ఈనెల 7న బీజేపీలోకి జానారెడ్డి! నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ?
posted on Dec 5, 2020 @ 2:44PM
దుబ్బాకలో కారుకు ధూంధాంగా దెబ్బేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీకి గ్రేటర్ ఝలక్ ఇచ్చింది. ఇప్పుడు నాగార్జున సాగర్ పై నజర్ పెట్టింది బీజేపీ. మూడునాలుగు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ అధికార పార్టీకి షాకిచ్చేందుకు అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టింది. కేసీఆర్ కు వరుసగా మూడోసారి ముచ్చెటమలు పట్టించేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది కమలం దళం.
తెలంగాణాలో అధికారం కోసం తహతహలాడుతున్న బీజేపీ.. దుబ్బాక బైపోల్, జిహెచ్ఎంసి ఎన్నికల విజయాలతో మరింత దూకుడు పెంచింది. వివిధ పార్టీల్లోని సీనియర్లు, బలమైన నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తూనే త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ చేసిన మంత్రాంగం ఫలించడంతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలో ఉన్న జానారెడ్డితో బీజేపీ అగ్ర నాయకత్వం టచ్‌లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. కమలనాధులు ఇచ్చిన ఆఫర్‌కు జానారెడ్డి కూడా సరే అన్నట్లుగా సమాచారం. ఈనెల 7 న ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనేతల సమక్షంలో జానా రెడ్డి కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ తరుఫున జానా రెడ్డి బరిలోకి దిగనున్నట్లుగా తెలుస్తోంది. కొంత కాలంగా రాజకీయ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జానారెడ్డి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ద్వారా మళ్ళీ యాక్టివ్ కావాలని నిర్ణయించినట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. నాగార్జున సాగర్ లో బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలో నిలపాలని బీజేపీ నేతలు యోచిస్తున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. రఘువీర్‌రెడ్డితో తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, టికెట్ ఆఫర్ చేశారని వార్తలు వచ్చాయి. బీజేపీ నాయకురాలు డీకే అరుణతో రఘువీర్ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం నాగార్జున సాగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జానా రెడ్డే పోటీ చేస్తారని చెబుతున్నారు.
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంతో పోలిస్తే నాగార్జున సాగర్ పూర్తిగా భిన్నం. ఇక్కడ బీజేపీ బలం అంతంతమాత్రమే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బీజేపీ ఇంత వరకు ఎమ్మెల్యే, ఎంపీ సీటు గెలవలేదు. నల్గొండ జిల్లాలోని మిగితా ప్రాంతాల కంటే నాగార్జున సాగర్ సెగ్మెంట్ లోనే బీజేపీ పూర్ గా ఉందని చెబుతున్నారు. హాలియా పట్టణంతో పాటు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లోనే కొంత బీజేపీ బలంగా ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంకణాల నివేదితా రెడ్డికి కేవలం 2 వేల 675 ఓట్లు వచ్చాయి. అందుకే జానారెడ్డికి కమలం పార్టీ గాలం వేశారని చెబుతున్నారు. జానారెడ్డి పోటీ చేస్తే సాగర్ లో గెలవడం ఈజీ అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంచి పట్టున్న జానారెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా అనుచర గణం ఉంది.బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడం అదనపు బలం అవుతుందని బీజేపీ అంచనా వేస్తోంది.
నాగార్జున సాగర్ నియోజకవర్ం గతంలో చలకుర్తి నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. ఇక్కడి నుంచి తొమ్మిది సార్లు పోటీ చేసిన జానారెడ్డి ఏడు సార్లు గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నాగార్జునసాగర్ స్థానానికి తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో జానారెడ్డి గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీపీఎం నుంచి టీఆర్‌ఎస్ లో చేరిన నోముల నర్సింహయ్య 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసినా జానారెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నోముల నర్సింహయ్య 7,771 ఓట్ల మెజారిటీతో జానారెడ్డిపై సంచలన విజయం సాధించారు.