రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే కోమటిరెడ్డి కొత్త పార్టీ? కేసీఆర్ అలా నరుక్కొస్తారా?
posted on Dec 19, 2020 @ 4:34PM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్ష పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలో ఎవరో ఒకరికి పీసీసీ పగ్గాలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ పీసీసీ ప్రకటన తర్వాత కాంగ్రెస్ లో కీలక మార్పులు ఉంటాయని, రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలన పరిణామాలు జరుగుతాయని భావిస్తున్నారు. టీపీసీసీ ఎంపికను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్.. తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల ఎదురైన వరుస పరాజయాలతో షాకైన కేసీఆర్.. తనదైన ఎత్తులతో ప్రత్యర్థులకు ఝలక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికే ఖాయమవుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఢిల్లీ నుంచి ఆయనకు సంకేతాలు వచ్చాయంటున్నారు. అందుకే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఆయన మనుషులు టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. పీసీసీ పదవి దక్కని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కొత్త పార్టీ పెట్టించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కోమటిరెడ్డితో కేసీఆర్ సన్నిహితులు మాట్లాడారని కూడా చెబుతున్నారు. కోమటిరెడ్డికి మొదటి నుంచి కేసీఆర్ తో మంచి సంబంధాలున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో పలు ప్రాజెక్టు పనులు కోమటిరెడ్డి బ్రదర్స్ కంపెనీలు చేస్తున్నాయని చెబుతున్నారు. రాజకీయంగా కేసీఆర్ పై కోమటిరెడ్డి ఆరోపణలు చేస్తారు కాని అంతర్గతంగా ఇద్దరి మధ్య డీల్స్ నడుస్తాయని రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో టాక్ ఉంది. అందుకే కోమటిరెడ్డితో కొత్త పార్టీ పెట్టించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
తమతో మంచి సంబంధాలున్న కోమటిరెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకోకుండా.. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టించడం వెనక భారీ వ్యూహం ఉందంటున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి . ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై ఆయన చేసే ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళుతున్నాయి. కేసీఆర్ పై చేస్తున్న పోరాటం వల్లే రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగిపోయిందని చెబుతారు. అలాంటి రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు వస్తే తమకు మరింత ఇబ్బంది అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ కేడర్ కూడా యాక్టివ్ అవుతుంది. అలా కాకుండా చేసేందుకే కోమటిరెడ్డితో కేసీఆర్ .. కొత్త పార్టీ ఎత్తు వేస్తున్నారని చెబుతున్నారు. కోమటిరెడ్డి పార్టీ పెడితే .. ఆయనతో కొందరు కాంగ్రెస్ నేతలు వెళతారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న సీనియర్ నేతలు కోమటిరెడ్డికి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు తనకు కోవర్టులుగా ఉన్న కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలను కూడా కేసీఆరే కోమటిరెడ్డితో పంపించవచ్చని కూడా చెబుతున్నారు.
మొత్తంగా కోమటిరెడ్డితో పార్టీ పెట్టించడం ద్వారా కాంగ్రెస్ ను చీల్చి రేవంత్ రెడ్డికి బలం తగ్గించడం, ప్రజా వ్యతిరేకత ఓట్లు మొత్తం ఒకవైపే వెళ్లకుండా చూడవచ్చని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డితో విభేదించే కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలోకి వెళ్లకుండా కోమటిరెడ్డితో వెళతారని గులాబీ బాస్ లెక్కట.దీంతో బీజేపీలోకి వలసలు తగ్గించడంతో పాటు కాంగ్రెస్ బలపడకుండా చూడవచ్చనది కేసీఆర్ స్కెచ్ అని తెలుస్తోంది. అయితే కోమటిరెడ్డి పార్టీ పెట్టినా ఆయనతో ఎంత మంది కాంగ్రెస్ నేతలు వెళతారన్నది ఊహించడం కష్టమే. కాంగ్రెస్ చీలితే.. కొందరు నేతలు బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ కాకపోవచ్చని, అంతిమంగా అది కూడా బీజేపీకి ప్లస్ కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.