ఉద్యోగుల తొలగింపు లేదా జీతాల కోత తప్పదంటున్న ప్రైవేట్ సంస్థలు!
posted on May 15, 2020 @ 10:42AM
కరోనా వైరస్, లాక్‌డౌన్ ప్రభావంతో చాలా ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించేందుకు, వేతనాల్లో కోత విధించేందుకు సిద్ధమవుతున్నాయని ఓ సర్వే తెలిపింది. దాదాపు 68% సంస్థలు ఈ దిశగా ఆలోచిస్తున్నాయట. కరోనా వైరస్ ముప్పుతో అమలు చేసిన లాక్‌డౌన్ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపించడమే ఇందుకు కారణమని సర్వే నివేదిక పేర్కొంది.
మైహైరింగ్‌క్లబ్.కామ్, సర్కారినౌకరి. ఇన్ఫో సంస్థలు సంయుక్తంగా మే1 నుంచి 10 వరకు ఈ సర్వే చేపట్టాయి. దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 11 రంగాలకు చెందిన 1,124 కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. దాదాపు 68% కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేందుకు సిద్ధమవుతున్నాయట. 57% యజమానులు తాత్కాలికంగా ఉద్యోగాలు తీసేస్తామని, 21% మంది రెండేళ్ల వరకు శాశ్వత ఉద్యోగాలు తీసేస్తామని వెల్లడించాయి. ఐతే 32% కంపెనీలు వేతనాలు, ఉద్యోగాల్లో కోతలు విధించడం లేదని చెప్పడం ఆసక్తికరం.
రిటైల్ అండ్ ఎఫ్‌ఎంసీజీ రంగంలో 49%, ఆతిథ్య/వైమానిక/రవాణా రంగాల్లో 48%, ఆటోమొబైల్/తయారీ/ఇంజినీరింగ్‌లో 41%, స్థిరాస్తిలో 39%, విద్యుత్ రంగంలో 38% ఉద్యోగుల తొలగింపు ఉంటుందని సర్వే వెల్లడించింది. 6-10 ఏళ్ల అనుభవజ్ఞుల్లో 31%, 11-16 ఏళ్ల అనుభవజ్ఞుల్లో 30%, అంత కన్నా ఎక్కువ అనుభవజ్ఞుల్లో 21%, జూనియర్ స్థాయి ఉద్యోగుల్లో (1-5 ఏళ్ల అనుభవం) 18% తొలగింపు ఉంటుందని పేర్కొంది.
‘కరోనా మహమ్మారి వల్ల అన్ని పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని అనుభవిస్తున్నాయి. అదిప్పుడు పరిశ్రమలోని ప్రతిస్థాయిలో వివిధ రూపాల్లో వ్యక్తమవుతోంది. ఉద్యోగస్తుల్ని తొలగించడమా? లేక వారి జీతాల్లో కోత విధించడమే. ఏదో ఒకటి చేసే దుస్థితి. కరోనా సంక్షోభం నుంచి కంపెనీలు బయటపడగానే కొత్త ఉద్యోగాల సృష్టి మొదలవుతుంది’ అని మైహైరింగ్‌క్లబ్, సర్కారి నౌకరీ సీఈవో రాజేశ్ కుమార్ అన్నారు. వైమానిక, ఆతిథ్య, రవాణా, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్, తయారీ రంగాలు ఎక్కువ ప్రభావం చెందాయని ఆయన తెలిపారు. ఇవి కోలుకొనేందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు.