బీజేపీకి జనసేన మద్దతు! ప్రచారం కూడా చేస్తానన్న పవన్
posted on Nov 20, 2020 @ 3:32PM
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన ఇప్పుడు వెనక్కి తగ్గింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఓబీసీ చైర్మెన్ లక్ష్మణ్ తో చర్చల తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని అధికారికంగా ప్రకటించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. గ్రేటర్‌లో బీజేపీ తరపున ప్రచారానికి జనసేనాని ఒప్పుకున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై బీజేపీ, జనసేన మధ్య కొన్ని రోజులుగా గందరగోళం నెలకొంది. గ్రేటర్ లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేన... బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపింది. అయితే బీజేపీ మాత్రం జనసేనను పట్టించుకోనట్లుగా వ్యవహరించింది. గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఎవరితోనూ పొత్తు లేదని రెండు రోజుల క్రితం ప్రకటించారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. అంతేకాదు జనసేనతో పొత్తు ఏపీ వరకే పరిమితమని కూడా స్పష్టం చేశారు. సంజయ్ ప్రకటనతో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్త ఉండదనే అంతా అనుకున్నారు. అయితే గురువారం జనసేన నుంచి మరో ప్రకటన వచ్చింది. గ్రేటర్ ఎన్నికలపై పవన్ తో మాట్లాడేందుకు బండి సంజయ్ వస్తున్నారని ప్రకటించింది. జనసేన ప్రకటనతో రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతాయని, పొత్తు కదరవచ్చని భావించారు.
జనసేన లేఖపై మరోసారి స్పందించిన బండి సంజయ్... జనసేనతో పొత్తు సమస్యే లేదన్నారు. తాము 150 మందిని ఇప్పటికే ఖరారు చేశామని చెప్పారు. దీంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు కూడా స్పందించి రాత్రికి తమ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామన్నారు. అయితే లిస్ట్ రిలీజ్ కాలేదు. శుక్రవారం మళ్లీ పొలిటికల్ సీన్ మారిపోయింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వెళ్లి పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపారు. జనసేన పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిచ్చేలా అయన్ను ఒప్పించారు.
జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. నామినేషన్ల పర్వం ముగిసేవరకు కావాలనే సాగదీసినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి అన్ని డివిజన్లలో అభ్యర్థులు నామినేషన్ వేశాకా పవన్ వద్దకు బీజేపీ నేతలు వెళ్లారు. నామినేషన్ వేసిన అభ్యర్థులను మళ్లీ వెనక్కి తీసుకోలేమని చెప్పలేం కాబట్టి ఎలాగైనా సర్దుకుపోవాలని పవన్ ను ఒప్పించినట్లు చెబుతున్నారు. జనసేన తరుపున ఎక్కువగా నామినేషన్లు రాకపోవడంతో వారిని విత్ డ్రా చేయించడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయంతోనే బీజేపీ ఇలా ఎత్తు వేసిందని చెబుతున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల పొత్తు విషయంలో బీజేపీ చేతిలో జనసేన బఫూన్ అయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.