గద్దర్ తో షర్మిల పార్టీకి ఊపు వచ్చేనా!
posted on Feb 20, 2021 @ 1:16PM
తెలంగాణలో కొత్త పార్టీకి సన్నాహాలు చేసుకుంటున్న వైఎస్ షర్మిల దూకుడుగా వెళుతున్నారు. లోటస్ పాండ్ లోని తన నివాసంలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొందరితో ఓపెన్ గా మాట్లాడుతున్న షర్మిల.. మరికొందరితో మాత్రం రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని వివిధ రంగాల ప్రముఖులతో షర్మిల మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో వైఎస్సార్ తో సన్నిహితంగా ఉన్న నేతలు షర్మిలతో టచ్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రజా యుద్ధ నౌకగా పిలుచుకునే గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవలే షర్మిలతో గద్దర్ సమావేశం అయ్యారు. గద్దర్ చేరికతో షర్మిల పార్టీకి ప్రయోజనం ఎంతన్న దానిపై రాజకీయ వర్గాలు, షర్మిల మద్దతుదారుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో మావోయిస్టుల్లో పని చేసిన గద్దర్... జన జీవన స్రవంతిలోకి వచ్చాకా కూాడా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. గతంలో ఆయనకు మాస్ ఫాలోయింగ్ బాగానే ఉండేది. తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్ కీలక పాత్ర పోషించారు. తన మాటలు, పాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారు.
అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనే అభిప్రాయం వస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత గద్దర్ ప్రజా క్షేత్రంలో తిరగడం తగ్గిపోయింది. ప్రజా ఉద్యమాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు. ఇటీవల కాలంలో తెలంగాణలో చాాలా సమస్యలు తెరపైకి వచ్చాయి. రైతులు ఆందోళనలు చేశారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఉద్యోగులు కూడా సర్కార్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అయినా ఎక్కడా గద్దర్ కనిపించలేదు. గతంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నా... గద్దర్ వారికి మద్దతు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం గద్దర్ కు క్రేజీ తగ్గిపోయిందని, ఆయన వల్ల పార్టీకి ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చని షర్మిల సన్నిహితులే చెప్పుకుంటున్నారని తెలుస్తోంది.
2018 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు గద్దర్. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కాని ఆయన ప్రభావం పెద్దగా కనిపించ లేదు. ఆయన ప్రచారం చేసిన ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ కు ఓట్లు పెరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గద్దర్.. షర్మిల పార్టీలో చేరినా...అదేమంత పనికొచ్చేది కాదనే అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాదు
ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్ కు దూరంగానే ఉంటున్నారు. ఇటీవల ఎక్కడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. రాజకీయాలు, ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉంటున్న గద్దర్ తో ప్రయోజనం ఉన్నా లేకున్నా.. పార్టీకి మాత్రం జోష్ వస్తుందని కొందరు షర్మిల అనచరులు చెబుతున్నారు .