కేసీఆర్ కు వరుస షాకులు! అసలు కారణం ఇదేనట?
posted on Dec 12, 2020 @ 3:19PM
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాకుల మీద షాకులు జరుగుతున్నాయి. కొన్ని నెలలుగా పరిపాలనలో ఆయనకు ఏది కలిసి రావడం లేదు. ప్రభుత్వం కొత్తగా తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలన్నిఫెయిలవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెరిగిపోతోంది. మంచి కోసం పోతే తమ కొంప ముంచేలా పథకాలు తయారయ్యాయని అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. అటు పార్టీ పరంగానూ గతంలో ఎప్పుడు లేనంతగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వరుస పరాజయాలతో పార్టీలో అలజడి పెరిగిపోతోంది. సొంత గడ్డలోనూ కేసీఆర్ పై వ్యతిరేకత కనిపించడం కారు పార్టీ నేతలను కలవరపెడుతోంది.
కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు వరుసగా తగులుతున్న షాకులపై ఆసక్తి కర చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. భక్త విశ్వాసాలను పాటిస్తూ యాగాలు, హోమాలు ఎక్కువగా చేస్తారు. అయితే ఆయన చేసిన యాగంలో తేడా వల్లే... ఆయనకు గడ్డు కాలం వచ్చిందనే చర్చ పండితుల నుంచి వస్తోంది. 2019 జనవరి 21వ తేదీన తలపెట్టిన చండీయాగం నుంచే కేసీఆర్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయని చెబుతున్నారు. 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు అనుకున్నదానికంటే ఎక్కువ సీట్లే వచ్చాయి. ఆ సంతోషం, కృతజ్ఞతతోనే 2019 జనవరి 21 నుంచి ఆయన యాగాన్ని నిర్వహించారు. అయితే జనవరి 22వ తేదీన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమారుడు మయాంక్ పెళ్ళి రిసెప్షన్ కార్యక్రమానికి ఢిల్లీకి వెళ్ళారు. ఆ సమయానికి చండీయాగం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీక్ష తీసుకున్న తర్వాత పూర్తిచేయకుండా మధ్యలో ఢిల్లీ వెళ్ళిడం వల్లే ఆయనకు చెడు జరుగుతుందని కొందరు పండితుల మాట.
యాగం మొదలుపెట్టిన తర్వాత అది పూర్తిగా ముగిసేంత వరకు ఆ పరిధి దాటి బైటకు వెళ్ళరాదన్నది నియమం. కానీ కేసీఆర్ ఢిల్లీ వరకు విమానంలో వెళ్ళి వచ్చారు. ఇది యాగ సంప్రదాయానికి విరుద్ధమని వేద పండితులు చెబుతున్నారు. అప్పటి నుంచే ఆయనకు కాలం కలిసి రావడం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. నిజంగానే కేసీఆర్ కు 2019 జనవరి నుంచి కలిసి రావడం లేదు. 2019 మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కూతురు కవిత నిజామాబాద్ ఎంపీగా ఓటమి పాలయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు వస్తాయని చెప్పిన కారు పార్టీ.. అనూహ్యంగా సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలాగా ఉన్న దుబ్బాక అసెంబ్లీ కారు ఫల్టీ కొట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గతంలో కంటే భారీగా నష్టపోయింది టీఆర్ఎస్.
పార్టీ పరంగానే కాక పాలనలోనూ ఏడాదిన్నరగా కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయి. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో రైతు బంధు ఇచ్చినా అన్నదాతల్లో కేసీఆర్ పై వ్యతిరేకత వచ్చింది. గత అక్టోబర్ కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయింది. వందల కోట్ల రూపాయల్లో నష్టం జరిగింది. వరద బాధితులను ఆదుకోవడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. వరద బాధితులకు సాయంగా అందించిన 10 వేల రూపాయల సాయం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సర్కార్ కు ప్రతికూలంగా మారింది. కొత్త రెవిన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్ స్కీం అమలుతో ప్రభుత్వం ప్రజల్లో విలన్ గా మారిపోయిందనే చర్చ జరుగుతోంది.
మొదటి నుంచి కేసీఆర్ ఏ పని తలపెట్టినా పండితుల సలహాలు తీసుకుంటారు. ఆలయాల సందర్శన తర్వాతనే ముందడుగు వేస్తారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే 2015లో ఎర్రవల్లిలోని తన సొంత ఫామ్ హౌజ్‌లో ఆయుత చండీయాగాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 2018లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేముందు అధికారంలోకి మళ్లీ రావాలంటూ రాజశ్యామల యాగాన్ని జరిపించారు. గెలిచిన తర్వాత 2019 జనవరిలోనూ అదే తరహా యాగాన్ని నిర్వహించారు. అయితే ఆ యాగ సమయంలో చేసిన తప్పిదం వల్లే కేసీఆర్ కు గతంలో ఎప్పుడు లేనంతగా సమస్యలు వచ్చాయని పండితులు పక్కాగా చెబుతున్నారు. మళ్ళీ యాగం చేసి పరిహారం సమర్పించుకుంటే తప్ప కేసీఆర్ కు మంచి రోజులు రావంటున్నారు.