400 మంది విద్యార్థుల కిడ్నాప్.. రంగంలోకి ఆర్మీ!
posted on Dec 14, 2020 9:12AM
నైజీరియాలోని ఓ ప్రభుత్వ పాఠశాలపై దాడి చేసిన బందిపోట్లు.. అక్కడ చదువుతున్న 400 మంది విద్యార్థులను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన నైజీరియాలోని నార్త్ వెస్ట్రన్ ప్రాంతం కట్సీనా రాష్ట్రంలో జరిగింది. బందిపోట్ల ముఠా ఆయుధాలతో ‘గవర్నమెంట్ సైన్స్ సెకండరీ స్కూల్’లోకి చొరబడి.. అక్కడున్న విద్యార్థులపై దాడికి దిగింది. మొత్తం 600మంది విద్యార్థులు ఆరోజు పాఠశాలకు హాజరయ్యారని పాఠశాల యాజమాన్యం చెబుతుండగా.. దుండగులు దాడి చేసిన తరువాత 400 మంది విద్యార్థులు కనిపించకుండా పోయారు. తమ బిడ్డలు కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, కిడ్నాప్ అయిన విద్యార్థుల ఆచూకీని కనుగొనేందుకు నైజీరియా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. పోలీసులు కూడా పెద్దఎత్తున కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు.
కాగా, ఆరేళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు ఓ బాలికల పాఠశాలపై దాడి చేసి 276 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. వారిలో 100 మంది బాలికలు తప్పించుకోగా, మిగిలిన వారి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.