కరోనా వాక్సిన్ వచ్చేది అప్పటికే... తేల్చి చెప్పిన భారత్ బయోటెక్
posted on Nov 2, 2020 9:12AM
కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో ప్రపంచం మొత్తం మరోసారి గడగడా వణుకుతున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన "కొవాక్సీన్" టీకా మూడో దశ ట్రయల్స్ దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 25 నుంచి 30 కేంద్రాల్లో మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఒక్కో కేంద్రంలో 2 వేల మందిని వాలంటీర్లను సిద్ధం చేసినట్లు భారత్ బయోటెక్ అంతర్జాతీయ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా మూడవ దశ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం అయి, ప్రభుత్వం నుండి అనుమతులు వస్తే, వచ్చే సంవత్సరం ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో కొవాక్సీన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అయన ప్రకటించారు.
అయితే ప్రస్తుతం మూడవ దశ ట్రయల్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, విజయవంతంగా పూర్తి చేయడంపైనే తాము దృష్టి పెట్టామని, దీని కోసం బలమైన క్లినికల్ ఎవిడెన్సులతో పాటు.. వ్యాక్సిన్ సామర్థ్యం, సమాచార భద్రత తదితర అంశాలు ఈ దశలో కీలకమని అన్నారు. వాక్సిన్ కు భారత నియంత్రణ సంస్థల అనుమతి లభిస్తే, వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అయన తెలిపారు.
అంతేకాకుండా వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కోసం రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల నిధులను పెట్టుబడిగ పెట్టనున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలకు కూడా తాము వాక్సిన్ ను అందిస్తామని తెలిపారు. ఇక వాక్సిన్ ఎగుమతికి సంబంధించి పలు దేశాల ఫార్మా కంపెనీలతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు సాగుతున్నాయని సాయి ప్రసాద్ తెలిపారు.