ఆ కాంగ్రెస్ సీనియర్ నేత బీజేపీలోకి.. మరో ఎన్నికకు సిద్ధం అవుతున్న కమలదళం
posted on Dec 5, 2020 @ 10:53AM
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో కాషాయ జెండా ఎగరేయాలని తహతహలాడుతున్న బీజేపీ దుబ్బాక ఉపఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికలలో సాధించిన వరుస విజయాలతో మరింత దూకుడు పెంచింది. అందులో భాగంగానే వివిధ పార్టీల్లోని సీనియర్లు, ద్వితీయ శ్రేణి నేతలను తమవైపు తిప్పుకొని, అధికార పీఠానికి చేరువయ్యేలా బీజేపీ వ్యూహకర్తలు ప్లాన్ సిద్ధం చేశారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డిని బీజేపీ లో చేర్చుకునే ప్రయత్నాలు షురూ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కేరళలో ఉన్న జానారెడ్డితో బీజేపీ నాయకత్వం ఇప్పటికే టచ్‌లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. బీజేపీ ఇచ్చిన ఆఫర్‌కు జానారెడ్డి కూడా సరే అన్నట్లుగా సమాచారం. దీంతో ఈనెల 7 న ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ఒక జాతీయ మీడియా కథనం.
అంతేకాకుండా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ తరుఫున అయన బరిలోకి దిగనున్నట్లుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా అటు రాజకీయ పరంగా గానీ, ఇటు పార్టీ కార్యకలాపాల పరంగా కూడా ఎక్కడా కనపడని జానారెడ్డి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ద్వారా మళ్ళీ తిరిగి క్రియాశీలం కావాలని నిర్ణయించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.