చైనా అండతో రెచ్చిపోయి కాల్పులు జరిపిన నేపాల్..

భారత్ తో ఎంతో సఖ్యతతో ఉండే మన పొరుగు దేశం నేపాల్ ఈ మధ్య చైనా ప్రోద్బలంతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలి భారత్ ను కవ్వించే విధంగా చేస్తున్న కామెంట్స్ తో అక్కడి అధికార పార్టీలో కూడా విభేదాలు తలెత్తాయి. తాజాగా నేపాల్ ప్రధాని ఓలి రాముడి అయోధ్య యూపీలోని డి కాదని అది నేపాల్ లో ఉందని చేసిన కామెంట్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నేపాల్ మరో దుశ్చర్యకు పాల్పడింది. బీహార్‌లోని కిషన్ గంజ్ సరిహద్దుల్లో ఆదివారం నాడు భారత నేపాల్ సరిహద్దులలో పశువులను కాస్తూ వెళ్లిన జీతేంద్ర కుమార్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. భారత నేపాల్ సరిహద్దుల్లోని ఫతేపూర్‌లోని తెహ్రగచ్‌లో ఈ కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. నేపాల్ పోలీసులు జరిపిన ఈ కాల్పుల్లో జీతేంద్ర సింగ్ గాయపడడంతో అతనిని హాస్పిటల్ కు తరలించినట్లు కిషన్ గంజ్ డీఎస్పీ అన్వర్ జావెద్ తెలిపారు. ఐతే కాల్పుల నుంచి మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారని అయన తెలిపారు. ఈ ఘటన తో స్థానికల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ఈ ఘటనపై తాము విచారణ చేపట్టామని అలాగే నేపాల్ అధికారవర్గాలతో చర్చలు జరుపుతున్నామని కిషన్ గంజ్ డీఎస్పీ తెలిపారు.

కరోనాతో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా రెండు దశాబ్దాల పాటు పనిచేసిన మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందారు. గత కొద్దీ రోజుల క్రితం దీక్షితులు కరోనా బారిన పడ్డారు. తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రి లో చేరారు. అయితే పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన గత రెండుదశాబ్దాలుగా టీటీడీలో సేవలందించారు. ఇటీవల టీటీడీలో పనిచేస్తున్న వారిలో దాదాపు 150 మందికి కరోనా సోకింది. వారిలో 18 మంది అర్చకులు కూడా ఉన్నారు. కరోనా బారిన పడిన శ్రీనివాసమూర్తి దీక్షితులు నాలుగు రోజుల కిందట చికిత్స కోసం సిమ్స్ లో చేరారు. ఆలయ సంప్రదాయ పద్ధతిలో శ్రీనివాస మూర్తి దీక్షితుల తుది అంతిమ సంస్కారాలు చేయనున్నారు. కరోనా వైరస్ కారణంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులకి ఆయన పార్థివదేహాన్ని అప్పగించే అవకాశం లేదు.

టీటీడీ మాజీ చైర్మన్‌ దేవినేని సీతారామయ్య మృతి

టీటీడీ మాజీ చైర్మన్‌, ప్రముఖ ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కో సీనియర్ భాగస్వామి, విజ్ఞాన జ్యోతి వ్యవస్థాపకులు దేవినేని సీతారామ‌య్య (90) మృతి చెందారు. కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సీతారామయ్య సొంతగ్రామం కృష్టాజిల్లాలోని తెన్నేరు. గుంటూరులో సీఏ పూర్తి చేసిన ఆయన1986-89లో  టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆర్‌బీఐ ప్రాంతీయ బోర్డు డైరెక్టర్‌గా సేవలందించారు. విజ్ఞాన జ్యోతి సంస్థ వ్యవస్థాపకుడు, కోశాధికారిగా దేవినేని సీతారామయ్య పనిచేశారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కొడుకు అమెరికాలో డాక్టర్. కుమార్తె హైదరాబాద్ లో ఉంటారు. సీతారామయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, సుజనాచౌదరి, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత విచారం వ్యక్తం చేశారు.  సీతారామయ్య ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియజేశారు.

తెలంగాణలో 45 వేలు క్రాస్ చేసిన కరోనా కేసులు.. ఒక చిన్న ఊరట

తెలంగాణలో కొత్తగా నిన్న 1,296 పాజిటివ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 45వేలు దాటాయి. ఐతే నిన్న నమోదైన కేసులలో జీహెచ్ఎంసీలో 557 , వరంగల్ అర్బన్ 117, రంగారెడ్డిలో 111 కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా తో ఆరుగురు మృత్యు వాత పడ్డారు. దీంతో కరోనా సోకి రాష్ట్ర్రం లో మొత్తం 415 మంది చనిపోయారు. ఆదివారం ఒక్క రోజు 1831 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా మహమ్మారి నుండి కోలుకుని 32,438 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్నటి రికార్డుల ప్రకారం కొత్తగా వచ్చిన కేసుల కంటే కోలుకుని ఇంటికి చేరిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి ఇది ఒకటే చిన్న ఊరట అని వైద్యులు తెలియ చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

ఈ-ఆఫీస్ ప్రారంభించిన సీఎస్

పరిపాలన పాదర్శకంగా ఉండేలా ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం బిఆర్కె భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆరు శాఖల్లో ఈ ఆఫీస్ విధానాన్ని ప్రారంభించారు. సాధారణ పరిపాలనా శాఖ, వాణిజ్య శాఖ, ప్రధాన కమీషనర్, భూ పరిపాలన, అబ్కారి, మద్యనిషేధ శాఖల్లో ఈ ఆఫీస్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇతర శాఖలు కూడా ఈ ఆఫీస్ విధానంలోకి మారాలని సిఎస్ సూచించారు. ఈ కొత్త విధానం ద్వారా పేపర్ లెస్ ఆఫీస్ తో పాటు పనుల్లో పారదర్శకత సాధ్యమవుతుందని ఆయన అన్నారు. దాదాపు 1600మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా త్వరగా ఫైళ్లు పరిష్కరించడానికి వీలవుతుందన్నారు. ప్రతి ఫిర్యాదు ఆన్ రికార్డులో అందుబాటులో ఉంటాయని, అధికారుల పనితీరు మరింత సులభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఆ రెండు బిల్లులను పక్కన పెట్టండి.. గవర్నర్ కు కన్నా లేఖ

ఎలాగైనా మూడు రాజధానుల బిల్లు, సిఆర్డీఏ సవరణ బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ఏపీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్న సంగతి తెల్సిందే. దీని కోసం ఆ బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమని ఎపి విభజన బిల్లుకు కూడా వ్యతిరేకమని ప్రతి పక్షాలు మొత్తుకుంటున్నాయి. తాజాగా ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఒక లేఖ రాసారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు ఆమోదించడం లేదని, ప్రభుత్వం పంపిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ సవరణ బిల్లులను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని అయన కోరారు. దీనికి కారణాలను వివరిస్తూ.. ఒక పక్క సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, మరో పక్క రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని వివరించారు. ఈ బిల్లులపై ఇటు ప్రజల, అటు రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని అయన గవర్నర్ ను కోరారు. ఈ సందర్బంగా రాజధాని ప్రాంత ప్రజల శాంతియుత నిరసనలను కూడా పరిశీలించాలని అయన ఆ లేఖలో తెలిపారు. ఇపుడు కన్నా రాసిన ఈ లేఖతో ఏపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రాష్ట్ర గవర్నర్ ను కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం నియమించడంతో అయన బీజేపీ మాట కాదనే అవకాశం ఉండదు. దీంతో అమరావతి పై బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్ లో ఈ లేఖ ఒక భాగమా లేక ఈ విషయం పై ఆ పార్టీ సీరియస్ గానే ఉందా అనే సంగతి త్వరలోనే తేలుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

సహాజీవన్ రెడ్డి గారికి నిబంధనలు వర్తించవా?

భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు పెరుగుతుండటంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులు పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. అయితే ఏపీలో మాత్రం సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిబంధనలకు గాలికి వదిలేయడంపై టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన లోకేష్.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. "వైఎస్ జగన్ గారి పాలనలో సామాన్యులకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయా? ప్రజలంతా ఖచ్చితంగా మాస్కు పెట్టుకోవాలి లేకపోతే చర్యలు తప్పవు అంటూ జిఓ తెచ్చిన వారు ఆ నిబంధన పాటించరా? యుశ్రారైకాపా నాయకులు కరోనా కి అతీతులా?" అని లోకేష్ ప్రశ్నించారు. "సహాజీవన్ రెడ్డి గారికి నిబంధనలు వర్తించవా? మాస్కు పెట్టుకోకుండా స్వైర విహారం చేస్తున్న జగన్ రెడ్డి గారు ప్రజలకు ఎం సమాధానం చెబుతారు?" అని లోకేష్ నిలదీశారు.

ఏపీలో ఒక్క రోజే 3963 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా ఒక్క రోజే 3963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,609 కి చేరింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుండి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసులలో సింగిల్ డే హయ్యెస్ట్ రికార్డ్. ఈ రోజు వచ్చిన పాజిటివ్ కేసులలో 993 కేసులు ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే నమోదయ్యాయి. దీని తరువాత స్థానంలో 550 కేసులతో కర్నూల్, 407 కేసులతో పశ్చిమ గోదావరి, 343 కేసులతో చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. నిన్న ఒక రోజులోనే 52 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 22,260 మంది వివిధ హాస్పిటల్స్, క్వారంటైన్ సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారు. అంతేకాక ఇప్పటివరకు 21,763 మందికరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

వాహనాల నంబర్ ప్లేట్ రంగులపై కేంద్రం క్లారిటీ

వాహనాల నంబర్ ప్లేట్ల రంగు సహా ఇతర అన్ని రకాల అనుమానాలపై మరోసారి కేంద్రం స్పష్టతనిచ్చింది. దీనిపై రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాటరీతో నడిచే వాహనాలకు ఆకుపచ్చ రంగు బ్యాగ్రౌండ్ లో పసుపు రంగు ఆల్ఫా న్యూమరల్స్ ఉన్న నంబర్ ప్లేటును అమర్చాలి. తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం ఎరుపు రంగు న్యూమరల్స్, పసుపు రంగు బ్యాగ్రౌండ్ నంబర్ ప్లేట్లను కేటాయించింది. డీలర్ల అధీనంలో ఉంటే వాహనాల నంబర్ ప్లేట్లు ఎరుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌తో తెలుపు రంగు అల్ఫా న్యూమరల్స్ ఉండాలని పేర్కొంది. నంబర్ ప్లేట్ కేటాయింపు విధానంపై స్పష్టత కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఇందులో కొత్తగా ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.  ఇంతకు ముందు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రకరకాల వాహనాల నంబర్ ప్లేట్ల విధానాలను సూచించింది కేంద్రం. ఆ తర్వాత వివిధ క్యాటగిరీ వాహనాలకు నంబర్ ప్లేట్ ఆల్ఫా న్యూమరల్స్ , బ్యాంగ్రౌండ్ లను నిర్దేశించింది. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లకు సంబంధించి కొత్త నిబంధనలు మంత్రిత్వ శాఖ ప్రకటించలేదు. కేవలం నియమాలపై స్పష్టత నివ్వడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రకాశం జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖ 

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని హింసించటం తగదంటూ ప్రకాశం జిల్లా ఎస్పీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వడ్డెల సందీప్ కుమార్, తోతపూడి చంద్రశేఖర్‌ ల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం తగదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని ఉల్లంఘించడమే అని తెలిపారు. 24 గంటల వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా వారిని శారీరకంగా హింసించటం దుర్మార్గమని.. సంబంధిత పోలీసు అధికారులపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి సంబంధించిన డబ్బు పట్టుపడిందని తమిళ మీడియాలో వచ్చిందని.. ఇదే విషయంపై ఏపీలో ఎందుకు తనిఖీలు చేయలేదని సందీప్, చంద్రశేఖర్ లు సోషల్ మీడియాలో ప్రశ్నించారన్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేయడం ద్వారా వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని వ్యాఖ్యానించారు. జులై 16 నాడు మధ్యాహ్నం 1 గంటకు వారిని అరెస్టు చేశారని, జూలై 17 సాయంత్రం వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని విమర్శించారు. ఈ అమానవీయ, అనాగరిక చర్యలను ఖండించాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ షురూ

మాజీ ఎంపీ, సీఎం జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య 2019 మార్చ్ 19 న జరిగిన సంగతి తెలిసిందే. ఐతే ఈ హత్య కేసు పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిట్ వేసి దర్యాప్తు చేసినా ఇంతవరకు హంతకులు ఎవరు...అసలు ఈ హత్య కు కారణం ఏంటనే విషయం ఇంతవరకు తెలీలేదు. ఐతే ఎపి హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడంతో ఈ రోజు సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఏడుగురు అధికారుల సిబిఐ బృందం ఈ రోజు కడప ఎస్పీ అన్బురాజన్ ను కలిసి వివేకా హత్యకేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి సీబీఐ అధికారులు వివేకా హత్య జరిగిన పులివెందులకు కూడా వెళ్లి క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేస్తారు. ఐతే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దాదాపు 1300 మందిని విచారించినా ఎటువంటి పురోగతి సాధించలేదు. సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్బంగా హైకోర్టు కూడా ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ ఈ కేసులో చిక్కుముడి వీడకపోవడాన్ని ప్రశ్నించింది. ఈ కేసును సిబిఐ వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

కలెక్టర్‌ బదిలీ వెనుక కొత్త కోణం.. సంతకం పెట్టు లేదా సెలవుపై వెళ్లిపో!

నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబును ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఆయన బదిలీ వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. భూ తతంగంలో మాట వినకపోవడంతో బదిలీ చేయించినట్టు సమాచారం. పేదల ఇళ్ల స్థలాల కోసం నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని బుడంగుంట వద్ద గల 35 ఎకరాలు కొనుగోలు చేయాలని భావించిన అధికారులు.. ఎకరం ధర రూ.13 లక్షలుగా నిర్ణయించారు. ఈ భూముల్లో అంతగా సాగు కాకపోవడంతో విక్రయించేందుకు రైతులు కూడా అంగీకరించారు. అలాగే, ఈ భూముల పక్కనే గల మరో 37 ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలని అధికారులు భావించారు. ఎకరం రూ. 27 లక్షలకు ఇవ్వడానికి వారు ఒప్పంద పత్రాలు కూడా ఇచ్చారు. ఈ భూముల కొనుగోలుకు దాదాపుగా నిర్ణయం జరిగిపోయింది. సరిగ్గా అప్పుడే అధికార పార్టీ నాయకులు రంగ ప్రవేశం చేశారు. ఇవి టీడీపీ సానుభూతిపరుల భూములని, వాటిని కొనడానికి వీలు లేదని అడ్డుపడ్డారట.  ఈ భూములకి బదులుగా కావలి రైల్వే లైన్ కు అవతలి వైపు తిప్ప పరిధిలో గల 115 ఎకరాలను ఎంపిక చేశారు. రిజిస్ర్టార్‌ ఆఫీసు రికార్డుల ప్రకారం ఈ భూమి విలువ ఎకరం రూ.12 లక్షలు. అయితే, ఈ భూమిలో కొంత విస్తీర్ణానికి గతంలో కన్వర్షన్‌(భూ వినియోగ మార్పిడి)కి అనుమతించారు. దీంతో ఆ సర్వే నంబరులో మాత్రం రిజిస్ట్రేషన్‌ విలువ రూ.24 లక్షలకు పెరిగింది. నిజానికి, వ్యవసాయానికి ఏ మాత్రం అనువుగాని భూములవి. రిజిస్ర్టార్‌ ఆఫీసు రికార్డుల ధర ప్రకారం అమ్మాలన్నా ఈ భూములను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురారు. అలాంటి భూములకు రెక్కలు వచ్చేలా చేశారు కొందరు అధికార పార్టీ నేతలు. మొత్తం 115 ఎకరాలకు 'కన్వర్షన్‌' భూమి ధరే ఉన్నట్లుగా చూపారు. ఎకరం ధర రూ.60 లక్షలుగా నిర్ణయించి.. ఆ తర్వాత ఐదు లక్షలు తగ్గించినట్లు చెబుతూ, ఎకరం 55 లక్షలకు ఫిక్స్‌ చేశారు.  అయితే, ఈ 115 ఎకరాల్లో 40 ఎకరాలు అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులవని తెలుస్తోంది. మిగిలిన 75 ఎకరాలకు సంబంధించి.. రైతుకు రూ.40 లక్షలు, తమకు కమీషన్‌ రూ.15 లక్షలు వచ్చేలా కొందరు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. అందుకు సమ్మతించిన రైతుల భూములనే సేకరించారని, అంగీకరించని రైతులకు చెందిన 30 ఎకరాలను వదిలేశారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, కావలి భూముల్లో కుంభకోణం జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు దీనిపై దృష్టి సారించారు. ఫైలు తన వద్దకు వచ్చినా పట్టించుకోలేదు. సంతకం చేస్తే ఇరుక్కుపోవడం ఖాయమనే ఉద్దేశంతో ఫైలును పక్కన పెట్టారు. దీంతో అధికార పార్టీ నేతలు కలెక్టర్‌ పై ఒత్తిడి తీసుకొచ్చారట. 'ఫైలు మీద సంతకం పెట్టు.. లేదంటే సెలవుపై వెళ్లిపో' అని బెదిరించడంతో ఆయన లీవ్‌లో వెళ్లిపోయారని తెలుస్తోంది. ఇంతలో కలెక్టర్‌ను బదిలీ చేయాలని ప్రతిపాదన రావడం, ప్రభుత్వం బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయి. మరోవైపు, కొత్త కలెక్టర్‌ రాకముందే కావలి భూ బాగోతానికి సంబంధించిన పని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఎకరం భూమికి రూ.50 లక్షలు సిఫారసు చేస్తూ జిల్లా నుంచి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు మరో అధికారి ద్వారా తమకు కావలసిన పని పూర్తి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా

ఏపీలో ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు కరోనా బారినపడ్డారు. తాజాగా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయింది. కరోనా అనుమానంతో ఆయన ఇటీవల పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ గా తేలింది. ఆయన సతీమణి శ్రీవాణిరెడ్డికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వీరు తిరుపతి అమర ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ రావటంతో ఆయనను కలిసిన నేతలు, కార్యకర్తలు, సన్నిహితుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం అధికారులు ఎమ్మెల్యేను కలిసిన వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. శ్రీకాళహస్తి వైసీపీ కార్యాలయంలోని సిబ్బంది, ఆ ప్రాంతంలోని పలువురు కార్యకర్తల నుంచి కరోనా పరీక్షల కోసం వైద్య సిబ్బంది నమూనాలు సేకరిస్తున్నారు.

రఘురామకృష్ణం రాజు సీటు మారింది.. మరో మెట్టు ఎక్కినట్టే

పార్టీకి విధేయుడినేనని చెబుతూ, వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తీరు కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎంపీ రఘురామకృష్ణం రాజుకు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఏకంగా పార్టీ పేరుకే ఎసరు వచ్చే పరిస్థితి తెచ్చుకున్న వైసీపీ.. తాజాగా ఆయనకు ఓ చిన్న ఝలక్ ఇచ్చింది. లోక్‌సభలో ఆయన కూర్చునే సీటును మార్చింది. గతంలో నాల్గో లైన్‌లో ఉన్న ఆయన సీటును ఏడో లైన్‌లోకి మారుస్తూ లోక్‌సభ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వైసీపీ లోక్‌సభా పక్షనేత ఇచ్చిన సూచన మేరకు ఈ మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. 379 సీట్లో ఉన్న రఘురామకృష్ణం రాజు 445 సీటుకు మారారు. మార్గాని భరత్‌ 385 నుంచి 379 కి వచ్చారు. వీరితో పాటు కోటగిరి శ్రీధర్‌ కు 421 నుంచి 385, బెల్లన చంద్రశేఖర్‌ కు 445 నుంచి 421 కేటాయించారు.  లోక్‌సభలో సీటు మార్పుపై ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. లోక్‌సభలో తన స్థానం మార్చినంత మాత్రాన పెద్ద తేడా ఏమీ ఉండబోదని అన్నారు. తనను మరో మెట్టు ఎక్కించారనుకుంటానని పేర్కొన్నారు. తమ పార్టీలో తనను వెలివేశారని, అయినప్పటికీ తాను ఎప్పుడూ సీఎం జగన్‌ కు, పార్టీకి విధేయుడినేనని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.

నాలుగు సార్లు టెస్టు చేసినా నెగటివ్.. అయినా ప్రాణాలు పోయాయి

కరోనా వైరస్ లక్షణాలు పైకి కనిపించిన వారు అనుమానం తో టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వస్తే చికిత్స చేయించుకుంటున్నారు. ఐతే లక్షణాలు ఉండి టెస్టుల లో నెగటివ్ వస్తే మాత్రం పరిస్థితి అయోమయం లో పడి చికిత్స ఆలస్యమవడం తో ఏకంగా ప్రాణాలే పోతున్నాయి. ఇటువంటి ఘటన ఒకటి హైదరాబాద్ లో జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇటీవల 26 మంది పోలీసులకు కరోనా సోకింది. దీంతో అక్కడే పని చేస్తున్న ఏఎస్ఐ ప్రేమ్ కుమార్ కూడా కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ రావడంతో తిరిగి విధులకు హాజరయ్యారు. ఐతే కొద్ది రోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేయించుకోవాలని పై అధికారులు సూచించడంతో మళ్ళీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. ఐతే మళ్లీ నెగిటివ్‌గానే ఫలితం వచ్చింది.  ఇది ఇలా ఉండగా గడచిన కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో అయన బాధపడుతున్నాడు. దీంతో మరో సారి ఆ ఏఎస్ఐ కరోనా పరీక్షలు చేయించుకోగా మళ్లీ రిజల్ట్ నెగిటివ్‌గానే వచ్చింది. మొత్తం నాలుగు సార్లు పరీక్షలు చేయించుకోగా.. నాలుగు సార్లు నెగిటివ్‌ ఫలితమే వచ్చింది. కానీ అయన పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు నగరంలోని పలు ఆసుపత్రులలో చేర్చే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు బెడ్ లు ఖాళీ లేవంటూ ప్రేమ్ కుమార్‌ను చేర్చుకోలేదు. ఆయనకు అంతకు ముందు చేసిన కరోనా టెస్టులన్నింటిలో నెగిటివ్ ఫలితం రావడంతో చివరికి గాంధీ ఆస్పత్రిలోనూ చేర్చుకోలేదు. దీంతో విషయం తెలుసుకున్న కొందరు పోలీసు ఉన్నతాధికారులు చిరవ తీసుకుని జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగలిగారు. ఐతే అప్పటికే ఆ ఏఎస్ఐ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఇక్కడ కూడా మరోసారి కరోనా వైరస్ నిర్దారణ పరీక్ష జరపగా అక్కడ కూడా నెగిటివ్‌గా ఫలితం వచ్చింది. ఆ మరుసటి రోజుకు ప్రేమ్ కుమార్ కిడ్నీలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో డాక్టర్లు మళ్లీ కరోనా పరీక్షలు చేశారు కానీ ఆ రిజల్ట్ వచ్చేలోపే ప్రేమ్ కుమార్ ప్రాణాలు విడిచారు. అయన మరణం తరువాత వచ్చిన టెస్ట్ ఫలితంలో మాత్రం పాజిటివ్ ‌గా తేలింది. దీంతో ముందుగా చేయించుకున్న నాలుగు టెస్టులలో నెగిటివ్ రావడమే ఆ ఏఎస్ఐ మ‌ృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

5జీ తో మారనున్న ప్రపంచం

అనేక రంగాల్లో పెనుమార్పులు.. సమాచార గోపత్య పెద్ద సవాలే.. ట్రింగ్.. ట్రింగ్ అంటూ ఒక్కోక్క నెంబర్ ను డయల్ చేసే స్థాయి నుంచి వాయిస్ కమాండ్ తో ఫోన్ చేసి మాట్లాడే  స్థాయికి  టెక్నాలజీ వచ్చింది. 1980లో డయల్ ఫోన్ వాడినవారు ఇప్పుడు గూగుల్ అసిస్టెంటు, సిరి లాంటి స్మార్ట్ టెక్నాలజీని చూసి అబ్బుర పడుతున్నారు. వర్చువల్ రియాల్టీతో అద్భుతాలు చూపించే 5జీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే మారిపోతుంది. స్మార్ట్ టెక్నాలజీతో పనులన్నీ సూపర్ ఫాస్ట్, టూ.. స్మార్ట్ అవుతాయి. 1980లో వన్ జీ, 1990లో 2జీ, 2000లో 3జీ, 2010లో 4జీ జెనరేషన్ మొబైల్ నెట్ వర్క్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు హై స్పీడ్, కెపాసిటీతో అందుబాటులోకి వస్తోంది ఫిప్త్ జెనరేషన్ మొబైల్ నెట్ వర్క్. గత నాలుగేండ్లుగా దీనిపై జరుగుతున్న ప్రయోగాలు ఒక కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే చైనా, జర్మనీ, దక్షిణ కొరియా, అమెరికా లాంటి దేశాలు 5జీ టెక్నాలజీ ని  ఉపయోగించుకోవడంలో ముందున్నాయి. మనదేశంలోనూ ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిలయల్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటించారు. వచ్చే ఏడాది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 5జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.  వర్చువల్ రియాల్టీ సర్వీసెస్ ను సపోర్ట్ చేసే బ్యాండ్ విడ్త్ తో 4జీ కన్నా పది రెట్లు ఎక్కువ స్పీడ్ లో 5జీ పనిచేస్తుంది. ఒక సెకన్ కు 10-20 గిగా బైట్స్ డేటా రేట్ ఉంటుంది. ఇక ఆడియో, వీడియో, పిడిఎఫ్ ఫైల్స్ 50-100 రెట్ల స్పీడ్ తో ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. అంతేకాదు 1జీబీ నుంచి 10జిబీ మధ్య డౌన్లోడ్ స్పీడ్ ఉంటుంది. క్లౌడ్ కంప్యూటింగ్ స్వీడ్ ఎక్కువగా ఉంటుంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్సీని సపోర్ట్ చేస్తుంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విద్య, ఆరోగ్య, వాణిజ్య, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్, రవాణా, వ్యవసాయ తదితర రంగాలను మరింత స్మార్ట్ గా మార్చవచ్చు. స్మార్ట్ సిటీలు, స్మార్ట్ విలేజెస్ కాదు ప్రతి ఇంటిని స్మార్ట్ గా మార్చవచ్చు. ఇంటర్నెటు కల్పించే సదుపాయాలన్నింటికీ కొన్ని రెట్లు పెంచే 5జీతో  ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు వస్తాయని ఒక అంచనా. అయితే ఇకముందు ముఖ్యమైన డేటా ట్రాన్సఫర్ అంతా 5జీ ద్వారానే జరిగే వీలుందని.. దీని వల్ల వివిధ రంగాల్లో సమాచారం హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని కొన్ని దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.

పొంచి ఉన్న ముప్పు

దేశవ్యాప్తంగా కోవిద్ 19వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పదకొండు లక్షలకు చేరువలో ఉంది. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో బీహార్ రెండోస్థానంలో ఉన్నాయి. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలపై శాస్త్రవేత్తల బృందం అధ్యాయనం నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మౌలిక వసతులు, వైద్యసదుపాయాలు,  పరిశుభ్రత పారిశుద్ధ్యం తదితర 15 అంశాల ఆధారంగా వైరస్ ముప్పు ఏ విధంగా ఉండబోతుంది అన్నది గమనిస్తూ ఒక నివేదికను రూపొందించారు. ఈ వివరాలన్నీ ది లాస్సె ట్  పత్రికలో ప్రచురించారు. జార్ఖండ్, మహరాష్ట్ర ,ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోనూ కరోనా  తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తల విశ్లేషణలో తెలిసింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ పరిశోధన వివరాలను పంపించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి తాము జరిపిన పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.