ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం

ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షలో భాగంగా స్కూళ్ల అభివృద్ధిపై సీఎం జగన్ ఆరా తీశారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడ-నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.  ప్రతి స్కూల్ లో 9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా విడుదల చేశామని తెలిపారు. పాఠశాలల అభివృధి పనుల కోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి చేసే విధంగా ఆయా జిల్లా కలెక్టర్లు పనులపై ప్రతిరోజూ సమీక్ష చేయాలన్నారు.

గాడ్సే నిజమైన దేశభక్తుడు: నాగబాబు

జాతిపిత మహాత్మా గాంధీని 1948 జనవరి 30 న నాధురాం గాడ్సే హత్య చేసిన సంగతి తెలిసిందే. సత్యం, అహింసని ఆయుధాలుగా మలుచుకొని స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ వంటి వ్యక్తిని చంపడం భారతీయులు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ  గాడ్సే అనే పేరు వింటే గాంధీని చంపిన హంతకుడనే భారతీయుల మెదళ్ళకు తడుతుంది. అయితే, గాంధీని ఆరాధించే ఈ దేశంలో.. గాడ్సే నిజమైన దేశ భక్తుడు అంటూ అభిమానించే వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నటుడు, జనసేన నేత నాగబాబు కూడా చేరిపోయారు. ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. ఆయన నిజమైన దేశ భక్తుడు అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. "ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గ్యుమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది. పాపం నాధురాం గాడ్సే... మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్." అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. కాగా, నాగబాబు ట్వీట్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా నాగబాబు ట్వీట్ ని తప్పుబడుతున్నారు.

ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై సుప్రీం కోర్టు కు వెళ్లిన ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి చుక్కెదురైంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఎన్జీటీలో విచారణ తరువాతే సుప్రీం కోర్టులో విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈకేసును సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఎన్జీటీ కి లేదని ఎల్జీ పాలిమర్స్ వాదనలు వినిపించగా.. ఆ విషయాలన్నీ ఎన్జీటీ ఎదుట ప్రస్తావించాలని ధర్మాసనం తెలిపింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.50 కోట్లు జమ చేశామని, అంతకుమించి ఎన్జీటీకి విచారణ అధికారం లేదని ఎల్జీ పాలిమర్స్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న జస్టిస్ లలిత్ ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది. అంతేగాకుండా, ఎన్జీటీలో న్యాయపరమైన అంశాలు లేవనెత్తేందుకు అవకాశం కల్పించింది. ఎన్జీటీ, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గ్యాస్ లీక్ ఘటన జరిగిన వెంటనే ఎన్జీటీ ఎల్జీ పాలిమర్స్ పై చాలా సీరియస్ అయింది. నోటీసులు ఇవ్వడంతో పాటు రూ.50 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై ఎల్జీ పాలిమర్స్ సుప్రీం కోర్టు కు వెళ్ళింది. తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడాన్ని ఎల్జీ పాలిమర్స్ సవాల్ చేసింది. 

కష్టకాలంలో ఓటు బ్యాంక్‌ రాజకీయాలు సరికాదు.. కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అంకెల గారడీ తప్ప అందులో ఏమీ లేదని, అదో బోగస్ ప్యాకేజీ అని కేసీఆర్ విరుచుకుపడ్డారు. కాగా, కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తప్పుపట్టారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్ ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. కష్టకాలంలో ఓటు బ్యాంక్‌ రాజకీయాలు సరికాదని హితవు పలికారు. ప్రధాని మోడీ వెనుక దేశమంతా ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ సహా.. 50 అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయన్న సంగతి కేసీఆర్‌ తెలుసుకోవాలన్నారు. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తెలంగాణ ప్రజలకు లబ్ధి జరగదా? అని ప్రశ్నించారు. ఉన్నంతలో కేంద్రం అద్భుతంగా ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పంటల విధానాన్ని కేంద్రం వ్యతిరేకించడం లేదని, అలాంటప్పుడు కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. రైతులు, పేద మహిళల ఖాతాల్లో నగదు. 80 కోట్ల మంది పేదలకు 5 కేజీల చొప్పున ఉచిత బియ్యం. పెన్షన్లు, ఈపీఎఫ్‌, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే సాయం.. ఇవన్నీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దేశంలో ఉపాధి పనులు దినాలు పెంచాం. ఉపాధి నిధులతో తెలంగాణలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేదా? అని ప్రశ్నించారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో రాజకీయాలను పక్కన పెట్టాలని కిషన్‌రెడ్డి సూచించారు.

తెలంగాణ టెన్త్‌ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

లాక్‌డౌన్‌తో వాయిదా పడ్డ తెలంగాణ పదో తరగతి‌ పరీక్షలను నిర్వహించడానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. జూన్‌ మొదటివారం తర్వాత‌ పరీక్షలు  నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. పరీక్షలు నిర్వహిస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. భౌతిక దూరం సాధ్యం కాని కేంద్రాలను మార్చాలని ఆదేశించింది. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉండాలని స్పష్టం చేసింది. అలాగే పరీక్షలు రాసే విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించింది.  అయితే, జూన్‌ 3న పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటికీ కేసుల తీవ్రత పెరుగుతున్నట్లయితే, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది.

అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా వేధిస్తున్నారు

విశాఖ గ్యాస్‌లీక్‌ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్స్‌ పెట్టారంటూ గుంటూరులో ఓ వృద్ధురాలిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు గుంటూరు లోని లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన రంగనాయకమ్మ(66)కు సీఐడీ అధికారులు‌ నోటీసు అందజేశారు. విశాఖ‌ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రంగనాయకమ్మ అసత్య ప్రచారంతో పోస్టింగ్స్‌ పెట్టారని.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఆ పోస్టులపై ప్రాథమిక విచారణ జరిపి, వాటిని రంగనాయకమ్మ పెట్టినట్టు గుర్తించామని సీఐడీ అధికారులు తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41-ఎ ప్రకారం రంగనాయకమ్మకు నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. ఈ కేసులో నేరం రుజువైతే మొదటిసారి మూడేళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానా విధిస్తారన్నారు. అదే నేరాన్ని వారు మరోసారి చేస్తే ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారన్నారు. రంగనాయకమ్మపై కేసు నమోదు చేయడం పట్ల టీడీపీ నేత నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. "అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా  కక్షగట్టి, వెంటాడి వేధిస్తున్నారు. ప్రమాదకరమైన స్టెరీన్ గ్యాస్ లీకేజ్ తో అమాయకుల ప్రాణాలు బలిగొన్న కంపెనీ ప్రతినిధుల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదు." అని లోకేష్ విమర్శించారు. "ప్రమాదంలో చిన్నారిని కోల్పోయిన బాధలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులను అరెస్ట్ చేసి అదో గొప్ప కంపెనీ అంటూ కితాబిచ్చారు జగన్. గ్రామస్తులు లేవనెత్తిన ప్రశ్నలనే సోషల్ మీడియా లో పోస్ట్ చేసినందుకు రంగనాయకమ్మ గారి పై కేసు పెడతారా?. " అని లోకేష్ ప్రశ్నించారు. "66 ఏళ్ల వృద్ధురాలు పై కేసు పెట్టడం వైకాపా ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.మీ లెక్క ప్రకారమే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 5 ఏళ్ల జైలు శిక్ష అయితే. 43 వేల కోట్ల ప్రజల సొమ్ము కొట్టేసిన జగన్ గారికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యాలి?" అని లోకేష్ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

డాక్టర్‌ ‌ను హాజరుపరచండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నర్సీపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం హైకోర్టుకు చేరింది. డాక్టర్‌ సుధాకర్‌ పట్ల విశాఖ పోలీసులు అమానుషంగా వ్యవహరించారని పేర్కొంటూ టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను, దానికి జత చేసిన వీడియోను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. డాక్టర్‌ సుధాకర్‌ ను తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా, డాక్టర్‌ను కలుసుకునేందుకు ఆయన తల్లికి కూడా అవకాశం ఇవ్వలేదంటూ వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. విజయవాడకు చెందిన రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.  విశాఖ పోలీసులు డాక్టర్ పట్ల అమానుషంగా ప్రవర్తించారని.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి జ్యుడీషియల్‌ కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు.  ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ పోలీసు కమిషనర్‌లను పేర్కొన్నారు.

ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా రెండు మరణాలు

ఏపీ‌లో కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో 9,739 శాంపిల్స్‌ని పరీక్షించగా 57 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2339 కి చేరింది. గత  24 గంటల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఒకరు, కర్నూలు జిల్లాకు చెందిన వారు ఒకరు ఉన్నారు. దీంతో, ఇప్పటివరకు ఏపీలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 52కి చేరింది. తాజాగా 69 మంది కరోనా నుంచి కోలుకుని  డిశ్చార్జ్ అయ్యారు.ఇప్పటి వరకు మొత్తం 1596 మంది డిశ్చార్జ్ కాగా, 691  మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

రూ.100 కోట్ల అజ్ఞాత విరాళాలు.. దేశంలో రెండో స్థానంలో వైసీపీ!!

రాజకీయ పార్టీలకు కోట్లల్లో విరాళాలు వస్తుంటాయి. ఎంత విరాళాలు వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? అని ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పిస్తుంటాయి. అయితే, కొన్ని నిబంధలు మాత్రం పార్టీలకు వరంగా మారుతున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.20 వేల లోపు విరాళాలు ఇచ్చే వారి పేర్లు బయటపెట్టాల్సిన అవసరం లేదు. అయితే, దాదాపు అన్ని పార్టీలకు రూ.20 వేల లోపే ఎక్కువ విరాళాలు అందుతున్నాయి. అలా అజ్ఞాత విరాళాలు కోట్లలో ఉంటున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి దేశంలోని 23 ప్రాంతీయ పార్టీలు విరాళాల విషయంపై‌ నివేదికలు సమర్పించాయి. ప్రాంతీయ పార్టీల ఆదాయ మార్గాలకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 2018-19 సంవత్సరంలో అన్ని ప్రాంతీయ పార్టీలకు కలిపి 885.956 కోట్ల విరాళాలు వచ్చాయి. అయితే, ఇందులో 54.32 శాతం(రూ.481.276 కోట్లు) అజ్ఞాత విరాళాలే ఉన్నాయని తేలింది. అజ్ఞాత విరాళాలు అందుతున్న పార్టీల్లో ఒడిశాలోని బీజేడీ 213 కోట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో రూ.100 కోట్లతో వైసీపీ నిలిచింది. ఇక 37.78 కోట్లతో టీడీపీ ఐదో స్థానంలో నిలిచింది. 1. బీజేడీ రూ.213.54 కోట్లు 2. వైసీపీ 100.50 కోట్లు 3. శివసేన 60.73 కోట్లు 4. జేడీఎస్ 39.13 కోట్లు 5. టీడీపీ 37.78 కోట్లు

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ బోగస్‌.. నేను చాలా బాధపడుతున్న: కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వందశాతం బోగస్‌ అని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఘోర విపత్తు సంభవించి, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాల చేతికి నగదు రావాలని కోరాం. రాష్ట్రాలకు నగదు ఇవ్వాలని కోరితే.. రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా చూసింది. ఇదేనా కేంద్రం చూసే పద్ధతి? అని‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గమైన విధానాన్ని కేంద్రం అనుసరిస్తుందని‌ మండిపడ్డారు. రాష్ట్రాల ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని పెంచారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి రూ.20వేల కోట్ల అప్పులు అదనంగా వస్తాయి. కానీ, అందులో పెట్టిన షరతులు వింటే ఎవరైనా నవ్వుతారు. కరెంట్‌ సంస్కరణలు చేయి రూ.2,500 కోట్ల బిచ్చం వేస్తాం. మునిసిపల్‌ ట్యాక్సులు పెంచు రూ.2500 కోట్ల బిచ్చం వేస్తాం అనడం ప్యాకేజీగా పరిగణిస్తారా? అని కేసీఆర్ ప్రశ్నించారు.  కేంద్రం చిల్లి గవ్వకూడా ఇవ్వదు. కేవలం రుణ పరిమితి పెంచింది. అది మళ్లీ రాష్ట్రమే కట్టుకోవాలి. కేంద్రం తన పరువు తానే తీసుకుందని విరుచుకుపడ్డారు. రాష్ట్రాలపై కేంద్రం ఈ విధంగా పెత్తనం చేయడం దుర్మార్గం అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం ప్యాకేజీ ఎలా ఉంటుందో, బోగస్‌ ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో తేలిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా నేను చాలా బాధపడుతున్న అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

తిరగబెడితే మొత్తం లాక్‌డౌన్‌ విధించాల్సి ఉంటుంది: సీఎం కేసీఆర్

తెలంగాణలో కంటెయిన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా అన్ని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా ప్రకటిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా చోట్ల అన్ని దుకాణాలను తెరుచుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుగుణంగా తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయని, రాత్రి 7 గంటల వరకే ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. అయితే, తెలంగాణ బస్సులు వేరే రాష్ట్రానికి వెళ్లబోవని, ఇతర రాష్ట్రాల బస్సులను తెలంగాణకు రానివ్వబోమని చెప్పారు.  హైదరాబాద్‌లో కరోనా తీవ్రత ఉన్నందున సిటీ బస్సులు నడపడం లేదని ప్రకటించారు. హైదరాబాద్‌ మెట్రో రైల్ కూడా‌ బంద్‌ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఆటోలు, టాక్సీలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నిర్ణయం తీసుకొని హైదరాబాద్‌లోని నిబంధనలు ప్రకటిస్తారని వెల్లడించారు. హైదరాబాద్‌లో సరి బేసి విధానంలో సగం దుకాణాలు తెరుచుకోవచ్చని చెప్పారు.  ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ తెరవడానికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. మొత్తం సిబ్బంది విధులకు హాజరు కావచ్చన్నారు. అయితే, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ  జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లు తప్ప హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ-కామర్స్‌కు ఆంక్షలు లేకుండా వంద శాతం అనుమతి ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతీ ఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని.. లేకుంటే, రూ.1000 జరిమానా తప్పదని సీఎం హెచ్చరించారు. భౌతికదూరం కూడా తప్పనిసరి పాటించాలన్నారు. ప్రభుత్వం నిబంధనలు సడలించిందని అవసరం ఉన్న వారు లేనివారు రోడ్ల మీదకు రావొద్దని.. అవసరం ఉంటే తప్ప బయటికి రాకపోవడం ఉత్తమమని సీఎం చెప్పారు. కరోనా మళ్లీ తిరగబెడితే మొత్తం లాక్‌డౌన్‌ విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

చైనా కరోనా లెక్కల గుట్టు బట్టబయలు

కరోనా కేసుల విషయంలో చైనా తప్పుడు లెక్కలు బట్టబయలయ్యాయి. చైనా చెబుతున్న గణాంకాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ కేసులు నమోదై ఉంటాయని ఓ నివేదిక తెలిపింది. చైనా రక్షణ సాంకేతిక జాతీయ విశ్వవిద్యాలయం నుంచి ఓ నివేదిక లీక్‌ అ‍యినట్లు.. అమెరికాలోని వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న ‘ఫారిన్‌ పాలసీ మ్యాగజైన్‌ అండ్‌ 100 రిపోర్టర్స్‌' ఓ కథనాన్ని ప్రచురించింది.  చైనాలో ఇప్పటివరకు 6లక్షల 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయన్నది ఆ నివేదిక సారాంశం. చైనా దేశ వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్‌ లు, సూపర్‌ మార్కెట్లు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్ లో నమోదైన కేసులన్నిటినీ పరిశీలించామని, అలాగే మొత్తం 230 నగరాల్లో నమోదైన రికార్డులను పరిశీలించామని ఆ నివేదిక పేర్కొంది.  అయితే, ప్రస్తుతం చైనా చెబుతున్న లెక్కల ప్రకారం ఆ దేశంలో ఇప్పటి వరకు 82 వేల కరోనా కేసులు మాత్రమే‌ నమోదయ్యాయి. దీంతో, అమెరికా సహా పలు దేశాలు కరోనా కేసులపై చైనా తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తప్పుడు లెక్కలను బహిర్గతం చేస్తూ నివేదిక లీక్ కావడం సంచలనం కలిగిస్తోంది. చైనా నిజంగానే తప్పుడు లెక్కలు చెబుతుందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

'ఎల్జీ పాలిమర్స్' కి మేం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు: సీఎం జగన్

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌ లీక్ బాధితులకు ప్రకటించిన నగదు పరిహారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా వారి ఖాతాల్లోకి జమచేశారు. గ్యాస్ ప్రభావిత ఐదు గ్రామాల్లోని 19,893 మందికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున పరిహారం అందించారు. అమరావతి నుంచి బటన్ నొక్కిన సీఎం వైఎస్ జగన్.. గ్యాస్‌ లీకేజీ బాధితుల అకౌంట్లలో పది వేల రూపాయిల చొప్పున సుమారు 20 కోట్లు జమ చేశారు. విశాఖ గ్యాస్‌ లీకేజీ బాధితులతో సీఎం జగన్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్జీ పాలిమర్స్‌కు సంబంధించి తమ ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదని అన్నారు. ఆ సంస్థకు అనుమతి, విస్తరణకు ఆమోదం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే జరిగాయని చెప్పారు. అయినప్పటికీ తాము రాజకీయంగా ఎక్కడా ఆరోపణలు చేయలేదని, మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నించామని అన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించామని, పదిరోజుల వ్యవధిలోనే బాధితులకు పరిహారం చెల్లించామని తెలిపారు. గతంలో ఓఎన్జీసీ గ్యాస్ లీకై 22 మంది చనిపోయినప్పుడు తాను కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశానని, ఇప్పుడు ఆ విషయాన్ని మదిలో ఉంచుకుని రూ.కోటి పరిహారం ప్రకటించామని పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై అధ్యయనానికి వేసిన కమిటీలు ఇచ్చే నివేదికల ద్వారా తప్పు ఎవరిదని తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ప్రతి నీటి బొట్టును సద్వినియోగం.. సాగునీటి వ్యవహారమంతా ఒకే గొడుగు కింద!

వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రాజెక్టుల కాల్వలనుంచి అవసరమైన తూములు (ఓటీలు), డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్ గేజ్ లు ఏర్పాటు చేయాలని, నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రియల్ టైమ్ డాటా ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సిఎం చెప్పారు. ఎన్నో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందికి రావాలని, ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటి పారుదల శాఖను పునర్వ్యవస్ఠీకరించుకోవాలని సిఎం ఆదేశించారు. ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ (ఓ అండ్ ఎం) మాన్యువల్ రూపొందించాలని సిఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని అన్ని పంపుల నిర్మాణం మే నెలాఖరు నాటికి పూర్తి చేసి, కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని పంప్ చేయాలని సిఎం ఆదేశించారు. నీటి పారుదల శాఖకు చెందిన భూములు, కట్టల ఆక్రమణను తీవ్రంగా పరిగణించాలని సిఎం ఆదేశించారు.గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంభించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.    వర్షాకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ప్రారంభం కాగానే మొదట అన్ని చెరువులు, కుంటలు నింపాలి. దీనికోసం అవసరమైన ఓటీలను, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను వెంటనే నిర్మించాలి. తెలంగాణలో చెరువులు, కుంటలు ఏడాదంతా నిండి ఉండే వ్యూహం అవలంభించాలి.  చెరువులను నీరు అందించడానికున్న అడ్డంకులపై చర్చించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, అధికారులు రెండు మూడు రోజుల్లోనే సమావేశం కావాలి.  చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది. ఫలితంగా బోర్ల ద్వారా కూడా వ్యవసాయం సాగుతుంది.  చెరువుల నుంచి రైతులు స్వచ్ఛందంగా మట్టిని తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలి. అధికారులు రైతులపై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దు.  ఈ వానాకాలంలో ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలి. గోదావరిలో పై నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్ఆర్ఎస్పిని కాళేశ్వరం ద్వారా నింపాలి.  ఎల్ఎండి నుంచి దిగువకు నీరందించడానికి ప్రస్తుతమున్న కాలువ కేవలం ఆరు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో ఉంది. దీని సామర్థ్యాన్ని 9వేల క్యూసెక్కులకు పెంచాలి. ప్రస్తుతమున్న కాల్వ సామర్థ్యం పెంచడమా? సమాంతరంగా మరో కాలువ నిర్మించాలా? అనే విషయాన్ని ఇఎన్సిల కమిటీ తేల్చాలి.  కాళేశ్వరంలో మూడో టిఎంసి ఎత్తిపోసే పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నుంచి మూడో టిఎంసిని వాడుకోవాలి.  తోటపల్లి కాలువ ద్వారా 77 వేల ఎకరాలకు నీరందించాలి.  గౌరవల్లి లిఫ్టు పనులు వెంటనే పూర్తి చేసి, ఈ సీజన్ లోనే నీళ్ళు అందించాలి.  దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాలోని అన్ని చెరువులు నింపాలి. సమ్మక్క బారాజ్ పనులను వేగవంతం చేయాలి. దేవాదుల ప్రాజెక్టు 365 రోజులూ నీటిని లిఫ్టు చేయాలి.  వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలి. వరద కాలువలపై ఓటీల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.  మల్లన్న సాగర్ ద్వారా తపాస్ పల్లి రిజర్వాయర్ నింపి, అక్కడి నుంచి మోత్కూరు, అడ్డగూడూరు, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, చిల్పూర్ మండలాలకు నీరందించాలి. జగిత్యాల జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని ముక్కట్ రావు పేట గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అమలు చేయాలి.  భారీ, మధ్య తరహా, చిన్న తరహా నీటి పారుదల, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందికి రావాలి. అన్నీ నీటి పారుదల శాఖ పరిధిలోనే ఉండాలి. ప్రాజెక్టులు, వాటి భౌగోళిక స్థితి ఆధారంగా నీటి పారుదల శాఖను పునర్వ్యవస్థీకరించాలి. సిఇ/ఇఎన్సి పరిధులు నిర్ణయించి, నీటి పారుదల జోన్లు ఏర్పాటు చేయాలి. అత్యవసరమైన సాగునీటి పనులకు కావాల్సిన అనుమతులు ఇవ్వడానికి సిఇ నుంచి ఇఇ వరకు అధికారాలను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. సిఇ 50 లక్షల వరకు ఎస్ఇ 25 లక్షల వరకు, ఇఇ 5 లక్షల వరకు పనులకు అనుమతులు ఇవ్వవచ్చు.  15 రోజుల్లోగా అన్ని ప్రాజెక్టులపై కొత్తగా గేజ్ మీటర్లు ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతమున్న గేజ్ లు చాలా కాలం క్రితం ఏర్పాటు చేసివని. చాలా ప్రాజెక్టుల్లో పూడిక వల్ల గేజ్ లు సరిగా చూపెట్టడం లేదు. కొత్తగా గేజ్ లు ఏర్పాటు చేసి ఖచ్చితమైన అంచనా వేయాలి.  నీటి పారుదల శాఖ భూములు, ఆస్తుల వివరాలతో ఇన్వెంటరీ తయారు చేయాలి. నీటి పారుదల శాఖ సేకరించిన భూములను వెంటనే మ్యుటేషన్ చేయించాలి.  ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూమిని ఇతరులు ఆక్రమిస్తున్నారు. వాటిపై సీరియస్ గా ఉండాలి. సేకరించిన భూమిని నీటి పారుదల శాఖ పేరు మీద మ్యుటేషన్ చేయాలి. రాష్ట్రంలో చాలా చోట్ల, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాల్వ కట్టలపై నిర్మాణాలు వచ్చాయి. ఇది నేరమేకాకుండా, ప్రమాదకరం కూడా. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని కాలువల్లో నీరు వస్తాయి కాబట్టి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాలువలపై నివాసం ఉండే వారు తక్షణం ఖాళీ చేయాలి. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను తొలగించాలి.  ఎంతో వ్యయం చేసి ప్రాజెక్టులు నిర్మించాం. వాటిని సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ప్రతీ ప్రాజెక్టు నిర్వహణ కోసం ఓ అండ్ ఎం మాన్యువల్ రూపొందించాలి. ప్రతీ ఏటా బడ్జెట్లోనే నిర్వహణ వ్యయం కేటాయించి, క్రమం తప్పకుండా ప్రభుత్వం విడుదల చేస్తుంది.  ఇంకా ఎక్కడైనా ఏమైనా భూసేకరణ మిగిలి ఉంటే, తక్షణం పూర్తి చేయాలి. దీనికి కావాల్సిన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

పదేళ్ల తెలుగు బాలికను సత్కరించిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదేళ్ల తెలుగు బాలిక శ్రావ్య అన్నపరెడ్డిని సత్కరించారు. ​గర్ల్స్‌ స్కౌట్‌ మెంబర్‌గా ఉన్న శ్రావ్య.. అమెరికాలో కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది సేవలను కొనియాడుతూ, వారిలో ఉత్సహం నింపేలా వ్యక్తిగత కార్డులను పంపించింది. దీనిని గుర్తించిన ట్రంప్‌.. శ్రావ్యను ప్రశంసించారు. ఆమెతో పాటు లైలా ఖాన్‌, లారెన్ మాట్నీ అనే మరో ఇద్దరు బాలికలను కూడా ట్రంప్‌ సత్కరించారు.  మేరీల్యాండ్ ఎల్క్‌రిడ్జ్‌లోని‌ ట్రూప్ 744లో ఈ ముగ్గురు బాలికలు సేవలు అందిస్తున్నారు. ఇటీవల వీరు 100 బాక్స్‌ల గర్ల్స్‌ స్కౌట్స్‌‌ కుకీస్‌ను స్థానిక అగ్నిమాపక, వైద్య సిబ్బందికి విరాళంగా ఇచ్చారు. దీంతో వారిని వైట్ హౌస్ కి ఆహ్వానించి, ట్రంప్ అభినందనలు తెలిపారు. హనోవర్‌లో నివాసం ఉంటున్న శ్రావ్య.. ప్రస్తుతం నాలుగో గ్రేడ్‌ చదువుతోంది. శ్రావ్య తండ్రి విజయ్‌రెడ్డి ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆయనది గుంటూరు‌ కాగా, శ్రావ్య తల్లి సీత స్వస్థలం బాపట్ల సమీపంలోని నరసయ్య పాలెం. తనకు దక్కిన గౌరవంపై శ్రావ్య స్పందిస్తూ.. ‘నా తల్లిదండ్రులు నాకు భారతీయ పద్ధతులు, సంస్కృతులను నేర్పుతూ  పెంచారు. నేను వసుధైక కుటుంబం సిద్ధాంతాన్ని నమ్ముతాను’ అని చెప్పింది.

లాక్డౌన్ 4.0 గైడ్లైన్స్…రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం

దేశవ్యాప్త లాక్డౌన్ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్డౌన్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలను హోంశాఖ విడుదల చేసింది. రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. అదే సమయంలో కంటైన్మెంట్ జోన్ల మినహా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వీటిని నడుపుకోవచ్చని హోంశాఖ స్పష్టంచేసింది. లాక్డౌన్ 4.0 లో వీటిపై నిషేధం కొనసాగుతుంది దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. దేశీయంగా మెడికల్ సేవలు, దేశీయ ఎయిర్ అంబులెన్స్లు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్ అనుమతించిన వాటికి మినహాయింపు ఉంటుంది. మెట్రో రైలు సేవలు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్ సెంటర్లు మూసి ఉంటాయి. ఆన్లైన్/డిస్టెన్స్ లెర్నింగ్ ఎప్పటిలాగే కొనసాగుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి లేదు. అయితే, వైద్య, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్కేర్ వర్కర్లలకు సేవలందించే, క్వారంటైన్లో ఉన్న పర్యాటకులకు వసతి కల్పించే వాటికి అనుమతి ఉంటుంది. ఇంటికి సరఫరా చేస్తున్న రెస్టారెంట్లు కిచ్న్ తెరిచేందుకు అనుమతులు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న క్యాంటిన్లు నడిపేందుకు అనుమతులు. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, ఇతర వినోద ప్రాంతాలు తెరిచేందుకు అనుమతి లేదు. రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకూ అనుమతి లేదు. మతపరమైన సంస్థల్లో ప్రజలకు అనుమతి లేదు. మతపరమైన ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించడానికి లేదు. కంటైన్మెంట్ జోన్లు కాకుండా నిబంధనల మేరకు వీటికి అనుమతి రాష్ట్రాల మధ్య సమన్వయం మేరకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహన ప్రయాణాలకు అనుమతి. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకుంటాయి. కంటైన్మెంట్, బఫర్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు ఎక్కడెక్కడ రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు ఏర్పాటు చేయాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వాటిని పరిగణించాల్సి ఉంటుంది. రెడ్, ఆరెంజ్, కంటైన్మెంట్, బఫర్ జోన్ల సరిహద్దులు ఆ జిల్లా అధికారులు నిర్ణయిస్తారు. అవి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలి. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ప్రజలు రోడ్లమీదకు రాకూడదు. కంటైన్మెంట్ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉండాలి. అవసరమైన వైద్య పరీక్షలు, సేవలు అందించాలి. రాత్రి కర్ఫ్యూ... రాత్రి 7గం. నుంచి ఉదయం 7గం. వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. (అత్యవసర సేవలు మినహా) ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేయాలి. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్ అమలు చేయాలి.

స్టైరీన్తోనూ సహజీవనం చేయాలా?: పవన్

స్టైరీన్ విష వాయువుతో కూడా సహజీవనం చేయాలా?అని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు పరిహారం ఇచ్చారు సరే.. పరిష్కారం ఎప్పుడు? నిలదీశారు. దైన్యంగా మిగిలిన బాధితులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాతో కలిసి జీవించే పరిస్థితి తప్పదని చెబుతున్న ప్రభుత్వం.. స్టైరీన్ మృత్యువాయువుతో సైతం సహజీనం చేయాల్సిందేనని తన చర్యల ద్వారా ప్రభుత్వం చెప్పకనే చెబుతోందని పవన్ ఎద్దేవాచేశారు.పారిశ్రామిక వృద్ధి ముఖ్యమే అని, అదే సమయంలో ప్రజల ప్రాణాలు కూడా అంతకంటే ముఖ్యమని పవన్ అన్నారు. పారిశ్రామికాభివృద్ధి పర్యావరణ హితంగా, ప్రజల జీవన విధానం మెరుగుపడే విధంగా ఉండాలన్నారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను చూసి నిపుణులు సైతం నివ్వెరపోతున్నారుని దుయ్యబట్టారు. ఆ కేసు దర్యాప్తులో ఇంత వరకు ఎటువంటి పురోగతీ కనిపించడం లేదన్నారు. స్టైరీస్ గ్యాస్ పీల్చిన వారు భవిష్యత్లో ఎదుర్కోబోయే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావని, గ్యాస్ బాధితులకు శాశ్వత ప్రాతిపదికన ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పర్యావరణ హితంగా ఉండే పరిశ్రమలకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని పవన్ అన్నారు.

పెను తుఫాన్ గా మారిన ఆంఫన్

ఆంధ్రప్రదేశ్ కు ఆంఫన్ తుఫాన్ గండం పొంచి ఉంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళఖాతంలో కేంద్రీకృతమైన ఆంఫన్ పెను తుఫాన్ ‌గా మారనుంది. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు పడే అవకాశముంది. తమిళనాడు పైనా అంఫన్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాన్ కారణంగా ఇప్పటికే దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో పెను తుఫాన్‌గా మారడంతో రాష్ట్రంలోని హార్బర్‌లలో మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీచేశారు.  బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారి ఆదివారం రాత్రి సాయంత్రం తీవ్ర తుఫాన్ గా మారింది. సోమవారం సాయంత్రానికి పెను తుఫాన్ గా మారనుంది. ప్రస్తుతం ఆంఫన్ తుఫాన్ పారాదీప్ దక్షిణ దిశగా 790 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ లోని డిగా ప్రాంతానికి దక్షిణ నైరుతి దిశగా 940 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ లోని కెఫాపుర ప్రాంతానికి దక్షిణ నైరుతి దిశగా 1060 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా బంగాళాఖాతం మీదుగా పయనిస్తోంది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి పెను తుఫాన్ గా మారనుంది. డిగా, బంగ్లాదేశ్ హతియా దీవుల మధ్య మే 20 వ తేదీ మధ్యాహ్నం సమయంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.