పోలీసులకే రక్షణ కరువైంది.. పోలీసులపై వైసీపీ నేతల దౌర్జన్యం!
posted on Dec 19, 2020 @ 11:45AM
విశాఖలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. మూడు రాజధానులకు ముద్దతుగా తూర్పు నియోజకవర్గం సమన్వయ కర్త విజయనిర్మల ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయం ముట్టడికి యత్నించడంతో పాటు.. ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంతో పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగి.. వైసీపీ నేతలు సీఐను తోసేశారు. దీంతో ఆయన తలకు తీవ్రగాయమైంది. వైసీపీ నేతల వ్యవహారశైలిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల తీరును చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ కరువైందని అన్నారు.
ఈ ఘటనపై స్పందించిన టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు పోలీసులపై దాడి చేసినా అసలేం జరగనట్టు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. "తన్నులు తిని వైసీపీ వాళ్ళతో మసాజ్ చేయించుకున్నాం అని చెప్పడానికి సిగ్గుగా లేదా?.. పోలీసు శాఖ ఆత్మగౌరవాన్ని వైఎస్ జగన్ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టకండి" అని విరుచుకుపడ్డారు. అధికార పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి కొంత మంది పోలీసులు పూర్తిగా దిగజారిపోతున్నారు అని మండిపడ్డారు. "వైసీపీ గూండాల దాడిలోనే పోలీస్ గాయపడ్డారు. వైసీపీ నాయకులు పోలీసుల పై చేసిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు బయటపెట్టే ధైర్యం మీకు ఎలాగో లేదు అందుకే నేను విడుదల చేస్తున్నా" అంటూ లోకేష్ దాడికి సంబంధించి వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.