కర్ణాటకలో కమలానికి షాక్.. కాంగ్రెస్ లోకి బీజేపీ ఎంపీ కుమారుడు!
posted on Feb 19, 2021 @ 11:48AM
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి షాక్ తగలనుంది. చిక్కబళ్లాపుర బీజేపీ ఎంపీ బచ్చేగౌడ కుమారుడు హొసకోటె స్వతంత్ర ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.శరత్ బచ్చేగౌడనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. శరత్ కాంగ్రెస్‌లో చేరుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తోను ఇటీవల ఆయన చర్చలు జరిపారు. దీంతో ఈ నెలాఖరులోపు శరత్ కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైంది.
ఇటీవల శాసనసభ సమావేశాలలో హక్కుల ఉల్లంఘనపై శరత్ బచ్చేగౌడ చర్చకు అవకాశం కోరగా సభాపతి పట్టించుకోలేదు. ఆయనకు మద్దతుగా ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు మూకుమ్మడిగా పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం కర్ణాటక రాజకీయాల్లో చర్చగా మారింది. అప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే అంశం తెరపైకి వచ్చింది.
2018 శాసనసభ ఎన్నికలలో శరత్ బీజేపీ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎంటీబీ నాగరాజ చేతిలో ఓటమి పాలయ్యారు. రాజకీయ సమీకరణలు మారడంతో ఎంటీబీ నాగరాజు సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2020లో జరిగిన ఉప ఎన్నికలలో ఎంటీబీ నాగరాజు బీజేపీ తరుపున పోటీ చేసి ఓడిపోగా శరత్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఎంటీబీ నాగరాజు ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శరత్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు. బీజేపీ ఎంపీ బచ్చేగౌడ కూడా పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొనడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన కూడా కొడుకు బాటలోనే కాంగ్రెస్ లో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది.