ఏపీలో మరో 52 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలు చేస్తున్న కొద్దీ పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9,713 శాంపిల్స్ ను పరీక్షించగా మరో 52 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,282కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 705 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,527 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన 52 కేసుల్లో.. చిత్తూరులో 15, తూర్పుగోదావరిలో 5, కడపలో 2, కృష్ణాలో 15, కర్నూలులో 4, నెల్లూరులో 7, విశాఖపట్నంలో 1, విజయనగరంలో 1, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

తెలంగాణలో రేపటి నుంచి బస్సులు రైట్ రైట్

తెలంగాణా ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి మళ్లీ రోడ్డెక్కనున్నాయి. లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన కేంద్రం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను నిన్న విడుదల చేసింది. బస్సు సర్వీసుల విషయంలో నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో బస్సులు నడిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నేటి సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన  జరగనున్న సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బస్సు సేవలను పునరుద్ధరించడంతోపాటు లాక్‌డౌన్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రేపటి నుంచి బస్సులు నడపాలని నిర్ణయించిన ప్రభుత్వం నిన్న రాత్రే ఈ విషయాన్ని ఆర్టీసీకి సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అధ్యక్షతన ఆర్టీసీ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఇందులో బస్సులు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసి, సాయంత్రం కేసీఆర్ సారథ్యంలో జరగనున్న సమావేశంలో నివేదించనున్నారు. నిజానికి 50 శాతం బస్సులు నడిపేందుకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. కరోనా వ్యాప్తి భయంతో ముందుకు రాలేదు. ఇప్పుడు గ్రీన్, ఆరెంజ్ జోన్ల సంఖ్య  పెరుగుతుండడంతో బస్సులు నడపాలని నిర్ణయించింది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాలకు అంటే గ్రామాలు, జిల్లాలు, రాష్ట్ర రాజధానికి బస్సులు నడవనున్నాయి. అయితే, ప్రయాణికులను పరిమితంగానే అనుమతించడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి చర్యలు తీసుకోనున్నారు. అయితే, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.

కూలీలకు లోటు రానివ్వొద్దు: సీఎం జగన్

రహదారులపై నడుస్తూ వెళ్తున్న వలస కూలీలకు భోజనం, ఇతరత్రా సదుపాయాల విషయంలో వారికి లోటు రానివ్వొద్దని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఖర్చుల గురించి ఆలోచించవద్దన్నారు. ఉదారంగా, మానవతా దృక్పథంతో వారికి సాయం చేయాలని స్పష్టంచేశారు. మానవత్వాన్ని చూపించాల్సిన సమయం ఇదేనని సీఎం సూచించారు. రాష్ట్రం మీదుగా వెళ్తున్న వలస కూలీలకు అందుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి జగన్ ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకూ అందించిన సహాయ కార్యక్రమాలపై సీఎంకు అధికారులు వివరించారు. కాలినడకన ఒడిశా వెళ్తున్న 902 మందిని షెల్టర్లలో చేర్చి అన్ని సదుపాయాలు అందించామని, వారిని తిరిగి బస్సుల్లో పంపించామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా నుంచి 10 బస్సుల్లో 470 మందిని, కృష్ణా జిల్లా నుంచి 16 బస్సుల్లో 410, శ్రీకాకుళం నుంచి 1 బస్సులో 22 మందిని పంపించామన్నారు. ఇవాళ గుంటూరు నుంచి 450 మందిని, కృష్ణా జిల్లా నుంచి 52 మంది వలస కూలీలను పంపిస్తున్నామని చెప్పారు.

కిడ్నాప్ అయిన చిన్నారికి కరోనా: క్వారంటైన్ లో 22మంది

హైదరాబాద్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ముంబైకి చెందిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి నగరంలో నివాసం ఉంటుంది. అయితే బుధవారం తన 18నెలల కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో సీసీటీవీ పుటేజీ ఆధారంగా కిడ్నాపర్ ఇబ్రహీంను అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన పిల్లలు అనారోగ్యంతో చనిపోతున్నారని, తన భార్య కొడుకు కావాలని కోరడంతో కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకొన్నాడు. అయితే వైద్య పరీక్షలు చేయగా కిడ్నాప్ అయిన చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో చిన్నారితో డైరక్ట్ కాంటాక్ట్ అయిన పోలీసులు డాక్టర్లు, కిడ్నాపర్ తో పాటు మొత్తం 22మందిని క్వారంటైన్ కు తరలించారు.

స్త్రీ అండం పురుషుని వీర్యకణం కలిసినట్లే, ముక్కులోని చీమిడితో కరోనా సంపర్కం చేస్తోందా?

కంటికి కనిపించని వైరస్. ప్రాణము లేని అచేతన స్థితిలో ఉన్న ప్రోటీన్ పదార్థపు కణమే కరోనా వైరస్. అసలు కరోనా ఎలా వృధ్ధి చెందుతుంది? ఈ వైరస్ను ఎలా నివారించవచ్చు?  స్త్రీ అండాశయంలో నిర్జీవ అండం ఎలా అయితే 14 రోజులు వుండి, వీర్యకణంతో జీవకణంగా మారి, కణ విభజన మొదలవుతుందో.. అలానే కరోనా నిర్జీవ కణం మానవుని “చీమిడి” తో సంపర్కము అయి కణ విభజన ఆరంభమవుతుంది. ముక్కులోని చీమిడిలో గల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం. కరోనా అనునది ప్రాణము లేని ఒక అచేతన స్థితిలో ఉన్న ప్రోటీన్ పదార్థపు కణము. దీనిపైన క్రొవ్వు పదార్థము ఒక పొరలా యేర్పడి ఒక పౌడరులా వుంటుంది. ఇతర వాటిలా కాక ఈ కణము కొంత బరువు కలిగి వుండటంతో గాలిలో యెగురలేదు. భూమిపై పడిపోతుంది. ఇదొక నిర్జీవకణం. స్త్రీ అండాశయంలో నిర్జీవ అండం ఎలా అయితే 14 రోజులు వుండి, వీర్యకణంతో జీవకణంగా మారి, కణ విభజన మొదలవుతుందో.. అలానే కరోనా నిర్జీవ కణం కూడా 14 రోజులు నిర్జీవ కణంగానే వుండి, ఈ మధ్యలో ఎప్పుడైతే మానవుని శరీరంలోని “చీమిడి” తో సంపర్కము అవుతుందో దానిలో కణ విభజన ఆరంభమవుతుంది. మన ముక్కులోని చీమిడిలో గల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం. మన కంటి ‘కలక’ లేక ‘పుసిలి’ కానీ, ముక్కులోని ‘చీమిడి’ కానీ, నోటిలోని ‘గళ్ళ’ కానీ దానికి దొరికితే వెంటనే నిముషాలలో కొన్ని వేల, లక్షలలో కణ విభజన జరిగి శ్వాస కోశాలలో చేరి, ఊపిరి తిత్తులలోని రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువును నిరోధిస్తుంది. దీని కారణంగా, రోగి ప్రాణవాయువు అందక మరణిస్తాడు. దీని విస్తరణ కు పడిశాన్ని ఉధృతం చేసికుంటుంది. రోగిష్టి తుమ్మినపుడూ, దగ్గినపుడూ, వారి చీమిడి ద్వారా, కఫము ద్వారా, ఈ రోగ కణాలు ఎచ్చటంటే అచ్చట పడతాయి. మనం దగ్గరగా వుంటే మనపై పడవచ్చు. లేక అవి తుంపరలుగా వేటిపైనన్నా పడివుంటే, ఆయా పదార్థ లక్షణములను బట్టి వాతావరణం లోని వేడిని స్వీకరించు సామర్థ్యాన్ని బట్టి అవి 4 గంటల నుండీ 24 గంటల వరకూ శక్తివంతమై ఉండగలవు. అంటే వేడికి దీనిపై వున్న క్రొవ్వు పొర కరిగిపోయి నిర్వీర్యమై పోతుంది. ఇప్పటి వరకూ ఈ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దరిదాపు శీతల ప్రదేశాలే. వేడి తక్కువ ప్రాంతాలు కావటంతో, దీనిపై గల క్రొవ్వు పొర కరగడానికి హెచ్చు ఆస్కారం లేకపోవడం ఒక కారణం. ఈ మధ్య సమయంలో వాటిని మనం స్పర్శించినచో.. అవి మనకు అంటుకొనగలవు. సాధారణంగా మనం మన చేతులతోనే స్పర్శించుతాము. కావున మన అరచేతులకు, వ్రేళ్ళకు అంటుకొనగలవు. సర్వ సాధారణంగా మన చేతులతో మన కళ్ళను, ముక్కును, నోటిని స్పర్శించడం సహజం. ఈ విధంగా రోగకణాలు ఎక్కడికైతే చేరకూడదో అచ్చటికి సులభంగా చేరిపోతాయి. ఒక్కసారి అవి మన కంటి కలకను కానీ, చీమిడిని లేక ముక్కులోని పొక్కులను కానీ, మన నోటిలోని గళ్ళను కానీ చేరాయో, ఇక వాటిని నిరోధించటం అసాధ్యం. ఇవి సాధారణంగా అందరిలో ఎల్లవేళలా ముఖ్యంగా ముసలి వారిలో వుంటాయి. కళ్ళకలకను చేరితే వెంటనే అది కంటి నీరుగా వృధ్ధి చెంది, ముక్కు ప్రక్కగా జారి, ముక్కు ద్వారా విజృంభిస్తుంది. దీనికి ఇంతవరకూ మందు కనుగొనలేకున్నా, దీనికి గల కొన్ని బలహీనతలను ఆసరాగా చేసుకుని మనలను మనం రక్షించుకోవచ్చు. దీనికి రక్షక కవచం దీనిపైనున్న క్రొవ్వు పదార్ధం. ఈ క్రొవ్వు పదార్థాన్ని మనం తొలగించి నట్లయితే దీనిని నిర్వీర్యం చేయవచ్చు. సాధారణంగా క్రొవ్వు పదార్థం వేడికి కరిగిపోతుంది. లేక ‘సబ్బు’ నురుగుకు కరిగి పోతుంది. మన ఇళ్లలో చేతికి కాని, పాత్రలకు కానీ పట్టిన జిడ్డు (క్రొవ్వు పదార్థం)ను తొలగించడానికి మనం సబ్బు పదార్థాలు వాడుతాం. దీనికి కూడా అంతే. మన శరీరాన్ని, తల వెంట్రుకలతో సహా సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో, రోజుకు 2-3 పర్యాయాలు బాగా తలస్నానం చేయడంతో.. మన శరీర భాగాలను అంటుకున్న ఈ కరోనా కణము పైగల క్రొవ్వు కరగి పోయి నిర్వీర్యమై పోతుంది. ఆ తరువాత బాగా కొబ్బరి నూనెను శరీర భాగాలకు రుద్దుకుంటే, ఒకవేళ మన శరీర భాగాలపై ఈ రోగ కణాలు మరలా పడ్డా, అందులో చిక్కుకుని బయటకు రాలేని స్థితి ఏర్పడుతుంది. మారు స్నాన శుభ్రతలో వీటిని నిర్వీర్యం చేయవచ్చు. వీటి మధ్యలో అనేక పర్యాయాలు మన చేతులను 38 డిగ్రీలు అంతకన్నా హెచ్చు. వేడి నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో ఒక నిముషం పాటు శుభ్ర పరచుకుంటే, మనం ధరించే వస్త్రాలను, కర్చీఫులను, మాస్కులను పైలాగే శుభ్ర పరచుకుంటే, ఈ వ్యాధి కణాలపై వున్న క్రొవ్వును కరిగించి దానిని నిర్వీర్యం చేయవచ్చు. కానీ ఎట్టి పరిస్థితులలో అయినా ఈ కణం మన ముఖానికి చేరకూడదు. కంటి కలకతో కానీ, ముక్కు చీమిడి లేక పొక్కులతో కానీ, నోటి గళ్ళతో కానీ సంపర్కమైతే దానిని అడ్డుకొనటం అసాధ్యం.

ఇండోర్ లో హనుమాన్ బంగారం విగ్రహము

రాష్ట్రంలోని ఎత్తైన 66 అడుగుల హనుమంతు విగ్రహం పత్రి పర్వతంపై తయారు చేయబడింది.  బంగారు-వెండి, రాగి, జింక్, సీసం, కేడియం వంటి అష్ట లోహాలతో తయారు చేసిన ఈ విగ్రహం కోసం సుమారు 11 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.  విగ్రహం చుట్టూ ఇప్పుడు రంగు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయనున్నారు.  అది ఒక పెద్ద వేడుకలో ఆవిష్కరించబడుతుంది.  శిల్పి ప్రభాత్ రాయ్ ప్రకారం, ఈ విగ్రహం బరువు 108 టన్నులు.  ఇది 9 టన్నుల జాపత్రి మరియు అతని గొడుగు 3 టన్నులు.  ఈ గొడుగుపై రామా అనే పేరు 9 అంగుళాల పరిమాణంలో 108 సార్లు అనలైజ్ చేయబడింది.  హనుమంజీ చేతుల పొడవు 11 అడుగులు.  రాముడి పట్ల భక్తితో కూర్చొని ఉన్న హనుమంతుడి విగ్రహంతో 15 -12 -12 అడుగుల రామ్ కథ కూడా సిద్ధం చేయబడింది.  ఈ విగ్రహం రాష్ట్రంలో ఎత్తైనది.

ఏకతాటిపైకి 62 దేశాలు.. డబ్ల్యూహెచ్‌వో వేదికగా చైనాకి చుక్కలు

కరోనా మహమ్మారి గుట్టు రట్టు చేసేందుకు 62 దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. కరోనా వైరస్‌ ఎక్కడ పుట్టింది? ఎలా వ్యాపించింది? అనే అంశాలపై స్వతంత్ర విచారణ జరపాలని అవి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)ను డిమాండ్‌ చేస్తున్నాయి. సోమవారం ప్రారంభంకానున్న డబ్ల్యూహెచ్‌వో వార్షిక సదస్సు వేదికగా ఈమేరకు ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 62 దేశాలు సిద్ధమయ్యాయి. అయితే, ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ కు రాసిన ఏడు పేజీల తీర్మానంలో చైనా పేరుకానీ, వూహాన్‌ నగరం పేరుకానీ ఎక్కడా ప్రస్తావించలేదు. చైనా పేరుని ప్రస్తావించకుండానే, చైనా మీద ప్రత్యక్షంగా నిందలు వేయకుండానే.. ఎలాగైనా కరోనా గుట్టుని, చైనా గుట్టుని బట్టబయలు చేయాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. కరోనా వెలుగుచూసిన తర్వాత తొలిసారి డబ్ల్యూహెచ్‌వో వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో ముఖ్యంగా చైనాపై ఆరోపణలు చేస్తున్న అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి దేశాలు వార్షిక సదస్సును ఓ అవకాశంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. మరోవైపు, తనపై వస్తున్న ప్రత్యక్ష, పరోక్ష ఆరోపణలకు డబ్ల్యూహెచ్‌వో వేదికగా సమాధానం ఇచ్చేందుకు చైనా సిద్ధమవుతోంది.

మాజీ ఎమ్మెల్యే రాజబాబు కన్నుమూత

కృష్ణా జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే ఎర్నేని రాజా రాంచందర్ (రాజబాబు) తుదిశ్వాస విడిచారు. గ‌త‌ కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న ఆయన.. ఆదివారం సాయంత్రం తన స్వగ్రామమైన కొండూరులో క‌న్నుమూశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో కొన‌సాగిన ఆయ‌న‌.. ఇండిపెండెంట్‌గాను విజ‌యం సాధించారు. కైకలూరు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒకసారి, కాంగ్రెస్ తరఫున మరోసారి ఎన్నికయ్యారు.  తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాంచందర్ టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలోకి వెళ్లారు. 1994లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.1999 ఎన్నికల్లో టీడీపీ ఆయ‌న‌కు టికెట్ ఇవ్వకపోవడంతో, ఇండిపెండెంట్ గా బ‌రిలోకి దిగిన‌ రాజబాబు మంచి మెజారిటీతో గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక నేత‌గా ఎదిగారు. 2004లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 2009 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చ‌విచూశారు. ఆ త‌ర్వాత వైఎస్సార్ మ‌ర‌ణం, రాష్ట్ర విభజన, త‌ద‌నంత‌ర ప‌రిస్థితుల వ‌ల్ల‌ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఎర్నేని మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. జల జగడం పైనే ప్రధాన చర్చ!!

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. నాలుగో విడత లాక్‌డౌన్ పై కేంద్ర ప్రభుత్వం‌ తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతివ్వడంతో పాటు లాక్‌డౌన్‌ లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధివిధానాలపైనా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా, గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల మధ్య కృష్ణ జలాల వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ అంశం ప్రధానంగా చర్చకొచ్చే అవకాశముందని సమాచారం.

ఉద్యమకారుని కొడుకును బతికించడంలో కనికరించని ప్రభుత్వం!

ఎంతోమంది ఉద్యమకారులు ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో ప్రత్యేకంగా నిలిచిన ఉద్యమకారుడు సిద్దిపేట ముద్దు బిడ్డ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్. ఎందుకంటే ప్రభుత్వం మీద ఎంత అసహనం ఉన్నా, మోసపోతున్నాం అని తెలిసినా నిరసన తెలియజేయకూడని ఏకైక ఉద్యోగం పోలీస్. 24×7 డ్యూటీలోనే ఉంటూ అహర్నిశలు ప్రజాక్షేమం కోసమే శ్రమించే పోలీసు ఉద్యోగులు అసంతృప్తిని కూడా ప్రదర్శించకూడదు.  కానీ మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రకటనను వ్యతిరేకిస్తూ పెట్టుబడిదారుల సహయంతో జరిగిన కృత్రిమ ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమం. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 2013లో జరిగిన మీటింగ్ లో సమైక్యాంధ్ర అవసరమనే తప్పుడు వాదనలు జీర్ణించుకోలేని అక్కడే బందోబస్తు నిర్వహిస్తూ, డ్యూటీ చేస్తున్న సిద్దిపేట (ఉమ్మడి మెదక్) జిల్లా కు చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే కానిస్టేబుల్ ఒక్కసారిగా జై తెలంగాణ అని నినదిస్తు తన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను, సమైక్యాంధ్ర పేరుతో జరుగుతున్న మోసాన్ని చూసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.  అక్కడ ఉన్న ఆంధ్రోళ్ళ ఆక్రోశానికి గురయ్యాడు. అయితే లక్షల మంది సమైక్యాంధ్రవాదుల మధ్య జై తెలంగాణ అని నినదించి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు హీరో అయ్యాడు. అప్పటికే టివి చానల్ లైవ్ లో విశ్లేషణలో కూర్చున్న ఇప్పటి ప్రభుత్వ ఓఎస్డి దేశపతి శ్రీనివాస్ గారు అప్పటికప్పుడు పోలీసన్న అని పాట కట్టి పాడటం జరిగింది. అదే రోజు అప్పటి టిఆరెస్ (ఇప్పుడు బిజెపి) నాయకుడు జితేందర్ రెడ్డి గారు లక్ష రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది.  మిగతా నాయకులు కూడా కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ ధీరత్వాన్ని మెచ్చి రివార్డులు ఇవ్వడం, సన్మానాలు చేయడం జరిగింది.    ఇలా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక పేజీ రచించుకున్న వ్యక్తికి తను కలగన్న తెలంగాణ రాష్ట్రంలో ఆపద వస్తే ప్రభుత్వం ఆదుకోలేక పోవడం చేత తన కొడుకు గౌతమ్ కాళోజి ని పొగొట్టుకున్నాడు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన కొడుకు కు వైద్యం చేయించాలంటే రూపాయలు 30 లక్షల అవసరం అని డాక్టర్లు చెప్పడంతో  తన కొడుకు ప్రాణాల కోసం ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబీకులను ట్విట్టర్ లో కాళ్ళు మొక్కుతా అని వేడుకోవడం అందరిని కలిచివేసింది. కేటీఆర్ గారు స్పందిస్తూ ఇప్పటికే 19 లక్షలకు పైగా పోలీసు డిపార్ట్మెంట్ నుండి అందివ్వడం జరిగింది అని, మిగిలిన ఖర్చును హరీష్ రావు భరిస్తారని చెప్పారు.  అయితే సమయానికి వెంటనే పూర్తిస్థాయిలో ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే శ్రీనివాస్ గౌడ్ కొడుకు మరణించాడు అనేది నిజం. రాజకీయ నాయకులకు ఆపద వస్తే వెంటనే స్పందించే ప్రభుత్వం, ఉద్యోగులకు ఆపద వస్తే ఆ స్థాయిలో స్పందించట్లేదు. నాయకులకు కూడా పోలీసులే రక్షణ కల్పిస్తారని, అలాంటి పోలీసుల కుటుంబాలకు ఆపద వస్తే ఆదుకోవాలని ప్రభుత్వంలోని నాయకులకు తెలియకపోవడం సిగ్గు చేటని పౌరహక్కుల ప్రజాసంఘం ప్ర‌తినిధి ఎం.వి.గుణ తీవ్ర‌స్థాయిలో కేసీఆర్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు.

రెస్టారెంట్లు, మాల్స్‌ తిరిగి ప్రారంభం ..సీఎం ఆదేశాలు!

ఏపీలోని అన్ని దుకాణాల్లో సామాజిక దూరం పాటించేలా చేయడానికి దుకాణదారులే ముందుకు వచ్చే పరిస్థితి రావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తమ దుకాణం ముందు దుకాణ దారులే వృత్తాలు గీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపించకుండా చర్యలు  తీసుకుంటూనే, ఎక్కడెక్కడ ఎలాంటి విధానాలు పాటించాలన్న దానిపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రోటోకాల్స్‌ (ఎస్‌ఓపీ) తయారు చేయాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా లక్షణాలు ఉన్నాయని తెలియగానే ప్రజలు పరీక్షలతో పాటు వైద్యం చేయించుకోవడానికి ముందుకు రావాలని సీఎం జగన్ అన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయికి కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వలస కూలీల పరిస్థితి చూస్తే బాధేస్తోందని సీఎం జగన్‌ అన్నారు. వలస కూలీల పట్ల మానవీయ కోణాన్ని మరచిపోవద్దని.. రాష్ట్రం గుండా వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలన్నారు. వలస కూలీల కోసం బస్సులు తిప్పడానికి సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. వలస కూలీల నుంచీ టికెట్టు కూడా అడగవద్దని ఆదేశాలు జారీ చేశారు. రెస్టారెంట్లు, మాల్స్‌ తిరిగి క్రమ, క్రమంగా ప్రారంభం కావాలని, వీటి కార్యకలాలు మొదలయ్యేలా ఎస్‌ఓపీ తయారు చేయాలన్నారు. అలాగే కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోయేందుకు.. ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

తాడేపల్లి వారధివద్ద వలసకూలీలపై విరిగిన లాఠీ...

కూలి కోసం... కూటి కోసం... పట్టణానికి వలసపోయిన కార్మికులకు వచ్చిన కష్టం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వారి స్వస్థలాలకు తిరిగి వెళ్ళడం వారికి తలకు మించిన భారంగా మారింది. ఎలాగొలా రోడ్లు పట్టుకు నడిచి పోతున్న వారిపై చాలా చెక్ పోస్టుల వద్ద ఖాకీలు కరుణ కురిపిస్తున్నా... కొన్ని ప్రాంతాల్లో మాత్రం కన్నెర్ర చేస్తూనే ఉన్నారు. ఫలితంగా పోలీసు లాఠీ రుచి చవి చూడాల్సి వస్తుంది. వలస కూలీలపై విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్న ఖాకీల్లో... అందరికన్నా తాడేపల్లి పోలీసులు అగ్రభాగాన నిలుస్తున్నారు. పొరుగునే ఉన్న కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట చెక్ పోస్ట్ పోలీసులు వలస కూలీలను ఆదరిస్తుంటే... తాడేపల్లి పోలీసులు తాట తీయడం విమర్శలకు తావిస్తోంది. వలస కూలీలపై విచక్షణారహితంగా దాడి కన్యాకుమారి నుంచి ఇక్కడ వరకు లేని నిబంధన కేవలం తాడేపల్లి వచ్చే సరికి ఎలా వచ్చిందో? అన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన ఏ చెక్ పాయింట్ వద్ద అపని పోలీసులు  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాలుగు జిల్లాల్లో ఉన్న చెక్ పోస్టులు వద్ద ఇలాంటి నిబంధన లేదా?! వలస కూలీలపై ఏకంగా సీఐ స్థాయి అధికారి లాఠీ దెబ్బలు. దీనిపై రాష్ట్ర స్థాయి అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. అన్ని కిలోమీటర్ల వరకు లేని నిబంధన కేవలం తాడేపల్లి వచ్చే సరికి ఎలా అమలు అవుతోంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఉన్న చెక్ పోస్టు వద్ద జరిగిన ఘటనలు లేకపోలేదు. జగ్గయ్యపేట చెక్ పోస్ట్ వద్ద నడక ద్వారా స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికుల కోసం ఏకంగా రిలీఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ స్వయంగా పరిశీలించి... వలస కార్మికులతో మాట్లాడి... వారి స్వస్థలాలకు పంపేందుకు చేసిన రవాణా ఏర్పాట్లను వివరించి... అనంతరం వారికి పండ్లు, ఆహార ప్యాకెట్లును అందచేసారు.

విశాఖలో డాక్టర్‌ నిరసన.. తాళ్లు కట్టి స్టేషన్‌కు తరలింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం మాస్క్‌లు కూడా ఇవ్వడం లేదంటూ పెద్ద ఎత్తున దుమారం రేపిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ విశాఖలో రోడెక్కారు. క‌నీసం శరీరం మీద చొక్కా లేకుండా ధర్నాకు దిగారు.  గుండు గీయించుకొని, కనుబొమలు  తీసేసి నిర‌సంగా క‌నిపించారు.  అయితే, ఆయన రోడ్డు మీద వెళ్లే వారితో అనుచితంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు రావడంతో పోలీసులు డాక్టర్ సుధాకర్ చేతుల్ని వెనక్కు కట్టేసి  విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. అనంతరం అక్కడి నుంచి కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ సుధాకర్‌కు చికిత్స అనంతరం కౌన్సెలింగ్ అందిస్తారని వైద్యులు చెబుతున్నారు. డాక్ట‌ర్ సుధాకర్ ఫుల్లుగా మద్యం తాగి ఉన్నారని విశాఖ సీపీ ఆర్కే మీనా తెలిపారు.  నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి చెందిన ఎనస్ధీషియన్ డాక్టర్‌గా సుధాకర్ పనిచేశారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని తనకు మాస్కులు, పీపీఈ , కిట్లు లేవంటూ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేసిన తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో ఆయన్ని సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు అప్పట్లో ఆయన నర్సీపట్నం పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఉద్యోగం నుంచి తొలగించినప్పటి నుంచి సుధాకర్ మానసికంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సుధాకర్‌ను ఓ క్రిమినల్ మాదిరిగా తాళ్లతో కట్టి స్టేషన్‌కు తరలించడంపై పోలీసులపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దళిత డాక్టర్ సుధాకర్ పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలన్నారు. సుధాకర్ కు అత్యున్నత వైద్య చికిత్స అందించాలని కోరారు. ఈ దురాగతానికి సీఎం జగన్ బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

అండర్ వరల్డ్ డాన్ కి గన్ శాల్యూట్.. ఆరుగురు అరెస్ట్!

అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ అంత్యక్రియల సందర్బంగా గాల్లోకి కాల్పులు జరిపిన ఆరుగురిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మరణించిన ముత్తప్ప రాయ్‌ అంత్యక్రియల సందర్భంగా ఆయన బంధువు ఒకరు, మరొక ఐదుగురు ఆయనకు గన్ శాల్యూట్ చేశారు. కర్ణాటక రామనగర జిల్లా బిడదిలో ఈ ఘటన జరిగింది. నిందితులు ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపినట్లు బిదడి పోలీసులు తెలిపారు.  కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ముత్తప్ప రాయ్ నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని అనుచరులు బిడదిలోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి, అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన భౌతికకాయానికి గన్ శాల్యూట్ చేశారు. ఆయుధాల చట్టం కింద ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కాల్పులు జరిపేందుకు ఉపయోగించిన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

సీఎం జగన్ కీలక నిర్ణయం.. వలస కూలీల కోసం ఉచిత బస్సులు

వలస కూలీలకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సమీక్షా సమావేం నిర్వహించిన ఆయన.. మండుటెండలో పిల్లా, పాపలతో కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలపై ఉదారత చూపాలన్నారు. రాష్ట్రం గుండా వెళ్తున్న వలస కూలీలు కోసం బస్సులు సిద్ధం చేయాలన్నారు. నడిచివెళ్తూ ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించి.. రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలన్నారు. అలాగే, ఇదివరకు ఆదేశించిన విధంగా వారికి భోజనాలు, త్రాగు నీరు ఏర్పాటు చేయాలన్నారు. ప్రోటోకాల్స్‌ పాటిస్తూ నడిపే బస్సుల్లో వలస కూలీలకు 15 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సీఎం పేర్కొన్నారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కంగారుపడొద్దు.. ఎవరినీ తొలగించలేదు

ఏపీఎస్ ఆర్టీసీ ఒకేసారి 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తప్పించిందన్న వార్త సంచలనమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెల జీతం రాక, లాక్డౌన్ వేళ అవస్థలు పడుతున్న కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించడం ఏంటని కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. అయితే, తాజాగా ఈ అంశంపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆర్టీసీ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించలేదని స్పష్టం చేశారు.  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా వైరస్ రక్షణ ఇన్సూరెన్స్ లేకపోవటం వలన, ఇన్సూరెన్స్ ఉన్న పర్మినెంట్ ఉద్యోగులను ముందుగా విధులకు రావాలని సర్క్యులర్ జారీ చేశామని మంత్రి చెప్పారు.  దీన్ని కూడా రాజకీయం చేసి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారని మండిపడ్డారు. కరోనా సంక్షోభం వలన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయామన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కంగారుపడొద్దని సూచించారు. ఎవరినీ తొలగించబోమని, యథావిధిగా కొనసాగుతారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పనే గాని, తొలిగింపు ఉండదని పేర్ని నాని స్పష్టం చేశారు.

నా బెస్ట్ ఫ్రెండ్ మోడీకి గిఫ్ట్ ఇస్తున్నా: ట్రంప్

కరోనా పై పోరులో భారత్ కి అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ విజ్ఞప్తి మేరకు మోడీ సర్కార్ గత నెల 50 మిలియన్ హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్స్ అమెరికాకు పంపించిన సంగతి తెలిసిందే. ఆ సాయాన్ని మనసులో పెట్టుకున్న ట్రంప్.. మనదేశానికి వెంటిలేటర్లను డొనేట్ చేయాలని నిర్ణయించారు. కరోనా కష్టకాలంలో భారత్‌కు అండగా ఉంటామని ట్రంప్ ట్వీట్ చేశారు. భారత్ కి వెంటిలేటర్లను విరాళంగా ఇస్తామని ప్రకటించారు. వ్యాక్సిన్ తయారీలోనూ రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. రెండు దేశాల్లోనూ గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారని కొనియాడారు. అమెరికాలో చాలామంది భారతీయులు ఉన్నారని.. వారు వ్యాక్సిన్‌ తయారీలో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. రెండు దేశాలు కలిసికట్టుగా పనిచేసి కనిపించని శత్రువును ఓడిస్తామని ట్రంప్ ట్వీట్ చేశారు.  అంతేకాదు.. తనకు భారత్ ప్రధాని మోడీ మంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు. కరోనాను అరికట్టడంలో భాగంగా మేము, మోదీ కలిసి పని చేస్తున్నాం అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ తయారీలో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని.. కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఏం తెలివిరా నాయనా.. పుచ్చకాయల్లో మద్యం సీసాలు తరలింపు

కరోనా కాలంలోనూ మద్యం అక్రమ రవాణాకు బ్రేకులు పడట్లేదు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న రూ. 5 లక్షలు విలువైన మద్యాన్ని ఏపీ పోలీసులు సీజ్ చేశారు. లాక్ డౌన్ కారణంగా మూతపడిన మద్యం షాపులు.. దాదాపు 40 రోజుల తరువాత తెరుచుకున్నాయి. అయితే, ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెరగడం, దానికితోడు ఎంత ఖర్చు పెట్టినా సరైన బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో.. మందు బాబులు తమకిష్టమైన బ్రాండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు పొరుగు రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం తెప్పించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. తాజాగా, గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2630 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. పుచ్చకాయల మాటున మూడు వాహనాల్లో  రూ. 5 లక్షలు విలువైన మద్యాన్ని తరలిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన గుంటూరు అడిషనల్ ఎస్పీ.. అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజ్‌ క‌రోనాకైనా అర్థం అవుతుందా?

మ‌న దేశంలో క‌రోనా 500 కేసులు ఉన్నపుడు లాక్డౌన్ నిర్ణ‌యం తీసుకుని కఠినంగా అమలు చేశారు. 5000 కేసులకు చేరినప్పుడు అందరు చప్పట్లు కొట్టారు. 10000 కేసులకు చేరినప్పుడు అందరు దీపాలు వెలిగించారు. 40000 కేసులకు చేరినప్పుడు ఆకాశంలో పూలు జల్లారు. 50000 కేసులకు చేరినప్పుడు మద్యం దుకాణాలు తెరిచారు. 60000 కేసులకు చేరినప్పుడు రైలు ప్రయాణాలు మొదలెట్టారు. మోదీ మాస్టారీ వ్యూహానికి క‌రోనా వైర‌స్ కూడా సందిగ్ధంలో పండింది. భార‌తీయులు క‌రోనా వైర‌స్‌ను చూసి భ‌యపడుతున్నారా లేక పండగ చేసుకుంటున్నారా? క‌రోనా వైర‌స్ ఆలోచ‌న‌లో ప‌డింద‌ట‌. క‌రోనాపై పోరాటానికి ప్ర‌ధాన మంత్రి 20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజ్ ప్ర‌క‌టించారు. ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కొత్త సీసాలో పాత సారా అన్న‌ట్లు ప్యాకేజ్ గురించి బుల్లి తెర మీద‌ సీరియల్‌ చూపిస్తున్నారు. ఎంత మంది దేశ‌ప్ర‌జ‌లుకు క‌రోనా సంక్షోభంలో ప్ర‌ధాని మోదీ తీసుకుంటున్న నిర్ణ‌యాలు అర్థం అవుతున్నాయో క‌నీసం దేశ‌భ‌క్తులైనా చెప్పాలి. దేశ‌ద్రోహులు అయితే కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజ్ బూటకం అంటున్నారు. ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారని క‌మ్యూనిస్టు పార్టీ అంటోంది. వలస కార్మికులు, వీధి వ్యాపారులు, ఇంటి పని కార్మికులు, మత్స్యకారులు, తదితరులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కుడా బదిలీ కాలేదని పేర్కొంది. ఆర్థిక మంత్రి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. దేశంలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి 14 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారని, పట్టణ పేదల్లో దాదాపు 80 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొంది. ఇటువంటి సమయంలో ఆదాయ పన్ను పరిధిలోకి రాని కుటుంబాలన్నింటికీ నెలకు రూ.7,500 చొప్పున మూడు నెలల పాటు ప్రభుత్వం నగదు బదిలీ చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన గోడౌన్లలో మగ్గుతున్న 77 మిలియన్‌ టన్నుల నిల్వల నుంచి ఆరు నెలల పాటు ఈ విధమైన ఉచిత పంపిణీ చేయాలి. లాక్‌డౌన్‌తో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్న సమయంలో రైతులు మనుగడ కొనసాగాలంటే వారికి ఒకే విడతలో రుణమాఫీ చేయాల్సిన అసవరం ఉంది. రాష్ట్రాలకు అత్యవసరంగా భారీ మొత్తంలో ఆర్థిక సాయం అందించాలి. లాక్‌డౌన్‌తో జీవితాలు కోల్పోయి రోడ్డున పడ్డ వలస కార్మికులకు తక్షణ ఉచిత రవాణా సదుపాయం కల్పించాలి.