సోనియా గాంధీ ఆశీర్వాదంతోనే బీజేపీలోకి
posted on Nov 21, 2020 @ 6:54PM
రాజకీయ నాయకులు పార్టీలు మారడం ఎంత కామనో, పార్టీ మారినప్పుడు అప్పటివరకు తాము పని చేసిన పార్టీపైనా, కలిసి పని చేసిన నాయకులపైనా విమర్శలు చేయడం కూడా అంతే కామన్. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. త్వరలో బీజేపీలో చేరబోతున్నట్టు ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఒకవైపు కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరడానికి సిద్దపడిన ఆయన.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని తన తల్లి అని సంబోదించడం చర్చనీయాంశమైంది.
సోనియా గాంధీ ఆశీర్వాదంతోనే బీజేపీలోకి వెళ్తున్నానని సర్వే సత్యనారాయణ తెలిపారు. సోనియా గాంధీ నాకు తల్లి, రాహుల్ గాంధీ నా తమ్ముడన్న అని అన్నారు. సోనియా ఆరోగ్యం క్షీణించింది, రాహుల్ కు రాజకీయాలపై ఆసక్తి లేదు అందుకే తాను మరో దారి చూసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. టీఆర్ఎస్ కోవర్టుల వలనే కాంగ్రెస్ పతనమైందని మండిపడ్డారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించింది కేసీఆరేనని ఆరోపించారు. కాంగ్రెస్ నాశనానికి రాష్ట్ర నాయకత్వం కారణమని, నాలాంటి వారిని గౌరవించటం లేదని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని అన్నారు. నా లాంటి వాళ్ళందరూ కష్టపడితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.