ఎన్నికలపై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం! గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖాస్త్రం
posted on Dec 5, 2020 @ 5:39PM
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జగన్ సర్కార్ కు మరోసారి షాకిచ్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించేది లేదని అసెంబ్లీలో తీర్మానం చేయడంపై ఆయన సీరియస్ స్పందించారు. అసెంబ్లీ తీర్మానాన్ని తిరస్కరించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు. ఎన్నికల వ్యవహారంలో అవసరమైతే సుప్రీం కోర్టు న్యాయ నిపుణులను సంప్రదించాలని గవర్నర్‌ను కోరారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో నిమ్మగడ్డ రమేష్ చెప్పారు. రాజ్యాంగంలోని 243కే అధికరణ కింద ఎన్నికల కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి ఉందన్న నిమ్మగడ్డ.. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం కమిషన్ విధి అని స్పష్టం చేశారు..
ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాన అధికారాలు ఉన్నాయని గవర్నర్‌కు రాసిన లేఖలో నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని గవర్నర్ కు రాసిన లేఖలో నిమ్మగడ్డ రమేష్ వివరించారు. ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని, అలాంటి ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించాలని గవర్నర్ ను కోరారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయనిపుణులను సంప్రదించాలని లేఖలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జగన్ సర్కారుకు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు మధ్య చాలా కాలంగా వివాదం జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ ప్రయత్నిస్తుండగా, జగన్ సర్కారు మాత్రం ఇప్పట్లో కుదరదని తేల్చి చెబుతోంది. స్థానిక ఎన్నికల పంచాయితీ రాష్ట్ర హైకోర్టులో కూడా నడుస్తోంది. ఇదిలా ఉండగానే స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేమంటూ శుక్రవారం అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం తీర్మానం చేయడం వివాదంలో మరింత హీట్ పెంచింది. జగన్ సర్కార్ నిర్ణయంపై వెంటనే స్పందించి గవర్నర్ కు లేఖ రాశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ఎస్ఈసీ లేఖపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.