ఈ-ఆఫీస్ ప్రారంభించిన సీఎస్
posted on Jul 18, 2020 @ 7:18PM
పరిపాలన పాదర్శకంగా ఉండేలా ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం బిఆర్కె భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆరు శాఖల్లో ఈ ఆఫీస్ విధానాన్ని ప్రారంభించారు. సాధారణ పరిపాలనా శాఖ, వాణిజ్య శాఖ, ప్రధాన కమీషనర్, భూ పరిపాలన, అబ్కారి, మద్యనిషేధ శాఖల్లో ఈ ఆఫీస్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇతర శాఖలు కూడా ఈ ఆఫీస్ విధానంలోకి మారాలని సిఎస్ సూచించారు.
ఈ కొత్త విధానం ద్వారా పేపర్ లెస్ ఆఫీస్ తో పాటు పనుల్లో పారదర్శకత సాధ్యమవుతుందని ఆయన అన్నారు. దాదాపు 1600మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా త్వరగా ఫైళ్లు పరిష్కరించడానికి వీలవుతుందన్నారు. ప్రతి ఫిర్యాదు ఆన్ రికార్డులో అందుబాటులో ఉంటాయని, అధికారుల పనితీరు మరింత సులభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.