మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత 

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ (85) ఈ ఉదయం కన్నుమూశారు. ఈ మరణాన్ని టాండన్ కుమారుడు, యూపీ మంత్రి అశుతోష్ టాండన్ ధ్రువీకరించారు. ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో గత నెల 11న లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే ఆయన మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు సరిగ్గా పని చేయకపోవడంతో ఆయన శరీరం వైద్యానికి సహకరించలేదని డాక్టర్లు తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అనుచరుడిగా భారతీయ జనతా పార్టీలో ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలలో అయన కీలక పాత్ర పోషించారు. మాయావతి ఆధ్వర్యంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం లోను, కల్యాణ్ సింగ్ మంత్రివర్గాలలో ఆయన మంత్రిగా పనిచేశారు.

తెలంగాణాలో కొత్త కేసులు 1198, డిశ్చార్జి అయిన వారు 1885

తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. నిన్న కొత్తగా 1,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 510 కేసులు, రంగారెడ్డిలో 106, మేడ్చల్ లో 76, వరంగల్ అర్బన్ లో 73, కరీంనగర్ లో 87, జగిత్యాల, మహబూబాబాద్ లో 36 చొప్పున, నాగర్ కర్నూల్ లో 27, జనగామలో 12, నిజామాబాద్ లో 31 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,274కి చేరింది. అంతే కాకూండా మరో ఏడుగురు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 422కి చేరుకుంది. ఇది ఇలా ఉండగా నిన్న1,885 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 11,530 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.

కొంపముంచిన వైసీపీ యువనేత బర్త్ డే పార్టీ..!!

కరోనా మహమ్మారి దెబ్బకి ప్రజలు ప్రాణ భయంతో అల్లాడుతుంటే.. మరోవైపు కొందరు అత్యుత్సాహానికి పోయి పుట్టినరోజు వేడుకలు అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా హాట్‌స్పాట్ అయిన తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ యువనేత పుట్టినరోజు వేడుకను ఆయన అనుచరులు ఘనంగా నిర్వహించారు. రావులపాలెం మండలం ఊబలంకలో జరిగిన ఈ బర్త్ డే వేడుకకు స్థానిక కార్యకర్తలు భారీగానే హాజరయ్యారు. అయితే, ఈ బర్త్ డే వేడుక దెబ్బకు పదుల సంఖ్యలో కరోనా బారినపడ్డారు.  బర్త్ డే వేడుకలో పాల్గొన్న పలువురు అనారోగ్యానికి గురయ్యారు. కొంతమందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ అని తేలింది. ఈనెల 17న ఊబలంక పీహెచ్‌సీలో నిర్వహించిన పరీక్షల్లో బర్త్ డే వేడుకలో పాల్గొన్న 25 మందితో పాటు ఆయా కుటుంబాల్లో మొత్తం 45 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో పాల్గొన్న మరో 81 మంది ఫలితాలు ఇంకా రాలేదని సమాచారం. యువనేత పుట్టిన రోజు వేడుకల్లో పలువురు కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా పొల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ బర్త్ డే వేడుకకు వెళ్లినవారిలో కలవరం మొదలైంది. మరోవైపు, ఆ వేడుక జరిగిన ఊబలంక గ్రామస్తులు కూడా భయంతో వణికిపోతున్నారు.

హుండీ సొమ్ముతో ఆలా ఎలా చేస్తారు.. ఏపీ సర్కారును ప్రశ్నించిన బీజేపీ 

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విరుచుకు పడ్డారు. దేవాదాయశాఖకు చెందిన రూ.25 కోట్ల నిధులను జీవో-18 ద్వారా అమ్మఒడి పథకానికి ఏపీ సర్కారు మళ్లించిందని.. ఆ హక్కు మీకెక్కడిది? అంటూ ఆయన సర్కారును ప్రశ్నించారు. దేవాదాయ శాఖ నిధులను వేరే పథకాలకు మళ్లించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అయన పేర్కొన్నారు. ఈ నిధులు మళ్లించడం అనేది జగన్ ప్రభుత్వానికి ఓ అలవాటుగా మారిందని అయన విమర్శించారు. భక్తులు ఎంతో భక్తి తో తమ డబ్బును హుండీల్లో వేస్తారని.. దానితో దేవాలయాల అభివృద్ధి, ధర్మపరిరక్షణ కోరుకుంటారని అన్నారు. అటువంటి దేవాదాయ శాఖ నిధులను ఇతర శాఖలకు ఖర్చు చేయడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ నుండి దేవాదాయశాఖకు ఒక్క పైసా ఇవ్వనప్పుడు, భక్తులు ఇచ్చిన సొమ్ము తీసుకునే హక్కు మీకెక్కడిది అంటూ అయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం హిందూ ఆలయాల విషయంలోనే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోందని, ఇతర మతాలకు చెందిన విషయాల్లో ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఈ సర్కారుకు ఉందా? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించనుంది. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 22న మంత్రివర్గ విస్తరణ కోసం సమావేశమవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. 22 తేదీన మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. అదే రోజున ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నిక కావడంతో రెండు మంత్రి పదవులు ఖాళీ అయిన విషయం తెలిసిందే.

ఘర్షణ వాతావరణం లో గవర్నర్ తో సిఎం కేసీఆర్ భేటీ..

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అటు ట్విట్టర్ లోను ఇటు పాలనా పరం గాను చాల యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి ఎక్కువైన తరువాత ఆమె స్వయం గా నిమ్స్ కు వెళ్లి అక్కడ వైద్యులకు పిపియి కిట్లు వంటి రక్షణ పరికరాల లభ్యత, అలాగే కరోనా రోగుల కు అందుతున్న సేవలు వంటి అంశాల పై ఆరా తీశారు. ఐతే అదే సమయంలో సీఎం కేసీఆర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అంతేకాక తెలంగాణాలో కరోనా విషయంలో తాజా పరిస్థితి గురించి చర్చించేందుకు సీఎస్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని రాజభవన్ కు రావాల్సిందిగా కోరగా వారిద్దరూ ఒక రోజు ఆలస్యంగా వెళ్లడంతో విమర్శలు తలెత్తాయి. దీని వెనుక సీఎం కేసీఆర్ హస్తం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతే కాకుండా కరోనా నేపథ్యంలో ప్రయివేట్ హాస్పిటల్స్ ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆయా యాజమాన్యాలతో ఆమె చర్చించారు ఇటువంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఈ రోజు గవర్నర్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చిస్తారని సమాచారం. దీంతో పాటుకొత్త సచివాలయ నిర్మాణం, కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు తదితర అంశాలపై కూడా అయన చర్చించనున్నట్టుగా సమాచారం.

ప్రజలను గాలికి వదిలి సర్కారు నిద్ర పోతోందా.. తెలంగాణ హైకోర్టు సూటి ప్రశ్న

తెలంగాణ‌లో క‌రోనా ప‌రీక్ష‌లు, హెల్త్ బులిటెన్ ల ‌లో ప్ర‌భుత్వం అసంపూర్తిగా ఇస్తున్న స‌మాచారంపై తెలంగాణ హైకోర్టు ప్రభుతం పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులపై హైకోర్టు సోమవారం నాడు విచారించింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో క‌రోనా కేసులు ఒక పక్క పెరుగుతుంటే స‌ర్కార్ నిద్ర‌పోతుందా అని ప్రశ్నించింది. టెస్టుల్లో ఏపీ, ఢిల్లీ లతో పోల్చి చూసి తెలంగాణ ఎంతో వెనుక‌బ‌డి ఉంద‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో కూడ ఇదే తరహలో హైకోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాము ఆదేశాలు ఇస్తున్నా ఒక్కటీ కూడ అమలు కావడం లేదని... ఇలా ఆదేశాలు ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని అడ్వొకేట్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. అంతే కాకుండా ప్రభుత్వ కరోనా హెల్త్ బులెటిన్ ను తాము అభినందించినట్టుగా ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

దేశ సరిహద్దుల్లో యుద్ధ విమానాలు

నెలాఖరుకు రానున్న రఫేల్ ఫైటర్ జెట్స్..   ఈనెల 22 నుంచి మూడురోజుల పాటు భారత వైమానిక దళం ఉన్నతాధికారుల సమావేశం.. దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులుపై చర్చించేందుకు ఈనెల 22 నుంచి మూడురోజుల పాటు భారత వైమానిక దళం ఉన్నతాధికారుల సమావేశం జరగనుంది. తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, భారత్ చైనా సరిహద్దుల్లోని ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు, భవిష్యత్ లో తీసుకోవల్సిన చర్యలపై సవివరంగా చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామని భారత వైమానిక దళం ప్రతినిధి తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశంలో వైమానిక దళం ఉన్నతాధికారులు చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బదౌరియాతో పాటు  ఏడుగురు కమాండర్‌ ఇన్‌ చీఫ్‌లు పాల్గొంటారు. పొరుగుదేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరుణంలో వారికి గట్టిగా బుద్ధి చెప్పేందుకే వైమానిక దళం సిద్ధమవుతోంది. చైనా సరిహద్దుల్లో వైమానిక దళం ఇప్పటికే మోహరించింది. మిరేజ్‌–2000, సుఖోయ్‌–30, మిగ్‌–29 తదితర అత్యాధునిక యుద్ధ విమానాలను పలు బేస్‌ స్టేషన్లలో సిద్ధంగా ఉంచింది. మరోవైపు మొదటి దశ రఫేల్‌ ఫైటర్లు జెట్లు ఈ నెలాఖరు వరకు ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు చేరుకోనున్నాయి. ఈ ఫైటర్‌ జెట్లను లద్ధాఖ్‌ సెక్టార్‌లో సరిహద్దు సమీపంలో మోహరించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.  మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో వైమానిక దళంలోని అత్యాంత ఆధునిక యుద్ధ విమానాలను ఏయే బేస్ స్టేషన్లలో ఏర్పాటు చేయాలన్న అంశంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.  యుద్ధమంటూ వస్తే పొరుగుదేశాలకు గట్టి గుణపాఠం చెప్పాలన్న లక్ష్యంతోనే భారతవైమానిక దళం సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు కీలకనిర్ణయాలు తీసుకోనున్నారు.

ఎరువుల కొరత రానివ్వం.. కేంద్రమంత్రి హామి

తెలంగాణ రాష్ట్రానికి కావల్సిన ఎరువులను అందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సదానందగౌడ హామి ఇచ్చారు. ఈ మేరకు ఆయనను ఢిల్లీలో కలిసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ వానాకాలానికి ఇచ్చిన మాటప్రకారం 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తప్పకుండా సరఫరా చేస్తాం.. దానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి చెప్పారని నిరంజన్ రెడ్డి మీడియాతో చెప్పారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి సదానంద గౌడను  కలిసి తెలంగాణకు రావాల్సిన ఎరువులు వెంటనే విడుదల చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి చెప్పారు. తెలంగాణలో పూర్తి అయిన ప్రాజెక్టుల కారణంగా ఆయకట్టు బాగా పెరిగిందన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. జులై నెలాఖరు నాటికి రావాల్సిన 1.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందజేస్తామని కేంద్రమంత్రి చెప్పారన్నారు. దేశాన్ని కరోనా  మహమ్మారి ఇబ్బంది పెడుతున్న తరుణంలో వ్యవసాయానికి కరోనా నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వడం వల్లనే ఈ రోజు ఆహారధాన్యాలకు కొరత లేదన్నారు.

కోవర్టు ఎవడో కానీ.. ఎర్రి పప్పను చేశాడు

మూడు రాజధానుల బిల్లు పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడం పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. "కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైంది. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాశారు. దీనితో పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?" అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అయితే, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు రామ్ కుమార్ యార్లగడ్డ ట్విట్టర్ వేదికగా విజయసాయికి కౌంటర్ ఇచ్చారు. "మా పార్టీలో ఉన్న కోవర్టు ఎవడో కానీ నీకు తప్పుడు సమాచారం ఇచ్చి.. ఎర్రి పప్పను చేశాడు" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇవన్నీ తప్పుడు కథనాలు, కేంద్ర పార్టీ సమాధానమిదేనని ఆయన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు.

విజయసాయిని కలిసినా న్యాయం జరగలేదు.. విషం తాగిన వైసీపీ నాయకురాలు!

వైసీపీ నాయకురాలు, మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోని కుమారి ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. మీడియాతో మాట్లాడుతుండగానే విషం తాగేశారు.  తన సమస్యలను పరిష్కరించాలంటూ విజయవాడలో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పెద్దలు తనను మోసం చేశారని ఆరోపించారు. పార్టీని సొంత కుటుంబంలా భావించానని.. అయినా పార్టీలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు తనను మోసం చేశారని అన్నారు. ఈ నెల 6వ తేదీన విజయసాయిరెడ్డిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సీఎం జగన్ ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే అవకాశం తనకు రాలేదని జోని కుమారి చెప్పారు.  ఇలా మీడియాకు వివరాలు వెల్లడిస్తూనే ఆమె విషం తీసుకున్నారు. వెంటనే ముందున్న టేబుల్ పై తల వాల్చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని.. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

బే ఆఫ్ బెంగాల్ లో భూగోళ చీలిక.. ఉత్తరాంధ్రపై ప్రభావం

బంగాళ ఖాతం సముద్రగర్భంలో దాగిన భూమి పొర పగులు ఉత్తరాంధ్ర భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ప్రాంతానికి ఇరువైపుల భూమి పొరలపై వత్తిడి పెరిగినప్పుడు ఈ చీలికరేఖలో వచ్చే చిన్న కదలిక కూడా పెను ప్రమాదానికి కారణం కానుందని పరిశోధనల ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. వైజాగ్ తీరప్రాంతం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో దాదాపు మూడువందల కిలోమీటర్ల పొడవున ఉన్న భారీ చీలికను పరిశోధకుల బృందం గుర్తించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, ఆయిల్,నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యుఒహెచ్) పరిశోధకుల బృందం చేసిన పరిశోధన ఫలితాలను ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ లో ప్రచురించారు. ఉత్తరాంధ్రలోని విశాఖ సముద్ర తీరప్రాంతానికి వంద కిలోమీటర్ల దూరంలో దాదాపు 300 కిలోమీటర్ల పొడవైన పగులు రేఖ ఉన్నట్లు కనుగొన్నారు. ఈ రేఖ దక్షిణాన ప్రాణహిత-గోదావరి, ఉత్తరాన నాగవాలి-వంషాధర  జోన్ మధ్య తూర్పు వైపున బస్తర్ క్రాటన్ సరిహద్దుగా ఉంది. ఈ ఫ్రాక్చర్ లైన్ కారణంగా సునామీ, భూకంపాలు వంటి ప్రకృతి వైపరిత్యాలు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకుల అధ్యయనంలో స్పష్టమైంది.  దాదాపు కోటి అరవై లక్షల సంవత్సరాల క్రితం ఈ పగులు ప్రారంభమైందని, 68లక్షల సంవత్సరాల నుంచి మూడు లక్షల సంవత్సరాల క్రితం వరకు కదలికలు ఉండేవన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి కదలికలు లేకపోయినా.. భవిష్యత్ లో ప్రకృతివైపరిత్యాలకు ఈ ఫ్రాక్చర్ లైన్ కారణం కావచ్చు అని పరిశోధనల్లో స్పష్టమైంది.  ఈ ఫ్రాక్చర్ ఉన్న ప్రాంతానికి ఇరువైపుల భౌగోళికంగా ఒత్తిడి పెరిగితే సునామీ, భూకంపంలాంటి భౌగోళిక ప్రమాదాలు భారీస్థాయిలో రావచ్చని, వాటిని నివారించలేమని పరిశోధకులు పేర్కొన్నారు. విశాఖ, చుట్టు పక్కల ప్రాంతాలకు ఈ ముప్పు పొంచి ఉందని పరిశోధకులు తెలిపారు. హైదరాబాద్ యూనవర్సిటీ నుంచి ప్రొఫెసర్ కె.ఎస్. కృష్ణ,డాక్టర్ ఎం ఇస్మాయిల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన డాక్టర్ కె. శ్రీనివాస్, ఆయిల్,నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి డాక్టర్ డి సాహా, పరిశోధనా బృందం పరిశోధనాంశాలను విశ్లేషించింది. ఇంత పెద్ద చీలిక ఏర్పడడానికి కారణాలు మాత్రం తెలియదు. అయితే లక్షలాది సంవత్సరాల క్రితం ఖండాంతర ఘర్షణ హిమాలయాల ఏర్పాటుకు దారితీసిందని పరిశోధకులు చెబుతారు. ఈ ఘర్షణ ప్రపంచ వాతావరణ పరిస్థితులలో పెద్ద మార్పులకు కారణమైంది. అలాంటి సమయంలోనే భూమి లోపలి పొరల్లో ఇలాంటి చీలికలు ఏర్పడి ఉండవచ్చు.

ఏపీ గవర్నర్ కు మహా చిక్కొచ్చి పడింది

'కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం' అన్నట్లుగా ఉంది ప్రస్తుతం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పరిస్థితి. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. అయితే ఈ బిల్లులను ఆమోదించడం రాజ్యంగ విరుద్ధమని అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఇప్పటికే గవర్నర్‌ కు లేఖలు రాశాయి. దీంతో గవర్నర్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అని తర్జన బర్జన పడుతున్నారు. ఆమోదిస్తే బీజేపీకి కోపం, ఆమోదించకపోతే వైసీపీకి కోపం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ వర్గాలు, గవర్నర్ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ను తొలగిస్తూ పంపిన ఆర్డినెన్స్‌ను, ఆమోదించవద్దని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాసిన లేఖను, గవర్నర్ ఖాతరు చేయకపోవడమే దానికి ప్రధాన కారణం. ఆ సందర్భంలోనే రాష్ట్ర బీజేపీ నాయత్వం, గవర్నర్‌ను మార్చాలని కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. పైగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడుల గురించి ఫిర్యాదు చేసినా, స్పందించలేదన్న అసంతృప్తి బీజేపీ వర్గాల్లో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, తమ మనోభావాల ప్రకారం గవర్నర్ వ్యవహరించడం లేదన్న అభిప్రాయం రాష్ట్ర బీజేపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.  ఇప్పుడు వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల విషయంలో కూడా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. రాష్ట్ర బీజేపీ నాయత్వం గవర్నర్‌ను మార్చాలని కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చే అవకాశముంది. దీంతో ఈ బిల్లుల విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది. ఆమోదించి జగన్ సర్కార్ కి సానుకూలంగా ఉన్నానన్న సంకేతాన్ని పంపి బీజేపీ ఆగ్రహానికి గురవుతారా?.. లేక నాకెందుకీ తలనొప్పని రాష్ట్రపతికి నివేదిస్తారా? లేక న్యాయసలహా కోరతారా? అన్నది ఉత్కంఠగా మారింది. నిపుణులు మాత్రం.. రాష్ట్రపతికి పంపించడమే మంచిదని చెబుతున్నారు. చూడాలి మరి గవర్నర్‌ ఏం చేస్తారో?

నీది పచ్చ స్వామి భక్తి.. కన్నా పై విరుచుకు పడ్డ విజయ్ సాయి రెడ్డి

వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ను కొంత కాలంగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడు రాజధానుల బిల్లు పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ కు కన్నా లేఖ రాయడం పై విజయసాయిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. "కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైంది. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాశారు. దీనితో పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?" తాజాగా తన ట్వీట్ లో అయన విమర్శించారు. అంతే కాకుండా "బాబుతో భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర బీజేపీకి జాతీయ నాయకత్వం హెచ్చరించినా టీడీపీ లైన్ లోనే లేఖలు రాస్తున్నారు. కరోనా టైంలోనైనా సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే ఎలా కన్నా? బీజేపీ స్టేట్ ఇంచార్జి కూడా రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అన్నారుగా కన్నా. ఓహో ఇదంతా నీ పచ్చ స్వామి భక్తినా? " అంటూ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కన్నా లక్ష్మి నారాయణ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. అయితే కొద్ది రోజుల క్రితం ఇలాగే విజయ్ సాయి రెడ్డి కన్నా పై తీవ్ర వ్యాఖ్యలు చేయగా అటు ఢిల్లీ నుండి ఇటు ఎపి లో ఉన్న బీజేపీ లీడర్ల వరకు అందరు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఎంపీ విజయ్ సాయి రెడ్డి తాజా వ్యాఖ్యల పై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

గవర్నర్‌ తో నిమ్మగడ్డ భేటీ.. ఇంతలోనే మరో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ తో మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం ఉదయం భేటీ అయ్యారు. తనను ఎస్‌ఈసీగా పునర్నియామకం చేయాలంటూ గవర్నర్‌కు నిమ్మగడ్డ వినతిపత్రం అందజేశారు.  తనను ఎస్ఈసీగా నియమించకపోవడంపై, ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించినా నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. ఈ సందర్భంగా నిమ్మగడ్డకు కీలక సూచనలు చేసింది. తీర్పును అమలు చేయాలని గవర్నర్‌ ను కలిసి వినతిపత్రం సమర్పించాలని సూచించింది. దీంతో ఈ రోజు ఉదయం గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ అయ్యారు. తనను ఎస్‌ఈసీగా మళ్లీ నియమించాలని వినతిపత్రం అందజేశారు. హైకోర్టు తీర్పు, తదితర అంశాలపై గవర్నర్‌ తో ఆయన దాదాపు గంట సేపు మాట్లాడారు. మరి నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమించడంపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే నిమ్మగడ్డ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై  స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‍లో ఉండగా కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టు విచారణ జరపడం సరికాదని ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు ఆదేశాలను అమలుచేస్తే సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ నిరర్ధకం అవుతుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇలాంటి సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ముందుకెళ్లడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‍లో పేర్కొంది. మొత్తానికి ప్రభుత్వ తీరు చూస్తుంటే నిమ్మగడ్డ వ్యవహారానికి ఇప్పట్లో శుభం కార్డ్ వేసేలా లేదు.

ఫ్రీస్కూల్స్ గా అంగన్ వాడీ కేంద్రాలు

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాలను ఫ్రీస్కూల్స్ గా మార్చి ఆంగ్లమాధ్యమంలో బోధన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆధునిక సౌకర్యాలు అంటుబాటులోకి తీసుకువచ్చి ఆన్ల్ లైన్ పాఠాల ద్వారా చిన్నారులు విద్యాబోధన అందించనున్నారు. పిల్లల మానసిక వికాసం పెంచేలా కథలు, పాటలు వీడియో ల ద్వారా వివరించేలా అంగన్ వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 149 ఐసిడిఎస్ ప్రాజెక్టు ల ద్వారా 35,700 అంగన్ వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో 31,711 మెయిన్ సెంటర్స్ కాగా 3898 మినీ సెంటర్స్ ఉన్నాయి.మొదటిదశలో మెయిన్ సెంటర్స్ లో ఎంపిక చేసిన కొన్ని సెంటర్లను ఫ్రీస్కూల్స్ గా మార్చనున్నారు.  వీటిని తొమ్మిది గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ విధానం ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పాలని రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది.