నేనేమి ట్రంప్ ను కాదు.. ఉద్ధవ్ థాకరే సెన్సేషనల్ కామెంట్స్

కరోనా మహారాష్ట్రను మరీ ముఖ్యంగా ముంబయి ని కబళిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా మహమ్మారిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "నేను డొనాల్డ్ ట్రంప్ కాదు. నా కళ్ల ముందే నా ప్రజలు ఇబ్బంది పడటాన్ని నేను చూడలేను" అని ఆయన అన్నారు. శివసేన అధికార మీడియా అయిన సామ్నా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ ఇంటర్వ్యూ ఈ వీకెండ్ లో రెండు భాగాలుగా ప్రసారం కానుంది. ఈ ఇంటర్వ్యూ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమయ్యారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వైరస్ ను కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఆసక్తి చూపలేదనే విమర్శలు ఉన్నాయి. ఐతే తాను ట్రంప్ మాదిరిగా విఫలం చెందలేదనే విషయాన్ని ఉద్ధవ్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికీ మహారాష్ట్రలో లాక్ డౌన్ అమల్లో ఉందని.. అయితే మెల్లమెల్లగా ఒక్కొక్క రంగానికి క్రమంగా కరోనా నిబంధనల నుంచి సడలింపులు ఇస్తున్నామని అయన తెలిపారు. ఇదే సందర్భంలో ఏ విద్యార్థి కూడా కరోనా బారిన పడకూడదనే ఉద్దేశం తోనే విద్యార్థులకు ఎలాంటి పరీక్షలను నిర్వహించలేదని ఆయన చెప్పారు.

నిమ్మగడ్డ కొనసాగింపు పై గవర్నర్ ఆదేశాలకు వైసీపీ షాకింగ్ రిప్లై

ఈ రోజు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా దీని పై అధికార పార్టీ వైసీపీ స్పందించింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయమని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళతామని ఆయన తెలిపారు. ఈ విషయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరు సరిగ్గా లేదని అయన విమర్శించారు. నిమ్మగడ్డ రాజ్యాంగ పదవిలో ఉండాలంటూనే మళ్ళీ హోటళ్లలో రహస్యంగా మంతనాలు జరిపారని విమర్శించారు. ఇప్పటికే ఎన్ఈసీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దాన్ని గౌరవించాల్సిన పని లేదా? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థకు తగిన విధంగా నిమ్మగడ్డ ప్రవర్తించడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఎందుకు రహస్యంగా కలుస్తున్నారని ప్రశ్నించారు. కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని అసలు నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారని అయన ప్రశ్నించారు. తనకు సంబంధించిన వ్యక్తులే కీలకమైన పదవుల్లో ఉండేలా చంద్రబాబు తెర వెనుక ఉండి కుట్రలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

గన్నవరం గరంగరం.. వంశీలో మొదలైన కలవరం!!

కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో.. అధికారపార్టీలో ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి వంశీ.. టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. వైసీపీకి మద్దతు తెలుపుతూ.. సొంత పార్టీ నేతలపైనే వంశీ దూషణల పర్వానికి దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు మరియు ఆ పార్టీ నాయకుల‌పై తీవ్ర విమర్శులు చేశారు. అధికారికంగా వైసీపీలో చేరకున్నా.. తాను వైసీపీ మనిషినే అన్న ముద్ర మాత్రం వేయించుకున్నారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి వెళ్లి మరీ సీఎం జగన్‌ ను వంశీ కలిశారు. అక్కడనుంచి గన్నవరం వైసీపీ రాజకీయాలు మలుపు తిరిగాయి. వంశీ వైసీపీకి అనుకూలంగా ఉండటాన్ని.. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో, యార్లగడ్డకు నామినేటెడ్ పోస్టు కట్టబెట్టి ఆ వర్గాన్ని శాంతింపజేశారు. అయితే, యార్లగడ్డ నుంచి ఎదురవుతున్న అసంతృప్తిని ఏదో విధంగా చల్లార్చుకున్న వంశీ.. మరో నాయకుడు 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామచంద్రరావు నుంచి తీవ్రమైన ఇరకాటాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వంశీ, దుట్టా రామచంద్రరావు వర్గాలకు పొసగడం లేనట్టుగా తెలుస్తోంది. వంశీకి వ్యతిరేకంగా దుట్టా అల్లుడు శివభరత్‌ రెడ్డి.. గన్నవరం నియోజకవర్గంలో ఓ వర్గానికి ప్రోత్సాహం ఇస్తున్నారని పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది.  ప్రస్తుతం నియోజకవర్గంలో వంశీకి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివభరత్‌రెడ్డి నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారని, వైసీపీ పెద్దల‌కు ఆయన బంధువు కావడంతో అధికారులు కూడా ఆయ‌న చెప్పిన విధంగా చేస్తున్నారనే మాట వంశీ వర్గీయుల‌ నుంచి వినిపిస్తోంది. హైదరాబాద్‌లో హాస్పటల్‌ నిర్వహిస్తున్న శివభరత్‌రెడ్డి.. నియోజకవర్గంలోని కార్యకర్తకుల‌, నాయకులకు ఫోన్‌లు చేసి నిత్యం టచ్‌లో ఉంటూ తన వర్గాన్ని పెంచుకుంటున్నారని, ఇది వంశీకి ఇబ్బందిని కల్గిస్తోందని అంటున్నారు. వైసీపీకి మద్దతు ప్రకటించిన వంశీ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెల‌వాల‌ని భావిస్తున్నారు. ఆ మేరకు వ్యూహాలు రంగం సిద్ధం చేసుకుంటుండగానే.. వైసీపీ నాయకుల‌ నుంచి వస్తోన్న ప్రతిస్పందనతో వంశీ కల‌వరానికి గురవుతున్నారంటున్నారు. దీనికితోడు, ఇటీవల జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో దుట్టా వర్గం సమావేశమైంది. గన్నవరంలో ఉప ఎన్నిక జరిగితే టికెట్ తమకే ఇవ్వాలంటూ షరతు విధించినట్లు తెలుస్తోంది. వంశీకి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోను సహకరించబోమని తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో, ఏం చేయాలో తెలియక వంశీ అయోమయంలో ఉన్నారట. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తారా?.. ఒక వేళ ఇచ్చినా.. దుట్టా వర్గీయులు ఎన్నికల్లో తనకు సహకరిస్తారా?.. అనే ఆందోళన వంశీలో నెల‌కొందని ఆయన వర్గీయులు అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా శివభరత్‌రెడ్డికే సహకరించే అవకాశముందని, ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియక వంశీ నిర్వేదానికి గురవుతున్నారనే మాట ఆయన వర్గీయులు నుంచి వినిపిస్తోంది.

మూగబోయిన బాలల హక్కుల గొంతుక

కరోనాతో కన్నుమూసిన పి. అచ్యుత రావు స్వేచ్ఛగా, ఆనందంగా పెరగాల్సిన బాలలకు ఎక్కడ సమస్య వచ్చినా.. వారి హక్కులకు ఆటంకం కలిగినా ఆయన గొంతుక అక్కడ వినిపించేది. యాదాద్రిలో చిన్నారుల అక్రమ నిర్భందం, నల్లగొండలో చిన్నారుల అమ్మకం ఇలా ఎక్కడ బాల్యం బజారున పడితే అక్కడ తన స్వరం వినిపిస్తూ న్యాయం జరిగేలా పోరాడే వ్యక్తి అచ్యుత రావు. బాలల హక్కుల సంఘం అధ్యక్షుడిగా దశాబ్దాలుగా పోరాటం చేసిన ఆయన కరోనా చేతిలో ఓడిపోయారు. కొన్నిరోజులుగా కోవిద్ 19 వైరస్ తో ఫైట్ చేసి అలసిపోయి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. చిన్నారుల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు ఇలా ఎన్నో అంశాలపై ఆయన కోర్టుల్లో కేసులు వేసి చిన్నారుల బాల్యం బందీ కావద్దని వాదించారు. అనేక న్యూస్ చానెల్స్ లో బాలల హక్కులపై అవగాహన కల్పించారు. ఆయన మృతి పట్ట పౌరసంఘాలు, బాలల హక్కుల కోసం పనిచేసే స్వచ్చంధ సంస్థలు తీవ్ర దిగ్భాంతిని తెలిపాయి.

ఆదిత్య  బిల్డర్స్ అధినేతపై చీటింగ్ కేసు

కొత్త మలుపు తిరిగిన డాక్యుమెంట్ల చోరీకేసు ప్రముఖ బిల్డర్స్ సంస్థ ఆదిత్య బిల్డర్స్‌ అధినేత వీరపరెడ్డి కోటారెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. గత కొన్నిరోజుల క్రితం వెలుగులోకి వచ్చిన  100కోట్ల డాక్యుమెంట్ల చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఆదిత్య బిల్డర్స్‌ ఛైర్మన్, డైరెక్టర్స్ మధ్య నెలకొన్న వివాదంలో కొత్త కోణం బయటకు వచ్చింది. ఆదిత్య బిల్డర్స్ అధినేత వీరపరెడ్డి కోటా రెడ్డితో కలిసి తాము ఏర్పాటు చేసిన ‘శ్రీ ఆదిత్య వంశీరామ్‌ హోమ్స్‌ ఎల్‌ఎల్‌పీ జాయింట్‌ వెంచర్‌లో తనకు తెలియకుండా విల్లాలు విక్రయించారని వంశీరామ్ అధినేత సుబ్బారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాము ముందుగా చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కోటారెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా పోలీసులు కోటారెడ్డిపై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నందగిరి హిల్స్‌లో నివసించే సుబ్బారెడ్డి నార్సింగిలోని సర్వే నంబర్‌ 155, 156లో ఉన్న 16 ఎకరాల 24 గుంటల స్ధలంలో విల్లాల నిర్మాణానికి ఆదిత్య హోమ్స్‌ సంస్థతో 2014లో డెవలప్‌మెంట్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన ఆదిత్య సంస్థ అధినేత కోటారెడ్డి ఉద్దేశ పూర్వకంగా 23 విల్లాల విక్రయంలో అక్రమాలకు పాల్పడ్డారని సుబ్బారెడ్డి  ఆరోపించారు. ఈ కారణంగా తనకు రూ. 79.36 కోట్ల మేర నష్టం వచ్చిందని ఆయన తన  ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రెండురోజుల క్రితం ఆదిత్య బిల్డర్స్ డైరెక్టర్ సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కోటారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఈ నేపధ్యంతో సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. కుటుంబ కలహాలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కేసుల పర్వం కొనసాగుతోంది.

భారత్ లో 18 కోట్ల మందికి కరోనా సోకింది.. ప్రముఖ సంస్థ షాకింగ్ రిపోర్ట్

మనదేశం లో కరోనా ఉధృతి తీవ్రంగానే ఉంది. ప్రతి నిత్యం రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 12 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు గా తెలుస్తోంది. ఐతే 12 లక్షలు కాదు.. ఇప్పటి వరకు ఇండియాలో దాదాపు 18 కోట్ల మందికి కరోనా సోకి ఉండవచ్చని థైరో కేర్ ల్యాబ్స్ అనే ప్రయివేట్ డయాగ్నస్టిక్స్ సంస్థ సంచలన రిపోర్టును బయటపెట్టింది. మన దేశంలో ఇప్పటికే 15 శాతం మంది ప్రజలు కరోనా బారినపడ్డారని తమ అధ్యయనం ద్వారా తేలిందని ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ వేలుమణి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రఖ్యాత డయాగ్నస్టిక్స్ సంస్థ అయిన థైరో కేర్ ల్యాబ్స్ దేశవ్యాప్తంగా 600 పిన్‌కోడ్స్‌లో సుమారు 60వేల మంది పై యాంటి బాడీ పరీక్షలు చేసింది. ఇందులో యావరేజ్ గా 15 శాతం మంది ప్రజల లో యాంటీ బాడీలు కనిపించాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. మన శరీరంలో కరోనా వైరస్ ప్రవేశిస్తే.. దాన్ని ఎదుర్కొనేందుకు యాంటీ బాడీలు తయారవుతాయి. దీని ఆధారంగా టెస్టులో యాంటీబాడీలు కనిపించాయంటే వారికి కరోనా సోకినట్లేనని నిపుణులు చెబుతున్నారు. మన దేశం మొత్తంగా 15 శాతం అంటే దాదాపు 18 కోట్ల మందికి కరోనా సోకి ఉంటుందని థైరో కేర్ సర్వే తెలిపింది. ఐతే దీనికి 3 శాతం అటూ ఇటూగా వాస్తవ పరిస్థితులు ఉండవచ్చని ఆ సర్వే వెల్లడించింది. ఇదే సర్వేలో హైదరాబాద్‌లోని వివిధ పిన్ కోడ్లలో పరిస్థితి ఈ విధంగా ఉంది. 500002,500060,500036,500026 పిన్‌కోడ్ కలిగిన ప్రాంతాల్లో వరుసగా 37.3 శాతం, 30.6శాతం, 23.5శాతం, 23.3 శాతం మందిలో యాంటీ బాడీలు కనిపించాయని ఆ సంస్థ సర్వే రిపోర్టులో పేర్కొన్నారు.

పంద్రాగస్ట్ కు ఖైదీల విడుదల

పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసిన సిఎం ఈ ఏడాది స్వాతంత్ర  దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు శాఖను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన  జాబితాను రూపొందించాలని సూచించారు. ప్రగతి భవన్ లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, డిజిపి మహేందర్ రెడ్డి తదితరులతో ఈ అంశంపై చర్చించారు. ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు విడుదలకు అర్హులైన ఖైదీల జాబితా తయారు చేయాలని సిఎం సంబంధిత అధికారులను ఆదేశించారు.

అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌!

ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ కాగా, తాజాగా వైసీపీకి చెందిన మరో కీలక నేత కరోనా బారిన పడ్డారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అంబటి రాంబాబును కలిసిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు వారందరికీ కరోనా పరీక్షలు చేయనున్నారు. కాగా, అంబటి రాంబాబుకు చేసిన టెస్టులపై కాస్త గందరగోళం నెలకొంది. స్వాబ్ టెస్టులో భిన్నమైన ఫలితాలు వెలుగు చూశాయి. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన టెస్టులో ఒకసారి నెగటివ్, మరోసారి చేసిన పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

జగన్ గారి రౌడీ రాజ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా?

ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్‌ఐ విజయ్ కుమార్ అత్యుత్సాహంపై దళి సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్‌ఐ విజయ్ కుమార్‌ పై హత్య, ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చెయ్యాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అద్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఈనెల 19న మాస్క్ లేకుండా తిరుగుతున్నాడని కిరణ్‌ కుమార్ అనే యువకుడిని  చీరాల టూటౌన్ ఎస్‌ఐ విజయ్ కుమార్ చితకబాదాడు. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించారు. కాగా యువకుడు కిరణ్‌ కుమార్ పరిస్థితి మరింత విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు లాఠీ దెబ్బల కారణంగానే కిరణ్‌ కుమార్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు, ఎస్‌ఐ విజయ్ కుమార్ అత్యుత్సాహంపై దళిత సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. కాగా, నిన్న తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక లారీలు అడ్డుకున్నందుకు దళిత యువకుడు వరప్రసాద్ కి పోలీసులు శిరోముండనం చేసి, తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. వైఎస్ జగన్ గారి రౌడీ రాజ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడు వరప్రసాద్ కి అధికారపార్టీ నేతల మెప్పు కోసం పోలీసులే శిరోముండనం చేయించి చిత్ర హింసలు పెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా లో దళిత యువకుడు కిరణ్ కుమార్ పోలీసుల దాడిలో చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.  దళితులపై జగన్ రెడ్డి ప్రభుత్వ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు ఈ రాష్ట్రంలో శాంతి,భద్రతలు ఉన్నాయా? అని లోకేష్ ప్రశ్నించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీకి తొత్తుల్లా మారి, గూండాల్లా దళితులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన పోలీసులు,వారి వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. శిరోముండనం ఘటనపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పెత్తందారీ పోకడలకు స్వస్తి చెప్పాలి

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలంటూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. "రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం. తద్వారా భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని నిలబెట్టడం సంతోషదాయకం. ఈ చర్యలతో ఆర్టికల్ 243కె(2)కు సార్ధకత ఏర్పడింది." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. "ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో చెలరేగిన హింసా విధ్వంసాలు, అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రానికి అప్ర‌తిష్ట‌ వాటిల్లింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య 4 మూల స్థంభాల (లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ, మీడియా) మనుగడ ప్రశ్నార్ధకమైంది." అన్నారు "కరోనాలో ఎన్నికలు ప్రజారోగ్యానికే పెనుముప్పు అనే సదుద్దేశంతో, ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసి తొలగింపు రాజ్యాంగ ఉల్లంఘనే. న్యాయస్థానాల జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వ పెడధోరణులకు అడ్డుకట్ట పడటం ముదావహం." అని వ్యాఖ్యానించారు "ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుందుడుకు చర్యలకు, పెత్తందారీ పోకడలకు స్వస్తి చెప్పాలి. ఎస్ఈసి తొలగింపు వెనుక ప్రధాన సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘం నిష్పాక్షిక విధి నిర్వహణకు దోహద పడాలి. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని కాపాడాలి." అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

ఏపీ మంత్రులుగా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పలాస ఎమ్మెల్యే అప్పలరాజు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వారి చేత ప్రమాణం చేయించారు. కరోనా కారణంగా రాజ్‌భవన్‌ లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా కారణంగా కొద్ది మంది అతిథులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో చాలా మంది రాజ్‌భవన్‌ కు వచ్చినా లోనికి అనుమతించలేదు.  కాగా, మంత్రివర్గంలో ఉన్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారు మంత్రులుగా రాజీనామా చేశారు. వారి స్థానంలో అప్పలరాజు, వేణుగోపాలకృష్లకు మంత్రులుగా సీఎం జగన్‌ అవకాశం కల్పించారు. మరోవైపు, రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ నుంచి ఎన్నికైన వైసీపీ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు ప్రమాణం చేశారు. మరో సభ్యుడు పరిమళ్‌ నత్వానీ కొన్ని కారణాల వల్ల ఈ రోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఆయన మరో రోజు ప్రమాణం చేస్తారు.

కరోనాపై వాస్తవాలు చెప్పండి

రాష్ట్ర చర్యలు, ఖర్చు చేస్తున్ననిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి సిఎంకు లేఖ రాసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రలో కరోనా వ్యాప్తిపై నిజాలు చెప్పాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. కరోనా పై ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించేలా వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నారు.  ఈ మేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్నపరిస్థితులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.  కరోనా కట్టడికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎందరో విరాళాలు ఇచ్చారు. ఈ వివరాలన్నీ శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరించాలని సంజయ్ తన లేఖలో కోరారు.  "రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ప్రజల్లో  భయాందోళనలు ఉన్నాయి. ప్రభుత్వం పట్ల తీవ్ర అభద్రతా భావం నెలకొని ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై వైద్య సిబ్బందే ధర్నాలు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలి. కరోనా వ్యాప్తిలో ప్రభుత్వ పనితీరును రాష్ట్ర హైకోర్టే సైతం ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ తీరు పట్ల, ప్రజలకు అందుతున్న వైద్య సౌకర్యాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి తెలుసుకోవడానికి ప్రధాని మోదీ ఫోన్ చేసినప్పుడు ఆయన కు వాస్తవాలు చెప్పారో, లేదో అని సందేహంగా ఉంది. నిజాలను దాచి రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు" అని బండి సంజయ్ తన లేఖ ద్వారా సిఎంను కోరారు. రాజకీయాలకు తావులేకుండా సమష్టిగా కరోనాపై పోరాడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

జగన్ సర్కార్ కు బిగ్ షాక్... నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా కొనసాగించాలని గవర్నర్ ఆదేశం

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో ఏపీ సర్కార్ కు పెద్ద షాక్ తగిలింది. ఆయనను ఎస్‌ఈసీగా కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వానికి అయన తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గత సోమవారం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్‌ను కలిసి తనను మళ్లీ ఏపీ ఎస్ఈసీగా నియమించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయంలో గవర్నర్ సానుకూలంగా స్పందించారని రమేష్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను ఎస్‌ఈసీగా తిరిగి నియమించాలని అయన ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా నియమించాలని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన ఒక లేఖ పంపారు. 

ఖద్దరో, ఖాకీనో తేల్చుకోండి.. ఏపీ పోలీసులకు తలంటిన హైకోర్టు 

రాష్ట్రంలో పోలీసులు అవలంబిస్తున్న వైఖరిని హైకోర్టు మరోమారు తూర్పారబట్టింది. రాష్ట్రంలో అసలు ‘రూల్‌ ఆఫ్‌ లా’ అనేది ఉందా లేదా అని నిగ్గదీసి అడిగింది. పోలీసులు ప్రజా హక్కులను రక్షించేందుకే ఉన్నారు తప్ప, ‘పొలిటికల్‌ బాస్‌’ల కు అనుకూలంగా వ్యవహరించేందుకు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బ్యూరోక్రాట్లు, పోలీసు అధికారులు రాజకీయాలు కావాలనుకుంటే యూనిఫారం వదిలేసి వెళ్లొచ్చని, యూనిఫారంలో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా హక్కులు కాపాడాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. "అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి ఒక న్యాయవాది ఇంట్లోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనేమైనా కరడు గట్టిన నేరస్థుడా? అంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారు?’’ అని పోలీసులను కోర్టు నిలదీసింది. ఒక వేళ అయన నేరస్థుడైనా కూడా అలా ఇంట్లోకి జొరబడకూడదని స్పష్టం చేసింది. ఒక లాయర్ కే ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుడి హక్కుల పరిరక్షణ ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకోగలమని తీవ్రంగా వ్యాఖ్యానించింది. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, వారి హక్కులను కాపాడాలని హితవు పలికింది. "పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మేము కఠిన చర్యలు తీసేసుకుని. ఒకసారి అధికారులకు వ్యతిరేకంగా ఉత్తర్వులిస్తే ఆ తరువాత మీరే కష్టాల్లో పడతారు. అప్పుడు ఏ నేతా మిమ్మల్ని ఆదుకోవడానికి కూడా రారు’’ అని తీవ్ర హెచ్చరికలు జరీ చేసింది. . ఇక అసలు విషయం లోకి వెళితే ఆదివారం అర్ధరాత్రి తన భర్త, న్యాయవాది సుభాష్ చంద్రబోస్ ను తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, ఏలేశ్వరం పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి దౌర్జన్యంగా, అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని, పేర్కొంటూ లాయర్ భార్య వెంకటప్రియదీప్తి హైకోర్టులో సోమవారం హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. సుభాష్  చంద్రబోసును తమ ముందు హాజరు పరచాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి నిన్న హైకోర్టులో నేరుగా హాజరై కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ పోలీసులు లాయర్ ఇంటికెళ్లిన సమయంలో చంద్రబోస్ అక్కడి నుండి పారిపోయారని, ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో లేరని.. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారని, అంతే కాకుండా ఈ ఘటనపై దర్యాప్తు కోసం డీజీపీ నేతృత్వంలో ఒక కమిటీ కూడా ఏర్పాటైందని పేర్కొన్నారు. ఈ కేసులో పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీవీ సతీశ్‌ తన వాదనలు వినిపిస్తూ.. లాయర్ చంద్రబోసును పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లారనే దానికి సాక్ష్యంగా ఉన్న వీడియో క్లిప్పింగ్‌ను పరిశీలించాలని అభ్యర్థించారు. దీని పై ధర్మాసనం స్పందిస్తూ పోలీసులే బలవంతంగా తీసుకెళ్లారని పిటిషనర్‌ చెబుతుంటే, ఆయన పారిపోయారని ఎలా చెబుతారని అక్కడే ఉన్న ఎస్పీని ప్రశ్నించింది. ఏదైనా రాజకీయ కారణాలతో మీరు ఇలా చెబుతున్నారా అని కోర్టు అనుమానం వ్యక్తంచేసింది. ఇదే సందర్భంలో బోస్‌కు ప్రాణహాని ఉందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలపడంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా ఏ పోలీసు అధికారీ అలాంటి సాహసం చేస్తారని మేమనుకోవడం లేదు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో కూడా వారికి తెలుసు. అంతే కాకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దాలో కూడా మాకు తెలుసు’’అని చాలా స్ట్రాంగ్ గా వ్యాఖ్యానించింది. ఎస్పీ.. మీకు చాలా ఫ్యూచర్ ఉంది.. ఆలోచించుకోండి ఇదే సందర్భంలో ఎస్పీని ఉద్దేశించి "మీరు డైరెక్ట్‌ ఎస్పీనా? లేక ప్రమోషన్‌పై ఎస్పీ అయ్యారా?" అని ధర్మాసనం ప్రశ్నించింది. తాను డైరెక్ట్‌ ఎస్పీ అని నయీమ్‌ అస్మి బదులిచ్చారు. "డైరెక్ట్‌ ఎస్పీ అయిన వారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారన్న ఆశ ప్రజలకు ఉంటుంది. మీదైన తరహాలో మాత్రమే వ్యవహరించండి. అంతే కాకుండా మీకు మరెంతో కెరీర్‌ కూడా ఉంది. ప్రజా హక్కులు కాపాడి.ప్రజలకు జవాబుదారీగా ఉండాలి’’ అని సుతిమెత్తగా హితవు పలికింది.  ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని అటు డీజీపీని, ఇటు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది. దీని పై తదుపరి విచారణను హై కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ లోగా లాయర్ బోస్ ను కనుగొంటే వెంటనే ఆయనను హైకోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.

ఆగస్టులో భారత్ లోని ఆరు నగరాలకు కువైట్ ఫ్లైట్స్

బుకింగ్ ప్రారంభించిన జజీరా, కువైట్ ఎయిర్ లైన్స్ విమానాశ్రయంలో పాటించవలసిన జాగ్రత్తలు కోవిద్ 19 వైరస్ కారణంగా ప్రపంచదేశాల్లో విమానప్రయాణాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. పరిస్థితులు చక్కబడిన తర్వాతే తిరిగి అంతర్జాతీయ విమాన సర్వీస్ లు ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా కువైట్ భారత్ లోని కొన్ని ప్రధాన నగరాలకు బుకింగ్ ప్రారంభించింది. అహ్మాదాబాద్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కొచ్చిన్ నగరాలకు కువైట్ లోని జజీరా ఎయిర్వేస్ బుకింగ్ ప్రారంభించింది. చెన్నై, ఢిల్లీ, ముంబయి, కొచ్చిన్ నగరాలకు కువైట్ ఎయిర్ వేస్ బుకింగ్ ప్రారంభించింది.  ఈ నేపధ్యంలో విమానాశ్రయంలో పాటించాల్సిన జాగ్రత్తలను కువైట్ విమానాశ్రయ వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సలేహ్ అల్-ఫదాగి వివరించారు. ప్రయాణీకులతో పాటు వారు తీసుకువచ్చే లగేజీ మొత్తం చెక్ ఇన్ లోనే అనుమతిస్తారు. క్యాబిన్ లోకి హ్యాండ్ లగేజీని అనుమతించరు. పిల్లలు, పెద్దవారి అవసరాలకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులను మాత్రమే క్యాబిన్ లోని అనుమతిస్తారు. విమానాశ్రయాల్లోకి కేవలం ప్రయాణీకులను మాత్రమే అనుమతిస్తారు. వారితో పాటు మరెవ్వరిని రానవ్వరు. విమాశ్రయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయనున్నారు. వృద్ధులకు మరోవ్యక్తి సహాయం అవసరం కావల్సి వచ్చినప్పుడు వారు ఆ విషయాన్ని టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలోనే చెప్పాలి. టికెట్ బుకింగ్ కూడా ఆన్ లైన్లోనే చేసుకోవాలి. నాలుగు గంటల ముందుగానే విమానాశ్రయంలో ఉండాలి.

దళిత యువకుడికి శిరోముండనం.. ఘోరం, అమానుషం: రఘురామకృష్ణంరాజు

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో దళిత యువకుడికి శిరోముండనం ఘటనపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. దీనిని అమానుష, ఘోరమైన ఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతున్నానని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు.  కాగా, సీతానగరం పోలీస్ స్టేషన్‌ లో దళిత యువకుడు వరప్రసాద్​ ని పోలీసులు కొట్టి మీసాలు, జుట్టు కత్తిరించారు. ఇసుక లారీలు అడ్డుకున్నందుకే తనపై ఇలా దాడి చేశారని బాధితుడు తెలిపాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో ముని కూడలి వద్ద వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టినట్లు బాధితుడు పేర్కొన్నాడు. దీనిపై ప్రశ్నించినందుకు తిరిగి తనపైనే వైసీపీ నాయకుడి అనుచరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడని బాధితుడు వాపోయాడు. దీంతో పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, అనంతరం సీతానగరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించి తీవ్రంగా కొట్టి శిరోముండనం చేశారని పేర్కొన్నాడు. మరోవైపు, ఈ కేసులో ట్రైనీ ఎస్సై ఫిరోజ్ షాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్సై, వైసీపీ నేత కవల కృష్ణమూర్తితో పాటుగా ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ సత్యనారాయణరావు తెలిపారు.

ఇది కరోనా పాజిటివా? వివేకా గారి కేసులో సీబీఐ పాజిటివా?

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంపై టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా స్పందించారు. "విజయసాయిరెడ్డి గారు మీకు నిజంగానే కరోన సంక్రమిస్తే మీరు వైరస్ ని జయించి..రావాలి. టెస్టులు,వైద్యం మన రాష్ట్రం లోనే చేయించుకోండి. మన రాష్ట్ర ప్రజలకి మనోధైర్యం ఇచ్చినట్లు ఉంటుంది.. విజయోస్తు.. సుఖీభవ..!" అంటూ నిన్న రాత్రి విజయసాయి రెడ్డికి కరోనా అని వార్తలు వచ్చిన సమయంలో  బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. ఇక, బుద్దా వెంకన్న స్పందిస్తూ.. "రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప వ్యక్తిగతంగా మా మధ్య ఎటువంటి గట్టు తగాదా లేదు. ఎంపీ విజయసాయిరెడ్డి గారు కనికరం లేని కరోనా బారిన పడటం బాధాకరం. ఆయన కరోనా నుండి త్వరగా కోలుకుని ట్విట్టర్ లో యాక్టివ్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను." అని ట్వీట్ చేశారు. అయితే, ఈఎస్ఐ స్కాం ఆరోపణలతో అరెస్టైన టీడీపీ నేత అచ్చెన్నాయుడు అనారోగ్యం కారణంగా ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టుని కోరినప్పుడు.. గుండ్రాయిలా ఉన్న అచ్చెన్న కి కార్పొరేట్ వైద్యం ఎందుకు అంటూ అవమానించిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేరడాన్ని బుద్దా వెంకన్న తప్పుబట్టారు. అంతేకాదు, ప్రస్తుతం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైన నేపథ్యంలో.. ఆయన హైదరాబాద్ వెళ్ళడంపై అనుమానం వ్యక్తం చేశారు. "అదేంటి హైదరాబాద్ పారిపోయారా? కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారా విజయసాయిరెడ్డి గారు. ఓహో అల్లుడు పాలన మీద నమ్మకం లేదా? గుండ్రాయిలా ఉన్న అచ్చెన్న కి కార్పొరేట్ వైద్యం ఎందుకు ఈఎస్ఐ ఉండగా అని ఒక బిసి నాయకుడి ని అవమానిస్తూ మీ రాక్షస మనస్తత్వం బయటపెట్టారు. మరి మీరు విశాఖ లో కేజీహెచ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లడం ఏంటి? అన్నట్టు ఇది కరోనా పాజిటివా? వివేకా గారి కేసులో సీబీఐ పాజిటివా? ఆయన హత్యకు గురైనప్పుడు మీరు సంభ్రమాశ్చర్యాలకు గురైయ్యారు గుర్తుందా?" అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.

ఎంపీ విజయ్ సాయి రెడ్డికి కరోనా.. హైదరాబాద్ అపోలోలో ట్రీట్ మెంట్

వైసీపీ లో ముఖ్య నేత ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితం విశాఖలో సంజీవని బస్సు ప్రారంభోత్సవంలో భాగంగా అయన టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. ఐతే గత కొద్దీ రోజులుగా స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో మళ్ళీ టెస్ట్ చేయించుకోగా నిన్న పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఉత్తమ చికిత్స కోసం అయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇదే సమయంలో అయన పిఏకు కూడా కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయసాయిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. అటు సీఎం జగన్ తో సహా పలువురు వైసీపీ ముఖ్య నేతలతో అయన సమావేశాలు నిర్వహించారు. ఐతే కొన్ని సందర్భాల్లో విజయసాయిరెడ్డి మాస్క్‌ కూడా ధరించలేదు. వారం పది రోజల పాటు క్వారంటైన్‌లో తాను ఉండనున్నట్లు ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు. అత్యవసరమైతేనే ఫోన్‌లో అందుబాటులోకి వస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా కరోనా సోకినా ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్య నేతలందరూ ఇతర రాష్ట్రాలలో చికిత్స తీసుకోవడం ఇపుడు విమర్శలకు దారి తీస్తోంది. రాష్ట్రంలో కరోనా చికిత్సకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పుకుంటున్న వైసిపి నేతలు ఇలా పొరుగు రాష్ట్రాలలోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ తీసుకోవడం ప్రజలను ఆశ్చర్యానికి ఆందోళనకు గురి చేస్తోంది.