ఆ ఒక్కడే ఇద్దరు ముఖ్యమంత్రుల టార్గెట్? ఆ వర్గ నాయకులంతా అటు వైపేనా ? 

ఒక్క  నాయకుడినే  రెండు అధికార పార్టీలు టార్గెట్ చేస్తున్నాయా?   తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ , కేసీఆర్ ఏకమయ్యారా? తమ ఉమ్మడి శత్రువును అణగదొక్కేందుకు  వ్యూహం రచిస్తున్నారా? అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాజా రాజకీయాలను పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తోంది. తమకు మొదటి నుంచి ప్రత్యర్థిగా ఉన్న  ఒక రాజకీయ  నేత రాజకీయ ఎదుగుదలను  అడ్డుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకమయ్యారని తెలుస్తోంది. అతన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఉమ్మడి వ్యూహం పన్నుతున్నారని, అందుకోసం పక్కాగా స్కెచ్ వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టార్గెట్ చేశారని ప్రచారం జరుగుతున్న ఆ రాజకీయ నాయకుడు ఎవరో కాదు.. తెలంగాణ ఫ్రైర్ బ్రాండ్ లీడర్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.   ఇటీవల ఏపీ మంత్రి పేర్ని నాని.. రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్లతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేస్తూ..  స్టేలు తెచ్చుకున్న విషయమై మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు పేర్ని నాని. ‘పొట్టిగా ఉంటాడు.. హడావుడిగా తిరుగుతుంటాడు.. అతడితో రూ.50 లక్షల సూట్ కేసు ఇచ్చి పంపించాడు’..అంటూ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డితో డబ్బులు ఇచ్చి పంపించారని అర్థం వచ్చేలా పేర్ని నాని కామెంట్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేసీఆర్, జగన్ కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే పేర్ని నాని కామెంట్లు చేశారని భావిస్తున్నారు.   గత ఆరేండ్లుగా కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం వల్లే అతనికి క్రేజీ వచ్చిందని చెబుతారు. అటు మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేశారు రేవంత్ రెడ్డి. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి..  అప్పటి వైఎస్సార్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడే వారు. తర్వాత జగన్ పైనా అదే వైఖరిని అవలంభించారు. దీంతో వైసీపీ నేతలు, కేడర్..  తమ రాష్ట్రం కాకపోయినా రేవంత్ రెడ్డిని తమ ప్రత్యర్థిగానే చూస్తారు. దీంతో తమకు కొరకరాని కొయ్యలా మారిన రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్, వైసీపీ ఉమ్మడిగా టార్గెట్ చేస్తున్నాయని చెబుతున్నారు.   ప్రస్తుతం టీపీసీసీ రేసులో ముందున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అతనికే వస్తాయని కేసీఆర్, జగన్ భావిస్తున్నారట.  రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు వస్తే తమకు మరింత ఇబ్బందిగా మారుతారని కేసీఆర్ భావిస్తున్నారు. అదే సమయంలో తమ ప్రత్యర్థికి కీలక పోస్టు రావడం వైసీపీకి ఇష్టం లేదు. అందుకే అతన్ని టార్గెట్ చేస్తూ రెండు పార్టీలు వ్యూహం రచిస్తున్నాయని చెబుతున్నారు.  ఇంతకాలం తెలంగాణ రాజకీయాలను శాసించిన రెడ్లు.. కేసీఆర్ పాలనలో తాము నిర్లక్ష్యానికి గురయ్యామనే భావనలో ఉన్నారు. ఎలాగైనా అధికారం సాధించాలనే కసిలో ఉన్నారు.  వారందరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి అశాకిరణంలా కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు వస్తే తెలంగాలోని రెడ్లంతా ఒక్కటయ్యే అవకాశం ఉంది. ఇది గ్రహించిన కేసీఆర్ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేలా కొత్త వ్యూహం రచిస్తున్నారని చెబుతున్నారు.          తెలంగాణలో దివంగత వైఎస్సార్ కు ఇప్పటికి భారీగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న తెలంగాణ రెడ్డి నేతల్లో ఎక్కువ మంది వైఎస్సార్ వల్ల రాజకీయంగా ఎదిగినవారే. వీళ్లంతా ఇప్పుడు జగన్ రెడ్డితోనూ సత్ససంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో తెలంగాణలో వైసీపీని బలోపేతం చేస్తే కొందరు రెడ్డి నేతలు.. ఆ పార్టీలోకి వెళతారని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. వైఎస్సార్ సెంటిమెంట్ ను రగిలించి కొందరు రెడ్డి నేతలతో కలిసి వైసీపీని బలోపేతం చేస్తే.. ఆ ప్రభావం రేవంత్ రెడ్డిపైనే ఎక్కువగా పడుతుందని ఆయన భావిస్తున్నారట. అందుకే కేసీఆర్ సూచనలతో తెలంగాణ రెడ్డి నేతలతో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నారని చెబుతున్నారు. తెలంగాణలో  వైసీపీ బాధ్యతలను వైఎస్ షర్మిల తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదంతా కేసీఆర్, జగన్ ప్లాన్ లో భాగంగానే జరుగుతున్నాయంటున్నారు.  ఏపీ  సీఎం జగన్ కు  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సత్సంబంధాలున్నాయి. తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత..  జగన్ కు పూర్తి మద్దతు ప్రకటించారు కేసీఆర్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణ చేస్తూ.. జగన్ ను ప్రశంసిస్తూ ప్రకటనలు చేశారు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా కేసీఆర్ ను స్వయంగా కలిసి  ధన్యవాదాలు చెప్పారు. తర్వాత కూడా ఇద్దరు సీఎంలు పలు సార్లు సమావేశమయ్యారు. తనకు పూర్తిగా మద్దతుగా నిలుస్తున్న కేసీఆర్ కోసం.. జగన్ మోహన్ రెడ్డి తెలంగాణలో వైసీపీని బలోపేతం చేయవచ్చని, బలమైన రెడ్డి నేతలంతా రేవంత్ రెడ్డి వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. తమ నేత టీపీసీసీసీ అధ్యక్షుడిగా కాకుండా చేసేందుకు జగన్, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అభిమానులు కూడా ఆరోపిస్తున్నారు.  

జగన్ కు రెబల్ ఎంపీ రఘురామరాజు విషెస్.. సీఎంపై నెటిజన్ల సెటైర్లు

వైసీపీ నరసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు గత కొంతకాలంగా తన సొంత పార్టీపై, అలాగే సీఎం జగన్ పై విరుచుకు పడుతున్న సంగతి తెల్సిందే. అయన సొంత పార్టీ వైసీపీలో విప‌క్ష పాత్ర పోషిస్తున్నారు. ఏ మాత్రం అవ‌కాశం చిక్కినా జ‌గ‌న్, వైసీపీలను టార్గెట్ చేస్తూ ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే ఈరోజు సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎంపీ రఘురామరాజు బర్త్ డే విషెస్ తెలియ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే, అందులో జ‌గ‌న్ ను ట్యాగ్ చేశారు కానీ గారు అని మాత్రం సంబోధించ‌లేదు. పైగా ఆ ట్వీట్ తో పాటు జ‌త చేసిన ఫోటో పై ఇప్పుడు నెటిజ‌న్లు రకరకాల కామెంట్ లు చేస్తున్నారు. కొంద‌రేమో గారు పోయింద‌ని…, మీరు చేయి వదిలించుకోవాల‌నుకుంటున్నా జ‌గ‌న్ విన‌టం లేదు, ప్రాదేయ‌ప‌డుతున్నారుగా… అని మరికొందరు, హ్యాపీ బర్త్ డే ఫేక్ సీఎం అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

బీజేపీపై ఎమ్మెల్యే సీతక్క అదిరిపోయే సెటైర్లు..

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కరోనా కల్లోల సమయంలో గిరిజన ప్రాంతాల ప్రజలను ఆదుకుంటూ సామాన్య ప్రజల మన్ననలను పొందిన సంగతి తెల్సిందే. అదే సమయంలో ఆమె ప్రజల పక్షాన ఉంటూ పలు ఆందోళనలలో కూడా పాల్గొన్నారు. తాజాగా ఆమె మండుతున్న పెట్రోల్ రేట్ల విషయమై బీజేపీ పై అదిరిపోయే సెటైర్లు వేశారు. దీనిపై ఆమె చేసిన తాజా ట్వీట్ అంద‌ర్నీ ఆలోచింప‌జేస్తూ, ఆక‌ట్టుకుంటోంది. ప్రస్తుతం పెట్రోల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. దాదాపుగా ప్ర‌తి రోజు పెట్రోల్ రేటు ఎంతో కొంత పెరుగుతుండ‌డంతో సామాన్య జనం బెంబేలెత్తుతోంది. పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై ములుగు ఎమ్మెల్యే సీత‌క్క క్రికెట్ క్విజ్ ప్ర‌శ్న‌ల‌తో క‌లిపి ట్వీట్ చేసింది... 2021వ సంవ‌త్స‌రంలో ఫ‌స్ట్ సెంచ‌రీ కొట్టేది ఎవ‌రు…? అని సీత‌క్క ప్రశ్న సంధించింది‌. దీనికి స‌మాధానంగా 1. విరాట్ కోహ్లి 2. రోహిత్ శ‌ర్మ అని ఆమె అషన్స్ పోస్ట్ చేసింది. అయితే దీనికి తన ఆన్స‌ర్ మాత్రం పెట్రోల్ ధ‌ర‌లు అంటూ సెటైర్ వేసింది. ఎమ్మెల్యే సీత‌క్క తాజా ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.  

కొత్త స్ట్రెయిన్‌ కరోనా... మళ్ళీ లాక్ డౌన్ వైవు ప్రపంచం అడుగులు!

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని ప్ర‌పంచం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బ్రిట‌న్ లో మ‌రోసారి తీవ్ర క‌ల‌వ‌రం మొద‌లైంది. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ చాల వేగంగా వ్యాపిస్తోందని, దీని ‌‌పై ఇప్పటికే నియంత్రణ కోల్పోయామని.. పరిస్థితి అదుపు తప్పిందని బ్రిటన్ హెల్త్ సెక్రటరీ మాట్ హెన్‌కాక్ వ్యాఖ్యలు చేసారు. ఈ కొత్త కరోనా స్ట్రెయిన్ విజృంభణకు అవకాశమివ్వకూడదని భావించిన యూకే ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్-4ను విధించింది. బ్రిటన్‌తో పాటు దక్షిణాఫ్రికా దేశాల్లో కూడా కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు మరోసారి కలవరపడుతున్నాయి. యూకే నుంచి రాకపోకలు సాగించే ప్యాసింజర్ విమానాలపై భార‌త్ స‌హా యూర‌ప్ దేశాలు విమాన సర్వీసులను వెంటనే నిలిపివేశాయి. ఇది ఇలా ఉండగా క్రిస్మస్ సందర్భంగా లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటన చేసి రోజులు కూడా గడవక ముందే లాక్‌డౌన్ 4ను మరింత కఠినంగా అమలు చేయాల్సిన పరిస్థితి రావడం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.   ఈ కొత్త స్ట్రెయిన్‌ వైరస్ ను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. ఈ కొత్త రకం కరోనా ఎంత వేగంగ వ్యాపిస్తోందంటే తాజాగా అమెరికా తర్వాత నిన్న ఎక్కువ కరోనా కేసులు బ్రిటన్‌లోనే నమోదయ్యాయి. దీంతో ఇన్నాళ్లూ మొదటి పది దేశాలలో అన్నిటికంటే కింద ఉండే బ్రిటన్... ఇప్పుడు టాప్ 2 ప్లేస్ కి వచ్చేసింది. దీంతో ప్రజలు క్రిస్మస్‌కి దూరంగా ఉండాలనీ, ఇళ్లలోనే ఉండాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు. కరోనా వ్యాక్సిన్ దేశమంతా సప్లై అయ్యే వరకూ కొన్ని నెలలపాటూ తాజా నిబంధనలు కొనసాగుతాయని ఆయన అన్నారు.   కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోంది కాబట్టి... మరణాల రేటు మాత్రం ఇప్పటి కంటే ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాలు కూడా మరికొన్ని నెలలపాటూ కఠిన నిబంధనలను కొనసాగించడం మేలంటున్నారు. ఈ కొత్త వైరస్ డిటైల్స్ పూర్తిగా అర్థం కాలేదనీ... అయితే మున్ముందు దీని వివరాలు పూర్తిగా తెలుస్తాయంటున్నారు.

తిరుపతిలో వైసీపీకి షాకే.. తేల్చేసిన ప్రీపోల్ సర్వే? వామ్మో జగన్  పాలనపై ఇంత వ్యతిరేకతా ! 

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో  జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన సీటుకు జనవరిలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రధాన పార్టీలన్ని తిరుపతి ఎన్నికపైనే ఫోకస్ చేశాయి.  అందరి కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ ప్రచారంపై దృష్టి సారించింది. ఉప ఎన్నిక కోసం సమన్వయ కమిటిని కూడా నియమించిన చంద్రబాబు.. తిరుపతిలో విజయానికి పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. అధికార పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే మల్లగుల్లాలు పడుతున్నాయి. సరైన నేతలు లేకపోవడంతోనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. అభ్యర్థి ఎంపికపై ఆలస్యం చేస్తున్నాయని తెలుస్తోంది.   తిరుపతి లో అధికార పార్టీల కంటే టీడీపీలోనే  ఎక్కువ ఉత్సాహం కనిపిస్తోంది. అందుకు కారణం కూడా ఉందంటున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో తెలుగు దేశం పార్టీకే లీడ్ ఉందని తేలిందట.  జగన్ రెడ్డి ఏడాదిన్నర పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేల్లో వచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, యువత, రైతులు, దళితులు .. చివరకి మందుబాబులు కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం వచ్చాకా సామాన్యులపై దాడులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు, అధికార పార్టీ నేతల స్కాములు తప్ప.. ప్రజలకు జరిగిందేమి లేదనే భావనలో మెజార్టీ ప్రజలు ఉన్నారని సర్వే సంస్థలు స్పష్టం చేశాయంటున్నారు. ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీల విషయంలో వైసీపీ నేతల తీరు వివాదాస్పదమైంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు తీరలేదు. గత ఏడాదిన్నరలో కొలువుల భర్తీ కూడా జరగలేదు. దీంతో ఆయా వర్గాలన్ని జగన్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని తేలిందట.  నిజానికి తిరుపతి ఉప ఎన్నికలో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన మొదట టీడీపీలో కనిపించింది. వైసీపీకి పట్టున్న ప్రాంతం  కావడం, సిట్టింగ్ ఎంపీ చనిపోవడంతో సహజంగా సానుభూతి కూడా ఉంటుంది. అధికారంలో ఉండటం కూడా వైసీపీకి కలిసివస్తోంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్న తిరుపతిలో పోటీ ఇవ్వగలమా అన్న చర్చ కూడా టీడీపీ నేతల్లో జరిగిందట. తిరుపతిలో వైసీపీ, బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే తిరుపతిలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కరోనాకు చికిత్స తీసుకుంటూ చెన్నై ఆస్పత్రిలో చనిపోయారు బల్లి దుర్గాప్రసాద్. అయితే దుర్గాప్రసాద్  కుటుంబాన్నిఇంతవరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించలేదు. ఇదీ ఇప్పుడు తిరుపతిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ నేత ఇలా వ్యవహరించలేదని జనాలు మాట్లాడుకుంటున్నారు. పార్టీ నేతలు అనారోగ్యం పాలయితేనే.. వారి యోగక్షేమాల గురించి పార్టీ పెద్దలు టెన్షన్ పడుతుంచారు. అలాంటిది ఒక ఎంపీ చనిపోతే.. ఆయన పార్టీ అధ్యక్షుడు, సీఎం హోదాలో ఉన్న జగన్ వారితో కనీసం మాట్లాడకపోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.  తిరుపతిలో ఎస్సీ ఓటర్లు  భారీగా  ఉంటారు. జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. చిత్తూరు జిల్లాలోనూ దళితులపై చాలా ప్రాంతాల్లో దాడులు జరిగాయి. దళితులకు వైసీపీ నేతలు శిరోముండనం వేయించిన ఘటనలు వెలుగుచూశాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర్లోని సీతానగరం పోలీస్ స్టేషన్లో ఒక దళిత యువకుడికి.. ఇన్‌చార్జి ఎస్సై  ట్రిమ్మర్ తో గుండు చేయించిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది.  అనంతపురం జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన జడ్జీ రామకృష్ణ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. దళిత జడ్జీ ఫ్యామిలీకే రక్షణ లేదంటే.. ఏపీలో  సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. దళితులపై జరిగిన, జరుగుతూనే ఉన్న దాడులతో .. ఆ సామాజిక వర్గంతా వైసీసీపైనా,  సీఎం జగన్ పైనా ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నారని, లోక్ సభ ఉప ఎన్నికల్లో అది చూపించబోతున్నారని చెబుతున్నారు.  మందుబాబులు కూడా జగన్ సర్కార్ పై రగిలిపోతున్నారని తెలుస్తోంది.  కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. లిక్కర్ రేట్లను భారీగా పెంచింది. రేటు పెరిగితే మద్యం తాగడానికి జనాలు భయపడతారని.. అందురే రేట్లు పెంచామనే కవరింగ్ ఇచ్చుకుంది. అయితే ఇప్పుడు లిక్కర్ సేల్స్ నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంది. పెరిగిన రేట్లతో తాము రోజంతా కష్టపడి సంపాదించినదంతా లిక్కర్ కే పోతుందని మందు బాబులు ఆరోపిస్తున్నారు. సర్కార్ ఆదాయం కోసమ తమను దోచుకుంటుందని వారంతా మండిపోతున్నారు. రైతులు కూడా వైసీపీ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. కాని వరదలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంతో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. వరద బాధితులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. అంతేకాదు కష్టాల్లో ఉన్న తమను కనీసం పరామర్శించడానికి  కూడా వైసీపీ నేతలు రాలేదని ఆరోపిస్తున్నారు రైతులు. ఇవన్ని తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీని నష్టం కలిగించబోతున్నాయని చెబుతున్నారు.   మొత్తానికి  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై వచ్చిన ప్రీపోల్ సర్వే ఫలితాలతో టీడీపీకి  మరింత బూస్ట్ వచ్చిందని చెబుతున్నారు.  దీంతో తమ్ముళ్లు మరింత ఉత్సాహంగా పని చేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకే టీడీపీ అభ్యర్థిగా ఖరారైన మాజీ ఎంపీ పనబాక లక్ష్మి కూడా తాను విజయం సాధించడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు.  మరోవైపు తాము నిర్వహించిన సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు రావడం వల్లే అభ్యర్థుల ఎంపికలో వైసీపీ, బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా అన్ని అనుకూలతలే ఉండటంతో జగన్  రెడ్డి సర్కార్ ఏడాదిన్నర పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పుగా తిరుపతి ఉపఎన్నికను మలుచుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.

దీన్ని కరోనా వ్యాక్సిన్ అంటారా.. అమ్మకాలు ఆపేయండి ! బాబా రామ్ దేవ్‌ కు బ్రిటన్ షాక్ 

ప్రముఖ యోగా గురువు , పతంజలి బాబా రామ్ దేవ్ కు బ్రిటన్ ప్రభుత్వం షాకిచ్చింది.  పతంజంలి ఆయుర్వేద సంస్థ కరోనిల్ కిట్ అమ్మకాలను నిషేదించింది. కరోనిల్ కిట్లను మ్మితే చర్యలు తీసుంటామని  బ్రిటన్ వైద్య ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్ఆర్ఏ) హెచ్చరికలు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా కరోనిల్ కిట్ ఎలా అమ్ముతారంటూ ఘాటుగా ప్రశ్నించింది. బాబా రామ్ దేవ్ కు చెందిన పతంజంలి ఆయుర్వేద సంస్థ కరోనిల్ కిట్ రూపొందించింది.   జూన్ 23న ఇండియాలో బాబా రామ్ దేవ్ ఈ కిట్లను విడుదల చేశారు. తాజాగా ఈ కిట్లను బ్రిటన్ లో అమ్మకాలు ప్రారంభించింది  పతంజలి సంస్థ. కరోనిల్ కిట్ పేరుతో ఇదే కరోనా వ్యాక్సిన్ అంటూ బ్రిటన్ లో ఆ సంస్థ అమ్మకాలు చేస్తోంది. పతంజలి అమ్మకాలపై ఎంహెచ్ఆర్ఏ ఆగ్రహం వ్యక్తం చేసింది.  కరోనిల్ కిట్లపై యూకే బర్మింగ్ హోమ్ యూనివర్సిటీ పరిశోధనలు చేసింది. కరోనిల్ కిట్ కరోనాని నయం చేస్తుందా అన్న అంశంపై సైంటిస్ట్ లు ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల్లో యూకేలో అమ్ముతున్న పతంజలి సంస్థకు చెందిన కరోనిల్ రోగనిరోధక శక్తిని పెంచడంలేదని, వృక్ష సంబంధిత పదార్థాలతో చేసిన ఈ కరోనా నిల్ కిట్ వల్ల ఎలాంటి ఫలితాలు లేవని బర్మింగ్ హోమ్ యూనివర్సిటీ సైంటిస్ట్ వైరాలజిస్ట్ డాక్టర్ మైత్రేయి శివకుమార్ చెప్పారు. దీంతో కరోనిల్ కిట్ల అమ్మకాలను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బ్రిటన్ వైద్య ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ.   

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అరెస్టు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ఎంపీ వి హనుంతరావును పోలీసులు అరెస్ట్ చేశారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది కాంగ్రెస్. అందులో భాగంగా వరంగల్ లో జరుగుతున్న రైతుల ధర్నాలో పాల్గొనేందుకు వెళుతుండగా వీహెచ్ ను పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ సరిహద్దులోని పెంబర్తి వద్ద హనుమంతరావును అదుపులోనికి తీసుకున్న పోలీసులు...  అక్కడి నుంచి ఆయనను వ్యానులో లింగాల ఘనపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వరంగల్ వెళుతున్న తనను పోలీసులు అరెస్ట్ చేయడంపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి.. రైతులను మోసం చేస్తున్నారని మండి పడ్డారు వి హనుమంతరావు. 

ఏపీ సీఎం జగన్ కు ప్రధాని మోడీ స్పెషల్ బర్త్ డే విషెస్ 

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తన 48 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అయనకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, లోక్ సభ స్పీకర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. "ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని మోడీ తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు. ప్రధానితోపాటు మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ.. "ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాభినందనలు. సుదీర్ఘకాలం పాటు మీరు ఆరోగ్యంతో ఉండాలని.. భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా" అన్నారు.   ఇక లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ మరియు దేశ ప్రజల సేవలో మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షిస్తున్నాను" అని తన ట్విట్టర్ అకౌంట్ లో తెలుగులో ట్వీట్ పెట్టారు.

అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని కుప్పకూలిన నర్సు.. 

కరోనా మహమ్మారితో సతమతమౌతున్న అమెరికాలో వైరస్ వ్యాప్తి నుండి ప్రజలను కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో అక్కడ వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టెన్నిస్సీలోని ఓ నర్సు కు ఫైజర్ టీకా ఇచ్చిన కొద్దిసేపటికే ఆమె కుప్పకూలడం ఆందోళనకు గురిచేసింది.    ఫైజర్ బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ కరోనా వ్యాక్సిన్ కు ఇటీవలే అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి. దీంతో అమెరికా వ్యాప్తంగా వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చట్టనూగాలోని సీహెచ్ఐ మెమోరియల్ ఆసుపత్రి హెడ్ నర్సు టిఫానీ డోవర్‌కు మొదటి వ్యాక్సిన్ షాట్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఆమె ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పిన ఆమె ఒక్కసారిగా తలపట్టుకుని ‘‘క్షమించండి, నాకు అసౌకర్యంగా అనిపిస్తోంది’’ అని చెబుతూనే కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో ఈ సమావేశాన్ని కవర్ చేస్తున్నమీడియా కెమెరాలు ఈ దృశ్యాన్ని చిత్రీకరించాయి. అయితే పక్కనే ఉన్న వైద్య సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం టిఫానీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఏ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రైతుల పోరాటానికి ఆరెస్సెస్ మద్దతు? మోడీ సర్కార్ దిగిరావాల్సిందేనా? 

కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం ఉధృతమవుతోంది.  కేంద్రం దిగొచ్చేవరకు ఎన్ని రోజులైనా ఉద్యమం చేస్తామని  స్పష్టం చేస్తున్నారు అన్నదాతలు. ఢిల్లీ సరిహద్దులో  జరుగుతున్న  ఆందోళనకు రోజురోజు మద్దతు పెరుగుతోంది. వేలాది మంది రైతులు కొత్తగా ఉద్యమంలో కలుస్తుండటంతో ఢిల్లీ, హర్యానా సరిహద్దు ఇప్పుడో యుద్దభూమిగా మారింది. ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాలు తేల్చి  చెబుతుండగా.. అటు కేంద్ర సర్కార్ కూడా పంతం వీడటం లేదు.  రైతు సంఘాల్లో చీలిక తెచ్చి అందోళన విమరించేలా ప్లాన్ చేస్తుందనే ఆరోపణలు మోడీ సర్కార్ పై వస్తున్నాయి. అందుకే ఖలీస్తానీయులు,మావోయిస్టులు రైతు ఉద్యమంలో చేరారని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని చెబుతున్నారు.      అయితే రైతుల మహా పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పదనే చర్చ ప్రస్తుతం ఢిల్లీలో జోరుగా జరుగుతోంది. ఇందుకు బలమైన కారణం ఆరెస్సెసే అంటున్నారు. రైతులు చేస్తున్న పోరాటానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆరెస్సెస్ అనుబంధ రైతు సంఘం కూడా బహిరంగంగానే రైతుల ఆందోళనను సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.  కొత్త వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తెచ్చినప్పుడు కూడా కొందరు ఆరెస్సెస్ నేతలు ఆ బిల్లులను వ్యతిరేకించారు. కొత్త చట్టాలతో  రైతులకు ప్రయోజనం లేదని, బడా వ్యాపారులకే మేలు చేసేలా  రూపొందించారని వారు వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా వారంతా అదే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. రైతుల ఆందోళన విరమించేలా చర్యలు తీసుకోవాలని, కొత్త చట్టాల్లో సవరణలకు చర్యలు చేపట్టాలని ఆరెస్సెస్ పెద్దల నుంచి కేంద్రానికి సందేశాలు వస్తున్నట్లు చెబుతున్నారు.  కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై బీజేపీ కూడా రెండుగా చీలిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు  కొత్త బిల్లుల్లో సవరణలు చేయడానికి ఏ మాత్రం సుముఖంగా లేరని చెబుతున్నారు. గుజరాత్ నేతలు కూడా మోడీ, అమిత్ షా బాటలోనే ఉన్నారట. మిగితా మెజార్టీ కాషాయ నాయకులు మాత్రం  అన్నదాతల పోరాటంపై కొంత సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. మహారాష్ట్ర బీజేపీ నేతలు బిల్లుల్లో సవరణ చేయాలని ఇప్పటికే కేంద్రం పెద్దలకు చెప్పేశారట. నాగపూర్ అరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో తో దగ్గరి సంబంధాలు ఉండే కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ప్రధానితో ఈ విషయం చెప్పినట్లు బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. వ్యవసాయ రైతులు ఎక్కువగా ఉండే పశ్చిమ బెంగాల్, హర్యానా, పంజాబ్ బీజేపీ నేతలు కూడా బిల్లులపై సంతృప్తిగా లేరని, కాని పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడలేక మౌనంగా ఉంటున్నారని  తెలుస్తోంది. ఇక పంజాబ్ బీజేపీ నేతలైతే కొత్త చట్టాలతో తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉన్నారట. ఉత్తరాది రాష్ట్రాల బీజేపీ రైతు నేతలు కూడా కొత్త వ్యవసాయ బిల్లుల్లో సవరణ చేస్తేనే బెటరని సూచిస్తున్నారని చెబుతున్నారు.     రైతులు తమ  పట్టు వీడకుండా ఉద్యమం కొనసాగిస్తుండటం, రోజురోజుకు ఆందోళనకు మద్దతు పెరుగుతుండటం, ఆర్సెస్సెస్ ఒత్తిడితో కేంద్ర సర్కార్ ఇక  దిగిరాక తప్పదని తెలుస్తోంది. రైతులతో పూర్తి స్థాయి చర్చలకు  కేంద్ర సర్కార్ సిద్ధమవుతుందని.. ప్రధాని మోడీనే స్వయంగా రైతు సంఘాల నేతలతో మాట్లాడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమంతో మోడీ సర్కార్ పై దేశ వ్యాప్తంగా కొంత వ్యతిరేకత పెరిగిందని రాజకీయ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆ డ్యామేజీ కంట్రోల్ చర్యల్లో భాగంగా ప్రధాని మోడీనే రైతులతో మాట్లాడి.. వాళ్లను ఒప్పించి ఆందోళన విరమింప చేస్తారని వారు భావిస్తున్నారు.  దీంతో రైతుల్లో తనపై వచ్చిన వ్యతిరేకతను ప్రధాని నరేంద్ర మోడీ కొంత వరకు తగ్గించుకునే ఛాన్స్ ఉందంటున్నారు. బీజేపీ హైకమాండ్ కూడా అలానే ముందుకు వెళ్లవచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

రేవంత్ రెడ్డికి  పీసీసీ ఇస్తే కోమటిరెడ్డి కొత్త పార్టీ? కేసీఆర్ అలా నరుక్కొస్తారా? 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్ష పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలో ఎవరో ఒకరికి పీసీసీ పగ్గాలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే  తెలంగాణ  పీసీసీ ప్రకటన తర్వాత కాంగ్రెస్ లో కీలక మార్పులు ఉంటాయని, రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలన పరిణామాలు జరుగుతాయని భావిస్తున్నారు. టీపీసీసీ ఎంపికను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్.. తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.  ఇటీవల ఎదురైన వరుస పరాజయాలతో షాకైన కేసీఆర్.. తనదైన ఎత్తులతో ప్రత్యర్థులకు ఝలక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికే ఖాయమవుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఢిల్లీ నుంచి ఆయనకు సంకేతాలు వచ్చాయంటున్నారు. అందుకే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఆయన మనుషులు టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. పీసీసీ పదవి దక్కని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కొత్త పార్టీ పెట్టించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కోమటిరెడ్డితో కేసీఆర్ సన్నిహితులు మాట్లాడారని కూడా చెబుతున్నారు. కోమటిరెడ్డికి మొదటి నుంచి కేసీఆర్ తో మంచి సంబంధాలున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో పలు ప్రాజెక్టు పనులు కోమటిరెడ్డి బ్రదర్స్ కంపెనీలు చేస్తున్నాయని చెబుతున్నారు. రాజకీయంగా కేసీఆర్ పై కోమటిరెడ్డి ఆరోపణలు చేస్తారు కాని అంతర్గతంగా ఇద్దరి మధ్య డీల్స్ నడుస్తాయని రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో టాక్ ఉంది. అందుకే కోమటిరెడ్డితో కొత్త పార్టీ పెట్టించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.    తమతో మంచి సంబంధాలున్న కోమటిరెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకోకుండా.. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టించడం వెనక భారీ వ్యూహం ఉందంటున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్  కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి . ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై ఆయన చేసే ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళుతున్నాయి. కేసీఆర్ పై చేస్తున్న పోరాటం వల్లే రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగిపోయిందని చెబుతారు. అలాంటి రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు వస్తే తమకు మరింత ఇబ్బంది అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ కేడర్ కూడా యాక్టివ్ అవుతుంది. అలా కాకుండా చేసేందుకే కోమటిరెడ్డితో కేసీఆర్ .. కొత్త పార్టీ ఎత్తు వేస్తున్నారని చెబుతున్నారు. కోమటిరెడ్డి పార్టీ పెడితే .. ఆయనతో కొందరు కాంగ్రెస్ నేతలు వెళతారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న సీనియర్ నేతలు కోమటిరెడ్డికి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు తనకు కోవర్టులుగా ఉన్న కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలను కూడా కేసీఆరే  కోమటిరెడ్డితో పంపించవచ్చని కూడా చెబుతున్నారు.   మొత్తంగా కోమటిరెడ్డితో పార్టీ పెట్టించడం ద్వారా  కాంగ్రెస్ ను చీల్చి రేవంత్ రెడ్డికి బలం తగ్గించడం, ప్రజా వ్యతిరేకత ఓట్లు మొత్తం ఒకవైపే వెళ్లకుండా చూడవచ్చని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డితో విభేదించే కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలోకి వెళ్లకుండా  కోమటిరెడ్డితో వెళతారని గులాబీ బాస్ లెక్కట.దీంతో బీజేపీలోకి వలసలు తగ్గించడంతో పాటు కాంగ్రెస్ బలపడకుండా చూడవచ్చనది కేసీఆర్  స్కెచ్ అని తెలుస్తోంది. అయితే కోమటిరెడ్డి పార్టీ పెట్టినా ఆయనతో ఎంత మంది కాంగ్రెస్ నేతలు వెళతారన్నది ఊహించడం కష్టమే. కాంగ్రెస్ చీలితే.. కొందరు నేతలు బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ కాకపోవచ్చని, అంతిమంగా అది కూడా బీజేపీకి ప్లస్ కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జయప్రకాశ్ నారాయణకు గవర్నర్ పదవి! తీసుకోవడానికి సిద్ధంగా లేనన్న జేపీ 

లోక్ సత్తా అధినేత,  రిటైర్డ్ ఐఏఎస్, మాజీ ఎమ్మెల్యే  జయప్రకాశ్ నారాయణకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవిని ఇవ్వబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గవర్నర్ పోస్టు పై అతనితో కేంద్రం పెద్దలు సంప్రదింపులు జరిపారని కూడా చెబుతున్నారు. అయితే తనపై వస్తున్న ప్రచారంపై స్పంందించారు జయప్రకాశ్ నారాయణ.  గవర్నర్ పదవిని స్వీకరించడానికి తాను సిద్ధంగా లేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మేలు జరిగేలా, సమాజాన్ని మార్చేందుకు ఏ సంస్థ,  ఏ రాజకీయ పార్టీ  ప్రయత్నించినా  తాను వారికి మద్దతుగా ఉంటానని జేపీ చెప్పారు.          రాజకీయాలకు తాను వ్యతిరేకం కాదన్న జయప్రకాశ్ నారాయణ.. రాజకీయాల ద్వారా మార్పును తీసుకొచ్చేందుకు  తన వంతు ప్రయత్నం చేశానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను తాను స్వాగతించానని చెప్పారు. ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న వైఖరిని కూడా తాను సమర్దించానని జేపీ తెలిపారు. పదవులు ఆశించి తాను అలా వ్యవహరించలేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేలా  ఉంటే తాను వాటికి మద్దతుగా మాట్లాడుతానని,  సరిగా లేవని భావిస్తే ధైర్యంగా వ్యతిరేకిస్తానని చెప్పారు జయ ప్రకాశ్ నారాయణ.

సామాజిక న్యాయమా నీవెక్కడ? జగన్ 'రెడ్డి' పాలనలో కుదరదా?  

సామాజిక న్యాయమే మా లక్ష్యం .. బడుగు, బలహీన వర్గాల అభివృద్దే మా ధ్యేయం.  ఇది రాజకీయ నాయకులు ఎప్పుడు వినిపించే నినాదం. అధికారంలోకి వచ్చేందుకు వీటినే ఎక్కువగా  ఉపయోగిస్తారు. పవర్ లోకి వచ్చాకా మాత్రం అంతా మర్చిపోతారు. తాము పాలన చేపట్టడానికి ఉపయోగి పడిన సామాజిక న్యాయం నినాదం అటకెక్కి.. తన సామాజిక వర్గ అభివృద్దే పాలకులకు ప్రధానమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎంతగా అంటే ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టుల్లో బడుగు, బలహీన వర్గాల లెక్క చూస్తే.. అసలు వాళ్లు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. అంతటా ఒక్క సామాజిక వర్గ ఆధిపత్యమే. అధికారం, నిధులు ఉన్న పదవులన్ని ఆ వర్గ సొంతమే. కొన్ని ప్రజా సంఘాలు. విపక్ష పార్టీలు ఇస్తున్న లెక్కలు చూస్తే ఏపీలో సామాజిక న్యాయం అన్న పదానికి అర్ధమే లేకుండా పోయిందని తెలుస్తోంది. సామాజిక న్యాయానికి  జగన్ 'రెడ్డి' పాలనలో స్థానం లేదనే విమర్శలు వస్తున్నాయి.  వైసీపీ ప్రభుత్వం వచ్చాకా  నియమించిన యూనివర్శిటీ వీసీల్లో 83 శాతం, ప్రభుత్వ సలహదారుల్లో 71 శాతం పదవులు ఒక సామాజిక వర్గానికే  ఇచ్చారు. ఏపీలో నామినేటెడ్‌ పదవులు 712 ఉండగా.. వీటిలో దాదాపు 90 శాతం ఒక సామాజిక వర్గానికే దక్కాయి. అతి ముఖ్యమైన టీటీడీలో మొత్తం 36 మంది సభ్యులుంటే అందులో 11 మంది రెడ్లు, ముగ్గురు బీసీలు ఉన్నారు. రాష్ట్రంలోని 12 మంది వైస్ ఛాన్స్ లర్లలో  10 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఒకటి మాత్రమే బీసీకి ఇచ్చారు. 24 మంది ప్రభుత్వ సలహాదారుల్లో 17 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు..ఒకరు బీసీ. ప్రభుత్వ న్యాయవాదులు 30 మంది ఉంటే.. 16  మంది సీఎం సామాజిక వర్గం వారే.  యూనివర్సిటీ సెర్చ్‌ కమిటీల్లో 12 మంది ఉంటే 9  రెడ్లకు, ఒకటి  బీసీకి ఇచ్చారు. ఏపీలో ఇలా ఎక్కడ చూసినా  కీలక పదవుల్లో బీసీలెవరు కనిపించడమే లేదు. రాజధానిపై వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి..ఇలా అంతా ఒక వర్గంతోనే నింపేశారు.   గత టీడీపీ హయాంలో నామినేటెడ్ పోస్టుల్లో సింహభాగం బడుగు, బలహీన వర్గాలకే ఇచ్చారు.  విశ్వవిద్యాలయాల వీసీ పదవుల్లో మెజార్టీ బీసీ వర్గాల వారినే నియమించారు. టీటీడీ  విషయానికి వస్తే చైర్మన్‌గా సుధాకర్‌ యాదవ్‌, ఈవోగా అనిల్‌ సింఘాల్‌, జేఈవోగా శ్రీనివాసరాజును నియమించారు. వీరెవరు అప్పడి ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారు కాదు. అత్యంత కీలకమైన ఏపీఐఐసీ, టీటీడీ, తుడా చైర్మన్ల పదవులను బీసీలకు ఇచ్చింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. నిజానికి బీసీల జీవితాలను మార్చేస్తాను.. నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి వారి జీవితాలను ఉద్ధరిస్తానని ఎన్నికల్లో  ప్రచారం చేసుకున్నారు జగన్. కాని అధికారంలో వచ్చాకా మాత్రం ఆ మాటే మర్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి. అధికారం, నిధులు ఉన్న జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ చైర్మన్లు, మేయర్లు, పురపాలక చైర్మన్లు, సర్పంచ్‌లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్ల స్థానాలకు సంబంధించి బీసీ కోటాను తగ్గించి... 16,800 బీసీ  పదవులకు జగన్ సర్కార్ కోత పెట్టింది.   అధికారం, నిధులు ఉన్న పదవులు బీసీలకు దక్కకుండా కోత పెట్టి.. ఉత్సవ విగ్రహాల్లా ఉండే బీసీ కార్పొరేషన్లకు ఏర్పాటు చేసి జగన్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. నేతిబీరలో నెయ్యి లేనట్లు.. నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటుచేసి నిలువునా వంచిస్తున్నారని జగన్ పై మండిపడుతున్నారు బడుగు, బలహీన వర్గాల నేతలు నేతలు. 50 శాతం జనాభా ఉన్న బీసీలు నామినేటెడ్‌ పోస్టులకు పనికిరారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్‌ పాలనలో సామాజిక న్యాయం లేదని, కీలక పదవులన్ని రెడ్లకే ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీసీ జీవితాలను ఉద్ధరిస్తానంటూ ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చాక వారిపై కత్తివేటు వేస్తున్నారని ధ్వజమెత్తుతున్నాయి. 

ఎమ్మెల్యే వంశీ సాక్షిగా తన్నుకున్న వైసీపీ నేతలు.. 

కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీలో ఉన్న పలు గ్రూపుల కారణంగా ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి గ్రామంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ సాక్షిగా పార్టీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఎమ్మెల్యే వంశీ పర్యటన సందర్భంగా ఈ గొడవలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే వంశీ ఈరోజు కొన్ని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనగా ఇక్కడ వైసీపీ నాయకులు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడులకు స్థానికంగా పార్టీలో ఉన్న వర్గవిబేధాలే కారణంగా తెలుస్తోంది.

దివ్యాంగ వాలంటీర్ అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?..

ప్రకాశం జిల్లా ఒంగోలులో వార్డు వాలంటీర్‌ గా పనిచేస్తున్న దివ్యాంగురాలు ఉమ్మనేని భువనేశ్వరి (22) అనుమానాస్పదంగా మృతిచెందారు. దశరాజుపల్లి రోడ్డులోని చిన్నవెంకన్న కుంట వద్ద తన మూడు చక్రాల సైకిల్‌ పైన ఆమె సజీవ దహనమైంది. ఎవరో తగలబడుతున్నారన్న సమాచారంతో  పోలీసులకు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలార్పారు. అప్పటికే ఆమె మృతి చెందింది. ఘటనా స్థలంలోని హ్యాండ్‌ బ్యాగ్‌ లో ఉన్న ఆధారాల ద్వారా ఆమె ఉమ్మనేని భువనేశ్వరి గా గుర్తించారు.   భువనేశ్వరి నగరంలోని 12వ వార్డు సచివాలయంలో వాలంటీర్‌గా పని చేస్తోంది. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. అక్క మానసిక వికలాంగురాలు. భువనేశ్వరి తల్లి జానకి బుక్‌షాప్‌లో పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లను పెంచింది. తన బిడ్డను ఎవరో హత్య చేసుంటారంటూ జానకి సంఘటన స్థలానికి వచ్చి భోరున విలపించింది. తన కుమార్తె ఎంతో ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకొని ఉండదని.. ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది.    అయితే భువనేశ్వరి వాట్సాప్‌ స్టేటస్ ఆధారంగా ఆత్మహత్యగా భావిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇక తన వాట్సాప్‌ పని చేయదని, ఎవరూ మెసేజ్ లు పంపవద్దని అందులో ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు వాలంటీర్‌ అంతదూరం ఎందుకు వెళ్లింది, ఆమె చివరగా ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడింది.. తదితరాల వివరాల కోసం పోలీసులు కాల్‌డేటా సేకరించే పనిలో ఉన్నారు. 

టెస్టు చరిత్రలో టీమిండియా  అత్యంత చెత్త రికార్డు! 

పింక్ బాల్ టెస్ట్‌లో టీమ్ ఇండియా చెత్త రికార్డు సృష్టించింది. బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులే ఆలౌటైంది. టెస్టుల్లో టీమ్ ఇండియాకు ఇదే అత్యల్ప స్కోర్ . 1974లో ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 42 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దాని తర్వాత ఇదే అత్యల్ప స్కోర్. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్సులో ఒక్క బ్యాట్స్‌మాన్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్. ముగ్గురు భారట బ్యాట్స్ మెన్లు డకౌట్ అయ్యారు.  ఓవర్ నైట్ స్కోర్ 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది.  బ్యాట్స్‌మెన్ పోటాపోటీగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 15 పరుగుల వద్ద వరుసగా నాలుగు వికెట్లు పడ్డాయి. నైట్ వాచ్‌మాన్ జస్ప్రిత్ బుమ్రా (2) కమ్మిన్స్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే చతేశ్వర్ పుజార (0) కూడా కమ్మిన్స్‌ బౌలింగ్‌లోని కీపర్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. జోష్ హాజెల్‌వుడ్ ఒకే ఓవర్లో మయాంక్ అగర్వాల్ (9), అజింక్య రహానే (0)ను అవుట్ చేశాడు. మరో నాలుగు పరుగులు జోడించిన తర్వాత విరాట్ కోహ్లీ (4) కమ్మిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. హనుమ విహారి (8), వృద్దిమాన్ సాహ (4), రవిచంద్రన్ అశ్విన్ (0) కూడా వెంటవెంటనే అవుటయ్యారు. పాట్ కమ్మిన్స్ వేసిన ఒక బంతి మహ్మద్ షమి చేతికి తగిలి గాయపడటంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగడంతో టీమ్ ఇండియా 36/9 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ముగించింది.      ఆసిస్ బౌలర్లలో  జోష్ హాజెల్‌వుడ్ 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ టెస్టులోనే అతను 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు.  కమిన్స్ నాలుగు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 244 పరుగులు చేయగా  ఆస్ట్రేలియా 191 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్ లో  కోహ్లీ సేన ఘోరంగా విఫలం కావడంతో ఆస్ట్రేలియా  90 పరుగులు చేస్తే ఈ టెస్ట్ మ్యాచ్ ను గెలుచుకుంటుంది.   

పోలీసులకే రక్షణ కరువైంది.. పోలీసులపై వైసీపీ నేతల దౌర్జన్యం!

విశాఖలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. మూడు రాజధానులకు ముద్దతుగా తూర్పు నియోజకవర్గం సమన్వయ కర్త విజయనిర్మల ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయం ముట్టడికి యత్నించడంతో పాటు.. ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంతో పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగి.. వైసీపీ నేతలు సీఐను తోసేశారు. దీంతో ఆయన తలకు తీవ్రగాయమైంది. వైసీపీ నేతల వ్యవహారశైలిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల తీరును చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ కరువైందని అన్నారు.   ఈ ఘటనపై స్పందించిన టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు పోలీసులపై దాడి చేసినా అసలేం జరగనట్టు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. "తన్నులు తిని వైసీపీ వాళ్ళతో మసాజ్ చేయించుకున్నాం అని చెప్పడానికి సిగ్గుగా లేదా?.. పోలీసు శాఖ ఆత్మగౌరవాన్ని వైఎస్ జగన్ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టకండి" అని విరుచుకుపడ్డారు. అధికార పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి కొంత మంది పోలీసులు పూర్తిగా దిగజారిపోతున్నారు అని మండిపడ్డారు. "వైసీపీ గూండాల దాడిలోనే పోలీస్ గాయపడ్డారు. వైసీపీ నాయకులు పోలీసుల పై చేసిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు బయటపెట్టే ధైర్యం మీకు ఎలాగో లేదు అందుకే నేను విడుదల చేస్తున్నా" అంటూ లోకేష్ దాడికి సంబంధించి వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

ఢిల్లీ సరిహద్దుల్లో  రైతుల పోరాట సేద్యం! తిండి కోసం అక్కడే  కూరగాయల సాగు! 

కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం ఉధృతమవుతోంది. తమ ఆందోళన 24వ రోజుకు చేరినా  అన్నదాతల్లో ఏమాత్రం అలసట కనిపించడం లేదు. ఇప్పటివరకు 25 మంది రైతులు చనిపోయారని చెబుతున్నారు. ఉద్యమంలో పాల్గొంటూనే వందలాది మంది రైతులు అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. అయినా ఉద్యమం నుంచి వెనుకంజ వేయడం లేదు కర్షకులు. కేంద్రం దిగొచ్చేవరకు ఎన్ని రోజులైనా, అవసరమైతే నెలలైనా అక్కడే ఉంటాయమని స్పష్టం చేస్తున్నారు. రైతుల ఆందోళనకు రోజురోజు మద్దతు పెరుగుతోంది. వేలాది మంది కొత్తగా వచ్చి వారితో జత కలుస్తున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో మొదట వందల్లో మొదలైన ఆందోళన ఇప్పుడు లక్షల్లోకి చేరింది.  ఢిల్లీ, హర్యానా సరిహద్దులో ఎక్కడ చూసినా పోరాట యోధులే కనిపిస్తున్నారు.  ఢిల్లీ సరిహద్దులో  చేస్తున్న రైతుల పోరాటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ సంస్థలు దృష్టి సారించాయి.  లక్షలాది మంది రైతులు రోడ్లపైకి వచ్చి ఇన్ని రోజులుగా ఎలా పోరాటం చేస్తున్నారు.. వారికి తిండి ఎలా వస్తోంది.. కనీస సౌకర్యాల మాటేంటి. ఇవే ఇప్పుడు రైతుల మహా పోరాటంపై వస్తున్న ప్రశ్నలు. అయితే తమ పోరాట కేంద్రాలుగా మారిన ఢిల్లీ సరిహద్దుల్లో పల్లెలనే నిర్మించారు రైతులు.  సింఘా వద్ద ఒక పెద్ద గ్రామాన్నే స్పష్టించారు. సింఘాకు 10-15 కిలోమీటర్లు దూరం నుంచే ఈ కొత్త పల్లె ఆనవాళ్లు కనపడుతున్నాయి.   రోజువారీ ఆహారం కోసం గోధుమ పిండి, నూనెల వంటివి సేకరించి ఇక్కడ నిల్వ చేసుకుంటున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్న నిత్యావసరాలను రాబోయే రోజుల కోసం భద్రంగా దాచుకుంటున్నారు. ఉద్యమ క్షేత్రం మధ్యలో పోరాట సేద్యం చేస్తున్నారు రైతులు. రోడ్డుపక్కన ఖాళీ స్థలంలోనే కూర గాయాలు సాగు చేస్తున్నారు. కొత్తిమీర, పుదీనాతో పాటు రకరకాల ఆకుకూరలను అక్కడే పండిస్తున్నారు. రోజూ వంటకాల్లో తాజావే వాడుతున్నారు.   పోరాటం ప్రారంభమైన తొలిరోజుల్లో రైతులు బృందాలు గా ఏర్పడి రోడ్డు పక్కనే వంట చేసుకునేవారు. ఒక్కో బృందంలో గరిష్టంగా 20 నుంచి 25 మంది ఉండేవారు. ఇప్పుడలా కాదు. ప్రతిరోజూ వేలాదిమంది పోరాటంలో చేరుతున్నారు. దీంతో వస్తున్న వారందరికి  భోజనం పెడుతున్నారు. తమ వద్దకు వచ్చిన వారిని ఖాళీ కడుపులతో ఉంచకుండా తినడానికి ఏదో ఒకటి అందిస్తున్నారు. ఇందు కోసం రొట్టెల యంత్రాలు సమకూర్చుకున్నారు.  కొన్ని హోటళ్లు, గురుద్వారా లలో వినియో గించే యంత్రాలను పెద్ద ఎత్తన సమీకరించారు. ఇప్పుడు గంటకు వెయ్యికి పైగా రొట్టెలను తయారు చేసే యంత్రాలు రైతుల దగ్గర ఉన్నాయి. ఉదయం నుంచి నాన్ స్టాప్ గా రొట్టెలు తయారవుతూనే ఉంటాయి. పోరాడేవారికి కావాల్సిన శక్తిని అందిస్తుంటాయి. రొట్టెలే కాదు పాలు, టీ, వేరుశనగలు... ఇలా ప్రతిదీ వేడివేడిగా అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు అన్నదాతలు.  దేశ రాజధాని సరిహద్దులో రైతులు నిర్వహిస్తోన్న మహా పోరాటంలో మహిళలు, పిల్లలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొనకపోయినా.. ఉద్యమిస్తున్న వారికి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. రోజుకు 18 నుంచి 20 గంటలు పని చేస్తూ అన్నదాతల ఆకలి తీర్చుతున్నారు కొందరు మహిళామణులు. ఎప్పటికప్పుడు తాజా వంటకాలు అందిస్తూనే..  మరుసటి రోజు భోజనాలకు అవసరమైన ఏర్పాట్లను చేసుకుంటున్నారు. మహిళలకు చిన్నారులు కూడా పెద్దఎత్తున  సాయం చేస్తున్నారు. అన్నదాతలు నిర్మించిన పలెల్లో ఉద్యమ వ్యూహాలే కాదు..  ఎప్పటికప్పుడు తలెత్తే సమస్యల పరిష్కారం కోసం మేధోమథనమూ సాగిస్తున్నారు.