కేకులతో పాటు పీకలు కోశారు!
posted on Feb 19, 2021 @ 3:58PM
పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య తెలంగాణను షేక్ చేస్తోంది. హత్యల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విపక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున ఓవైపున మొక్కలు నాటి, కేకులు కోసిన టీఆర్ఎస్ నాయకులు పీకలు కూడా కోశారని ఆరోపించారు. కేసీఆర్ పుట్టిన రోజు నాడు జరిగిన ఈ ఘటన ఆయన జీవితానికే మచ్చలా మిగిలిపోతుందన్నారు వీహెచ్. కేసీఆర్ జన్మదినం బ్లాక్ డేగా చేసుకోవాల్సిన పరిస్థితి తయారైందన్నారు. సీఎం కేసీఆర్ ఈ దారుణంపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
మంథనిలో పర్యటించిన వీహెచ్.. వామనరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వామనరావు దంపతుల హత్యను చేయడం అత్యంత కిరాతకమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనే.. పేదలకు అండగా నిలుస్తున్న హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణిలను హత్య చేశారని ఆయన మండిపడ్డారు. 2018లో ఇనుముల సతీశ్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు రూ. 50 లక్షల సుపారి మాట్లాడుకున్న ఆడియోలు లీకయ్యాయని చెప్పారు. సతీశ్ కూడా పుట్ట మధుపై కేసులు వేయడంతో సుపారీ మాట్లాడారన్నారు.
గతంలో సుపారీ ఆడియోలు లీకైనా పోలీసులు స్పందికపోవడం వల్లే ఈ హత్యలు జరిగాయని వీహెచ్ ఆరోపించారు. తెలంగాణ పోలీస్ అన్ని వేళల్లో సేవలందిస్తామంటూ కాలర్ ట్యూన్ పెట్టుకున్నారని.. కాని పట్టపగలు హత్యలు జరగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతును చంపాలన్న ఆలోచనతోనే చేశారు తప్ప గ్రామంలోని గుడి పంచాయితీ.. వామనరావు దంపతుల హత్యకు కారణం కాదన్నారు. రాజకీయ నేతల హస్తం ఖచ్చితంగా ఉందన్నారు వి హనుమంతరావు.