దేశమంతా తన హవా చాటుతున్న బీజేపీకి అక్కడ పెద్ద షాక్..
posted on Dec 5, 2020 8:33AM
దేశం మొత్తం ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తున్న సంగతి తెల్సిందే. దాదాపుగా ఎన్నికలు జరిగిన ప్రతి చోటా బీజేపీ తన సత్తా చాటుతూ వస్తోంది. అయితే తాజాగా మహారాష్ట్ర శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీకి గట్టి షాక్ తగిలింది. అక్కడ ఆరు స్థానాలలో ఒక్క సీటు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మహాకూటమి 4 స్థానాల్లో విజయం సాధించింది. మరో ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. ఈనెల ఒకటిన మహారాష్ట్రలోని మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను శుక్రవారం ప్రకటించారు. ఔరంగాబాద్, పుణె గ్రాడ్యుయేట్ స్థానాలను ఎన్సీపీ గెలుచుకోగా.. బీజేపీకి గట్టి పట్టున్న నాగపూర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ నుండి గతంలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధర్ రావ్ ఫడ్నవీస్, అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహించారు. ఇక ధూలె నందుర్‌బార్ లోకల్‌బాడీ సీటును మాత్రమే బీజేపీ దక్కించుకోగలిగింది. తాజా ఎన్నికల ఫలితాలపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ స్పందిస్తూ... రాష్ట్రం లో రాజకీయ వాతావరణం మారిందని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడుతూ.. కౌన్సిల్ ఎన్నికల్లో మహాకూటమి బలాన్ని తాము తక్కువగా అంచనా వేసినట్టు చెప్పారు.