టీటీడీ మాజీ చైర్మన్ దేవినేని సీతారామయ్య మృతి
posted on Jul 20, 2020 @ 9:59AM
టీటీడీ మాజీ చైర్మన్, ప్రముఖ ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కో సీనియర్ భాగస్వామి, విజ్ఞాన జ్యోతి వ్యవస్థాపకులు దేవినేని సీతారామయ్య (90) మృతి చెందారు. కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
సీతారామయ్య సొంతగ్రామం కృష్టాజిల్లాలోని తెన్నేరు. గుంటూరులో సీఏ పూర్తి చేసిన ఆయన1986-89లో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆర్‌బీఐ ప్రాంతీయ బోర్డు డైరెక్టర్‌గా సేవలందించారు. విజ్ఞాన జ్యోతి సంస్థ వ్యవస్థాపకుడు, కోశాధికారిగా దేవినేని సీతారామయ్య పనిచేశారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కొడుకు అమెరికాలో డాక్టర్. కుమార్తె హైదరాబాద్ లో ఉంటారు.
సీతారామయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, సుజనాచౌదరి, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత విచారం వ్యక్తం చేశారు. సీతారామయ్య ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.