రేవంత్ తో ప్రియాంక టాక్స్! పీసీసీ ఖాయమైనట్టేనా?
posted on Feb 20, 2021 @ 9:30AM
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై క్లారిటీ వచ్చినట్టేనా? హైకమాండ్ నుంచి ఆ నేతకు సిగ్నల్స్ వచ్చాయా? తెలంగాణ కాంగ్రెస్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పీసీసీ రేసులో ఉన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డితో... ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా మాట్లాడటం ఆసక్తి రేపుతోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని దాదాపుగా ఖరారు చేశారనే చర్చ జరుగుతోంది.
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యేందుకు బెంగళూరు వచ్చారు ప్రియాంక గాంధీ.ఆ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా హాజరయ్యారు. అక్కడే రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడారు ప్రియాంక గాంధీ. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వెళ్ళిపోతున్న క్రమంలో కారులో ఎక్కి కూర్చుకున్న ప్రియాంకాగాందీ తన సెక్యూరిటీ సిబ్బంది ద్వారా రేవంత్ రెడ్డిని కారు దగ్గరకే పిలిపించుకున్నారు. ఇద్దరూ కొద్దిసేపు కారులో కూర్చునే మాట్లాడుకున్నారు. పీసీసీ చీఫ్ ఎన్నిక ప్రకటన వాయిదా పడిన నేపథ్యంలో ఆమె రేవంత్ రెడ్డితో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటిదాకా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో మాత్రమే కలిసిన రేవంత్ రెడ్డి ప్రియాంకాగాంధీతో ఎప్పుడు సమావేశం కాలేదు. అలాంటిది రేవంత్ రెడ్డిని తన సిబ్బంది ద్వారా పిలిపించుకుని ప్రియాంక గాంధీ మాట్లాడటం కాంగ్రెస్ లో చర్చగా మారింది. తెలంగాణలో పార్టీ అంశాలను, పాదయాత్రకు సంబంధించిన స్పందన గురించి ఆమె ఆరా తీశారని తెలుస్తోంది. పాదయాత్రలో రైతులు ప్రధానంగా ఏయే అంశాలను ప్రస్తావించారు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా స్పందిస్తున్నారు, ప్రస్తుతం తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటి, కొత్త వ్యవసాయ చట్టాలపై వారికున్న అవగాహన ఏపాటిది వంటి అంశాలపై రేవంత్ రెడ్డితో ప్రియాంక మాట్లాడారని చెబుతున్నారు. పాదయాత్రలో తనకు ఎదురైన అంశాలను రేవంత్ రెడ్డి వివరించారని తెలుస్తోంది.
రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా పిలుపించుకుని ప్రియాంక గాంధీ మాట్లాడటంతో పీసీసీ చీఫ్ అంశంలో క్లారిటీ వచ్చినట్లేనని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటంపై హైకమాండ్ దగ్గర పూర్తి సమాచారం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీకి రేవంత్ కీలకమని పార్టీ పెద్దలు భావిస్తున్నారని సమాచారం. అందుకే తనను ఇప్పటివరకు కలవకపోయినా.. అతని గురించి తెలుసుకుని ప్రియాంక మాట్లాడారని అంటున్నారు. పీసీసీ చీఫ్ పదవి విషయంలోనూ హైకమాండ్ క్లారిటీగా ఉందంటున్నారు. కొంత ఆలస్యం కావొచ్చు కాని.. పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి రావడం ఖాయమని చెబుతున్నారు. తాజా పరిణామాలతో ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్రకు హైకమాండ్ అనుమతి లేదనే ప్రచారం చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు షాకయ్యారని తెలుస్తోంది.