కేసీఆర్ ఎత్తుకు బీజేపీ పైఎత్తు..
posted on Dec 14, 2020 9:23AM
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ, టిఆర్ఎస్ ల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగిన సంగతి తెల్సిందే. ఎన్నికల తరువాత రైతుల ఆందోళన నేపథ్యంలో జరిగిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించింది. అటు బంద్ పూర్తి కాగానే కొత్త పార్లమెంట్ శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీని, సీఎం కేసీఆర్ ప్రశంసిస్తూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల సమయంలో ఉప్పు నిప్పుగా ఉన్న టీఆర్ఎస్ బీజేపీ సంబంధాలపై పలువురు సందేహాలు వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా లను కూడా కలవడం విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే సీఎం కేసీఆర్ పర్యటన వెనుక పెద్ద లాజిక్ ఉందని తాజాగా తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత అనూహ్యంగా పెరుగుతుండటం, రాష్ట్రంలో తమ పార్టీ పుంజుకుంటున్న నేపథ్యంలో గులాబీ దళం విషయంలో తమ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని బీజేపీ వర్గాలు చెపుతున్నాయి. ఈ వ్యూహం మేరకు కేసీఆర్ నాయకత్వంపై టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల్లోనే విశ్వాసం సన్నగిల్లే దిశగా పావులు కదుపుతోంది. దీంట్లో భాగంగా, కేసీఆర్‌పై కేసుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. తనపై ఉన్న కేసుల భయంతోనే ఢిల్లీకి కేసీఆర్ వెళ్లారన్నది తెలంగాణ ప్రజల కంటే కూడా ముందు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు గుర్తించాలన్నదే తమ లక్ష్యం అని బీజేపీ నాయకులు చెపుతున్నారు.
మరోపక్క సరిగ్గా ఏడాది కిందట, గత డిసెంబరు మొదటివారంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ లభించలేదని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దానికి భిన్నంగా మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం వెనుక పెద్ద కారణమే ఉందని వారు వివరిస్తున్నారు. ఢిల్లీ బయలుదేరే ముందు ‘‘తనకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవచ్చునని కేసీఆర్ భావించారు. అయితే ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ కొద్దిరోజుల కిందట ప్రధానిని కలుసుకున్నారు. ఈ రెండు కారణాలను సాకుగా చూపి తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందంటూ బద్నాం చేయాలని గులాబీ ముఖ్యనేతలు ప్లాన్ చేసారని బీజేపీ నాయకులు చెపుతున్నారు. అయితే దీనికి సంబంధించి తమకు ముందే ఉప్పందడంతో మా వ్యూహం మార్చాం. ఈసారి అడిగి అడగగానే కేసీఆర్‌కు మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ లు లభించాయి’’ అని బీజేపీ నాయకులు చెపుతున్నారు. తన సొంతపార్టీ ఎమ్మెల్యేలతోపాటు మంత్రులకు సైతం సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, దీనిని తాము హైలైట్ చేయబోతున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ జాతీయ నాయకత్వం కూడా కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే కేసీఆర్ దానిని తమపై ఎదురుదాడికి వాడుకునే అవకాశం ఉంటుందని.. అందుకే, తమపై ఆ అపవాదు రాకుండా జాగ్రత్తపడ్డామని బీజేపీ నాయకులు తెలిపారు. .
దీంతో సీఎం కేసీఆర్ డిల్లీ పర్యటనకు ముందే తమ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించిందని.. దీంతో కేవలం జిమ్మిక్కులు చేయడానికే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని బీజేపీ నాయకులు చెప్తున్నారు, అంతేకాకుండా అయన పర్యటనలో లోన జరిగేదొకటి, బయటకు ఆయన చెప్పేదొకటి ఉంటుందంటూ సీఎం పర్యటన తొలిరోజే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ముందే ప్రకటన చేశారని వారు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా తాజా పరిణామమాలతో సీఎం కేసీఆర్‌కు నిద్రకరువయ్యే ఢిల్లీకి వచ్చారని బీజేపీ కేంద్ర, రాష్ట్ర సమన్వయకర్త బాల్‌రాజ్ వ్యాఖ్యానించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతో ఆయన ఢిల్లీలో చక్కర్లు కొట్టారని తెలిపారు. మజ్లీస్ తో స్నేహం కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్ కు గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో ముందునుయ్యి..వెనుక గొయ్యిలా మారిందని అయన అభిప్రాయపడ్డారు.