ముంబై ఉగ్రదాడిని మించిన కుట్ర వార్తల నేపథ్యంలో.. మోడీ, షా, దోవల్ అత్యవసర భేటీ
posted on Nov 20, 2020 @ 4:06PM
జమ్మూ కశ్మీరులోని నగ్రోటాలో జరిగిన ఎన్‌కౌంటర్, 26/11 ముంబై దాడులు జరిగి పన్నెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉగ్రవాదులు మరో సారి అంతకంటే భారీ ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం వస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఇంకా ఈ సమావేశానికి విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ శృంగ్లా, నిఘా సంస్థల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
ముంబైలో దాడులు జరిగిన నవంబర్ 26వ తేదీనే మరోసారి భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన నలుగురు టెర్రరిస్టులను జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారంతా ముంబై దాడులు జరిగిన రోజే మరోసారి భారీ స్థాయిలో దాడి చేయడానికి కుట్ర పన్నినట్టు నిఘావర్గాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో దేశంలో భద్రతపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలను ప్రధానిమోదీ ట్విట్టర్ ద్వారా అభినందించారు.
గురువారం జమ్మూకాశ్మీర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. జమ్మూ హైవేపై నగ్రోటా ప్రాంతంలోని బస్ టోల్‌ప్లాజా వద్ద ఓ ట్రక్కు అనుమానాస్పదంగా కనిపించింది. బియ్యం ట్రక్కును తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ట్రక్కు డ్రైవర్ వెంటనే దిగి పారిపోయాడు. దీంతో అప్రమత్తమైన బలగాలు ట్రక్కులో వెతికాయి. బియ్యం బస్తాల మాటున దాక్కున్న ఉగ్రవాదులు భారత భద్రతా బలగాలపై గ్రెనేడ్లు విసరుతూ, కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు ఆ ట్రక్కును చుట్టుముట్టి, దీటుగా స్పందించారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. ఉగ్రవాదుల వద్ద నుంచి 11 ఏకే రైఫిళ్లు, 24 మేగజైన్లు, 3 పిస్టళ్లు, 35 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.