నేనే తోపు.. నేనే నెంబర్ వన్! అధికార పార్టీ ఎమ్మెల్యే సెల్ఫ్ డబ్బా
posted on Feb 19, 2021 @ 1:45PM
ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే.. ప్రభుత్వ పెద్దలకు ఆయన అత్యంత సన్నిహితుడని చెబుతారు.. ఉత్తర తెలంగాణకు చెందిన ఆ ఎమ్మెల్యే బిల్డప్ కూడా అలానే ఉంటుందని పార్టీ కార్యకర్తలే అనుకుంటూ ఉంటారు. తాజాగా ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చర్చకు దారి తీశాయి. అంతేకాదు ఆయన ఓవరాక్షన్ పై సహచర నేతల నుంచే విమ్శలు కూడా వస్తున్నాయి. తనకు తాను గొప్పగా చెప్పుకునే ప్రయత్నంలో... ఇతర నేతలను కించపరేచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో దుమారం రేపుతోంది.
వివాదాస్పద వ్యాఖ్యలతో కాక రేపింది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.మాక్లూర్ మండలం మానిక్ భాండార్ గ్రామంలో నిర్వహించిన టీఆరెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో నేనే తోపు... నాకున్న ఫాలోయింగ్ మా పార్టీలో ఎవరికీ లేదు.. నాకున్న కార్యకర్తల బలం, రాష్ట్రంలో మరే ఇతర ఎమ్మెల్యే కు లేదు అంటూ కామెంట్ చేశారు జీవన్ రెడ్డి. గత ఎన్నికల్లో తనపై పోటీ చేసిన సురేష్ రెడ్డి, ఆకుల లలిత లాంటి నేతలు కూడా టీఆరెస్ లో చేరారని చెప్పారు. మరో మూడు తరాలు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందన్నారు జీవన్ రెడ్డి. దేశంలో ఎక్కువ సభ్యత్వం కలిగిన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎసేనని కూడా చెప్పారు.
అయితే టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పడం బాగానే ఉన్నా.... తనకు తానే గొప్పగా చెప్పుకుంటూ ఇతర నేతలను చులకన చేసి మాట్లాడరనే చర్చ గులాబీ పార్టీలోనే జరుగుతోంది. తనకే ఎక్కువ మాస్ ఫోలోయింగ్ ఉందని జీవన్ రెడ్డి చెప్పుకోవడంపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారట. తన గురించి చెప్పుకోవడం సరేగాని.. ఇతరులతో పోల్చుతూ తనను గ్రేట్ అని చెప్పుకోవడం ఏంటని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన కామెంట్లపై కారు పార్టీలో పెద్ద చర్చే జరుగుతుందని తెలుస్తోంది.