బెంగాల్ లో దీదీ.. తమిళనాట స్టాలిన్! ప్రీ పోల్ సర్వేలో బీజేపీకి షాక్
posted on Jan 19, 2021 @ 1:28PM
దేశ వ్యాప్తంగా త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్, అసోంతో పాటు దక్షిణాదికి చెందిన తమిళనాడు, పుదిచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బెంగాల్ లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది బీజేపీ. ఏడాదిన్నర క్రితం నుంచే అక్కడ రాజకీయ ఎత్తులు మొదలు పెట్టింది. దక్షిణాదిలో పార్టీ విస్తరణపై ఫోకస్ చేసిన బీజేపీ.. తమిళనాడుపై ఆశలు పెట్టుకుంది. తమకు మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకేతో కలిసి మరోసారి సర్కార్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీజేపీ ఆశలపై నీళ్లు చల్లింది ఏబీపీ- సీ ఓటర్ సర్వే. పశ్చిమ బెంగాల్ లో మరోసారి టీఎంసీదే అధికారమని తేల్చేసింది. తమిళనాడులో డీఎంకే కూటమి ఘన విజయం సాధించబోతోందని ఏబీపీ- సీ ఓటర్ సర్వేలో తేలింది. కేరళలో పినరయి విజయన్ మళ్లీ విక్టరీ కొడుతారని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా ఏబీపీ- సీ ఓటర్ సర్వే ప్రకారం డీఎంకే- కాంగ్రెస్ కూటమి 158 నుంచి 166 స్థానాలు గెలుచుకోబోతోంది. ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమి 60 నుంచి 68 స్థానాలకే పరిమితం కానుంది. కమల్‌హాసన్ పార్టీ ఎంఎన్ఎం గరిష్టంగా 4 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. సర్వే ప్రకారం కమల్ హాసన్ పార్టీ తమిళనాడులో ఎలాంటి ప్రభావం చూపడం లేదన్నది స్పష్టమవుతోంది. కేరళలో మరోసారి కామ్రెడ్లదే విజయమని సర్వే ద్వారా వెల్లడైంది. కేరళలో మొత్తం 140 సీట్లు ఉండగా... ఎల్‌డీఎఫ్ కు 42 శాతం ఓట్లతో 81-89 సీట్లు..యూడీఎఫ్ కు 35 శాతం ఓట్లతో 49- 57స్థానాలు రానున్నాయి. కేరళలో బీజేపీకి గరిష్టంగా రెండు స్థానాలు వస్తాయని ఏబీపీ- సీ ఓటర్ సర్వే తెలిపింది.
బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమ బెంగాల్ లోనూ ఆ పార్టీకి షాక్ తప్పదని ఏబీపీ- సీ ఓటర్ సర్వే తేల్చింది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తృణామూల్ కాంగ్రెస్ పార్టీ 43 శాతం ఓట్లతో 158 స్థానాలు గెలవబోతోంది. బీజేపీ 37.5 శాతం ఓట్లతో 102 స్థానాలు దక్కించుకుంటుందని సర్వేలో వెల్లడైంది. బెంగాల్ లో కాంగ్రెస్- లెప్ట్ పార్టీల కూటమి 12 శాతం ఓట్లు సాధింది 30 స్థానాలు గెలుచుకోనుంది. బెంగాల్ లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొడతారని సర్వేలో స్పష్టమైనా... బీజేపీకి మాత్రం గతంలో కంటే ఓట్ల శాతం భారీగా పెరిగింది.