మనదేశంలో కరోనాకు తోడు మరో ప్రాణాంతక వ్యాధి.. ఇప్పటికే పలువురి మృతి.. 

కరోనా తో సతమతమవుతున్న భారత్ ను తాజాగా మరో ముప్పు వణికిస్తోంది. గుజరాత్‌లో తాజాగా మరో ప్రాణాంతక వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. మ్యూకార్ మైకోసిస్ (Mucormycosis) అనే అరుదైన ఫంగస్ వ్యాధి.. అహ్మదాబాద్‌లో కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్‌లో 44 మంది ఈ వ్యాధి బారిన పడి ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో 9 మంది చికిత్స పొందుతూ ఇప్పటికే మరణించారు. కరోనా బాధితుల్లో కనిపిస్తున్న ఒక అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వారి కంటిచూపుతో పాటు ప్రాణాలను కూడా హరించి వేస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రం లో అహ్మదాబాద్‌తో పాటు పలు నగరాల్లో మ్యూకార్ మైకోసిస్ వ్యాధి బాధితులు ఆస్పత్రుల్లో చేరుతుండడంతో ఇపుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.   మ్యూకార్ మైకోసిస్ అనేది చాలా తీవ్రమైన, అరుదైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్. మ్యుకోర్మిసెట్స్ (mucormycetes) అనే ఒకరకమైన ఫంగస్ వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఎలాంటి వాతావరణంలోనైనా సంక్రమిస్తుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా ముక్కులో ఇన్‌ఫెక్షన్ తో ఈ వ్యాధి మొదలవుతుంది. అక్కడి నుంచి ఇది కళ్లకు వ్యాపిస్తుంది. ప్రారంభ దశలోనే కనుక ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే దీని నుండి బయటపడవచ్చు. ఒకవేళ ఈ వ్యాధిని గుర్తించడంలో ఆలస్యమైనా.. లేక ట్రీట్‌మెంట్ తీసుకోకుండా అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాలుపోయే ప్రమాదముంది. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై ఈ మ్యూకార్ మైకోసిస్ ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా కరోనా సోకని వారిలో "మ్యూకార్ మైకోసిస్" వ్యాప్తి చెందడానికి 15 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటుందని, అయితే కరోనా రోగులకు మాత్రం ఇది 2 నుంచి 3 రోజుల్లోనే సోకుతోందని నిపుణులు తెలియచేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో సర్ గంగారామ్ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం 12 మ్యుకోర్మికోసిస్ కేసులు నమోదయ్యాయి. ముంబైలోనూ పలువురు ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యారు. ఇది ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   ఈ వ్యాధి నుండి కాపాడుకోవడం ఎలా.. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతను తప్పకుండా పాటించాలి. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. ముక్కును, కంటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ చేతులతో తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ముక్కు, గొంతు, కళ్లు భాగాల్లో వాపు కనిపిస్తే వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే కనుక తేలికగా దీని నుండి బయటపడవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కనుక ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి మనల్ని మనం కాపాడుకుందాం.

కొత్త వ్యవసాయ చట్టాల కాపీలను అసెంబ్లీ సాక్షిగా చించేసిన సీఎం..  

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల పై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాలను రద్దు చేయాలని రైతులు 21 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఈ వివాదస్పద వ్యవసాయ చట్టాల కాపీని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలలో చించేశారు. ఢిల్లీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చ జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో భాగంగా.. ఈ చట్టాలపై కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘‘బ్రిటిషర్ల కంటే దారుణంగా తయారవకండి’’ అంటూ మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను అడ్డంగా చించేశారు. దీంతో సభలో ఉన్న సభ్యులంతా బల్లలు చరుస్తూ కేజ్రీవాల్‌కు తమ సంఘీభావం తెలిపారు.   ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘‘అసెంబ్లీ సాక్షిగా ఈ మూడు వ్యవసాయ చట్టాలను చించేస్తున్నాను. ఇదే సమయంలో నేను కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి నుండి ఒక విజ్ణప్తి చేస్తున్నాను. మీరు తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోండి. బ్రిటిషర్ల కంటే కూడా దారుణంగా తయారవ్వొద్దు. కరోనా.. లాక్‌డౌన్ సమయం‌లో కొంపలు మునిగినట్లు ఈ చట్టాలను ఆమోదింపజేసేంత అవసరం ఇపుడు ఏమొచ్చింది?’’ అని అసెంబ్లీలో కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశించారు. అంతేకాకుండా ‘‘రైతుల వద్దకు వెళ్లి వ్యవసాయ చట్టాల గురించి వివరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒకపక్క చెబుతోంది. భూములు తీసుకోవడం లేదు కదా.. ఈ చట్టాల వల్ల రైతులు లాభపడతారని యూపీ సీఎం అంటున్నారు. ఇది నిజంగా ప్రయోజనం చేకూర్చేది అయితే మరి రైతులు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? కొంత మంది బీజేపీ నేతలు అయితే ఏకంగా రైతులను దేశద్రోహులు అంటున్నారు. చాలా మంది మాజీ ఆర్మీ ఉద్యోగులు, గాయకులు, సెలబ్రిటీలు, డాక్లర్లు రైతులకు మద్దతు ఇస్తున్నారు. మరి వీళ్లు కూడా దేశద్రోహులేనా? జాగ్రత్త.. ఈ వ్యవహారం పై కేంద్రం వైఖరితో ప్రతి రైతు ఒక భగత్‌సింగ్‌లా తయారవుతున్నారు’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.  

ఉస్మానియా క్యాంపస్ లో అలజడి! కేసీఆర్ సర్కార్ పై ఇక తిరుగుబాటే? 

ఉస్మానియా యూనివర్శిటి.. ఈ పేరే ఓ వైబ్రేషన్.. పోరాటాల  గడ్డ అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రధాన మెట్టు. ఉస్మానియా సమర నినాదమే తెలంగాణలో పార్టీలకతీతంగా నేతలను ఏకం చేసింది. ఉస్మానియా విద్యార్థుల వీర గర్జనే ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. దశాబ్దాలప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసింది. ఉస్మానియా యూనివర్శిటి లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదంటే అతిశయోక్తి కాదు.  సిద్ధిపేట నుంచి  ఆమరణ దీక్ష కోసం కరీంనగర్ వెళుతున్న కేసీఆర్ ను మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు  ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడే నిమ్మరసం తాగి దీక్ష విరమించారు కేసీఆర్. అయితే కేసీఆర్ తీరుపై ఉస్మానియా భగ్గుమనడంతో ఆయన  మాట మార్చారు. మళ్లీ దీక్ష కొనసాగించారు. అప్పుడు ఉస్మానియా విద్యార్థులు ఎదురు తిరగకపోతే కేసీఆర్ దీక్ష చేసే వారే కాదని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ఉండేది కాదని చెబుతారు.   విద్యార్థి ఉద్యమ కేంద్రంగా  అంతర్జాతీయంగా పేరున్న ఉస్మానియా యూనివర్శిటీలో ఇప్పుడు అరాచకం రాజ్యమేలుతోంది. ప్రశ్నించే ప్రాంతంగా పేరున్న క్యాంపస్ లో ఇప్పుడు ప్రశ్నించడమే పాపంగా మారింది. విద్యార్థుల  త్యాగాలతో సిద్దించిన తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఎలగబడుతున్న టీఆర్ఎస్ పార్టీ.. ఉస్మానియా వర్శిటిలో నిర్బంధం అమలు చేస్తోంది. ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తోంది. సమైక్య రాష్ట్రంలోనూ ఉస్మానియా క్యాంపస్ లో  స్వేచ్చగా తిరిగిన విద్యార్థులు... తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భయంభయంగా కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో అధికార పార్టీ నేత అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి సురేష్ యాదవ్ అనే విద్యార్థి నాయకుడిపై దాడి జరగడంకలకలం రేపుతోంది. . టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఛానల్ డిబేట్‌లో మాట్లాడినందుకే అతనిపై దాడి చేశారని చెబుతున్నారు.  టీఆర్ఎస్ నేత , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి.    ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో బుధవారం రాత్రి 11:30లకు తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్ నేత సురేష్ యాదవ్ రాత్రి భోజనం చేసి రూమ్‌లో పడుకునే సమయంలో సుమారు 20 మంది మారణాయుధాలతో అతనిపై దాడిచేశారు. వారి నుంచి తప్పించుకున్న సురేష్ యాదవ్.. ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనను కొట్టడానికి 20 మంది రావడంతో  రూమ్ నుంచి బయటకు వచ్చి రీసెర్చ్ సెంటర్ వద్ద చెట్లల్లో దాక్కున్నానని సురేష్ యాదవ్ చెప్పారు. విద్యార్ధి సమస్యలపై ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేశారని.. మా బాల్కసుమన్ అన్ననే కాదు.. టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే నిన్నే కాదు ఎవరినైనా చంపుతాం అనుకుంటూ  రూమ్‌లోకి బీర్ సీసాలు విసురుకుంటూ వెళ్లిపోయారని తెలిపారు. వారంతా వెళ్లిపోయిన తర్వాత ఉస్మానియా క్యాంపస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వారిపై ఫిర్యాదు చేశానని, తనకు ఎమ్మెల్యే బాల్క సుమన్ నుంచి ప్రాణ హాని ఉందని సురేష్ యాదవ్ వాపోయారు. తనపై దాడి చేసిన దుండగులను తక్షణమే  అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని  సురేష్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.    విద్యార్థి నేత సురేష్ యాదవ్‌పై జరిగిన దాడి ఉస్మానియా యూనివర్శిటీలో ప్రకంపనలు రేపుతోంది. నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ కొంత కాలంగా సురేష్ యాదవ్ పోరాడుతున్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి వివిధ న్యూస్ చానెళ్లు నిర్వహిస్తున్న చర్చా కార్యాక్రమాల్లో పాల్గొంటూ కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నారు. ఇదే అధికార పార్టీ నేతలకు కంటగింపుగా మారిందంటున్నారు. ప్రశ్నించే గొంతుకను నులిమివేయాలని ఉద్దేశ్యంతోనే అతనిపై దాడి చేశారని ఓయూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉస్మానియా విద్యార్థి నేతగానే ఎదిగారు బాల్క సుమన్. ఉస్మానియా విద్యార్థుల మద్దతుతోనే ఆయన తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచారు. బాల్క సుమన్ కు ఎంపీ, ఎమ్మెల్యే పదవులు వచ్చాయంటే అది ఉస్మానియా యూనివర్శిటీ పెట్టిన బిక్షేనని విద్యార్ఖులు చెబుతున్నారు. అలాంటిది ఉద్యమ నేతగా ఎదిగి రాజకీయ పదవులు అనుభవిస్తున్న బాల్క సుమన్ ... విద్యార్థి నేతపై దాడి చేయించడంపై ఓయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సురేష్ యాదవ్ పై దాడి చేసిన దుంగులను వెంటనే శిక్షించాలని, ఎమ్మెల్యే బాల్క సుమన్ పైనా కేసు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.    విద్యార్థి నాయకుడు సురేష్ యాదవ్ పై జరిగిన దాడిని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు క్యాంపస్ కు వెళ్లి  బాధిత విద్యార్థిని పరామర్శించారు. టీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ మాదిగ కూడా దాడిని ఖండించారు. కేసీఆర్ సర్కార్ అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై సురేష్ యాదవ్ మొదటి నుంచి పోరాడుతున్నారని చెప్పారు. ఇది జీర్ణించుకోలేని టీఆర్ఎస్ తొత్తులు కొందరు సురేష్ యాదవ్‌పై దాడి చేశారని ఆరోపించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాబందుల రాజ్యంలో ఉన్నమా అని కృష్ణ మాదిగ ప్రశ్నించారు. తక్షణమే బాల్కసుమన్ అనుచరులను అరెస్టు చేయాలి అని ఆయన డిమాండు చేశారు.    విద్యార్థి నేత, ప్రశ్నించే గొంతుకగా మారిన సురేష్ యాదవ్ పై జరిగిన దాడితో ఉస్మానియా యూనివర్శిటి నివురు గప్పిన నిప్పులా మారింది. దాడికి పాల్పడిన అధికార పార్టీ నేత అనుచరులను అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓయూ విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో క్యాంపస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. కేసీఆర్ సర్కార్ పై ఓయూ విద్యార్థులు తిరుగుబాటుకు సిద్దమవుతున్నారనే సమాచారం వస్తోంది. దీంతో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంతో దద్దరిల్లిన ఉస్మానియా గడ్డ.. కేసీఆర్ సర్కార్ పై పోరాటానికి వేదిక కానుందని తెలుస్తోంది. క్యాంపస్ లో తాజాగా జరుగుతున్న ఘటనలతో ఓయూ విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదంటున్నారు ఓయూ స్టూడెంట్స్.

అలా చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్‌ రెడ్డి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ మండిపడ్డారు. రాజధాని అమరావతి రక్షణకై రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా 'జనరణభేరి' పేరిట భారీ బహిరంగ సభను అమరావతి జేఏసీ నిర్వహించింది. ఈ సభకు హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రైతులు, మహిళలను రియల్ ఎస్టేట్ వ్యాపారులని సీఎం అన్నారని, ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు జగన్ అని మండిపడ్డారు. త్యాగం చేసిన రైతులపై ఇష్టానుసారం మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.    ‘‘ఒక కులంలో పుట్టడం నా తప్పా?. కులం చూసి హైదరాబాద్‌, విశాఖను అభివృద్ధి చేయలేదు. నా దగ్గర జగన్ తెలివి తేటలు పనిచేయవు. ద్రౌపది వస్త్రాపహరణం చేసినందుకు సామ్రాజ్యం కూలిపోయింది. మహిళల శాపంతో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది’’ అని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతి అంటే ఈ సీఎంకు ఎందుకింత కోపమో అర్థం కావట్లేదు. ఇవాళ రాజధాని రైతుల కోసం వైసీపీ తప్ప రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వచ్చాయి. ఊరందరిదీ ఒకదారి అయితే ఈ ముఖ్యమంత్రిది మరోదారి. ఇంతకంటే వితండవాదం మరొకటి ఉంటుందా? అని విమర్శించారు. 10 వేల కోట్లు అమరావతిలో ఖర్చు చేస్తే శ్మశానం అంటారా? అని ప్రశ్నించారు. ఎడారి, శ్మశానం అనడానికి మీకు బుద్ధుందా అని మండిపడ్డారు.   రాష్ట్రమంతా నీతోనే ఉందని చెప్పుకుంటున్నావు కదా.. మరి రిఫరెండంకు వెళదామా? అని చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు. మీరు ప్రజల ముందుకు వెళ్లి మూడు రాజధానులు కావాలా అని అడగండి.. ప్రజలు గనుక మూడు రాజధానులు కావాలి అని ఓటేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు అన్నారు.

విశాఖలో ఆ వైసీపీ నేత చెప్పిందే వేదం! తిరగబడేందుకు సొంత పార్టీ నేతల వ్యూహం 

అనుకున్నదొకటి.. అయిందొక్కటి బొల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా. ఈ పాట అంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అచ్చుగుద్దినట్లుగా సరిపోతోంది. ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణ పేరుతో విశాఖను పరిపాలన రాజధానిగా ప్రతిపాదించింది జగన్ పార్టీ. ఈ విషయం ఇంకా తేలనప్పటికి.. పరిపాలనా రాజధానిగా ప్రకటించినందున ఉత్తరాంధ్రలో తమకు తిరుగే ఉండదని, వైజాగ్ జనమంతా  జగన్ కే జై కొడతారని వైసీపీ భావించింది. కాని ఇప్పుడక్కడ సీన్ రివర్స్ గా మారింది. వైసీపీ పేరు చెబితేనే విశాఖ వాసులు భగ్గుమంటున్నారు. రాజకీయాల కోసం నగరాన్ని నాశనం చేశారని మండిపడుతున్నారు. విశాఖ జనాల్లోనే కాదు వైసీపీ నేతల నుంచి కూడా ఇదే అభిప్రాయం వస్తోంది. విశాఖను తన అడ్డాగా చెప్పుకుంటున్న ఓ వైసీపీ ముఖ్య నేత మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఫ్యాన్ పార్టీ నేతలు ఫైరవుతున్నారు.   సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే సదరు నేత విశాఖలోనే తన రాజకీయమంతా చేస్తున్నారు. విశాఖ పాలనా యంత్రాంగాన్ని మొత్తం తన గుప్పిట్లో ఉంచుకున్నారని చెబుతున్నారు. సీఎంకు దగ్గరి వ్యక్తి కావడంతో అధికారులు కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నారట. దీంతో విశాఖలో సదరు నేత చెప్పిందే వేదంగా తయారైందట. ఆ నేత దూకుడుతో జిల్లాకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు జీరోలుగా మిగిలిపోయారనే ప్రచారం జరుగుతోంది. సదరు నేతకు చెప్పకుండా చిన్న కార్యక్రమం కూడా విశాఖలో జరగడం లేదంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో  ఊహించుకోవచ్చు. ఆ నేత తీరుతో విసిగిపోయిన విశాఖ వైసీపీ నేతలు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. అయినా ఆ నేత తన తీరు మార్చుకోవడం లేదట.    సదరు నేత తీరుతో విసిగిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు గత నవంబర్ లో జరిగిన డీడీఆర్సీ సమావేశంలో అతన్ని టార్గెట్ చేశారు. సదరు నేత చేసిన రాజకీయ నేతల అవినీతి' వ్యాఖ్యలపై  ఒక ఎమ్మెల్యే ఓ రేంజ్ లో పైర్ కావడంతో సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అవాక్కయ్యారు. వైఎస్సార్‌సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డితో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. విశాఖ వైసీపీ పరిణామాలపై సీఎం జగన్ కూడా సీరియస్ అయ్యారు. ఆ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి తో చర్చించిన సీఎం జగన్.. వైసీపీ లీడర్లను తాడేపల్లికి పిలిపించుకుని మందలించారు.  నేతలు ఒకరిపై ఒకరు బహిరంగ వ్యాఖ్యలు చేసుకోవడం సరికాదంటూ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్.. గొడవలు పక్కకు పెట్టి పార్టీ అభివృద్ధికి పాటుపడాలంటూ క్లాస్ పికారు.    అయితే సీఎం జగన్ క్లాస్ పీకినా సదరు నేత తీరు మారలేదట. మళ్లీ ఎప్పటిలానే విశాఖలో తన పెత్తనం సాగిస్తున్నారట. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్ మంత్రి ఒకరు విశాఖ వెళ్లగా.. జిల్లాకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులంతా సదరు నేతపై ఆయనకు ఫిర్యాదు చేశారట. అతనితో తామే ఏగలేకపోతున్నామని, కంట్రోల్ చేయకపోతే విశాఖలో పార్టీకి భవిష్యతే ఉండదని చెప్పారట. అన్ని పనులు అతను చెప్పినట్లే జరిగితే ఇక మేమెందుకని కొందరు నేతలు ఆ సీనియర్ మంత్రి దగ్గర అసహనం వ్యక్తం చేశారట. జిల్లాకు చెందిన మంత్రులు కూడా తామ ఉత్సవ విగ్రహాలుగా మిగిలాం తప్ప ఏం చేయలేకపోతున్నామని బాధపడ్డారట. సీఎంకు దగ్గరి వ్యక్తి కావడంతో తాను ఏం చేయలేనంటూ ఆ సీనియర్ మంత్రి వారి దగ్గర చేతులెత్తేశారట.    విశాఖ ఎయిర్ పోర్టును మూసేయాలని కేంద్రానికి సదరు నేత రాసిన లేఖ కూడా కలకలం రేపింది. అత్యంత రహస్యంగా ఉంచిన ఆ లేఖ.. కేంద్ర మంత్రి ద్వారానే వెలుగులోకి  రావడంతో విశాఖ వాసులు షాకయ్యారు. నవంబర్ లో   కేంద్ర విమానయాన మంత్రి హర్దిప్ సింగ్ పూరిని కలిశారు సదరు నేత. బోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే.. విశాఖ ఎయిర్ పోర్టు 30 ఏళ్ల పాటు మూసేయమని కోరారు. అలా అయితేనే దూరంగా కడుతున్న బోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంత వరకూ భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపనే జరగలేదు. అప్పుడే  విశాఖ ఎయిర్ పోర్టు మూత గురించి.. విజయసాయిరెడ్డి విజ్ఞాపనా పత్రాలు ఇవ్వడం కలకలం రేపింది. భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మించాలని గత ప్రభుత్వం అనుకుంది. జీఎంఆర్ సంస్థకు అప్పగించింది. అయితే అవినీతి జరిగిందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆరోపించింది.  అధికారంలోకి రాగానే కాంట్రాక్టును రద్దు చేసింది. కొద్ది రోజులు సైలెంట్‌గా ఉండి… గతంలో కేటాయించిన భూమిలో ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసుకుని మళ్లీ ఆ జీఎమ్మార్ సంస్థకే కాంట్రాక్ట్ అప్పగించింది. ఇప్పుడున్న విశాఖ ఎయిర్ పోర్టు మూసేసి.. ఒక్క భోగాపురం మాత్రమే రన్ చేసేలా.. చూస్తామన్న హామీని జీఎమ్మాప్ సంస్థ ఏపీ సర్కార్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.     విశాఖపట్నం ఎయిర్ పోర్టు ప్రజల సెంటిమెంట్. మెట్రోపాలిటన్ నగరంగా ఎదుగుతున్న విశాఖకు ఆ ఎయిర్‌పోర్టు ఓ బ్రాండ్‌గా ఉంది. దాన్ని ప్రజలు తమ సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. అలాంటి ఎయిర్‌పోర్టును మూసివేయాలని విజయసాయిరెడ్డి లేఖ రాయడం విశాఖ ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా కనిపించింది. దీంతో సాధారణ ప్రజల్లోనూ విజయసాయి లేఖపై వ్యతిరేకత వచ్చింది. అసలు విశాఖ ఎయిర్‌పోర్టుపై అంత జబర్దస్తీగా లేఖ రాయడానికి విజయసాయి ఎవరన్న మౌలికమైన ప్రశ్న ప్రధానంగా వినిపించింది. విశాఖ ఎయిర్ పోర్టుకు విజయసాయికి సంబంధం ఏమిటనే మౌలికమైన ప్రశ్నలు విశాఖ వాసుల నుంచి వచ్చాయి. విశాఖకు.. విజయసాయికి సంబంధం ఏమిటని రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నించాయి. ఇలా వరుస వివాదాలకు కారాణమవుతున్న సదరు నేతపై విశాఖ వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. మరోసారి సీఎం జగన్ కు ఫిర్యాదు చేసి అతనితో తాడోపేడా తేల్చుకోవాలని కూడా కొందరు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.వైసీపీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించిన రాజకీయ అనలిస్టులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సదరు నేత తీరు మార్చుకోకపోతే పరిపాలనా రాజధానిగా ప్రకటించినా కూడా విశాఖలో వైసీపీకి కష్టాలు ఉంటాయనే చెబుతున్నారు.

"ఈ చిల్లు కుండను దింపేద్దాం.." జగన్ పై ఏపీ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. 

అమరావతి రాజధాని ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా ఈరోజు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రాయపూడిలో "జనభేరీ" పేరుతొ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ అధికార ప్రతినిధి వామరాజు సత్యమూర్తి మాట్లాడుతూ ఏపీకి ఒకటే రాజధాని అని, అది అమరావతేనని అయన స్పష్టం చేశారు. మనసా వాచా కర్మణా, త్రికరణశుద్ధిగా అమరావతి రాజధానిగా ఉండాలని తాము విశ్వసిస్తున్నామని, చివరి రైతుకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందని సత్యమూర్తి హామీ ఇచ్చారు.   సత్యమూర్తి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. "ఈ ఉద్యమాన్ని 365 రోజులుగా నిరాటంకంగా సాగిస్తున్న సోదర సోదరీమణులకు, వారి పోరాట పటిమకు బీజేపీ తరపున సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. ఈ ఉద్యమానికి బీజేపీ తరపున మద్దతు తెలపడానికి బీజేపీ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చా.. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు? పాదయాత్ర చేస్తూ రోడ్డుమీద ఉన్నారు. అపుడు మనం అందరం ఇళ్లలో ఉన్నాం. అయితే ఈ రోజు ఆయన్ను గెలిపించిన తర్వాత ఆయన మనందరినీ రోడ్డుమీద పడేశారు. ఆయన మాత్రం హాయిగా ఏసీ గదుల్లో ఉన్నారు. ఇలా ప్రజలను రోడ్డుమీద పడేసిన సీఎం జగన్‌కు గుణపాఠం నేర్పాల్సిందే. ఈ రోజు మనం విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. ఒక చిల్లుకుండను మనం నెత్తిమీద పెట్టుకున్నాం. మనం అలాంటి కుండను నెత్తిన పెట్టుకొని బాధపడి లాభం లేదు. మన కన్నీరు కూడా ఎవరికీ కనిపించదు సరికదా.. మనం ఏడుస్తున్నామని కనీసం సానుభూతి ప్రకటించే స్థితిలో కూడా ఎవరూ లేరు. కాబట్టి ఈ చిల్లుకుండను ఎంత త్వరగా దించుకుంటే మనకు అంత మంచిది. ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. మన జెండాలు వేరైనా... అజెండా మాత్రం ఒక్కటే. ఏపీకి అమరావతి ఒకటే రాజధానిగా ఉంటుంది. ఈ నినాదంతోనే బీజేపీ ముందుకు సాగుతుంది. అమరావతి ఉద్యమానికి మేము పూర్తి మద్దతిస్తాం. త్రికరణ శుద్ధిగా అమరావతి ఉద్యమం వెంట ఉంటాం.’’ అని బీజేపీ ప్రతినిధి వామరాజు సత్యమూర్తి పేర్కొన్నారు.

త్వరలో రాజ్యసభకు జస్టిస్ చలమేశ్వర్? ఢిల్లీలో పట్టు కోసం జగన్ ప్లాన్! 

చంద్రబాబు టార్గెట్ గా దూకుడు పెంచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపనున్నారని సమాచారం. ఏపీకి సంబంధించి వచ్చే ఏడాది ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లలో ఒకదానికి వైసీపీ అభ్యర్థిగా జస్టిస్ చలమేశ్వర్ ను ఇప్పటికే జగన్ ఖరారు చేశారని తెలుస్తోంది. రాజ్యసభకు వెళ్లేందుకు జస్టిస్ చలమేశ్వర్ కుడా అంగీకరించారని చెబుతున్నారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కు కీలక బాధ్యతలు ఇవ్వాలనుకోవం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంటుందని, ఢిల్లీ స్థాయిలో తనకు ఇబ్బంది లేకుండా చూసేందుకే జగన్ ఆయన్ను రాజ్యసభకు పంపిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.     ఇటీవలే జస్టిస్ చలమేశ్వర్ కుమారుడికి వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. జాస్తి నాగభూషణ్‌ను అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా నియమించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుబ్రమణ్యం శ్రీరామ్ అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నారు. అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సేవలు అందిస్తున్నారు. అయినా జాస్తి నాగభూషన్ ను కూడా రెండో అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా నియమించింది జగన్ సర్కార్. ఏపీ హైకోర్టు, సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణ తీరును ఆక్షేపిస్తూ సీఎం జగన్ సీజేఐకి ఎనిమిది పేజీల లేఖ రాయడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రిని కలిసి జగన్ పలు నివేదికలు కూడా సమర్పించారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రితోపాటు ఢిల్లీకి వెళ్లినవారిలో జాస్తి నాగభూషణ్‌ కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కుమారుడు కావడంతో ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అందరూ అనుకున్నారు. ఇప్పుడు నాగభూషణ్‌ను అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా నియమించడంతో జగన్ బలమైన వ్యూహంలో ఉన్నారని భావిస్తున్నారు.    ఏపీ హైకోర్టు, సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణ తీరుపై సీజేఐకి రాసిన లేఖలో జస్టిస్ చలమేశ్వర్, మాజీ ఏజీ దమ్మాలపాటి పేర్లు కూడా ప్రస్తావించారు జగన్. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో జడ్జిలుగా ఉన్నవారి నియామకాలు, గతంలో దమ్మలపాటికి అనుకూలంగా వెలువడిన ఉత్తర్వులను ప్రముఖంగా పేర్కొన్నారు. గతంలో జస్టిస్ రమణ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు.. న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్‌ కు అనుకూలంగా పలు ఉత్తర్వులు ఇచ్చారని, గతంలో ఓ ఐదుగురు జడ్జిల నియామకానికి సంబంధించి కొలీజియం సభ్యుడిగా జస్టిస్‌ రమణ వ్యక్తం చేసిన అభిప్రాయం.. అప్పటి సీఎం చంద్రబాబు అభిప్రాయం అచ్చు గుద్దినట్లు ఒక్కటేనని.. ఈ విషయాన్ని అప్పట్లో కొలీజియం సభ్యుడిగా ఉన్న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ స్వయంగా చెప్పారని కూడా సీఎం జగన్ లేఖలో పేర్కొనడం సంచలనం రేపింది. దీంతో సుప్రీంకోర్టు సీజేఐకి జగన్ రాసిన లేఖ వెనక జస్టిస్ చలమేశ్వర్ ప్రమేయం ఉందనే చర్చ జరిగింది. జగన్ తో పాటు ఢిల్లీకి వెళ్లిన వారిలో జస్టిస్ నాగభూషణం కూడా ఉండటంతో ఈ వాదనకు అప్పుడు బలం చేకూరింది.    ఏపీ సీఎం జగన్ తో జస్టిస్ చలమేశ్వర్ కుటుంబానికి చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి.  చంద్రబాబుతో విభేదాలున్న జస్టిస్ చలమేశ్వర్.. ఆయనకు వ్యతిరేకంగా జగన్ కు దగ్గరయ్యారని చెబుతారు. జస్టిస్ చలమేశ్వర్ తో పాటు ఆయన కుమారుడు జగన్ కు కీలక సమయాల్లో అండగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుసార్లు ఆయనను కలిశారు జస్టిస్ చలమేశ్వర్. 2019 జూన్‌ 11న విజయవాడలో ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు చలమేశ్వర్‌  పాల్గొన్నారు. ఈ ఏడాది  జనవరి 30న సుప్రీంకోర్టు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిశారు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్. ఈ సందర్భంగా చలమేశ్వర్‌ను శాలువా, జ్ఞాపికతో సాదరంగా సత్కరించారు సీఎం జగన్.    జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు నందమూరి కుటుంబంతో చాలా దగ్గరి అనుబంధం ఉండేది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లీగల్ వ్యవహారాలన్ని జస్టిస్ చలమేశ్వరే చూసేవారట. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సమయంలో జాస్తి చలమేశ్వర్ స్వయంగా హరికృష్ణ పాడె మోశారు.  అంత దగ్గరి అనుబంధం వారికి ఉంది. అయితే చంద్రబాబుతో మాత్రం మొదటి నుంచి జస్టిస్ చలమేశ్వర్ కు సఖ్యత లేదని చెబుతారు. జస్టిస్ రమణకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడంతో జస్టిస్ చలమేశ్వర్ ఆయనకు దూరమయ్యారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే న్యాయ వ్యవస్థలో బలంగా ఉన్న చంద్రబాబును దెబ్బ కొట్టడానికి జస్టిస్ చలమేశ్వర్ ను అస్త్రంగా జగన్ వాడుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడికి జగన్ కీలక బాధ్యతలు ఇవ్వడమే చర్చనీయాంశం కాగా.. త్వరలో జస్టిస్ చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపిస్తున్నారనే విషయం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

డీజీపీ సూచనను ఫాలో అవ్వండి.. టీడీపీ కేడర్ కు బాబు అదిరిపోయే ఐడియా.. 

ఏపీ రాజధానిని అమరావతి నుండి తరలిచాలని సీఎం జగన్ ప్రకటించడంతో అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై ఈరోజుకు ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సంఘం ఈరోజు రాయపూడిలో "జనభేరి" పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. దీనికి పలు ప్రతిపక్షాల నేతలు హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశానికి రావడానికి సిద్దమైన టీడీపీ నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ కేడర్ కు అదిరిపోయే సూపర్ ఐడియా ఇచ్చారు. పోలీసులు ఒక కేసు పెడితే మీరు రెండు ప్రయివేట్ కేసులు పెట్టండి. ఒకవేళ పోలీసులు కేసులు తీసుకోకపొతే టెక్నాలజీ వాడుకోవాలని.. డిజిపి గౌతమ్ సవాంగ్ గతంలో చేసిన సూచనను ఫాలో అవ్వాలని వారికి సూచించారు. పోలీసులు కనుక నేరుగా ఫిర్యాదులు తీసుకోకపోతే ఆన్ లైన్ లో కేసులు రిజిష్టర్ చేయాలని చంద్రబాబు తన పార్టీ నాయకులాలకు,కార్యకర్తలకు సూచించారు. అంతేకాకుండా తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదిలే ప్రసక్తే లేదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రస్తుత పరిష్టితులలో పోలీసులు కాళ్లబేరానికి రావాలంటే ప్రైవేట్ కేసులు ఒక్కటే మార్గమని ఆయన తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. తప్పుడు కేసులకు కాలం చెల్లిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రజలు టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని డిజీపీ పదేపదే ఊదరగొడుతున్నారని మనం కూడా అయన సలహాను ఫాలో అవుదామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సోనూసూద్ కు అరుదైన పద్మ అవార్డ్ ! ముంబై కార్పెంటర్ సేవా పురస్కారం 

బాలీవుడ్ నటుడు, సామాజిక సేవలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్న  సోనూసూద్ కు మరో అరుదైన అవార్డు దక్కింది. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నందుకు ఆయనకు  పద్మ అవార్డు లభించింది. అయితే ఈ పద్మ అవార్డు భారత సర్కార్ ఇచ్చింది కాదు.  ముంబైకు చెందిన ఓ కార్పెంటర్ బహూకరించింది.  ఇంద్రోజిర రమెష్ అనే వ్యక్తి ముంబై మహానగరంలో ఓ కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. అతడు తన జీవితాన్ని కష్టాలతోనే గడిపాడు. చివరకు చెక్క పనిలో స్థిరపడ్డాడు. తనకు కూడా కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించాలని ఉన్నా తన ఆర్థిక పరిస్థితి సహకరించదు. అందుకే దేశంలో ఎవరైన ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే వారి ప్రతిమను తయారు చేసి వారికి అందిస్తాడు. దానికి అతడు పద్మ సేవ అనే పేరును పెట్టుకున్నాడు.  ముంబై కార్పెంటర్ ఇచ్చే ఈ పద్మ అవార్డును ఇప్పటివరకు కొద్ది మంది మాత్రమే అందుకున్నారు.   నేను సైతం అంటూ ఎందరికో అండగా నిలిచిన మంచు లక్ష్మీ, దాదాపు 220 సార్లు రక్తదానం చేసిన సంపత్ కుమార్, తాను బిచ్చమెత్తగా వచ్చిన రూ.3లక్షలను సమాజసేవలో ఖర్చు చేసిన కామరాజులు ఈ సత్కారాన్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు సోనూ సూద్‌ను ఈ అవార్డుతో రమేష్ సత్కరించాడు. గతంలో  సోనూకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. ప్రపంచంలోని టాప్ 50 ఆసియా తారల సరసన సోనూ కూడా ఉన్నాడు.  సోనూ సూద్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లలేదు. రీల్‌లో విలన్‌గా చేసే సోనూ నిజ జీవితంలో ప్రజల పాలిట హీరోగా మారాడు. కరోనా మహమ్మారి సమయంలో వలస కార్మికులను తమతమ ఇళ్లకు చేర్చడంలో సోనూ ప్రధాన పాత్ర పోషించాడు. దేశంలో ఎక్కడి వారైనా సమస్యలతో పోరాడుతుంటే వారికి సోనూ తన వంతు సహాయం అందించి అండగా నిలిచాడు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కూడా ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఆపన్నులకు సాయం చేయడానికి సోను సూద్ ముంబైలోని తన ఆస్తులను తాకట్టు పెట్టారని వార్తలు వచ్చాయి. అతని ఉదారత గురించి లోకం కోడై కూసింది. ఇంత చేసినా ఏ ప్రభుత్వం కూడా  సోనుసూద్ కు ఎటువంటి సత్కారాలు చేయలేదు. అయితే ఇప్పుడు లభించిన ఆ అవార్డును  సోనూ సూద్ కు అరుదైన గౌరవంగానే చెప్పుకోవాలి.

ఆన్‌లైన్ అప్పుకు మరొకరు బలి! సిద్దిపేట జిల్లాలో  ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్ 

ఆన్ లైన్ రుణం ఓ యువతి ప్రాణం తీసుకుంది. రుణం ఇచ్చిన సంస్థ వేధింపులు భరించలేక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటలో ఈ విషాద ఘటన జరిగింది. వ్యాపారంలో నష్టపోయిన తండ్రి కష్టాలు చూడలేక ఆన్‌లైన్ యాప్‌లో రుణం తీసుకున్న ఓ యువతి గడువులోగా అప్పును తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో రుణ సంస్థ నుంచి వేధింపులు, ఒత్తిడి ఎక్కువయ్యాయి. తట్టుకోలేకపోయిన ఆమె పురుగుల మందు తాగి ప్రాణం తీసుకుంది.  పోలీసుల వివరాల ప్రకారం రాజగోపాలపేట చెందిన  24 ఏండ్ల కిర్ని మౌనిక  ఏఈవోగా పనిచేస్తోంది. ప్రస్తుతం వీరి కుటుంబం సిద్ధపేటలో ఉంటోంది. మౌనిక తండ్రి భూపాణి వ్యాపార ప్రయత్నాల్లో డబ్బులు నష్టపోయారు. దీంతో కుటుంబ అవసరాల కోసం ‘స్నాప్ ఇట్ లోన్’ యాప్ నుంచి రెండు నెలల క్రితం రూ. 3 లక్షల రుణం తీసుకుంది. అయితే, గడువు తీరినా ఆమె తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో యాప్ నిర్వాహకులు మౌనికపై ఒత్తిడి తీసుకొచ్చారు. అంతటితో ఆగక ఆమె ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లన్నింటికీ మౌనికను రుణ ఎగవేతదారుగా పేర్కొంటూ వాట్సాప్‌ మెసేజ్‌లు పంపించారు. రుణ సంస్థ తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 14న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.  పురుగుల మందు తాగి ఇంట్లో పడిపోయిన మౌనికను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మౌనిక మృతి చెందింది. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అప్పు కోసం వేధించిన రుణ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

"ష్.. ఎవ్వరికీ చెప్పొద్దు.. ఆ సర్కార్ ను కూలదోసింది మోడీయే".. బీజేపీ నేత సంచలనం

పాపం.. చుట్టూ ఉన్నది తమవాళ్లే అనే ఆవేశంలో కొంతమంది నాయకులు నోరు జారి నిజాలు చెప్పేసి తరువాత తీరిగ్గా నాలుక్కరుచుకున్న సంఘటనలు అనేకం మనం చూసాం. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బెంగాల్ వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడంలో ప్రధాని నరేంద్ర మోడీ చాల ప్రముఖ పాత్ర పోషించారని వ్యాఖ్యలు చేశారు. ఇండోర్ లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ‘‘ఈ మాటలు ఎవ్వరితోనూ చెప్పకండి. ఇప్పటి వరకూ నేను కూడా ఎవరికీ చెప్పలేదు. ఈ సభ ద్వారానే మొదటి సారిగా వెల్లడిస్తున్నాను. కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఎవరైనా ప్రముఖ పాత్ర పోషించారంటే అది మన ప్రధాని మోడీయే. దీంట్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర ఏమి లేదు .’’ అని విజయ వర్గీయ వ్యాఖ్యానించారు. బీజేపీ కీలక నేత విజయ వర్గీయ తాజా వ్యాఖ్యల పై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

కరోనా మహమ్మారి వల్ల రూ.866 లక్షల కోట్ల నష్టం

కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 11.7 లక్షల కోట్ల డాలర్ల(దాదాపు రూ.866 లక్షల కోట్ల) నష్టం వాటిల్లిందని ఆక్స్ ఫామ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇదంతా ఈ సంవత్సరం ప్రపంచం చెల్లించుకున్న అదనపు మూల్యమని తెలిపింది. మొత్తం నష్టంలో 83 శాతం నష్టం 36 సంపన్న దేశాలకు ఏర్పడిందేనని పేర్కొంది. 56 అల్పాదాయ దేశాలు ఈ మొత్తంలో కేవలం 0.4 శాతం మాత్రమే నష్టపోయాయని తెలిపింది.   ఈ అదనపు వ్యయంలో అధిక భాగం సామాజిక సంక్షేమం కోసం ఖర్చయిందని ఆక్స్‌ ఫామ్‌ పేర్కొంది. 28 సంపన్న దేశాలు తమ జనాభాలో ఒక్కొక్కరిపై 695 డాలర్లు ఖర్చు చేయగా.. పేద, మధ్య తరగతి దేశాలు ఒక్కొక్కరిపై 4 నుంచి 28 డాలర్ల వరకూ వెచ్చించాయని ఆక్స్ ఫామ్ అంచనా వేసింది.   కరోనా సంక్షోభ కాలంలో పని గంటలు తగ్గడం, లాక్ డౌన్, కంపెనీల మూసివేత కారణంగా ఆసియా పసిఫిక్‌ దేశాల్లో 8.10 కోట్ల మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారని ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌(ఐఎల్‌ఓ) తెలిపింది. కరోనా సంక్షోభం ప్రజల ఆదాయం, ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. కరోనా సోకకముందుతో పోలిస్తే పనిగంటలు 15 శాతానికి పైగా తగ్గాయని, ఇంకా పూర్తి స్థాయిలో ఏ రంగమూ కోలుకోలేదని ఐఎల్‌ఓ తెలిపింది.

"అన్నదాత రోడ్డెకాల్సి రావడం దారుణం.. వారికోసం నా త్యాగం"  అంటూ సిక్కు మత బోధకుడు ఆత్మహత్య

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ రైతులు 21 రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ ఆందోళనకు సంఘీభావంగా హరియాణలోని కర్నాల్‌కు చెందిన ఓ మత ప్రబోధకుడు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. హర్యానాకు చెందిన సంత్‌ బాబా రాంసింగ్‌ (65) అనే ఈ సిక్కు ప్రబోధకుడు "రైతుల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నానని" లేఖ రాసి, ఢిల్లీ సరిహద్దుల్లో ఆత్మహత్యకు పాల్పడటం తీవ్రం కలకలం రేపుతోంది. అయన ఢిల్లీ సోనేపట్ సరిహద్దులోని కుండ్లీ దగ్గర తన తుపాకీతో కణతపై కాల్చుకుని మరణించారు. ఆయనకు పంజాబ్‌, హరియాణాల్లో అనేకమంది అనుచరులున్నారు. గడచిన 21 రోజులుగా అయన రైతులతో కలిసి నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రాంతం రైతు నిరసనలకు ప్రధాన కేంద్రమైన సింఘూ బార్డర్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రైతుల నిరసనలను కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రమూ పట్టించుకోవడంలేదని ఆరోపించిన ఆయన, రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.   శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ)తో పాటు అనేక సిక్కు సంఘాల్లో బాబా రాంసింగ్ క్రియాశీలక సభ్యుడు. "రైతులు పడుతున్న బాధలను చూడలేకపోతున్నాను. రైతులు తమ హక్కుల కోసం పోరాడాల్సి రావడం చాలా బాధను కలిగిస్తోంది. రోడ్డెక్కి తమ హక్కుల కోసం పోరాడుతున్న వారి దుస్థితిని వర్ణించలేను. ప్రభుత్వం వారిని అణచేస్తోంది. ఇది నేరం.. పాపం... దారుణం. దీన్ని ఆపేవారెవరూ లేరు. రైతులకు మద్దుతుగా ఇప్పటికే ఎంతో మంది తమకు గతంలో వచ్చిన అవార్డులను వెనక్కు ఇచ్చారు. నా వంతుగా నన్ను నేనే త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను" అంటూ అయన ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొన్నారు.   నిన్న రాత్రి తన కారులో కూర్చున్న బాబా రామ్ సింగ్, తుపాకితో తనను తాను కాల్చుకుని మరణించారని సోనేపట్ డిప్యూటీ పోలీసు కమిషనర్ శ్యామ్ లాల్ పునియా తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కల్పనా చావ్లా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి తీసికెళ్లినపుడు ఆయన అనుచరులు వేల మంది అక్కడకు చేరుకున్నారు.   ఆత్మహత్య చేసుకునే ముందు బాబా రామ్ సింగ్, తన మద్దతుదారులతో కలిసి భారతీయ కిసాన్ యూనియన్ హర్యానా యూనిట్ చీఫ్ గుర్నామ్ సింగ్ చారుహునిని కలిసి చర్చలు జరిపారు. నిన్న ఆయన తనతో పాటు 45 నిమిషాలు ఉన్నారని, ఉద్యమం తాజా పరిస్థితుల పై అడిగి తెలుసుకున్నారని, అంతలోనే ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని తాము ఎంత మాత్రమూ ఊహించలేదని గుర్నామ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన త్యాగం ఎంతో విలువైనదని, దాన్ని వృథా పోనివ్వబోమని అయన స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాల సీఎంల ఢిల్లీ టూర్.. కారణం ఒక్కటే!!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంట వెంటనే హస్తిన బాట పట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొదట తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కలిసి రాగా.. ఆ వెంటనే ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు విడిగావిడిగా ఢిల్లీకి వెళ్లినప్పటికీ.. వెళ్లిన కారణం మాత్రం ఇంచుమించు ఒక్కటే. ఇద్దరూ ప్రధానంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి చర్చిండానికే వెళ్లారు. అందుకే, ఇద్దరూ కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ను కలిశారు.   కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్. అనుమతులు లేకుండానే మూడో టీఎంసీ ఎత్తిపోసేందుకు నిర్మాణ పనులు చేపట్టడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. అసలు కేంద్రానికి సమాచారమే లేకుండా ఈ పనులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించింది. దీంతో హడావుడిగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. కేంద్ర పెద్దలను కలిసి వారిని కూల్ చేసే ప్రయత్నం చేశారు.   ఇక, వైఎస్ జగన్ పోలవరం, మూడు రాజధానులు వంటి అంశాలు చర్చిండానికి ఢిల్లీ వెళ్లారని చెబుతున్నప్పటికీ.. ప్రధానంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ గురించి చర్చిండానికే షెకావత్ ని కలిసినట్టు తెలుస్తోంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణ విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టికి వెళితే.. దాన్ని ఆపాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు, పర్యావరణ అనుమతులు పొందకుండా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చేపట్టవద్దంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ధిక్కరిస్తోందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ షెకావత్ ని కలిసి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.   ఇలా ఇద్దరు సీఎంలు ప్రధానంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించే ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్ పనులనూ ఒక ప్రముఖ కంపెనీ చేపడుతుంది. దీంతో  సీఎంలు పట్టుబట్టి, అనుమతులు తీసుకోకుండానే ఆ ప్రాజెక్ట్ లు చేయడంపై అనుమానాలకు తావిస్తోంది. మిగతా విషయాలలో ఇంతగా కేంద్రాన్ని పట్టుబట్టని సీఎంలు.. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో హడావుడిగా ఢిల్లీ వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీతో కేసీఆర్ డీల్.. షేక్ అవుతున్న టీఆర్ఎస్ శ్రేణులు!!

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోబోతున్నాయా? సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత టీఆర్ఎస్ శ్రేణులు షేక్ అవుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.   ఇటీవల తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. దుబ్బాకలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీతో.. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ కూడా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీనే తమ ప్రధాన ప్రత్యర్థిగా భావించింది. ఈ రెండు ఎన్నికల్లోనూ బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది.    దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల షాక్ తో కేసీఆర్ బీజేపీపై యుద్ధానికి సిద్ధమయ్యారని, అందుకే రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాదు, బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఒక్కసారిగా అన్నీ తారుమారయ్యాయి. సడెన్ గా కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ఇతర పార్టీలు కూడా షాక్ అయ్యాయి. కేసులకు భయపడి కేసీఆర్ బీజేపీతో కాళ్ళ బేరానికి వచ్చారని విపక్షాలు ఆరోపించాయి. ఇక రాష్ట్ర బీజేపీ నేతలైతే కేసీఆర్ వంగి వంగి దండాలు పెట్టినా క్షమించేది లేదని, జైలుకి పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.   అయితే, కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. అనుమతులు లేకుండానే మూడో టీఎంసీ ఎత్తిపోసేందుకు నిర్మాణ పనులు చేపట్టడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుందని సమాచారం. అసలు కేంద్రానికి సమాచారమే లేకుండా ఈ పనులు ఎలా ప్రారంభిస్తారని, మూడో టీఎంసీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడినట్టు సమాచారం. దీంతో హడలిపోయిన కేసీఆర్ కేంద్రంతో యుద్దాన్ని పక్కన పెట్టి సయోధ్య కోసం హస్తినకు వెళ్లారని తెలుస్తోంది. అంతేకాదు, బీజేపీ కోపాన్ని చల్లార్చడం కోసం ఏకంగా టీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని మాట ఇచ్చారట. అయితే దీనికి ఒక రిక్వెస్ట్ లాంటి కండిషన్ పెట్టారట. తెలంగాణలో తనయుడు కేటీఆర్ ని సీఎంని చేసి, కేంద్ర కేబినెట్ లోకి తనని తీసుకుంటే పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని చెప్పారట. గతంలో తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్ .. ఆ మాట తప్పారు. అయితే ఇప్పుడు మాత్రం కేసులు, కాళేశ్వరం కేసీఆర్ ని హడలిపోయేలా చేశాయని.. అందుకే పార్టీని విలీనం చేయడానికి కూడా సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. అందుకే, కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ శ్రేణులు షేక్ అవుతున్నాయని అంటున్నారు.

అమరావతిని శిధిల స్థితిలో చూస్తుంటే బాధేస్తోంది

జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో ఏడాది పుర్తి చేసుకున్న నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.   "విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానిగా ప్రణాళికాబద్ధమైన ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించుకునే అవకాశం మనకు వచ్చింది. రాజధానిగానే కాకుండా 13 జిల్లాల అభివృద్ధికి అవసరమైన సంపద సృష్టి, యువతకు ఉపాధి కేంద్రంగా ఆ నగరాన్ని నిర్మించాలనుకున్నాం. ఆ కారణంగానే ఐదు కోట్ల ఆంధ్రులూ గర్వంగా చెప్పుకునేలా ప్రజారాజధాని అమరావతిని నిర్మించేందుకు ఆనాడు సంకల్పించాం. రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కోసం రాజధాని ప్రాంత రైతులు 33వేల ఎకరాల భూములను త్యాగం చేశారు." అని చంద్రబాబు అన్నారు.   "ఆనాడు అమరావతి శంకుస్థాపన కోసం రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి పవిత్రస్థలాల మట్టిని, నీటిని పంపించి రాష్ట్ర ప్రజలు తమ ఆకాంక్షను, ఆమోదాన్ని తెలియజేసారు. అలా ఊపిరిపోసుకున్న అద్భుత రాజధాని అమరావతి నగరాన్ని ఈరోజు శిధిల స్థితిలో చూస్తుంటే బాధేస్తోంది." అని ఆవేదన వ్యక్తం చేశారు.   "రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం ఆడుతోన్న మూడు ముక్కలాటకు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే రేపటి తరాలకు కలిగే నష్టాలకు మనమే బాద్యులం అవుతాం. అందుకే రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలి. ఆంధ్రులందరిదీ ఒకే మాట,ఒకే రాజధాని అని చాటాలి." అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

పదవుల ఆరాటంలో రాహుల్ గాంధీని చంపేసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల లీడర్లు 

కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ అనేది దేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంతేకాకుండా కాంగ్రెస్ కు వీర విధేయులం… అలాగే గాంధీ కుటుంబానికి నమ్మిన బంటులం అని చెప్పుకునే కాంగ్రెస్ సీనియ‌ర్లు తాజాగా పార్టీ అధిష్టానానికి రాసిన లేఖలో ఏకంగా రాహుల్ గాంధీని లేట్ అంటూ సంబోధిస్తూ సంచలనం రేపారు‌. గ్రూప్ రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పీసీసీ పోస్ట్ రేసు జోరుగా సాగుతుంది. ఈ రేసులో అందరికంటే ముందుండాల‌న్న తాపత్రయం‌తో పాటు ఇతర నేతలకు ప‌ద‌వి దక్కకూడదనే తొంద‌ర‌లో ఏకంగా కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్ నాయ‌కుడు రాహుల్ గాంధీనే చంపేశారు.   రేవంత్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లోనూ పీసీసీ పదవి ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ సీనియ‌ర్లు కొంద‌రు కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి రెండు పేజీల లేఖ రాశారు. అయితే అందులో త‌మ‌ గురించి తాము గొప్ప‌గా చెప్పుకునే ప్ర‌య‌త్నంలో గ‌తంలో జ‌రిగిన కొన్ని విష‌యాలు తెలియచేస్తూ… రాహుల్ గాంధీని మ‌ర‌ణించిన వారిని సంబోధించే "Late Rahul Gandhi" అంటూ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి. తమకు చేతనైతే తాము ఏం చేస్తామో చెప్పుకొని ప‌ద‌వి పొందాలి కానీ పదవుల కోసం ఇలా ఇత‌రుల‌పై బుర‌ద జ‌ల్లే కార్య‌క్ర‌మం వ‌ల్లే పార్టీ పరిస్థితి ఇలా త‌యారైంద‌ని, ఈ పేరు గొప్ప సీనియ‌ర్ లీడర్లకు రాహుల్ కు రాజీవ్ కు కూడా తేడా తెలియ‌కుండా పోయింద‌ని మండిప‌డుతున్నారు. మీ గ్రూప్ రాజ‌కీయాలతోనే తెలంగాణాలో కాంగ్రెస్ కు సమాధి కడుతున్నారని వారు మండిప‌డుతున్నారు.

ఒకే ఒక్క ఓటు తేడాతో మేయర్ అభ్యర్థి ఓటమి.. 

ఎన్నిక ఏదైనా ప్రతి ఓటు చాలా కీలకం అవుతుంది. ఒక్కోసారి ఆ ఒక్క ఓటే పోటీ చేస్తున్న అభ్యర్థి తలరాతను కూడా మార్చేస్తుంది. తాజాగా కేరళలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఎన్.వేణుగోపాల్ కేవలం ఒక్క ఓటు తేడాతో తన సమీప బీజేపీ అభ్యర్థి చేతిలో బుధవారంనాడు ఓటమి చవిచూశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొచ్చి కార్పొరేషన్ నార్త్ ఐలాండ్ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వేణుగోపాల్ పోటీచేసి ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు.   తన ఓటమిపై వేణుగోపాల్ స్పందిస్తూ.. "ఇది ఖచ్చితంగా గెలవాల్సిన సీటు. అయితే ఏం జరిగిందో అర్ధం అవరంలేదు. మా పార్టీలో మాత్రం ఎలాంటి సమస్యా లేదు. ఓటింగ్ మిషన్‌తోనే అసలు సమస్య. బహుశా అదే బీజేపీ విజయానికి కూడా కారణం కావచ్చు" అని అయన అన్నారు. ఇవిఎం అంశంపై కోర్టుకు వెళ్లే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అసలు ఏమి జరిగిందో తెలుసుకున్న తర్వాతే తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.   ఇది ఇలా ఉండగా కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభం కాగా తాజాగా అందుతున్న లీడ్స్ ప్రకారం అధికారంలో ఉన్న ఎల్డిఎఫ్ 509 స్థానాలలో, ప్రతిపక్ష యూడీఎఫ్ 369 స్థానాలలో, ఎన్డీయే 27 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

58 నిమిషాల్లో 46 వంటకాలు.. పదేళ్ల బాలిక వరల్డ్ రికార్డ్

58 నిమిషాల్లోనే 46 రకాల వంటకాలు చేసి ఓ పదేళ్ల చిన్నారి యూనికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. చెన్నైకి చెందిన లక్ష్మి సాయిశ్రీ అనే బాలిక ఈ ఘనత సాధించింది. లక్ష్మి సాయిశ్రీ వంటలు వండటంలో అద్భుత ప్రతిభ కనబరిచిందని ఈ సందర్భంగా యూనికో ప్రతినిధులు వ్యాఖ్యానించారు.    లాక్ డౌన్ సమయంలో తన తల్లి దగ్గర వంట నేర్చుకుందీ చిన్నారి. తన బిడ్డ లాక్ డౌన్ సమయంలో వంటలు వండటం నేర్చుకుందని లక్ష్మి తల్లి కలైమగల్ తెలిపారు. ఆమె వేగాన్ని, ప్రతిభను చూసిన తండ్రి వరల్డ్ రికార్డు కోసం కృషి చేయాలని ప్రోత్సహించారని చెప్పారు.   తనకు వరల్డ్ రికార్డు దక్కడంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన లక్ష్మి.. తాను తన తల్లిని చూసి వంట పట్ల ఆసక్తి పెంచుకున్నానని తెలిపింది. తానిప్పుడు వివిధ రకాల తమిళ సంప్రదాయ వంటకాలను చేయగలనని చెప్పింది. వరల్డ్ రికార్డు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని లక్ష్మి తెలిపింది. గతంలో కేరళకు చెందిన పదేళ్ల శాన్వి అనే బాలిక.. గంట వ్యవధిలో 30 రకాల వంటకాలు చేసి రికార్డు సృష్టించగా, ఇప్పుడు ఆ రికార్డును లక్ష్మి అధిగమించింది.