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యేక రైలు కోవిడ్ కేంద్రం లో పనిచేసే వైద్య సిబ్బంది స్థానిక జిల్లా వైద్య అధికారి లేదా స్థానిక రాష్ట్ర నోడల్ అధికారి ద్వారా గుర్తించబడి స్థానిక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లో పని చేయటం జరుగుతుంది సూచించిన ప్రమాణాల మేర శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే ఇటువంటి కేంద్రాలలో పనిచేయడానికి అనుమతి ఉంటుంది. ఇక ప్రత్యేక కోవిడ్ రైలు నిర్వహణ లో రైలు ఎక్కడైతే నిలుపబడిందో అక్కడ స్థానిక రైల్వే సిబ్బంది రైలు కు కావలసిన ఎలెక్టికల్ రిపేర్లు గాని చిన్న చిన్న మరమ్మతులు వంటి నిర్వహణ నిర్వహిస్తారు. అవసరమైన చోట భోజన వసతి ఏర్పాట్లు కొరకు IRCTC బాధ్యత తీసుకుంటుంది. అలాగే రైల్వే రక్షక దళం బోగీలలో చికిత్స తీసుకునే రోగులకు, చికిత్స అందించే వైద్యులకు మరియు ఇతర సహాయ సిబ్బంది యొక్క రక్షణ బాధ్యతలు నిర్వహిస్తుంది. స్టేషన్ లో ప్రత్యేక ప్రదేశములో నిలుపబడిన కోవిడ్ రైలు చేరుటకు సరైన సూచీలు మరియు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయడం ద్వారా సామాన్యులు మరియు రోగులు చేరుకొంటారు బోగీలలో ఉష్ణోగ్రతలు పెరగకుండా తగిన చర్యలు చేపడతారు. కోవిడ్19 వ్యక్తుల విసర్జితాలు నిర్మూలనలో కేంద్ర పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ద్వారా సూచించబడిన మార్గదర్శకాలు అనుసరించబడతాయి. మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈ ప్రత్యేక కోవిడ్ చికిత్స రైలు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, పలాసా, విజయనగరం, రేణిగుంట, మంత్రాలయం రోడ్, కొండాపురం(కడప), దిగువ మెట్ట స్టేషన్లలో లో ఈ ప్రత్యేక రైలు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. చికిత్సలు ముగిశాక ట్రైన్ ను తిరిగి రైల్వే శాఖ కు అందించే సమయం లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సూచించబడిన మార్గదర్శకాలు ప్రకారం ఈ ప్రత్యేక రైలు ను క్రిమి రహితం చేసి రైల్వే శాఖకు అప్ప చెప్పడం జరుగుతుందని కోవిడ్ 19 స్టేట్ నోడ‌ల్ అధికారి డాక్ట‌ర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.

బువ్వ తినే పైసలతో బ్రాందీ, విస్కీ తాగేస్తుండు!

గరీబోనికి సర్కారికిచ్చిన 1500 రూపాయిలు మందు తాగనీకే ఖర్చయిపోయే. గిప్పుడు రాక్షస పాలనలో ఫార్మ్హౌస్ ముఖ్యమంత్రి 5 దినాల్లో 600 కోట్ల రూపాయిల మందు తాపించి, ఇంట్లో ఆడోళ్ళ, చిన్నపిల్లల బతుకులు కూలుస్తుండు అంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుప‌డుతోంది. మందు పేరుతో సామాజిక దూరం పోయి వైరస్ కు జనాలు బలైతే, తాగొచ్చి ఆడోళ్లను, పిల్లలలను కొడుతుంటే, బువ్వ తినే పైసలతో బ్రాందీ, విస్కీ తాగేస్తుంటే, ఆ పాపం, ఏడుపు తగిలి నీ సర్కారు త్వరలో నాశనమౌతదని మహిళలు శాపాలు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి అన్ని రుగ్మతలకు కారణం మద్యం కాబట్టి దీన్ని దశలవారీగా నియంత్రణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన‌ని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. మ‌ద్యం షాపుల‌కు సంబంధించిన స‌మాచారాన్ని టి.కాంగ్రెస్ ఆర్టీఐ ద్వారా సేక‌రించింది. తెలంగాణాలో ఎన్ని బెల్టు షాపులు ఉన్నాయి అని అడగగా ఏమీ లేవు అని స‌ర్కార్ స‌మాధానం ఇచ్చింది. అయితే ఎన్ని ఇల్లీగల్ కేసులు బుక్ అయ్యాయని అడగగా 22 జిల్లాల వారిగా 17952 కేసులు నమోదయ్యాయి అత్యధికంగా వికారాబాద్ జిల్లా కింద పరిగి ఎస్ హెచ్ ఓ కింద 8233 కేసులు నమోదయ్యాయి మహబూబ్ నగర్ జిల్లా 1022 జగిత్యాల కింద 783, రంగారెడ్డి కింద 784 గు వనపర్తి 492, సంగారెడ్డి 889, కరీంనగర్ 722, సిద్దిపేట్ 419 ,మహబూబాబాద్ 354 ,జనగాం 511 ,వరంగల్ 481, సికింద్రాబాద్ 153, మెదక్ 462, నిజామాబాద్ 217, కొత్తగూడెం 496, మేడ్చల్ 280, పెద్దపల్లి 1024 నమోదయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఎనిమిది కోట్ల 50 లక్షల జనాభా ఉన్న 23 జిల్లాల్లో లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం ఆర్టీఐ ద్వారా వచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. 2008 నుంచి 2009 వరకు 4888.18, కోట్లు 2009 నుంచి 2010 వరకు 5595.07 కోట్లు 2010 నుంచి 2011 వరకు 6512 కోట్లు 2011 నుండి 2012 వరకు 7275 కోట్లు 2012 నుంచి 2013 వరకు 8575 కోట్లు 2013 నుంచి 2014 వరకు 9890 కోట్ల 63 లక్షలు అంటే లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం 26 శాతం. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుండి 2019 వరకు అంటే 3 కోట్ల 75 లక్షల జనాభా ఉన్న ఉమ్మడి పది జిల్లాల ఆర్టీఐ ద్వారా పొందిన ఆదాయ వివరాలు ఇలా వున్నాయి. 2014 నుంచి 2015 వరకు 10,853 కోట్లు 2015 నుంచి 2016 వరకు 12,706 కోట్లు, 2016 నుంచి 2017 వరకు 14,184 కోట్లు 2017 నుంచి 2018 వరకు 17,597 కోట్లు 2018 నుంచి 2019 వరకు 20,859 కోట్లు అంటే లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం 65 శాతం ఆదాయం పెరిగింది. 2019 ఏప్రిల్ అనగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో 1884 కోట్ల యాభై ఐదు లక్షల అమ్మకాలు జరిగినట్లుగా నమోదయింది. 2019 డిసెంబర్ 30 31 రెండు రోజుల ఆదాయం 450 కోట్లు గత సంవత్సరం డిసెంబర్ 30, 31 అమ్మకాలతో పోల్చితే నాలుగు శాతం ఎక్కువ.. ఉదాహరణకి పంజాబ్ రాష్ట్రాన్ని తీసుకుంటే 2017-18 లో లిక్కర్ మీది ఆదాయం 5,136 కోట్లు, 2018 నుంచి 2019 లో 5,450 కోట్లు నమోదయింది. అంటే 10 నుంచి 12 శాతం పెరిగినట్లు తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం వసతి లిక్కర్ నమ్మకమే అన్నట్లు 65 శాతానికి పెంచిన ఘనత ఈ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో లో ఏ పాలసీ అయినా ఆలస్యం కావచ్చేమో కానీ లిక్కర్ పాలసీ మాత్రం ఒక రోజు కూడా అటు ఇటు కాలే దీన్నిబట్టి ఇ రాష్ట్ర ప్రజల పైన ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుంది. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తూ రాష్ట్రంలో నేర ప్రవృత్తి పెరిగేందుకు కారణం అవుతుంది. రహదారులకు 500మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు నెలకొల్పాల్సి ఉండగా...రహదారికి 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలను నెలకొల్పేందుకు అనుమతులు ఇవ్వడం ప్రభుత్వ భాద్యతరహిత్యాన్నికి నిదర్శనంగా చెప్పొచ్చు. దిశ ఘటన జరిగాక అయిన ప్రభుత్వం మద్య నియంత్రణ కు చర్యలు తీసుకుంటుందని ఊహించాం కానీ సర్కారు ఆదిశగా ఏమాత్రం కృషి చేయడం లేదు.అత్యాచారాలు నిత్యం జరుగుతుండటానికి గల ప్రధాన కారణమైన లిక్కర్ ను ప్రభుత్వం అదుపు చేయకపోవడమే...తక్షణమే ప్రభుత్వం మద్యం నియంత్రణకు దశల వారీగా చర్యలు తీసుకోవాల‌ని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. గుజరాత్ రాష్ట్రంలో మద్యపాన నిషేదం ఉంది.మరి మోడి గారు దీన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయవచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నీరా పాలసి నడవాలన్న బెల్టు షాపులు బందు కావలి. అరోగ్య వంతమైన తెలంగాణ గా తీర్చి దిద్దలంటె మద్యాని నియంత్రించ వలసిన బాధ్యత ప్రభుత్వనిదే. లేనిచో ఈ మహిళా లోకాన్ని చైతన్య పరిచి ఉద్య‌మించ‌డానికి తెలంగాణా పిసిసి యాక్ష‌న్ ప్లాన్ రూపొందించుకుంటోంది.

మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం!

మొహంపై చెరగని చిరునవ్వుతో, ఆప్యాయంగా పలకరిస్తూ ఎంతటి బాధలో నున్న వారికైనా ఓదార్పునిస్తున్నారు నర్సులు. ఈ అపత్కాల సమయంలో నర్స్‌లే బాధితులకు కొండంత అండగా వుంటున్నారు. ప్రస్తుత కరోనా వైరస్‌ ‌కట్టడి చేసేందుకు వైద్యులతో పాటు నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్‌ ‌కట్టడికి వేల సంఖ్యలో నర్సులు కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వైరస్‌ ‌తమనే అంతం చేస్తుందని తెలుసు. అయినా వారి లక్ష్యం ఒకటే. బాధితులను ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపించడం. ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ‌మహమ్మరిని అరికట్టేందుకు నర్సులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. బాధితులకు చికిత్స మరియు సంరక్షణను అందిస్తున్నారు. వారి సేవలు వెలకట్టలేనివి. ప్రమాదం అంచున నిలబడి వైరస్‌ ‌బారిన పడిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నిరంతరం రోగుల మధ్యనే వుంటూ జబ్బులతో పోరాటం చేస్తూ వుంటారు. అంటు రోగాలతో సహవాసం చేస్తుంటారు. రాత్రి వేళల్లో సైతం డ్యూటీలు చేస్తుంటారు. పని ఒత్తిడిని ఎదుర్కోవడం, ఎదుటి వ్యక్తి బాధలను ఓపికగా వినడం వారికి వృత్తిలో అలవాటు అయిన లక్షణాలు. వారి ఓదార్పు మాటలు, సేవలు రోగులకు మనోధైర్యాన్ని ఆత్మ స్టైర్యాన్ని కలిగిస్తూ వారి జబ్బులను సగం నయం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ విపత్కర సమయంలో ఒక యజ్ఞం వలె సేవలందిస్తున్న నర్సుల సేవలకు వెలకట్టలేం. కరోనా సోకితే కన్న బిడ్డ నైనా తాకలేం. బంధువులైనా, ప్రాణ స్నేహితులైరా సరే దగ్గరికి రాలేరు. ఒక రకంగా ఒంటరైన పేషేంటుకు హాస్పిటలే దిక్కు. అలాంటి పేషేంట్‌ ‌దగ్గరకు ఆత్మీయంగా వచ్చి సేవలు అందించే వ్యక్తి అన్నీ తానై వ్యవహరించి అమ్మను మరిపిస్తుంది. కరోనా విలయంలో "అమ్మ"లా ఆదరిస్తూ,కనిపించే దైవాలుగా వైద్య సేవలు అందిస్తున్న "నర్సు" లందరికి శుభాకాంక్షలు.

అడవుల్ని సైతం వ‌ద‌ల‌డం లేదు! మడ అడవుల్ని జగన్‌ నుంచి కాపాడండి! చంద్ర‌బాబు పిలుపు

మడ అడవులను వైసీపీ ప్రభుత్వం ఎలా నరికేసి, మట్టి నింపేస్తుందో చూడంటూ చంద్రబాబునాయుడు పోస్టు పెట్టారు.  ఐక్యరాజ్య సమితి సైతం కోరింగ మడ అడవులను గుర్తించింది. కాకినాడకు రక్షణ కవచం లాంటివి మడ అడవులు. ఇలా నరికేస్తే రేపు తుపానులొచ్చినప్పుడు ప్రజల సంగతి ఏంటీ? ఇలాంటి చోట ఇళ్లు కట్టుకుంటే ఆ పేదలకు రక్షణ ఏంటి? తూర్పు గోదావరి జిల్లాలోని మడ అడవులను నరికివేయిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఆ అడవులు ఎలా ఉండేవో, నరికివేతతో అక్కడి ప్రాంతం ఎలా మారిపోయిందో తెలుపుతున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. 'ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించిన కోరింగ మడ అడవులను వైసీపీ ప్రభుత్వం ఎలా నరికేసి, మట్టి నింపేస్తుందో చూడండి. ఇలాంటి చోట ఇళ్లు కట్టుకుంటే ఆ పేదలకు రక్షణ ఏంటి?' అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మడ అడవులను జగన్‌ నుంచి కాపాడాలంటూ హ్యాష్ ట్యాగ్ జోడించారు.

తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తే సహించం: కేసీఆర్

మాకు చెప్పకుండా కొత్త ప్రాజెక్టా? జ‌గ‌న్ స‌ర్కార్‌పై కేసీఆర్ ఆగ్రహం! వ్య‌క్తం చేస్తున్నారు. శ్రీశైలం జలాలపై కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయాన్ని అడ్డుకుని తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించేలా ఏపీ ప్రభుత్వం జీఓ తీసుకురావడం విభజన చట్టానికి విరుద్ధమని, అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకుని తప్పు చేశారని, ఈ విషయంలో తమను సంప్రదించకపోవడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టును ఆపాలంటూ కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డులో రాష్ట్రం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించగా, ఈ విషయంపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అపెక్స్ కమిటీ నుంచి ఆమోదం పొందకుండానే ఏపీ ముందడుగు వేసిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టు రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టని, ఏ కొత్త నిర్మాణమైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించే తీసుకోవాలని, ఈ ప్రాజెక్టుతో పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీటి సమస్య ఏర్పడుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో నెలకొన్న విభేదాలను, వివాదాలను పక్కనబెట్టి నదీ జలాలను వాడుకుందామని తాను స్నేహహస్తం అందించానని, బేషజాలు లేకుండా తాను చొరవ చూపితే, తమను సంప్రదించకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం బాధను కలిగించిందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోనని అన్నారు. నదిలో నీటి వాటాలను తేల్చడంలో ట్రైబ్యునల్ లో జాప్యం జరుగుతోందని గుర్తు చేసిన ఆయన, సత్వర న్యాయం కోసం అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించాలని అన్నారు.

మే 18 నుంచి ఎగరనున్న దేశీయ విమానాలు!

ఈ నెల 17‌తో లాక్‌డౌన్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ తర్వాతి రోజు నుంచి దేశీయ విమాన సర్వీసులు నడపాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చిన కేంద్రం విమాన సేవలు పునఃప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం. విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలపై డీజీసీఏ, సీఐఎస్ఎఫ్, విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులు, డీఐఏఎల్ అధికారులతో కూడిన కమిటీ ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న తనిఖీలు నిర్వహించింది. సర్వీసులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి దేశీయ సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికార వర్గాలు తెలిపాయి.

రాజధాని తరలింపు ప్రక్రియ జోరందుకుందా?

వాస్తవానికి ఉగాదినాడే విశాఖ‌ నుంచి పాలనకు శ్రీకారం చుట్టాలని ముఖ్య‌మంత్రి భావించారు. కానీ హైకోర్టు అభ్యంతరాలు, కరోనా పరిస్థితులతో అది నిలిచిపోయింది. అయినప్పటికీ రాజధాని విషయంలో పట్టుదలతోనే వుంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. ఎలాగైనా విశాఖకు రాజధాని తరలించాలనే ధ్యేయంతో ఉంది. ఇందుకు సంబంధించి మే 28వ తేదీ ఉదయం 8గంటలకు ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది.అయితే ముందుగా భావించినట్టు సచివాలయం మిలీనియం టవర్స్ లో కాకుండా వేరేచోటకు తరలించనున్నారు. 20 లారీలలో ఫర్నిచర్ తరలిస్తున్నారు. సచివాలయం గ్రేహౌండ్ కంపౌండ్ లోని ఇండియా బుల్స్ -విజ్ఞాన్ సమీపంలో ఉండనుందని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గుట్టుగా పనులు జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలతో కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఉద్యోగులను బదిలీ చేయకుండా ఆన్ డ్యూటీపై విశాఖ నుంచి పనిచేయించాలని భావిస్తున్నార‌ట‌. అయితే, ఈ విషయంపై అధికారులు ఎవరూ నోరు మెదపడంలేదు. అందరూ చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఏం మాట్లాడితే ఏం సమస్య వస్తుందో అని సైలెంటుగా ఉంటున్నారు. ప్రభుత్వం ఆన్ డ్యూటీ ఇచ్చి మరీ కొందరు కీలక శాఖల ఉద్యోగులను విశాఖ పంపాలని పట్టుదలగా ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగసంఘాలకు ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.అయితే దీనిపై వారు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆన్ డ్యూటీపై ఉద్యోగులను పంపితే న్యాయపరమయిన చిక్కులు ఉండవంటున్నారు అధికారులు. ఆన్ డ్యూటీపై పంపొద్దని చెప్పడానికి నిబంధనలు ఏవీ లేవని, ఈ అవకాశాన్ని వాడుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది. రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద విశాఖకు సచివాలయం తరలింపు విషయంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

డాక్టర్లు, నర్సులకు గ్రీన్ కార్డు!అమెరికా కాంగ్రెస్ బిల్లు

కరోనా కారణంగా అమెరికా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది. ఈ డెడ్లీ వైర‌స్ తో ప్ర‌పంచవ్యాప్తంగా 2,80,000 మంది చనిపోతే అమెరికాలోనే 80 వేల మరణాలు ఉన్నాయి. 13 లక్షలకు పైగా కేసులు ఉన్నాయి. కరోనా గజగజ వణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా చట్టసభ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ కేటాయించని దాదాపు 40వేల గ్రీన్ కార్డులను విదేశీ డాక్టర్లు, నర్సులకు తక్షణమే జారీ చేయాలని అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో బిల్లు ప్రవేశ పెట్టారు. డాక్టర్లు, నర్సులకు తక్షణమే గ్రీన్ కార్డు ల‌భించేలా అమెరికా కాంగ్రెస్ బిల్లును తీసుకు వచ్చింది. అమెరికాలో స్థిరపడటానికి ఈ బిల్లు ద్వారా డాక్టర్లు, నర్సులకు అవ‌కాశం ల‌భించింది. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే 25,000 మంది నర్సులు, 15,000 మంది డాక్టర్లకు గ్రీన్ కార్డులు లభిస్తాయి. అక్కడే ఉండాలనుకునే H1B, J2 వీసాలపై ఉన్న ఇండియన్ డాక్టర్స్, నర్సులకు ఇది ప్రయోజనం. అమెరికాలో వివిధ కంపెనీలలో పని చేసేందుకు H1B వీసాలను మంజూరు చేస్తుంది అమెరికా. చైనా, భారత్ నుండి ఈ వీసా దరఖాస్తులు ఎక్కువగా వస్తాయి. అమెరికాలో ఇప్పుడు డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ది హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ రీసైలెన్స్ యాక్ట్ ప్రకారం ఏళ్లుగా వినియోగించకుండా ఉన్న గ్రీన్ కార్డులకు అనుమతిచ్చే అధికారం కాంగ్రెస్‌కు ఉంది. కార్డులను మంజూరు చేయడం ద్వారా అక్కడి పౌరులకు వైద్య సహాయం అందించడంతో పాటు శాశ్వత నివాసం పొందవచ్చు. గ్రీన్ కార్డు అంటే శాశ్వత నివాస ధృవీకరణ పత్రం. గతంలోనే కాంగ్రెస్ ఆమోదించినప్పటికీ జారీ కానీ గ్రీన్ కార్డులను ఇప్పుడు మంజూరు చేయాలని ఈ బిల్లులో పేర్కొన్నారు.

నాటుకోళ్లను తినొద్దు! నెల రోజుల వరకు పాలు తాగవద్దు?

స్టెరీన్ గ్యాస్ ను పీల్చిన గేదెల నుంచి తీసే పాలను నెల రోజుల వరకు తాగవద్దని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ప‌శువులు ఆ గాలి పీల్చడంతో కడుపులో ఇంకా పాలిమర్ నిక్షేపాలు ఉంటాయి. అందుకే వాటి పాలు అసలు తాగవద్దని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో వున్న గేదె, ఆవు పాలు  తాగితే ఊపిరితిత్తులు, చర్మం పై దద్దుర్లు, తలనొప్పి, వికారం, వాంతులు, ఆయాసం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.  పశువులకు అక్కడి గడ్డిని సైతం మేతగా వేయవద్దంటున్నారు ప‌శు వైద్యులు. అక్కడ పెంచుకునే నాటుకోళ్లను తినొద్దట. వాటి శరీరంలోకి విషవాయువు వెళుతుందని..వాటి మాంసం తినడం వల్ల దుష్పప్రభావాలు వస్తాయని చెబుతున్నారు బయో సెంటిస్టులు. మేక, పొట్టేలు వంటి వాటి మాంసాన్ని తినరాదు. ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఇబ్బంది పడక తప్పదు. పశువులకు అక్కడ పంట పొలాల్లో పైరుగా వేసిన జొన్న లేక చొప్ప. పిల్లి పెసర, మొక్కజొన్న వంటి గడ్డి జాతిని గానీ ఎండుగడ్డిని గానీ మేతగా వేయవద్దంటున్నారు పశువుల డాక్టర్లు.  వాతావరణం అంతా పూర్తిగా కలుషితమైంది. పాలిమర్ రూపంలో స్టెరీన్ నిక్షేపాలు సూక్ష్మ ధాతువులుగా ఉండిపోయాయి. మరికొద్ది రోజుల వరకు దాని ప్రభావం ఉంటోంది. పూర్తిగా ఆ ప్రాంతాన్ని స్టెరిలైజ్ చేస్తే తప్ప యధాతథ స్థితికి రాదు. ఇళ్ల పై పెద్ద మొత్తంలో నీరు చల్లడంతో పాటు రసాయానాలతో ఇళ్లను శుద్ది చేస్తేనే అక్కడకు వెళ్లే వీలుంది. అప్పటి వరకు శిబిరాల్లోనే ప్రజలు ఉండాలి.  హడావుడిగా శిబిరాల నుంచి వారిని ఇళ్లకు పంపితే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

7వేల 992 కోట్ల రూపాయ‌ల డ‌బ్బు ఏమైంది? టిపిసిసి

క‌రోనా ముసుగులో కేసీఆర్ ప్ర‌భుత్వం దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని  తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కోట్ల రూపాయ‌లు దోచుకుతింటున్నారంటూ టిపిసిసి అధికార ప్ర‌తినిధి ఇందిరాశోభ‌న్ తెలంగాణా ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నారు. క‌రోనా నిధుల గుల్‌మాల్ పై గుట్టువిప్పుతానంటున్నారు.   కేంద్ర ప్ర‌భుత్వం కరోనా నిర్మూలనకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 6082 కోట్లు ఇచ్చింది. పైగా విరాళాల రూపంలో మ‌రో 500 కోట్ల రూపాయ‌లు వ‌చ్చాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల జీతాల కోత పెట్టి 4000 కోట్ల రూపాయ‌లు మిగుల్చుకుంది. మొత్తం 10వేల 582 కోట్ల రూపాయ‌లు. ఒక్క కరోనా రోగికి కోలుకోవడానికి అయ్యే ఖర్చు రూ. 3.5 లక్షలు. అయితే తెలంగాణాలో వున్న  మొత్తం 1100 రోగులకు అయ్యే ఖర్చు 39 కోట్ల రూపాయ‌లు.  ఇప్పటి వరకు జరిగిన మొత్తం కరోనా అనుమానితుల పరీక్షలు 20000 మందికి. ఒక్కొక్కరికి రూ. 4500 ఖర్చు. మొత్తం కరొనా పరీక్షలకు ఖర్చు రూ. 9 కోట్లు. క్వారంటైన్ లో ఉన్న ఒక్కరికి ఒక రోజు ఖర్చు 500 రూపాయ‌లు. మొత్తం 30000 మందికి 28 రోజుల క్వారంటైన్ ఖర్చు 42 కోట్ల రూపాయ‌లు. ఆస్పత్రుల ఏర్పాటుకు 100 కోట్ల రూపాయ‌లు. రాష్ట్రం పేదలకు‌ ఇస్తున్న ఒక్కొక్క‌రికి  రూ.1500 లు చొప్పున  రూ. 1200 కోట్లు. 12 కిలోల బియ్యం విలువ : రూ.1000  కోట్లు. (రాష్ట్రం ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న 12 కిలోల బియ్యం లో.. కేంద్రం ఇస్తున్న 5 కిలోల బియ్యం కూడా ఉన్నవి. ఆ ఐదు కిలోల లెక్క త‌గ్గిస్తే వెయ్యి కోట్లు కాదు ఇంకా త‌గ్గుతుంది.) ఉద్యోగుల బోనస్: రూ. 100 కోట్లు. ఇతరములు : రూ. 100 కోట్లు. ఇలా మొత్తం  ఖర్చు సుమారుగా   2 వేల 590 కోట్లు మాత్రమే. అయితే మిగిలిన 7 వేల 992 కోట్ల రూపాయ‌ల డ‌బ్బు ఏక్కడికి పోయిందని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ప్ర‌శ్నిస్తోంది.

24 గంటల్లో 4,213 మంది! భారత్‌లో కరోనా విల‌య‌తాండ‌వం! 

భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఏ రోజూ నమోదుకానన్ని అత్యధిక కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 4,213 మందికి కొత్తగా కరోనా సోకింది. గత 24 గంటల్లో భారత్‌లో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,206కి చేరింది.  దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 67,152కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 20,917  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 44,029 మంది చికిత్స పొందుతున్నారు.

కజిరంగా పార్క్‌లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి!

అసోం రాష్ట్రంలోని కజిరంగా జాతీయ వనంలో అరుదైన రాయల్ బెంగాల్ టైగర్ కళేబరం వెలుగుచూసింది. కజిరంగా జాతీయ వనంలోని బగోరి రేంజ్ లో పులి కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పులి కళేబరానికి పశువైద్యాధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పులి ఏడు రోజుల క్రితం మరణించి ఉంటుందని పశువైద్యులు తేల్చారు.  ఈ ఏడాది కజిరంగా జాతీయ వనంలో ఒక పులి మరణించింది. మళ్లీ రెండో పులి మరణించింది. ఈ పులి కళేబరం వద్ద ఏకే 47 రైఫిల్ తూటాలు లభించాయి. దీంతో వేటగాళ్లు ఈ పులిని చంపి ఉంటారని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ జాతీయ వనంలో 121 రాయల్ బెంగాల్ పులులున్నాయి. వీటితోపాటు కొమ్ములున్న ఖడ్గమృగాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో పులులు, ఖడ్గమృగాలకు మధ్య దాడులు కొనసాగుతుంటాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కజిరంగా జాతీయ వనంలో సందర్శకులను నిలిపివేశారు.

జులైలో కరోనా తారస్థాయికి చేరుకుంటుంది! ప్రపంచ ఆరోగ్యసంస్థ

భార‌త్‌లో కరోనా వైరస్‌ జూలై నెల‌లో తారస్థాయికి చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రాయబారి డేవిడ్‌ నబరే విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల్లో తమిళనాడు గురించి ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఆయన ఏమన్నారంటే.... భారత్‌లో కరోనా వైరస్‌ కట్టడయ్యేందుకు ముందు జూలైలో ఉచ్చస్థితికి చేరుకుంటుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతాయ‌ని ఆయ‌న త‌న నివేదిక‌లో తెలిపారు. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడులో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. తమిళనాడు కోయంబేడు మార్కెట్‌ 2,167 మందిని బాధితులుగా మార్చింది. పొరుగు జిల్లాల నుంచి వచ్చే హోల్‌సేల్, రిటైల్‌ కూరగాయల వ్యాపారులు భౌతికదూరం పాటించడంలో నిర్లక్ష్యాన్ని చూపడం శాపంగా మారింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పాజిటివ్‌ కేసులు పెరిగినా వైరస్‌ వ్యాప్తి స్థిరంగా ఉంటుంది. భారత్‌ అత్యంత వేగంగా కట్టుబాటు చర్యలను అమల్లోకి తెచ్చినందున వైరస్‌ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయగలిగారు. జనాభా అత్యధికంగా ఉండే భారత్‌లో వైరస్‌ కట్టడి చేయడం ఎంతో కష్టం. భారత్‌లో లాక్‌డౌన్‌ చర్య ఎంతో మంచి ఫలితాలను ఇచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ రాయబారి డేవిడ్‌ నబరే అభిప్రాయ‌ప‌డ్డారు.

స్టైరీన్‌ ప్రభావిత గ్రామాల్లో బస చేయండి! మంత్రుల‌కు సి.ఎం. ఆదేశం!

మంత్రులు, అధికారులకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు ఇచ్చారు. గ్యాస్‌ ప్రమాద బాధితులు ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులు మెరుగుపరచాలన్నారు. ప్రభావిత గ్రామాల్లో ఇంటా, బయట పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ చేయాలని సూచించారు. రసాయన అవశేషాలు లేకుండా శానిటైజేషన్‌ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సోమవారం సాయంత్రానికి ప్రజలు ఇళ్లకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు గ్యాస్‌ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో రాత్రి బస చేయాలని చెప్పారు. వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలన్నారు. సోమవారం ఉదయం మంత్రులు, అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందజేయాలని పేర్కొన్నారు. పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. ఆర్థిక సాయం అందలేదని బాధితులెవరూ విజ్ఞాపనలు చేసే పరిస్థితి ఉండకూడదని సీఎం పేర్కొన్నారు. స్టైరీన్‌ రసాయనం విశాఖలో ఉంచడానికి వీల్లేదని సీఎం జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. గ్యాస్‌ లీక్‌ ప్రాంతాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని సీఎంకు అధికారులు వివరించారు.

బస్తాకు రూ.70వరకూ పెరిగిన సిమెంటు ధర!

సిమెంటు ధర మండిపోతోంది. బస్తాకు ఏకంగా రూ.70 వరకూ పెరగడంతో నిర్మాణరంగం పరిస్థితి నిప్పుల కొలిమిలో పడినట్లయింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా నిర్మాణాలు ప్రారంభిద్దాం అనుకునేసరికి సిమెంటు ధర ఆకాశాన్నంటుతోంది. కంపెనీని బట్టి ఒక్కో బస్తా రేటు రేటు రూ.70వరకు పెరిగింది. గతంలో రూ.250 ఉన్నది ఇప్పుడు రూ.320కి, గతంలో రూ.300 ఉన్న బ్యాగ్‌ ఇప్పుడు రూ.370 అయింది. దూరాభారాన్ని బట్టి దాదాపు రూ.400కు కూడా చేరుతోంది. ఏపీలో నిర్మాణ రంగంపై ఆధారపడిన సుమారు 20 వృత్తుల వారు దాదాపు 40లక్షల మంది ఉన్నారని అంచనా. ఇంతమందికి ఉపాధి కల్పించాల్సిన నిర్మాణదారులు బేలచూపులు చూస్తున్నారు. మోయలేనంత భారంగా ఉన్నా ప్రాజెక్టులు పూర్తిచేద్దామని అనుకున్నవారు.... ధరల పెరుగుదలతో మరింత బెంబేలెత్తిపోతున్నారు. కరోనా కారణంగా సుమారు 50రోజులు సిమెంటు అమ్మకాలే లేవు. నిర్మాణ రంగం మొత్తం స్తంభించిపోయింది. క‌రోనాకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇసుకకు ధర పెట్టడం, ఇసుక కొరతతో పెరిగిన ధరలు, మూడు రాజధానుల నిర్ణయంతో ఎక్కడికక్కడ అమ్మకాలు నిలిచిపోవడంతో నిర్మాణ దారులు కుదేలయ్యారు. చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అప్పులు చేయాల్సి రావడం, వాటికి పెరుగుతున్న వడ్డీలు.. ఇవన్నీ పడలేక కొందరు హైదరాబాద్‌కు తరలిపోయారు. మరికొందరు అసలు ఈ రంగమే వదిలేశారు. అన్ని రకాలుగా ఇబ్బందుల్లో చిక్కుకున్న నిర్మాణదారులను ఆదుకోవడానికి రాయితీలు ఇవ్వడం, వీలైతే ధరలు తగ్గేలా ప్రభుత్వం చూడాల్సి ఉంది. కానీ దీనికి రివర్స్‌లో ధరలు పెరగడంతో నిర్మాణదారులు హతాశులవుతున్నారు.

దీర్ఘకాలం ప్రభావం చూపనున్న విశాఖ విషవాయువు..!

విశాఖలో తలెత్తిన విపత్కర పరిణామాలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. పండించే పంట నుండి భూగర్బంలోనిండి వచ్చే నీటి బిందువు వరకూ కలిషితమైపోయినట్టు నిపుణులు నిర్ధారిస్తున్నారు. పీల్చే గాలి కూడా కలిషితం అయిపోయిట్టు, అవన్ని సామన్యస్థితికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో పచ్చదనం అన్న పదమే లేదు . ఇప్పటివరకు పండించిన పంట అంతా నాశనం అయిపోయింది . బావుల్లో నీరు తాగడానికి కాదు కదా కనీసం వాడేందుకు కూడా పనికిరాకుండా పోయాయి. ఇక మనిషి శరీరంలో ఉన్న స్టైరీన్ పాలీమర్ గా మారి విషవాయువుని ఉత్పత్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమ నుండి వెలువడిన గ్యాస్ చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు ఉన్న ప్రకృతిని నాశనం చేసింది. 12 మంది ప్రాణాలు వదలగా కొన్ని వందలమంది ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . ఈ గ్యాస్ పీల్చిన వారు కాకుండా ప్రస్తుతానికి ప్రాణాలతో బయటపడిన వారిలో కూడా దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి అని వైద్యులు మరియు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలో పుట్టబోయే చాలామంది అంగవైకల్యం బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయట. ఎల్జీ పాలిమర్స్ వెదజల్లిన విషవాయువు వల్ల ప్రకృతి అందించే ఫలాలను కూడా తినకూడని పరిస్థితులు తలెత్తాయి. ప్రకృతిలో దొరికే ఎన్నో త్రాగే, ఆహారాలను విషవాయువు వినాశనం చేసింది. ఈ విషవాయువు వల్ల మొత్తం ప్రకృతే కాకుండా ప్రకృతి మీద ఆధారపడిన జీవకోటి మనుగడకు కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పంట పొలాలు కలుషితమై పండిన పంటలు తినేందుకు ప‌నికిరావ‌ట‌. పంటపొలాల్లో ఉండే బావుల్లో నీటి పరిస్థితి కూడా ఎంతొ ప్రమాదకరంగా మారినట్టు తెలుస్తోంది. తాగడానికి, వాడకానికి అస్సలు పనికి రావని తెలుస్తోంది. పెద్ద ఎత్తున వర్షం వచ్చి నీరు కొట్టుకు పోవడం గానీ, ఆ నీరు ఎండిపోవడం గానీ జరిగితే పాలిమర్ ప్రభావం తగ్గుతుంది తప్ప అప్పటివరకూ విషప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఈ వాయువు తీవ్ర దుష్ప్రభావాని చూపుతుందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన నిపుణులు అక్కడ అంతా విషపూరితం అయిపోయింది అని తేల్చి చెప్పారు . త్రాగు నీరు, ఆహారం , భూమి, ఆకాశం లోని వాయువు అన్నీ కలుషితం అయినట్లు తెలిసిన వారు మరికొన్ని సంవత్సరాలు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. చుట్టూ ఉన్న గ్రామస్తులంతా ఆ ప‌రిశ్ర‌మ‌ను ఇక్క‌డి నుంచి త‌ర‌లించాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పచ్చని చెట్లతో, సముద్రపు అలల గలగలలతో సస్యశ్యామలంగా, ప్రకృతి శోభతో విరాజిల్లే విశాఖ పట్టణం ఇప్పుడు కలుషిత పట్టణంగా మారిపోయింది.

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 5 లక్షలకు చేర‌నుందా?

భారత్‌లో వచ్చే 30 రోజుల్లో కొవిడ్‌-19 బారిన పడే వారి సంఖ్యను అంచనా వేసేందుకు గువాహటి ఐఐటీ, సింగపూర్‌ డూక్‌-నుజ్‌ మెడికల్‌ స్కూల్‌ల సంయుక్త బృందం సరికొత్త నమూనా రూపొందించింది. దీని ప్రకారం దేశంలో వచ్చే నెల రోజుల్లో వైరస్‌ వ్యాప్తి మధ్యస్తంగా ఉంటే మొత్తం కేసులు 1.5 లక్షలకు చేరుతాయి. అదే విషమంగా వ్యాపిస్తే 5.5 లక్షలకు చేరతాయ‌ట‌. రాష్ట్రాల వారీగా కేసుల పెరుగుదల రేటు, రోజువారీ కేసుల నమోదు ప్రకారం ఈ లెక్కలు కట్టారు. ఇందులో రాష్ట్రాలను మూడు విభాగాలుగా గుర్తించారు. గత రెండు వారాలుగా రోజువారీ కేసుల్లో తగ్గుదల లేని రాష్ట్రాలను విషమ విభాగంగా పరిగణించారు. క్రియాశీల కేసుల సంఖ్య పెరుగుతున్నా గత రెండు వారాలుగా రోజువారీ కేసులు తగ్గుతున్న వాటిని మధ్యస్త విభాగంలోకి తీసుకున్నారు. మొత్తం క్రియాశీల కేసులతో పాటు రోజువారీగా నమోదయ్యే కేసులూ తగ్గుతుంటే నియంత్రణ విభాగంగా పరిగణించారు. ‘వచ్చే నెల రోజుల్లో కేసుల అంచనా కోసం దేశం మొత్తాన్ని ఒకే తరహాలో చూస్తే సరైన లెక్క రాదు. కొత్త కేసుల పెరుగుదల రేటు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు తీసుకొనే నివారణ చర్యలు భిన్నంగా ఉంటాయి. అందుకే ప్రతి రాష్ట్రాన్ని విడిగా పరిగణించాలి. అప్పుడే అందుబాటులో ఉన్న పరిమిత వనరులను సమర్థంగా వినియోగించుకొనేందుకు ప్రభుత్వాలకు వీలవుతుంది.’ అని బృందం పేర్కొంది.

మ‌ళ్ళీ విజృంభిస్తున్న క‌రోనా! లాక్‌డౌన్ సడలిస్తున్న దేశాలకు షాక్!

లాక్‌డౌన్ సడలిస్తున్న దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. సడలింపుతో ఊపిరి పీల్చుకుని రోడ్ల మీదకు వస్తున్న జనం కారణంగా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దక్షిణ కొరియాలో గత 24 గంటల్లో 34 మంది కరోనా బారినపడ్డారు. ఒకే రోజు ఇంతమంది వైరస్ బారినపడడం గత నెల రోజుల్లో ఇదే తొలిసారి. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వైరస్ తగ్గుముఖం పట్టింది. దీంతో ఆంక్షలను సడలించిన ప్రభుత్వం బార్లు, రెస్టారెంట్లు, దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడీ నిర్ణయమే వైరస్ తిరిగి విజృంభించేందుకు కారణమైంది. బార్లు, నైట్‌క్లబ్‌లలో జనం భౌతిక దూరాన్ని గాలికి వదిలేయడంతో వైరస్ తిరిగి సంక్రమిస్తోంది. తాజాగా వెలుగుచూసిన కేసుల్లో ఎక్కువ మంది ఇటువంటి కేంద్రాలను సందర్శించిన వారే కావడం గమనార్హం. వైరస్ మళ్లీ చెలరేగుతుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం 2,100 నైట్‌క్లబ్‌లు, బార్లు, డిస్కోలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. జర్మనీలోనూ కొత్తగా 667 కేసులు నమోదయ్యాయి. ఓ జంతువధ శాలలో 180 మంది కరోనా బారినపడ్డారు. మరోవైపు, నిబంధనలు సడలించాలంటూ రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాక్షికంగా సడలిస్తూ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ నిర్ణయం తీసుకున్నారు. ఇంకోవైపు, ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో వేలాదిమంది రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఫ్రాన్స్‌లో తాజాగా 80 మంది మరణించారు. గత నెల రోజుల్లో ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రష్యాలో పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతోంది. నిన్న ఒక్క రోజే అక్కడ 11,012 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది.