రైతుల పోరాటానికి ఆరెస్సెస్ మద్దతు? మోడీ సర్కార్ దిగిరావాల్సిందేనా?
posted on Dec 19, 2020 @ 5:08PM
కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం ఉధృతమవుతోంది. కేంద్రం దిగొచ్చేవరకు ఎన్ని రోజులైనా ఉద్యమం చేస్తామని స్పష్టం చేస్తున్నారు అన్నదాతలు. ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న ఆందోళనకు రోజురోజు మద్దతు పెరుగుతోంది. వేలాది మంది రైతులు కొత్తగా ఉద్యమంలో కలుస్తుండటంతో ఢిల్లీ, హర్యానా సరిహద్దు ఇప్పుడో యుద్దభూమిగా మారింది. ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాలు తేల్చి చెబుతుండగా.. అటు కేంద్ర సర్కార్ కూడా పంతం వీడటం లేదు. రైతు సంఘాల్లో చీలిక తెచ్చి అందోళన విమరించేలా ప్లాన్ చేస్తుందనే ఆరోపణలు మోడీ సర్కార్ పై వస్తున్నాయి. అందుకే ఖలీస్తానీయులు,మావోయిస్టులు రైతు ఉద్యమంలో చేరారని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని చెబుతున్నారు.
అయితే రైతుల మహా పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పదనే చర్చ ప్రస్తుతం ఢిల్లీలో జోరుగా జరుగుతోంది. ఇందుకు బలమైన కారణం ఆరెస్సెసే అంటున్నారు. రైతులు చేస్తున్న పోరాటానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆరెస్సెస్ అనుబంధ రైతు సంఘం కూడా బహిరంగంగానే రైతుల ఆందోళనను సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తెచ్చినప్పుడు కూడా కొందరు ఆరెస్సెస్ నేతలు ఆ బిల్లులను వ్యతిరేకించారు. కొత్త చట్టాలతో రైతులకు ప్రయోజనం లేదని, బడా వ్యాపారులకే మేలు చేసేలా రూపొందించారని వారు వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా వారంతా అదే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. రైతుల ఆందోళన విరమించేలా చర్యలు తీసుకోవాలని, కొత్త చట్టాల్లో సవరణలకు చర్యలు చేపట్టాలని ఆరెస్సెస్ పెద్దల నుంచి కేంద్రానికి సందేశాలు వస్తున్నట్లు చెబుతున్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై బీజేపీ కూడా రెండుగా చీలిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు కొత్త బిల్లుల్లో సవరణలు చేయడానికి ఏ మాత్రం సుముఖంగా లేరని చెబుతున్నారు. గుజరాత్ నేతలు కూడా మోడీ, అమిత్ షా బాటలోనే ఉన్నారట. మిగితా మెజార్టీ కాషాయ నాయకులు మాత్రం అన్నదాతల పోరాటంపై కొంత సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. మహారాష్ట్ర బీజేపీ నేతలు బిల్లుల్లో సవరణ చేయాలని ఇప్పటికే కేంద్రం పెద్దలకు చెప్పేశారట. నాగపూర్ అరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో తో దగ్గరి సంబంధాలు ఉండే కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ప్రధానితో ఈ విషయం చెప్పినట్లు బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. వ్యవసాయ రైతులు ఎక్కువగా ఉండే పశ్చిమ బెంగాల్, హర్యానా, పంజాబ్ బీజేపీ నేతలు కూడా బిల్లులపై సంతృప్తిగా లేరని, కాని పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడలేక మౌనంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇక పంజాబ్ బీజేపీ నేతలైతే కొత్త చట్టాలతో తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉన్నారట. ఉత్తరాది రాష్ట్రాల బీజేపీ రైతు నేతలు కూడా కొత్త వ్యవసాయ బిల్లుల్లో సవరణ చేస్తేనే బెటరని సూచిస్తున్నారని చెబుతున్నారు.
రైతులు తమ పట్టు వీడకుండా ఉద్యమం కొనసాగిస్తుండటం, రోజురోజుకు ఆందోళనకు మద్దతు పెరుగుతుండటం, ఆర్సెస్సెస్ ఒత్తిడితో కేంద్ర సర్కార్ ఇక దిగిరాక తప్పదని తెలుస్తోంది. రైతులతో పూర్తి స్థాయి చర్చలకు కేంద్ర సర్కార్ సిద్ధమవుతుందని.. ప్రధాని మోడీనే స్వయంగా రైతు సంఘాల నేతలతో మాట్లాడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమంతో మోడీ సర్కార్ పై దేశ వ్యాప్తంగా కొంత వ్యతిరేకత పెరిగిందని రాజకీయ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆ డ్యామేజీ కంట్రోల్ చర్యల్లో భాగంగా ప్రధాని మోడీనే రైతులతో మాట్లాడి.. వాళ్లను ఒప్పించి ఆందోళన విరమింప చేస్తారని వారు భావిస్తున్నారు. దీంతో రైతుల్లో తనపై వచ్చిన వ్యతిరేకతను ప్రధాని నరేంద్ర మోడీ కొంత వరకు తగ్గించుకునే ఛాన్స్ ఉందంటున్నారు. బీజేపీ హైకమాండ్ కూడా అలానే ముందుకు వెళ్లవచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.