ఐపీఎల్ మ్యాచ్ లు అడ్డుకుంటాం! టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్
posted on Feb 20, 2021 @ 1:16PM
ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ యాజమాన్యం తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. లోకల్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మాజీ క్రికెటర్లు సన్ రైజర్స్ యాజమాన్యం తీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాాగా రాజకీయ నేతలు కూడా ఎంటరయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా స్పందించారు. మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిన డేవిడ్ వార్నర్ జట్టుకు కెప్టెన్ గా ఉండగా.. లోకల్ ఆటగాళ్లను తీసుకోకపోవడమేంటనీ ఆయన మండిపడ్డారు.
మ్యాచ్ ఫిక్సింగులో చిక్కుకున్న ప్లేయర్ ను కెప్టెనుగా పెట్టుకుని.. స్థానిక ఆటగాళ్లకు స్థానం లేకపోవడం ఏంటని ఆయన సన్ రైజర్స్ యాజమాన్యాన్ని నిలదీశారు. హైదరాబాదులో సత్తా ఉన్న క్రికెటర్లకు కొరత లేదన్నారు దానం నాగేందర్. సన్ రైజర్స్ టీమ్ లో హైదరాబాదు ఆటగాళ్లు లేకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా హైదరాబాదు ఆటగాళ్లకు సన్ రైజర్స్ టీమ్ లో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతై ఫ్రాంచైజీ పేరైనా మార్చుకోవాలని స్పష్టం చేశారు. ఇదే తీరు కొనసాగితే హైదరాబాదులో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు.
సన్ రైజర్స్ యాజమాన్యం తీరుపై ఇప్పటికే భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాదీలను తీసుకోకుండా జట్టు కూర్పు ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ముంబై టీమ్ మేనేజ్ మెంట్ అక్కడి లోకల్ ఆటగాళ్లను ప్రోత్సహిస్తుందని.. అందుకే అర్జున్ టెండుల్కర్ ను తీసుకున్నారని చెప్పారు.