స్పీడ్ పెంచిన కిషన్ రెడ్డి! ఆ భయం వెంటాడుతుందా?
posted on Dec 12, 2020 @ 12:00PM
సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. గతంలో ఉమ్మడి అంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. తెలంగాణ బీజేపీలో అగ్రనేతగా ఉన్న కిషన్ రెడ్డి కొన్ని నెలలుగా యాక్టివ్ గా లేరు. కేంద్ర మంత్రిగా ఉన్నా ఆయన బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదనే చర్చ ఆ పార్టీలోనే వస్తోంది. తెలంగాణ పార్టీ చీఫ్ బండి సంజయ్, ఎంపీ అర్వింద్ లు దూకుడుగా వెళుతున్నా.. కిషన్ రెడ్డి మాత్రం వాళ్లను అందుకోలేకపోయారు. దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఆయన పెద్దగా ప్రచారం చేయలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసినా బండి, ధర్మపురి రేంజ్ లో కేడర్ లో జోష్ నింపలేకపోయారు.
ఇంతకాలం సైలెంట్ గా ఉంటూ వస్తున్న కిషన్ రెడ్డి సడెన్ గా స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి వేగం పెంచారని చెబుతున్నారు. రోజూ ఆయన ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గతంలో కిషన్ రెడ్డి ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవారు. కాని ఇప్పుడాయన జిల్లాలు కూడా చుట్టేస్తున్నారు. శుక్రవారం వరంగల్ లో పర్యటించి నగర అభివృద్ధిపై వివిధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొన్ని గంటల పాటు అక్కడే ఉన్నారు. పార్టీ నేతల సమావేశంలోనూ పాల్గొన్నారు. వరంగల్ కార్పొరేషన్ కు త్వరలో ఎన్నికలు జరగనుండటంతోనే కిషన్ రెడ్డి వచ్చారని చెబుతున్నారు. తర్వాత నల్గొండ జిల్లాలో పర్యటించారు. కిషన్ రెడ్డి పర్యటనలు ఇప్పుడు తెలంగాణతో పాటు బీజేపీలోనూ చర్చనీయాంశంగా మారాయి.
కిషన్ రెడ్డి స్పీడ్ పెంచడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. ఇందు కోసం రాష్ట్రం నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉండగా.. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా, బండి సంజయ్ పార్టీ చీఫ్ గా ఉన్నారు. ఇక మిగిలిన ఇద్జరు ఎంపీల్లో సోయం బాపురావుపై పలు కేసులు నమోదై ఉన్నాయి. ఇక మిగిలిన ఎంపీ అర్వింద్ కే మోడీ మంత్రివర్గంలో సహాయ మంత్రి పదవి రావచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే తెలంగాణతో పాటు బీజేపీలోనూ కిషన్ రెడ్డి ప్రాధాన్యత మరింత తగ్గుతుందని చెబుతున్నారు. కేసీఆర్ పై చేసే ఘాటు విమర్శలతో అర్వింద్ ఇప్పటికే పాపులర్ అయ్యారు. కేంద్ర మంత్రి పదవి కూడా వస్తే ఆయన మరింత బలమైన నేతగా ఎదగడం ఖాయం. ఈ సంకేతం ఉండటం వల్లే కిషన్ రెడ్డి సడెన్ గా దూకుడు పెంచారని చెబుతున్నారు. వరంగల్ కార్పొరేషన్ లో పార్టీని గెలిపించి హైకమాండ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఆయన భావిస్తున్నారట. దాంతో పాటు తెలంగాణలో తన హవా తగ్గకుండా చూసుకోవాలని కిషన్ రెడ్డి వ్యూహమని చెబుతున్నారు.
కిషన్ రెడ్డి దూకుడుపై మరో వాదన కూడా వినిపిస్తోంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డి వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీజేపీ నేతలే అసంతప్తిగా ఉన్నారట. ముఖ్యంగా సిద్దిపేటలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించినా.. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సీరియస్ గా స్పందించలేదనే ఆరోపణలు వచ్చాయి. గ్రేటర్ ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ తో కిషన్ రెడ్డి లోపాయకారి ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు కూడా వెళ్లాయంటున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి తీరుపై బీజేపీ పెద్దలు ఆరా తీశారని చెబుతున్నారు. తెలంగాణలో అధికారం కోసం తాము వ్యూహాలు రచిస్తుండగా.. కేంద్రమంత్రిగా ఉండి సైలెంట్ గా ఉంటే ఎలా అని పార్టీ పెద్దలు కిషన్ రెడ్డిని మందలించారని తెలుస్తోంది. హైకమాండ్ అక్షింతల వల్లే కేంద్ర మంత్రి స్పీడ్ పెంచారని కూడా కొందరు కమలం నేతలు అంతర్గత సంబాషణల్లో చెబుతున్నారు.