బీజేపీకి షేక్ హ్యాండ్.. హస్తానికి బూస్ట్! ఢిల్లీ టూర్ తో కేసీఆర్ నయా ప్లాన్
posted on Dec 12, 2020 @ 10:33AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన మూడు భేటీలు.. ఆరు చర్చలుగా జరుగుతోంది. ఢిల్లీకి వెళ్లిన రోజే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడం ఆసక్తిగా మారింది. కేసీఆర్ హఠాత్తుగా హస్తిన వెళ్లడమే అనేక చర్చలకు తావివ్వగా.. అమిత్ షాతో సమావేశం కావడం మరిన్ని అనుమానాలకు కారణమైంది. రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు కేసీఆర్. కేంద్రం మీద యుద్ధం కూడా ప్రకటించారు. అంతలోనే కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి వర్చువల్గా హాజరవుతానని ప్రధానికి లేఖ రాశారు. మరుసటి రోజే ఏకంగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు. దీంతో కేసీఆర్ గంటల వ్యవధిలోనే యూ టర్న్ తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. రణం చేయడానికి బదులుగా కేంద్రంతో కాళ్ల బేరానికి వెళ్లారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. పాత కేసులు తిరగదోడకుండా ఉండేందుకు రాజీపడ్డారని ఆరోపించారు.
అయితే కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికి అందకుండా ఉంటాయని, ఏ ప్రయోజనం లేకుండా ఆయన నిర్ణయాలు తీసుకోరని చెబుతున్నారు. గులాబీ బాస్ ఢిల్లీ పర్యటన వెనక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు. ఢిల్లీలో కేసీఆర్ పర్యటన ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా సాగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో తమకు ఇబ్బందిగా మారిన తెలంగాణ బీజేపీ నేతల దూకుడుకు బ్రేక్ వేయడంతో పాటు కాంగ్రెస్ కు బూస్ట్ ఇవ్వడమే కేసీఆర్ లక్ష్యమంటున్నారు. తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగినందున కాంగ్రెస్ బలంగా ఉంటేనే తమకు కలిసి వస్తుందని కారు పార్టీ అధినేత భావిస్తున్నారట. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉండటం వల్లే బీజేపీకి ప్లస్ అయిందని టీఆర్ఎస్ నేతలు అంచనాకు వచ్చారట. కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపించక పోవడంతో కాంగ్రెస్ కేడర్ తో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా కమలానికి మళ్లినట్లు ఎన్నికల ఫలితాలు కూడా చెబుతున్నాయి.
తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు 30 శాతానికి పైగానే సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇది 20 శాతానికి పైగానే ఉంటుంది. అయితే దుబ్బాకలో పీసీసీ నేతలంతా శ్రమించినా కాంగ్రెస్ కు 21 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఎలాగూ గెలవలేదనే భావనతో హస్తం సానుభూతి పరులు, కేసీఆర్ పని తీరుపై కసిగా ఉన్న జనాలంతా కమలానికి జై కొట్టారని తేలింది. దుబ్బాకలో దాదాపు 10 శాతం కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి మళ్లాయంటున్నారు. అలాగే గ్రేటర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బీజేపీ వైపు వెళ్లింది. అందుకే జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు కేవలం 6 శాతం ఓట్లు వచ్చాయని చెబుతున్నారు. కాంగ్రెస్ బలంగా ఉంటే దుబ్బాకతో పాటు గ్రేటర్ లో మంచి విజయం సాధించే వారమని గులాబీ నేతలు అంటున్నారు. ఈ లెక్కలన్ని బేరీజు వేసుకున్న కేసీఆర్.. ఇలా నరుక్కొస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఢిల్లీలో కేసీఆర్.. అమిత్ షా సహా బీజేపీ పెద్దలను కలవడంతో కాంగ్రెస్ కు అస్త్రం దొరికినట్లైంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అనే వ్యాఖ్యలు ఆరేండ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. కేసీఆర్ తాజా పర్యటనతో ఇది రుజువైందని కాంగ్రెస్ జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. రైతుల బంద్ కు సపోర్ట్ చేసిన కేసీఆర్.. ఢిల్లీ సరిహద్దుకు వెళ్లి అన్నదాతలను కలవకుండా కమలం నేతల సమావేశాలు పెట్టడమేంటనే విమర్శలు వస్తున్నాయి. కేసుల కేసుమే కేసీఆర్ బీజేపీతో రాజీ పడ్డారని, కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన బీజేపీ కూడా ఇప్పుడు ఆయనతో ఫ్రెండ్ షిప్ చేస్తుందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఇవన్ని కాంగ్రెస్ బలపడానికి పనికొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ బలపడితే అంతిమంగా ఆ ప్రయోజనం మళ్లీ కారు పార్టీకే దక్కనుంది. ఈ దిశగానే కేసీఆర్ ఢిల్లీ అడుగు పడిందని భావిస్తున్నారు.
మరోవైపు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేసిన ఘాటు విమర్శల వేడి ఇంకా తగ్గకముందే ఢిల్లీలో కేసీఆర్ కు కేంద్రమంత్రులు అపాయింట్‌మెంట్ ఇవ్వడం తెలంగాణ బీజేపీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది. వరుస గెలుపులతో బీజేపీ బలపడుతున్న సమయంలో ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలు తమకు బ్రేక్ వేసినట్లయిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకాలం టీఆర్ఎస్‌పై చేసిన పోరాటమంతా వృథా అయిందని, ఇకపై రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకుని తిరగాలన్న ఆవేదనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్న సమయంలో పార్టీలో ఇలాంటి సమస్యే వచ్చింది. అధికార పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ యుద్ధం చేస్తూ ఉంటే కేంద్ర మంత్రులు ఇక్కడ పథకాలను ప్రశంసిస్తుండడం, ఢిల్లీలో సమావేశమవుతుండడం పార్టీ ఎదుగుదలకు ఆటంకంగా మారిందని బహిరంగంగానే నేతలు గతంలో ఆవేదన వెలిబుచ్చారు.