దానికి జనం అలవాటు పడిపోయారు... మంత్రిగారి సెన్సేషనల్ కామెంట్స్
posted on Feb 20, 2021 @ 10:47AM
దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ దగ్గర నుండి నిత్యావసర వస్తువులైన వంట నూనె, పప్పులు, ఉప్పుల ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు.తాజాగా ఈ ధరల పెరుగుదలపై బీహార్ లోని నితీష్ సర్కార్ క్యాబినెట్ మంత్రి ఒకరు నోరు జారారు. దీంతో అయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్ పర్యాటకశాఖ మంత్రి నారాయణ్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ధరల పెరుగుదలకు జనం పూర్తిగా అలవాటు పడిపోయారు. ధరల పెరుగుదల వలన జనానికి ఇబ్బందేమీ లేదని వ్యాఖ్యానించారు.
ధరల పెరుగుదల అంశంపై బీహార్ అసెంబ్లీ పరిసరాల్లో విపక్షాలు నిరసన ప్రదర్శనలు చేస్తూ, ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపధ్యంలో మంత్రి నారాణయ్ ప్రసాద్ విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ మీడియా ముందు వింత వ్యాఖ్యలు చేశారు. ధరల పెరుగుదల వలన సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, దీని వలన జనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అయన అన్నారు. ప్రజలకు ధరల పెరుగుదల అలవాటైపోయిందని అయన పేర్కొన్నారు. అంతేకాకుండా ధరలు పెరిగితే జనం సొంతవాహనాలకు బదులుగా బస్సులపై వెళతారన్నారు. అయినా బడ్జెట్ వచ్చిందంటే ధరలు పెరుగుతుంటాయనీ.. దీని ప్రభావం ప్రజలపై ఎమీ ఉండదు.. మెల్లమెల్లగా జనం అలవాటు పడిపోతారని అయన వ్యాఖ్యానించారు.