జంబో జెట్ కు గుడ్ బై చెప్పిన బ్రిటీష్ ఎయిర్ వేస్

క్వీన్ ఆఫ్ స్కైస్ గా పిలువబడే బోయింగ్ 747 విమానాలను ఇక నడపబోమని బ్రిటిష్ ఎయిర్ వేస్ ప్రకటించింది. జంబో జెట్ గా పిలువబడే ఈ అతిపెద్ద విమానం గత అర్థ శతాబ్దంగా లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో విదేశీప్రయాణాలు చేసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో విమానయాన రంగం నష్టాల్లో పడింది. దాంతో చాలా సంస్థలు నష్టాలను తగ్గించుకోవడానికి మార్గాలను వెతుకుతున్నాయి. తాజాగా బ్రిటిష్ ఎయిర్వేస్  బోయింగ్ 747 నడపడం వల్ల నష్టాలు వస్తున్నాయని తెలిపింది. నిజానికి 2024లో బోయింగ్ 747 విమానాలను ఆపేయాలని బ్రిటిష్ ఎయిర్ వేస్ గతంలోనే నిర్ణయం తీసుకుంది. అయితే ప్రసుత్తం నెలకొన్న పరిస్థితులతో నాలుగేండ్లు ముందుగానే జంబో విమానసర్వీసులను ఆపేసింది. 50ఏండ్లుగా.. జెంటో జెట్, డబుల్ డెక్కర్, క్వీన్ ఆఫ్ స్కైస్ తదితర పేర్లతో పిలువబడే బోయింగ్ 747 విమానం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చి 50ఏండ్లు పూర్తి చేసుకుంది. భారీ ఆకారంతో సులభంగా గుర్తించేలా ఉండే ఈ విమానాన్నిమొదటిసారిగా సెప్టెంబర్ 30 1968 నాడు జరిగిన రూల్ అవుట్ సెలబ్రేషన్స్ లో బోయింగ్ సంస్థ ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత 1969లో మొదటిసారి ఆకాశంలో విహరించింది. పరీక్షలన్నీ పూర్తి చేసుకుని 1970 నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చింది. 1971లో మొదటిసారి లండన్-న్యూయార్క్ మధ్య ఆకాశయానం చేసింది. నాలుగు ఇంజన్స్ తో నడిచే ఈ విమానం అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది.

భారత్ లో కరోనా లేని ప్రాంతం ఉంది.. ఎక్కడో తెలుసా..?

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దాడికి కకావికలమౌతోంది. మన భారత దేశం లో కూడా పాజిటివ్ కేసులు 10 లక్షల మార్క్ దాటేశాయి. ఐతే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క కరోనా కేసు నమోదు కాని ప్రాంతం ఒకటి మన ఇండియాలోనే ఉంది. నమ్మబుద్ది కావడం లేదు కదా. కానీ నిజంగానే మన దేశంలోని లక్ష దీవులలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మనకు నమ్మశక్యం కావడం లేదు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం. సుమారుగా 65 వేల జనాభా కలిగిన లక్షద్వీప్ లో కేవలం మూడు ఆసుపత్రులు ఉన్నాయి. ఐతే ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. దీనికి అక్కడి ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలే కారణం. అక్కడ ఉన్న జనాభా కు మూడు ఆసుపత్రులు ఉండడం తో కరోనా ఎంటర్ ఐతే హ్యాండిల్ చేయడం అసాధ్యమని భావించిన స్థానిక ప్రభుత్వం అక్కడికి వచ్చే వారు తప్పని సరిగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించింది. లక్షద్వీప్ చేరాలంటే అటు షిప్ లో కానీ ఇటు ఫ్లయిట్ లో కానీ కేరళ లోని కొచ్చి నుండి మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. దీంతో కొచ్చి లోనే క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ రెండు వారాల సమయం గడచిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి అప్పుడే లక్షదీవులలోకి అనుమతిస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ లోకల్ గా ఉన్న 61 మందికి టెస్ట్ లు చేయగా నెగటివ్ అని తేలింది. అంతే కాకుండా మిగిలిన దేశంలో ఎక్కడా కూడా విద్యా సంస్థలు తెరిచే ఆలోచన కూడా చేయలేని పరిస్థితుల్లో ఇటు లక్షద్వీప్ ప్రభుత్వం మాత్రం పాఠశాలలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. ఫిబ్రవరిలో కరోనా అలజడి మొదలైనప్పుడే విదేశాల నుండి వచ్చే వారిని ముందుగా రెండు వరాల పాటు క్వారంటైన్ అనే రూల్ అమలు చేసి ఉంటే బహుశా మన దేశంలోనూ కరోనా ఇంత తీవ్రంగా ఉండేది కాదేమో అని సామాన్యులు అభిప్రాయ పడుతున్నారు. ఓ రకంగా మనది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది పరిస్థితి.

ఆ డబ్బు నాదే.. స్టిక్కర్ మాత్రం మా డ్రైవర్ ది

ఎపి తమిళనాడు బోర్డర్ లో 5.3 కోట్ల నగదు తో కొంతమంది తమిళనాడు పోలీసులకు పట్టుబడడం తో ఎపి రాజకీయాలలో తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ సొమ్ము ప్రకాశం జిల్లా వైసిపి నాయకులదేనని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీని పై ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు స్పందిస్తూ ఆ డబ్బు తనదేనని ఐతే కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం తన కార్ డ్రైవర్ అతికించాడని చెప్పారు. అసలు ఆ స్టిక్కర్ కాలం చెల్లిందని అంతే కాకుండా తన డ్రైవర్ దానిని ఎక్కడ నుండి తెచ్చాడో తనకు తెలియదని చెప్పారు. శ్రావణ మాసం వస్తున్నందున బంగారు నగలు కొనడానికి ఆ నగదుని చెన్నై తీసుకు వెళుతున్నట్లుగా అయన తెలిపారు. కొంత మంది విమర్శిస్తున్నట్లు ఈ ఘటన తో మంత్రి బాలినేని కి ఎటువంటి సంబంధం లేదని అయన వివరించారు. ఐతే నల్లమల్లి బాలు మంత్రి బాలినేనికి ముఖ్య అనుచరుడు కావడం తో పాటు వైసిపి తరుఫున కార్పొరేటర్ గా పోటీ లో ఉండడం తో ఇప్పట్లో ఈ రాజకీయ దుమారం సద్దుమణిగేటట్లు లేదు.

కరోనా విషయంలో ప్రజలెవరూ భయపడొద్దు: సీఎం కేసీఆర్

కరోనా మహమ్మారి విషయంలో ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యం కూడా ఉండొద్దని, తగు జాగ్రత్తలను పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు కీలక సూచనలు ఇచ్చారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, మాస్కులు ధరించాలి, శానిటైజర్లు వాడాలి. ప్రజలంతా వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. కరోనా సోకిన వారు అధిక ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎంతమందికైనా చికిత్స అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారని సీఎం చెప్పారు. హైదరాబాద్ లోని గాంధీ, టిమ్స్ లోనే దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్లు 5 వేల వరకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.  తెలంగాణలో కరోనా రికవరీ రేటు 67 శాతంగా ఉందని చెప్పారు. తీవ్రమైన జబ్బులు ఉన్న 200 మంది మినహా మిగిలిన అందరూ కోలుకుంటున్నారని తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉందని కేసీఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణలోనూ, చికిత్సలోనూ ఎంతో గొప్ప సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.

ఆస్ట్రేలియా బడుల్లో తెలుగు

మన తెలుగు భాషకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. అక్కడి పాఠశాలల్లో తెలుగును ఐచ్ఛిక అంశంగా చేరుస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు ఇకపై తెలుగు భాషను నేర్చుకునే అవకాశం కలగనుంది. తాజా ఆదేశాలతో తెలుగు భాషను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకొన్న వారికి ఉత్తీర్ణతలో ఐదు పాయింట్‌లు  అదనంగా వస్తాయి.  ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు హిందీ, పంజాబీ, తమిళ భాషలకు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు లభించింది. తాజాగా ఆ జాబితాలో తెలుగు చేరింది. చదువులోనే కాకుండా అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్లు శాశ్వత నివాసం కోసం కూడా తెలుగు భాష ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆదేశాల్లో పేర్కొన్నారు. నేషనల్‌ అక్రిడిటేషన్‌ అథారిటీ ఫర్‌ ట్రాన్సిలేటర్స్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటర్స్‌ నిర్వహించే పరీక్ష రాసేవారికి కూడా తెలుగుకు ఐదు పాయింట్లు అదనంగా కలుస్తాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రకటన పట్ల స్థానిక తెలుగు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

రాజస్థాన్ సంక్షోభంలో సెన్సేషనల్ ట్విస్ట్.. కేంద్ర మంత్రి పై ఎఫ్ ఐ ఆర్

రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షోభం సంచలన మలుపు తిరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఇటీవల బయపటడ్డ ఆడియో టేపులపై తీవ్ర దుమారం చెలరేగింది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాల సంచలనానికి తెర తీశారు. తమ పార్టీ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్‌ ఫోన్‌లో మాట్లాడుతూ బేరసారాలకు దిగారని తెలిపారు. దానికి సంబంధించిన ఆడియో టేపులు అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయని తెలిపారు. ఈ ఆడియో టేపుల గురించి కాంగ్రెస్ చీఫ్ విప్ మహేష్ జోషి రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)కి ఫిర్యాదు చేయడంతో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కేసు నమోదు చేసింది. అయితే ఈ ఎఫ్ఐఆర్‌లో భన్వర్ లాల్, సంజయ్ జైన్‌తో పాటు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్లను చేర్చింది. ఈ ఎఫ ఐ ఆర్ పై SOG ఏడీజీ అశోక్ రాథోడ్ మాట్లాడుతూ మహేష్ జోషి నుంచి మాకు రెండు ఫిర్యాదులు అందాయి. నిన్న వైరల్ అయిన ఆడియో టేపుపై ఆయన ఫిర్యాదు చేశారు. సెక్షన్ 124a, 120b కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఐతే ఆ ఆడియో టేప్ నిజమైనదా కాదా అనే విషయం పై దర్యాప్తు చేయాల్సి ఉంది అని తెలిపారు. తన పై ఫైల్ అయిన ఎఫ్ ఐ ఆర్ గురించి కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో టేపులతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా తాను ఎటువంటి విచారణకైనా సిద్ధమని అయన తేల్చి చెప్పారు.

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

తెలంగాణ ప్రస్తుత సచివాలయం కూల్చివేతకు అడ్డంకులు తొలగిపోయాయి. సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌లను న్యాయస్థానం కొట్టివేసింది. కూల్చివేతలపై దాఖలైన అభ్యంతరాలను తోసిపుచ్చింది.  కూల్చివేతకు కేంద్రం అనుమతులు అవసరం లేదని, కొత్త నిర్మాణం చేప్పట్టే ముందు అనుమతులు తీసుకుంటామని సోలిసీటర్ జనరల్ కోర్టుకు వివరించారు.  కొత్త భవనాల నిర్మాణానికి స్థలాన్ని సిద్ధం చేయడంలోనే భవవాల కూల్చివేత అంశం కూడా వస్తుందని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కరోనా ఎక్కువ ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. వారంరోజుల నుంచి ఉన్న స్టేను ఎత్తివేసింది హైకోర్టు. దీంతో ఇప్పటివరకు ఏర్పడిన సందిగ్ధత వీడినట్టయింది. ఇప్పటికే సగానికి పైగా భవనాలను కూల్చివేశారు. కూల్చివేతను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కూల్చివేత పనులు మళ్ళీ జరగనున్నాయి. ఇదే అంశంపై సుప్రీంకోర్టులోనూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేశారు. సుప్రీం కోర్టు, హైకోర్టులలో కూల్చివేతను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లు కొట్టివేయడంతో సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది. అయితే సచివాలయం కూల్చివేతను ఆపాలంటూ కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లోనూ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ అంశం విచారణకు రానుంది.

ఆ సత్తా భారత్ కే ఉంది: బిల్ గేట్స్

వ్యాక్సిన్ ఉత్పత్తికి సహాయం చేస్తాం కోవిద్ 19 వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ భారత్ తయారు చేస్తే తాము చేయూత నిస్తామని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రకటించారు. ప్రపంచం మొత్తానికి సరిపోయే స్థాయిలోవ్యాక్సిన్ అందించే శక్తి భారతదేశానికి ఉందని ఆయన అన్నారు. భారతదేశంలో ఫార్మారంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.  'కోవిడ్-19: ఇండియాస్ వార్ ఎగనెస్ట్ ది వైరస్' డాక్యుమంటరీ కోసం మాట్లాడుతూ భారత్ పరిశోధనలను ఆయన అభినందించారు. భారత్ లో జరుగుతున్న పరిశోధనలు విజయవంతమైతే కోవిద్ 19 వైరస్ ను అరికట్టడానికి ప్రపంచ ప్రజలందరి అవసరాలకు సరిపోయే స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల సత్తా భారత్ కు ఉందన్నారు. వ్యాక్సిన్ ను అత్యధిక సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ భారత్ కు సహాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.  బయో టెక్నాలజీ విషయంలో ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్)తో కలసి పని బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కలిసి పనిచేస్తోందన్నారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయని భారత్ లోనూ బయో ఈ, భారత్ బయోటెక్, సీరమ్ కంపెనీలు పరిశోధనల్లో ప్రగతి సాధించాయన్నారు. త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందని.. అయితే అప్పటివరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బిల్ గేట్స్ సూచించారు.

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు హైకోర్టులో ఊరట

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గతంలో రవిప్రకాష్ సీఈవో హోదాలో మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి టీవీ9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఏబీసీఎల్) నుంచి రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా విత్ డ్రా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఏబీసీఎల్ ప్రతినిధులు రవిప్రకాష్ తదితరులపై ఫిర్యాదు చేయగా, గతేడాది కేసు నమోదైంది.  ఈ కేసు ఆధారంగా ఈడీ రంగంలో దిగింది. ఈడీ వర్గాలు ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేయడంతో, తను మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భావించిన రవిప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కొన్ని షరతులతో బెయిల్ ఇచ్చింది. రూ.లక్ష చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు, ఈడీ అధికారులు ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈడీ విచారణ కొనసాగించుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

కరోనాతో కన్నుమూసిన మాజీ ఐఏఎస్ అధికారి

మహారాష్ట్ర తొలి మహిళా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రముఖ రచయిత్రి, కవి నీల సత్యనారాయణ్ (72) కరోనాతో కన్నుమూశారు. రెండు వారాల నుంచి కరోనాతో బాధపడుతున్న ఆమె ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త, కుమారుడు కూడా కోవిద్ 19 వైరస్ బారిన పడ్డారు. కుమార్తె , అల్లుడు ఐసోలేషన్ లో ఉన్నారు. 1972 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన నీల 2012లో మహారాష్ట్ర చీఫ్ ఎన్నికల కమిషనర్ గా నియమించబడ్డారు. మహారాష్ట్ర చీఫ్ ఎన్నికల కమిషనర్ గా  పనిచేసిన మొదటి మహిళగా పేరు గాంచారు. కరోనాతో మృతి చెందిన తొలి మహిళా ఐఏఎస్ అధికారి కూడా ఆమెనే కావడం విచారకరం. సాహిత్య, సంగీత రంగాల్లో విశేష ప్రతిభ ఉన్న ఆమె ఎన్నో పుస్తకాలు రాసి రచయిత్రిగా గుర్తింపు పొందారు. కొన్ని సినిమాలకు కూడా ఆమె సంగీతాన్ని అందించారు.

ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం.. మాజీ ఎస్.ఇ.సి నిమ్మగడ్డకు కీలక సూచన

ఏపీ ఎన్నిక‌ల అధికారిగా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ను తిరిగి నియ‌మించాల‌ని హైకోర్టు ఇచ్చిన తీర్పు అమ‌లుకాక‌పోవ‌టంపై నిమ్మ‌గ‌డ్డ ఏపీ ప్ర‌భుత్వంపై కోర్టు ధిక్కార పిటిష‌న్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు హైకోర్టులో విచారణ సందర్భంగా నిమ్మగడ్డ తరుఫు లాయర్ తన వాదనలో భాగంగా హైకోర్టు తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం మూడు సార్లు సుప్రీం తలుపు తట్టినా స్టే ఇవ్వడానికి నిరాకరించిందని తెలిపారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం ఏపీ గ‌వ‌ర్న‌ర్ ను స్వయంగా క‌లిసి పున‌ర్నియామ‌కంపై హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని విన‌తి ప‌త్రం ఇవ్వాల‌ని కోర్టు నిమ్మ‌గ‌డ్డ రమేష్ కుమార్ ‌కు సూచించింది. అంతే కాకుండా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు స్టే ఇవ్వని కారణంగా తాము ఇచ్చిన తీర్పు అమలులో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఐతే ఇప్ప‌టికే తాము గ‌వ‌ర్న‌ర్ అపాయింట్ మెంట్ కోరిన‌ట్లు నిమ్మ‌గ‌డ్డ త‌రుపు లాయ‌ర్ కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. తమ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే నిరాకరించినా ఇప్పటి వరకు నిమ్మగడ్డను ఎందుకు తిరిగి నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతే కాకుండా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచార‌ణ‌ను వ‌చ్చే శుక్ర‌వారంకు హైకోర్టు వాయిదా వేసింది.

ప్రజలను గాలికి వదిలేయలేం.. మీకు చేతనైంది చేసుకోండి...

ఏపీలోని క్రిష్ణా జిల్లా నూజివీడు లో కరోనా ఉధృతి తీవ్రమవుతోంది. కొత్తగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవడమే కాకుండా మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో పట్టణం లో మళ్ళీ లాక్ డౌన్ పెట్టాలని విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం నూజివీడులోని పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఒక వారం, పది రోజుల పటు లాక్ డౌన్ ప్రకటిస్తే సహకరిస్తామని నూజివీడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కూడా ముందుకు వచ్చారు. ఐతే సమస్యల్లా అధికార పార్టీ నేతలతోనే అని సమాచారం. కరోనా కేసులు తక్కువగా ఉన్నపుడు నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణి పేరుతొ అటు ప్రజలలోను ఇటు అధికారులతో కలిసి పని చేసిన నేతలు ఇపుడు పూర్తిగా పక్కకు తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.  ఇపుడు అధికార యంత్రాంగం ఒకటి రెండు రోజుల్లో లాక్ డౌన్ ప్రకటించే ఆలోచన చేస్తుండగా అధికార పార్టీ నాయకులు కొందరు అడ్డుపడుతున్నట్లుగా కూడా సమాచారం. ఐతే లాక్ డౌన్ విషయం పై ఈ రోజు అన్ని శాఖల అధికారులు కలిసి కరోనా నియంత్రణ కోసం ఒకనిర్ణయం తీసుకోబోతున్నామని ఆ పార్టీ నాయకులకు తెలిపినట్లు సమాచారం. దీని గురించి మీ లోకల్ నాయకత్వానికి చెప్పుకోవాలని ఒక వేళ అధికారులు తీసుకునే నిర్ణయం కనుక నచ్చకపోతే 24 గంటల్లో తమను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని కూడా వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా కొద్ది రోజులు లాక్ డౌన్ పెట్టి కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేసి నూజివీడు ప్రజలను ఈ మహమ్మారి నుండి బయట పడేయాలని అధికార యంత్రాంగం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రపంచంలోని కరోనా వ్యాక్సిన్ డేటా పై కన్నేసిన రష్యా గూఢచారులు.. 

కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో అటు ప్రభుత్వాధినేతల నుండి ఇటు సామాన్యుల వరకు అందరు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ కోసం ప్రపంచం లోని 20 ప్రముఖ పరిశోధనా సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరో పక్క రష్యా కు చెందిన సెచేనోవ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ మూడు దశల ట్రయల్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తీ చేసి ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉందని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే బ్రిటన్, కెనడా, అమెరికా లోని కరోనా వ్యాక్సిన్ రిసెర్చ్ సెంటర్ల మీద రష్యా హ్యాకర్లు సైబర్ ఎటాక్‌కు పాల్పడినట్టు యుకె తాజాగా ఆరోపించింది.  రష్యాకు చెందిన ఏపీటీ29 అనే గ్రూప్ ఈ సైబర్ ఎటాక్ చేసినట్టు ఆయా దేశాల సైబర్ సెక్యూరిటీ విభాగాలు గుర్తించాయి. ద డ్యూక్స్, కాజీ బేర్ అని పిలవబడే ఈ గ్రూప్ రష్యా నిఘా విభాగానికి అనుబంధ సంస్థ. రష్యాకు చెందిన ఈ హ్యాకర్లు తమ మేధావులు, హెల్త్ కేర్‌కు చెందిన విభాగాలపై సైబర్ ఎటాక్ చేసి కీలకమైన సమాచారం చోరీ చేయడానికి ప్రయత్నించారని యూకే జాతీయ సైబర్ భద్రతా విభాగం ఆరోపించింది. 2016 అమెరికా ఎన్నికల సమయంలో కూడా వీరు అమెరికన్ డేటాను హ్యాక్ చేసినట్టు ప్రచారం ఉంది. ఐతే కరోనా వైరస్ వ్యాక్సిన్ సమాచారం హ్యాక్ చేయడానికి వీరు ప్రయత్నించినట్టు మొట్టమొదటి సారి వెలుగులోకి వచ్చింది. ఐతే ఈ సైబర్ ఎటాక్స్ తో మాకు సంబంధం లేదని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పష్టం చేసారు. బ్రిటన్ లోని కోవిడ్ 19 రీసెర్చ్ సెంటర్లు, ఫార్మా కంపెనీల మీద సైబర్ ఎటాక్ ఎవరు చేశారో తమకు తెలీదు అని అయన ప్రకటించారు.

మానవత్వం చాటిన దుబాయ్ ఆసుపత్రి

కోటి 52 లక్షల రూపాయల బిల్లు మాఫీ.. కరోనా పాజిటివ్ వ్యక్తికి 80రోజుల చికిత్స.. ప్లైట్ టికెట్, పది వేల రూపాయలు ఇచ్చి ఇంటికి పంపించిన వైనం.. మాయమై పోతున్నడమ్మ.. మనిషన్నవాడు అంటూ సాగే పాటను వింటే నిజమే అనిపిస్తుంది. రోగి చనిపోయినా బిల్లు కడితే తప్ప శవాన్నికూడా ఇవ్వలేమని కఠినంగా చెప్పే మన హస్పిటల్స్ ను చూస్తూ. కానీ, దుబాయ్ లోని ఒక హస్పిటల్ కోటి 52లక్షల రూపాయల బిల్లును మాఫీ చేయడంతో పాటు ఆ వ్యక్తికి ఫ్లైట్ టికెట్ ఇచ్చి జేబులో పదివేల రూపాయలు పెట్టి సొంత ఊరికి పంపించింది. ఆసుపత్రిలోనూ తోడుగా ఉంటూ అతని సమస్యను పరిష్కరించేలా సహాయం చేశారు స్నేహితులు, అధికారులు. ఇలాంటి సంఘటనలు మానవత్వం ఇంకా ఉందని మనిషన్నవాడు అక్కడక్కడ బతికే ఉన్నాడు అనిపిస్తుంది. ఇక విషయంలోకి వస్తే..  తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని వేణుగుమట్ల గ్రామానికి చెందిన రాజేష్ లింగయ్య ఒడ్నాలా రెండేండ్ల కింద దుబాయ్ వెళ్లాడు. అక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ అనారోగ్యంలో ఏప్రిల్ 23 న  ‘దుబాయ్ హాస్పిటల్’ లో చేరాడు. తరువాత అతనికి వైద్యపరీక్షలు నిర్వహించగా  కోవిద్ 19 వైరస్ పాజిటివ్ గా తేలింది.  దాదాపు 80రోజుల పాటు చికిత్స తర్వాత అతను కోలుకున్నాడు. ఆరోగ్యంగా కోలుకున్నా.. ఆర్థికంగా మాత్రం ఆయన హాస్పిటల్ బిల్లు కట్టే పరిస్థితిలో లేరు. అతని చికిత్సకు మొత్తం బిల్లు 7,62,555 దినార్లు అయ్యింది. మన కరెన్సీలో కోటి 52లక్షలు.  చికిత్స సమయంలో రాజేష్‌తో సన్నిహితంగా ఉన్న దుబాయ్‌లోని గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు గుండెల్లి నరసింహకు తన పరిస్థితి వివరించాడు రాజేష్. బిల్లు చెల్లించడానికి తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. ఈ విషయాన్ని నరసింహ దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ వాలంటీర్ సుమంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.  సుమంత్  కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో కాన్సుల్ (లేబర్) హర్జీత్ సింగ్ను అభ్యర్థించారు. ‘మానవతా ప్రాతిపదికన’ బిల్లును మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ సింగ్ దుబాయ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌కు ఒక లేఖ రాశారు. ఆసుపత్రి సానుకూలంగా స్పందించి రోగిని వెంటనే డిశ్చార్జ్ చేసింది. అంతేకాదు రాజేష్‌ తిరిగి సొంత గ్రామానికి చేరుకోవడానికి ఉచిత విమాన టిక్కెట్లు ఏర్పాటు చేశారు, అతను ఇతర ఖర్చుల కోసం 10,000 రూపాయలు కూడా ఇచ్చారు. ఎయిర్ ఇండియా ద్వారా హైదరాబాద్ చేరుకున్న రాజేష్ కు వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత 14రోజుల క్వారంటైన్ పాటించాలని సూచిస్తూ ఇంటికి పంపించారు. 80రోజులు కరోనాతో పోరాడి, కోటిన్నర బిల్లును మాఫీ చేయించుకుని వచ్చిన రాజేష్ ను చూసి కుటుంబసభ్యులు ఎంతో ఆనందించారు.