దళిత ఎంపీ చనిపోతే పరామర్శించరా! జగన్ తీరుతో తిరుపతి వైసీపీకి దడ
posted on Jan 20, 2021 @ 2:26PM
ఎంపీ దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. తిరుపతి ఉప ఎన్నికను సవాల్ గా తీసుకుంటున్న టీడీపీ .. గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే వైసీపీ సిట్టింగ్ ఎంపీ చనిపోయినా.. ఆ కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించకపోవడం ఇప్పుడు టీడీపీకి అస్త్రంగా మారుతోంది. ఇదే అంశంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ అనారోగ్యంతో చనిపోతే ఆయన కుటుంబ సభ్యులను జగన్ ఇంతవరకు పరామర్శించలేదని విమర్శించారు. దివంగత ఎంపీ దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించని జగన్ పై దళితులంతా ఏకమై తిరగబడాలని పిలుపిచ్చారు అచ్చెమన్నాయుడు. జగన్ ను దళితులు రాష్ట్రం నుంచి వెలివేయాలని వ్యాఖ్యానించారు.
దళితులపై జగన్ కు నిజంగా అభిమానం ఉంటే... దుర్గాప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేవారని అన్నారు అచ్చెమన్నాయుడు. ఎంపీ చనిపోతే పరామర్శించే బాధ్యత ఆ పార్టీ అధినేత, సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. దుర్గాప్రసాద్ చనిపోయిన 12 రోజులకు బందర్ లో ఓ మంత్రి తల్లి చనిపోయారని... ఆ సందర్భంగా హెలికాప్టర్ లో వెళ్లి జగన్ ఆయనను పరామర్శించారని చెప్పారు అచ్చెమన్నాయుడు. కర్నూలు జిల్లాలో ఓ ఎమ్మెల్సీ చనిపోతే హెలికాప్టర్ లో వెళ్లి పరామర్శించారని గుర్తుచేశారు. దుర్గాప్రసాద్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. దళితులపై జగన్ కు అంత చులకన భావం ఎందుకని ఏపీ టీడీపీ అధ్యక్షుడు ప్రశ్నించారు.
సీఎం జగన్ తీరుపై తిరుపతి జనాల్లోనూ చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా దళితులు జగన్ పై ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. రెడ్డి నేతలు, వారి కుటుంబ సభ్యులు చనిపోతే.. ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లి పరామర్శిస్తున్న జగన్.. పదవిలో ఉన్న ఎంపీ చనిపోయినా ఇంతవరకు అతని కుటుంబాన్ని పరామర్శించకపోవడం ఏంటని జనాలు కూడా ప్రశ్నిస్తున్నారు. అందుకే టీడీపీ ఈ అంశాన్ని తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారంగా మలుచుకోవాలని చూస్తోందట. జగన్ తీరుపై వైసీపీ కేడర్ లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలుస్తోంది.తిరుపతి ఉప ఎన్నికలో ఇది తమకు తీవ్ర నష్టం కల్గిస్తుందని కొందరు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.