వరల్డ్ టాప్ టెన్ ట్రాఫిక్ రద్దీ నగరాలివే!
posted on Jan 19, 2021 @ 3:25PM
ప్రపంచ దేశాల్లో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు వలసలు పెరిగిపోతున్నాయి. అయితే వలసలకు తగ్గట్లు మౌలిక వసతుల కల్పన నగరాల్లో సాధ్యం కావట్లేదు. దీంతో నగరాలు, పట్టణాల్లో రద్దీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నగరాల్లో ట్రాఫిక్ రద్దీ దారుణంగా ఉంటోందని తాజా అధ్యయనం చెబుతోంది. ప్రపంచంలో ఏయే నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందనే అంశంపై టామ్ టామ్ సంస్థ ఒక నివేదిక వెల్లడించింది. 2020 సంవత్సరానికి సంబంధించిన ట్రాఫిక్ ఇండెక్స్‌ను Tom Tom Traffic index- 2020 పేరుతో విడుదల చేసింది. ప్రపంచంలోని ఆరు ఖండాలు, 57 దేశాల్లో మొత్తం 416 నగరాలపై ఈ సర్వే చేశారు. 2020 సంవత్సరంలో ప్రపంచంలో సగటు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న పది నగరాలను ఆ సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో మూడు భారతీయ నగరాలు కూడా ఉన్నాయి.
రష్యా రాజధాని మాస్కో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి రోడ్లపై ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా 54 శాతంగా ఉందని టామ్ టామ్ నివేదిక తెలిపింది. భారత వాణిజ్య రాజధాని ముంబై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల్లో ప్రపంచ వ్యాప్తంగా రెండు, మన దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ముంబై రోడ్లపై వాహనాల ట్రాఫిక్ రద్దీ 53 శాతంగా ఉంది.కొలంబియా కేపిటల్ బొగోటా 53 శాతం ట్రాఫిక్ రద్దీతో మూడో స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్‌లో రాజధాని మనీలాలో ప్రజలు సొంత వాహనాలనే ఎక్కువగా వాడతారు. ఇక్కడి రోడ్లపై ట్రాఫిక్ రద్దీ 53 శాతంగా నమోదైంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో టర్కీలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో ట్రాఫిక్ రద్దీ 51 శాతంతో ప్రపంచ నగరాల్లో ఇది ఐదో స్థానంలో ఉంది.
భారత్ ఐటీ నగరం బెంగళూరులో ట్రాఫిక్ సమస్య అంతకంతకు పెరిగిపోతోంది. మన దేశంలోని దక్షిణాది నగరాల్లో బెంగళూరులోనే రోడ్లపై సగటు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ రద్దీ స్థాయి 51 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువున్న ఆరో నగరంగా టామ్ టామ్ సంస్థ సర్వేలో నిలిచింది బెంగళూరు. ఉక్రెయిన్ దేశంలోని కైవ్ నగరంలో కూడా రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ ట్రాఫిక్ రద్దీ స్థాయి 51 శాతంగా ఉంది. భారత రాజధాని ఢిల్లీ రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల్లో దేశంలో మూడవ స్థానంలో, మొత్తం జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మన రాజధానిలో ట్రాఫిక్ రద్దీ స్థాయి 47 శాతంగా ఉన్నట్లు టామ్ టామ్ వెల్లడించింది. రష్యాలోని నోవోసిబిర్స్క్ నగరం ట్రాఫిక్ రద్దీ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. నోవోసిబిర్స్క్ రోడ్లపై ట్రాఫిక్ రద్దీ స్థాయి 45 శాతంగా నమోదైంది. ఇక టూరిజానికి ప్రసిద్ధి చెందిన బ్యాంకాక్ నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అక్కడి రోడ్లపై సగటు ట్రాఫిక్ రద్దీ 44 శాతంగా ఉన్నట్లు టామ్ టామ్ తెలిపింది. బ్యాంకాక్ ఓవరాల్ లిస్టులో పదో స్థానంలో నిలిచింది.
అయితే నగరాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతున్నా.. కరోనా మహమ్మారి వైరస్ కారణంగా గతేడాది వివిధ దేశాల్లో ట్రాఫిక్ చాలావరకు తగ్గిపోయిందని సర్వేలో తెలిసింది. అయితే ఇది తాత్కాలికమేనని.. ప్రస్తుతం పట్టణాల్లో మళ్లీ ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని టామ్ టామ్ సంస్థ వివరించింది.