జీవీఎల్.. లోకలా? నాన్ లోకలా?
posted on Nov 2, 2020 @ 11:33AM
కోర్ కమిటీలో ఆయనొక్కరికే ఆహ్వానమా?
కన్నా, సుజనా, రమేష్, వెంకటేష్ లు అంటరానివారా?
జీవీఎల్‌ను ఏ అర్హతతో ఆహ్వానించారు?
బీజేపీలో ఇదో లిమిటెడ్ పాలిటిక్స్
జీవీఎల్ నరసింహారావు. బీజేపీ యుపి రాజ్యసభ సభ్యుడు. మొన్నటి వరకూ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి. దక్షిణ భారతదేశం నుంచి తానొక్కడినే జాతీయ అధికార ప్రతినిధిని కాబట్టి.. అమరావతిపై తాను చెప్పిందే ఫైనలన్నది, మొన్నటి వరకూ ఆయన వాదన. రైటే. ఇప్పుడాయనకు జాతీయ పార్టీలో ఏ హోదా లేదు. ఇప్పటిక యితే.. జీవీఎల్ గారు కేవలం, యుపి బీజేపీ రాజ్యసభ సభ్యుడు మాత్రమే. మరి విశాఖలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి, ఆయనొక్కరినే ఎలా ఆహ్వానించారు? ఏపీ బీజేపీ మాజీ దళపతి కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులయిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్‌ను ఎందుకు పిలవలేదు? మరి వీరంతా ఏపీకి చెందిన వారే కదా? వీరికి లేని అర్హతలు, జీవీఎల్‌కు మాత్రమే ఉన్న అర్హతలేమిటి? అంటే జాతీయ పార్టీ కూడా.. రాష్ట్రాల్లో ‘లిమిటెడ్ లీడర్స్’కు పరిమితమవుతుందా? అసలు ఇది జాతీయ విధానమా? లేక ఏపీలో మాత్రమే సంఘటనా కార్యదర్శి వైఫల్యంతో నడుస్తున్న స్వతంత్ర విధానమా?.. ఇదీ ఇప్పుడు ఏపీ బీజేపీలో జరుగుతున్న చర్చ.
విశాఖలో ఆదివారం కోర్ కమిటీ భేటీ జరిగింది. దానికి ఏపీ ఇన్చార్జి సునీల్ దియోథర్, పార్టీ సంఘటనా జాతీయ కార్యదర్శి సతీష్‌జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి, యుపి ఎంపి జీవీఎల్ నరసింహారావు, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. అయితే, రాష్ట్రానికి చెందిన ఎంపీలనెవరినీ ఈ భేటీకి ఆహ్వానించని వైనంపై చర్చ జరిగింది. దీనిపై.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి స్పందిస్తూ, ఇది సంస్థాగతపరమైన సమావేశమేనని, అందులో ఎంపీలు ఉండరని చెప్పారు. బాగానే ఉంది. ఆయన చెప్పిందే నిజం. మరి.. జీవీఎల్ నరసింహారావు కూడా ఎంపీనే కదా? ఆయనొక్కరినే ఎలా ఆహ్వానించారు?పోనీ కోర్ కమిటీ సభ్యుడైనందుకే ఆయనను పిలిచారనుకున్నా... మరి ఆ లెక్కన, మిగిలిన ముగ్గురు ఎంపీలు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడిని కూడా పిలవాలి కదా? అన్నది ప్రశ్న.
నిజానికి జీవీఎల్‌కు, ఏపీతో సాంకేతికంగా ఎలాంటి సంబంధం లేదు. ఆయన సాంకేతికంగా యుపి నుంచి ఎన్నికయిన రాజ్యసభ సభ్యుడు మాత్రమే. గతంలో ఉన్న జాతీయ అధికార ప్రతినిధి హోదా కూడా లేదు. ఇటీవల ఆయనకు ఓ కార్పొరేషన్ స్థాయి పదవి ఇచ్చారు. అది పార్టీ సమావేశాలకు సంబంధం లేదు. అధికారికంగా ఆయనకు కోర్ కమిటీలో ఆహ్వానం పంపడానికి వీల్లేదు. రాష్ట్రానికి సంబంధించిన వారు మాత్రమే ఆ కమిటీలో ఉండాలి. ఆ లెక్కన ఆయన ఏపీ నుంచి ఎన్నికయిన ఎంపీ కాదు. గతంలో నిర్మలాసీతారామన్ ఏపీ నుంచి ఎన్నికయినందున, ఆమె కోర్ కమిటీ సభ్యురాలయ్యారు.
ఇప్పుడు పురందీశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి. పైగా ఆమె గతంలో కూడా కోర్ కమిటీ సభ్యురాలే కాబట్టి, ఆమె హాజరవడాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ, జీవీఎల్‌ను ఏ ప్రాతిపదికన కోర్ కమిటీ భేటీకి పిలిచి, ఏ అనర్హతతో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ముగ్గురు ఎంపీలను అంటరానివారిగా పక్కనపెట్టారన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలు రాష్ట్రంలో ఉండే లోకల్ లీడర్లకు, వేరే రాష్ట్రం ఎంపీగా ఉంటూ ఢిల్లీలో ఉండే నాన్ లోకల్ లీడర్ జీవీఎల్‌కు, సంబంధం ఏమిటన్న లాజిక్కు నేతల నుంచి వినిపిస్తోంది. సోము వీర్రాజు అధ్యక్షుడయిన తర్వాత, పార్టీ కార్యక్రమాలు-తీసుకుంటున్న నిర్ణయాలన్నీ, ‘లిమిటెడ్ వ్యవహారం’గా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సోము అండ్ కో నిర్ణయాలు నచ్చని ఓ రాజ్యసభ సభ్యుడు, తనను టెలికాన్ఫరెన్సులకు పిలవద్దని నిర్మొహమాటంగా చెప్పారట. ఇటీవల కేంద్ర మంత్రి ఒకరు టెలికార్ఫరెన్సు తీసుకుంటే, దానికి ఎంపీలతో సహా పార్టీ నేతలంతా హాజరయ్యారు. అయితే, సదరు మంత్రి మాత్రం, చివరలో ఒక్క జీవీఎల్‌ను ఉద్దేశించి మాత్రమే మాట్లాడటంతో, ఎంపీలంతా అగ్గిరాముళ్లయ్యారట. దానితో ఓ ఎంపీ, ఇకపై తనను టెలీకాన్ఫరెన్సులకు తీసుకోవద్దని నిర్మొహమాటంగానే చెప్పారట.
అసలు సాంకేతికంగా, ఏపీకి ఎలాంటి సంబంధం లేని జీవీఎల్‌కు..ఏపీ పార్టీ వ్యవహారాల్లో, పెద్ద పీట వేయడం ఏమిటని సీనియర్లంతా గుర్రుమంటున్నారు. ఆయన ఏ అర్హతతో ఏపీ కోర్ కమిటీ సమావేశాలకు వస్తున్నారు? ఏపీ రాజ్యసభ సభ్యులు యుపి కోర్ కమిటీకి వెళితే, వారిని అనుమతిస్తారా? అందాకా ఎందుకు.. ఇప్పుడు కర్నాటక ఎంపీ అయిన నిర్మలాసీతారామన్, ఏపీ కోర్‌కమిటీలో వస్తే అనుమతిస్తారా? మరి ఆమెది కూడా ఏపీనే కదా? ఈ విషయంలో ఒక్క జీవీఎల్‌కు మాత్రమే ఎలా మినహాయింపు ఇస్తున్నారు? ఆయన ఏపీకి చెందిన వారయినప్పటికీ.. యుపీ నుంచి ఎన్నికయిన ఎంపీ కాబట్టి, ఇక్కడ కోర్ కమిటీలో ఉండకూడదు కదా? అని నిలదీస్తున్నారు.
అయినా ఆయనను రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర సంఘటనా కార్యదర్శి ఎలా అనుమతిస్తున్నారు? అంటే వాళ్లిద్దరే ఆయనను ప్రోత్సహిస్తున్నారని భావించాలా? అసలు రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్‌రెడ్డిజీ స్వతంత్రంగా పనిచేస్తున్నారా? లేక అధ్యక్షుడి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారా? అదీకాకపోతే, అంతా కలసి ఓ వర్గంగా పనిచేస్తున్నారా? జాతీయ సంఘటనా కార్యదర్శి సతీష్‌జీ కూడా, ఇలాంటి చర్యలను ఖండించకపోవడం ఏమిటి? జీవీఎల్ కోర్ కమిటీకి ఎలా హాజరవుతారు? మిగిలిన ఎంపీలను ఎందుకు పిలవలేదని సతీష్‌జీ ప్రశ్నించకపోవడం ఏమిటి? అన్న ప్రశ్నలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి.
-మార్తి సుబ్రహ్మణ్యం