తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి! జాతీయ కమిటిలోకి సీనియర్లు
posted on Dec 5, 2020 @ 3:33PM
దుబ్బాక అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఢీలా పడిన తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళనకు హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. ఆ పదవిని ఫైర్ బ్యాండ్ లీడర్ కు ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించిందని సమాచారం. పార్టీలోని మెజార్టీ నేతలు, కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై పీసీసీ పగ్గాలు ఇస్తారని గాంధీభవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది. రెండు రోజులుగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేయడంతో.. హైకమాండే అతన్ని పిలిపించినట్లు చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయిందని, అధికారిక ప్రకటన రావడమే మిగిలి ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పుట్టిన రోజైన ఈ నెల 9న రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తికే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పీసీసీ రేసులో ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబులకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇస్తారని తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, హనుమంతరావు, జానారెడ్డికి జాతీయ కమిటిలో పదవులు ఇస్తారని చెబుతున్నారు. తెలంగాణ నేతలకు ఇచ్చే పదవులపై హైకమాండ్ నుంచి అందరికి సమాచారం వచ్చిందని, హైకమాండ్ అదేశాలతోనే పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారని తెలుస్తోంది.
వాస్తవానికి గత నెలలోనే పిసిసి చీఫ్ పదవిని రేవంత్ రెడ్డి ఇవ్వాలని నిర్ణయించారట. తన ప్రసంగాలు, పోరాటాలతో కేడర్ లో జోష్ నింపడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనే సామర్థం రేవంత్ రెడ్డికే ఉన్నాయని పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ గతంలోనే రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇచ్చారని చెబుతున్నారు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ జరిగే అవకాశం ఉండటంతో ప్రకటన ఆపివేశారని చెబుతున్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోతే మొదటలోనే అపవాదు వచ్చే అవకాశం ఉంటుందని హైకమాండ్ భావించినట్లు సమాచారం.
రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇప్పుడు ముళ్ల కిరీటమని రాజకీయ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. వరుస ఓటములతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఢీలా పడింది. రాజకీయ భవిష్యత్ పై భరోసా లేక నేతలు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కూడా ఎవరి దారి వారి చూసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల కోసం కమల దళం గాలం వేసి కూర్చుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను మళ్లీ బలోపేతం చేయడం అంత ఈజీ కాదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా కాపాడుకుంటూ, కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసం నింపుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలను ఎదుర్కొవాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డికి. పీసీసీ పగ్గాలు చేపడితే త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఆయన సత్తాకు పరీక్షగా నిలవనుంది.