దివ్యాంగ వాలంటీర్ అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?..
posted on Dec 19, 2020 @ 12:16PM
ప్రకాశం జిల్లా ఒంగోలులో వార్డు వాలంటీర్ గా పనిచేస్తున్న దివ్యాంగురాలు ఉమ్మనేని భువనేశ్వరి (22) అనుమానాస్పదంగా మృతిచెందారు. దశరాజుపల్లి రోడ్డులోని చిన్నవెంకన్న కుంట వద్ద తన మూడు చక్రాల సైకిల్ పైన ఆమె సజీవ దహనమైంది. ఎవరో తగలబడుతున్నారన్న సమాచారంతో పోలీసులకు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలార్పారు. అప్పటికే ఆమె మృతి చెందింది. ఘటనా స్థలంలోని హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఆధారాల ద్వారా ఆమె ఉమ్మనేని భువనేశ్వరి గా గుర్తించారు.
భువనేశ్వరి నగరంలోని 12వ వార్డు సచివాలయంలో వాలంటీర్‌గా పని చేస్తోంది. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. అక్క మానసిక వికలాంగురాలు. భువనేశ్వరి తల్లి జానకి బుక్‌షాప్‌లో పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లను పెంచింది. తన బిడ్డను ఎవరో హత్య చేసుంటారంటూ జానకి సంఘటన స్థలానికి వచ్చి భోరున విలపించింది. తన కుమార్తె ఎంతో ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకొని ఉండదని.. ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది.
అయితే భువనేశ్వరి వాట్సాప్ స్టేటస్ ఆధారంగా ఆత్మహత్యగా భావిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇక తన వాట్సాప్ పని చేయదని, ఎవరూ మెసేజ్ లు పంపవద్దని అందులో ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు వాలంటీర్ అంతదూరం ఎందుకు వెళ్లింది, ఆమె చివరగా ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడింది.. తదితరాల వివరాల కోసం పోలీసులు కాల్‌డేటా సేకరించే పనిలో ఉన్నారు.