సామాజిక న్యాయమా నీవెక్కడ? జగన్ 'రెడ్డి' పాలనలో కుదరదా?
posted on Dec 19, 2020 @ 1:43PM
సామాజిక న్యాయమే మా లక్ష్యం .. బడుగు, బలహీన వర్గాల అభివృద్దే మా ధ్యేయం. ఇది రాజకీయ నాయకులు ఎప్పుడు వినిపించే నినాదం. అధికారంలోకి వచ్చేందుకు వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. పవర్ లోకి వచ్చాకా మాత్రం అంతా మర్చిపోతారు. తాము పాలన చేపట్టడానికి ఉపయోగి పడిన సామాజిక న్యాయం నినాదం అటకెక్కి.. తన సామాజిక వర్గ అభివృద్దే పాలకులకు ప్రధానమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎంతగా అంటే ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టుల్లో బడుగు, బలహీన వర్గాల లెక్క చూస్తే.. అసలు వాళ్లు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. అంతటా ఒక్క సామాజిక వర్గ ఆధిపత్యమే. అధికారం, నిధులు ఉన్న పదవులన్ని ఆ వర్గ సొంతమే. కొన్ని ప్రజా సంఘాలు. విపక్ష పార్టీలు ఇస్తున్న లెక్కలు చూస్తే ఏపీలో సామాజిక న్యాయం అన్న పదానికి అర్ధమే లేకుండా పోయిందని తెలుస్తోంది. సామాజిక న్యాయానికి జగన్ 'రెడ్డి' పాలనలో స్థానం లేదనే విమర్శలు వస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వం వచ్చాకా నియమించిన యూనివర్శిటీ వీసీల్లో 83 శాతం, ప్రభుత్వ సలహదారుల్లో 71 శాతం పదవులు ఒక సామాజిక వర్గానికే ఇచ్చారు. ఏపీలో నామినేటెడ్ పదవులు 712 ఉండగా.. వీటిలో దాదాపు 90 శాతం ఒక సామాజిక వర్గానికే దక్కాయి. అతి ముఖ్యమైన టీటీడీలో మొత్తం 36 మంది సభ్యులుంటే అందులో 11 మంది రెడ్లు, ముగ్గురు బీసీలు ఉన్నారు. రాష్ట్రంలోని 12 మంది వైస్ ఛాన్స్ లర్లలో 10 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఒకటి మాత్రమే బీసీకి ఇచ్చారు. 24 మంది ప్రభుత్వ సలహాదారుల్లో 17 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు..ఒకరు బీసీ. ప్రభుత్వ న్యాయవాదులు 30 మంది ఉంటే.. 16 మంది సీఎం సామాజిక వర్గం వారే. యూనివర్సిటీ సెర్చ్ కమిటీల్లో 12 మంది ఉంటే 9 రెడ్లకు, ఒకటి బీసీకి ఇచ్చారు. ఏపీలో ఇలా ఎక్కడ చూసినా కీలక పదవుల్లో బీసీలెవరు కనిపించడమే లేదు. రాజధానిపై వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి..ఇలా అంతా ఒక వర్గంతోనే నింపేశారు.
గత టీడీపీ హయాంలో నామినేటెడ్ పోస్టుల్లో సింహభాగం బడుగు, బలహీన వర్గాలకే ఇచ్చారు. విశ్వవిద్యాలయాల వీసీ పదవుల్లో మెజార్టీ బీసీ వర్గాల వారినే నియమించారు. టీటీడీ విషయానికి వస్తే చైర్మన్‌గా సుధాకర్ యాదవ్, ఈవోగా అనిల్ సింఘాల్, జేఈవోగా శ్రీనివాసరాజును నియమించారు. వీరెవరు అప్పడి ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారు కాదు. అత్యంత కీలకమైన ఏపీఐఐసీ, టీటీడీ, తుడా చైర్మన్ల పదవులను బీసీలకు ఇచ్చింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. నిజానికి బీసీల జీవితాలను మార్చేస్తాను.. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి వారి జీవితాలను ఉద్ధరిస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు జగన్. కాని అధికారంలో వచ్చాకా మాత్రం ఆ మాటే మర్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి. అధికారం, నిధులు ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లు, మేయర్లు, పురపాలక చైర్మన్లు, సర్పంచ్‌లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్ల స్థానాలకు సంబంధించి బీసీ కోటాను తగ్గించి... 16,800 బీసీ పదవులకు జగన్ సర్కార్ కోత పెట్టింది.
అధికారం, నిధులు ఉన్న పదవులు బీసీలకు దక్కకుండా కోత పెట్టి.. ఉత్సవ విగ్రహాల్లా ఉండే బీసీ కార్పొరేషన్లకు ఏర్పాటు చేసి జగన్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. నేతిబీరలో నెయ్యి లేనట్లు.. నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటుచేసి నిలువునా వంచిస్తున్నారని జగన్ పై మండిపడుతున్నారు బడుగు, బలహీన వర్గాల నేతలు నేతలు. 50 శాతం జనాభా ఉన్న బీసీలు నామినేటెడ్ పోస్టులకు పనికిరారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్ పాలనలో సామాజిక న్యాయం లేదని, కీలక పదవులన్ని రెడ్లకే ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీసీ జీవితాలను ఉద్ధరిస్తానంటూ ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చాక వారిపై కత్తివేటు వేస్తున్నారని ధ్వజమెత్తుతున్నాయి.