ఆ ఇద్దరు కీ ఇస్తే ఆడే బొమ్మ ఈ హోంమంత్రి! 

ఏపీ హోంమంత్రి సుచరిత పై టీడీపీ నేత, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సుచరిత కేవలం కీ ఇస్తే ఆడే ఒక బొమ్మ మాత్రమేనని, ఆ బొమ్మకు సీఎం జగన్ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి కీ ఇస్తేనే ఆడుతుందని ఆమె విమర్శించారు. 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగంలో రాష్ట్రంలో ఒక్క ఆడపిల్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని అనిత విమర్శించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన అనూషను హత్య చేసిన ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. నిందితుడి పేరు పక్కన రెడ్డి అని ఉంటే.. చర్యలు తీసుకోవడానికి పోలీసులు కూడా భయపడుతున్నారని అనిత ఎద్దేవా చేశారు. తమపేరులో రెడ్డి అని తోక ఉంటే రాష్ట్రంలో ఎంతటి అరాచకమైనా చేయవచ్చా అని అనిత ప్రశ్నించారు. ఇంకోపక్క జగన్ స్వంత పత్రిక సాక్షిలో నిందితుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరులో రెడ్డిని తీసేసి మరీ వార్త ప్రచురించారని ఆమె విమర్శించారు. దిశా చట్టం ఒక దిక్కుమాలిన చట్టమని... ఒక చట్టాన్ని సక్రమంగా తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందని అనిత విమర్శించారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందే జగన్ వస్తాడని మంత్రులు, వైసిపి నేతలు, ఊదరగొట్టారని, మరి నరసరావుపేట అనూష కేసుపై సీఎం జగన్ ఎందుకు స్పందించలేదని అనిత ప్రశ్నించారు. అనూష కేసులో 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడితే సీఎం జగన్‌కు తాము సలాం చేస్తామన్నారు. మరోపక్క ఒక విద్యార్థిని దారుణ హత్యకు గురైతే స్థానిక వైసిపి ఎమ్మెల్యే అయిన అంబటి రాంబాబు కనీసం స్పందించడా అని అనిత నిలదీశారు.

విజయసాయిపై 'ట్రోల్'తీత

విజయసాయిరెడ్డి. ట్విట్టర్ పక్షి. ఎప్పుడూ నీతులు చెప్పే నేత నీతి తప్పాడు. అధికారంలో ఉండి అడ్డదిడ్డంగా ప్రవర్తించాడు. నిబంధనలకు తూట్లు పొడిచాడు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. ఎంపీ బాటలోనే మంత్రి సైతం రూల్స్ బ్రేక్ చేశాడు.  జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విజయసాయి రెడ్డి నగరంలో ప్రచారం చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో గొప్పగా పోస్ట్ చేసుకున్నారు. ఆ బైక్ ర్యాలీ ఫోటోలను చూసిన నెటిజన్లు విజయసాయిని, అవంతి శ్రీనివాస్ ను తెగ ఆడుకుంటున్నారు. మేటర్ ఏంటంటే.. బైక్ నడుపుతూ వారిద్దరూ హెల్మెట్ పెట్టుకోలేదు.  అధికారంలో ఉన్న నేతలే ఇలా నిబంధనలు పట్టించుకోకుండా, హెల్మెట్ లేకుండా బైక్ నడపడమేంటని సోషల్ మీడియాలో తెగ ప్రశ్నిస్తున్నారు. కామెంట్లతో కుమ్మేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం ఓ నేరమైతే.. బహిరంగా ప్రదేశంలో ర్యాలీ నిర్వహిస్తూ ఆ ఇద్దరు నేతలు మాస్క్ కూడా పెట్టుకోకపోవడం కొవిడ్ నిబంధనలకు విరుద్ధం. బాధ్యత గల పదవుల్లో ఉండి.. హెల్మెట్ ధరించకుండా బుల్లెట్ నడపటంతో పాటు కొవిడ్ రూల్స్ అతిక్రమించడంతో ఇరువురు నేతలు విమర్శలకు గురవుతున్నారు. ఏపీలో ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఒక పక్క ప్రభుత్వమే భారీ జరిమానాలు విధిస్తుంటే... మరోపక్క ఆ ప్రభుత్వంలోని వారే నిబంధనలు గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏపీలో హెల్మెట్ లేని ప్రయాణానికి రూ.1000 జరిమానా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. యథారాజా తథాప్రజా అన్నట్టు.. ఆ ఇద్దరు నేతల వెనక ఉన్నవారూ హెల్మెట్ లేకుండా వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు. ఆ ఫొటోలు స్వయంగా విజయసాయిరెడ్డే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ట్రోల్స్ తో పండగ చేసుకుంటున్నారు నెటిజన్స్.

కొవిడ్ డోసు వేయించుకున్న వెంకయ్య నాయుడు

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణి వేగవంతమైంది. అన్ని రాష్ట్రాల్లోనూ 60 ఏండ్లకు పైబడిన వృద్ధులతో పాటు 45 ఏండ్లకు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా డోసు ఇస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ఎయిమ్స్ కోవాగ్జిన్ టీకా వేయించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  చెన్నై‌లోని ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు.  వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫోటోలను ఉప రాష్ట్రపతి వెంకయ్య తన ట్విటర్‌లో షేర్ చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులంతా వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. పేద, ధనిక అనే తేడా లేకుండా వ్యాక్సిన్‌ సరఫరాకు మన దేశం ముందుకు రావడం హర్షించదగిన విషయమని ఆయన చెప్పారు.  రెండో డోసును 28 రోజుల తర్వాత తీసుకోవాల్సి ఉంటుందని వెంకయ్య చెప్పారు.  తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్  హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో కరోనా టీకా వేయించుకున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ లేదన్నారు మంత్రి ఈటల. అందరికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, ఎటువంటి భయం అవసరం లేదని భరోసా ఇచ్చారు. వాక్సిన్ తీసుకోవడం పట్ల ప్రజలు భయాందోళనకు గురికావద్దన్నారు. వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్స్‎లో కూడా అందుబాటులో ఉంటుందని ఈటల తెలిపారు. 

అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దైంది. మార్చి 4, 5 తేదీల్లో తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. తిరుపతి సమావేశానికి ఏపీతో పాటు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలు, లక్షద్వీప్ నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. అమిత్ షా తిరుపతి షెడ్యూల్ కూడా ఖరారైంది. తాజాగా అమిత్ షా తన తిరుపతి పర్యటన రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. అయితే అమిత్ షా తిరుపతి పర్యటన ఎందుకు రద్దయిందన్న దానిపై కారణాలు తెలియరాలేదు.  దేశంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో ప్రచారం సాగించేందుకు వీలుగా అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నట్టు భావిస్తున్నారు. ముఖ్యంగా, 8 విడతల్లో పోలింగ్ జరుపుకోనున్న పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దాంతో అమిత్ షా అధిక సమయం పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై దృష్టి సారించేందుకు ఈ పర్యటనకు రాబోవడంలేదని తెలుస్తోంది. అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు కావడం ఏపీలో నిరుత్సాహం కల్గిస్తోంది. తిరుపతి లోక్ సభకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. తిరుపతి లోక్ సభలో ప్రయోజనం కల్గుతుందనే ఆలోచనతోనే అమిత్ షా పాల్గొనే దక్షిణాది రాష్ట్రాల సమావేశాన్ని తిరుపతిలో ఏర్పాటు చేశారనే ప్రచారం కూడా జరిగింది. తిరుపతికి అమిత్ షా వస్తుండటంతో.. ఆ ప్రభావం ఉప ఎన్నికపై ఉంటుందని ఏపీ కమలనాధులు భావించారు. తాజాగా అమిత్ షా టూర్ రద్దు కావడంతో వారంతా ఢీలా పడ్డారు. 

పవార్ పవర్ పాలిటిక్స్! మోడీ టార్గెట్ గా బైడెన్ డైరెక్షన్.. 

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరో ఎన్టీఆర్ కాబోతున్నారా? జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా బలమైన కూటమి రూపుదిద్దుకోనుందా? అంటే ఢిల్లీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. 1989లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్.. అప్పడు కేంద్రంలో అధికారంలో ఉంటూ అత్యంత శక్తివంతంగా ఉన్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు, నేతలను ఏకం చేశారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన నేషనల్ ఫ్రంట్ కూటమి అప్పట్లో రాజకీయ సంచలనమైంది. ఎన్టీఆర్ బాటలోనే ఇప్పుడు శరద్ పవార్ కూడా జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బలమైన కూటమి ఏర్పాటు చేయబోతున్నారు.  ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ చీప్ కేజ్రీవాల్.. పవార్ కు ఫుల్ సపోర్టుగా ఉంటున్నారు. ఇటీవల గుజరాత్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటింది. సూరత్ కార్పొరేషన్ ను గెలుచుకుని బీజేపీ వర్గాలకు షాకిచ్చింది. గుజరాత్ ఫలితాల జోష్ తో దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో ఆప్ ను విస్తరించేందుకు కేజ్రీవాల్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో శరద్ పవార్ కూటమిలో మఫ్లర్ మెన్ కీ రోల్ పోషించబోతున్నారు. ఎంఐఎం కూడా దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే నాలుగైదు రాష్ట్రాల శాసనసభల్లో అడుగు పెట్టింది. దేశంలోని ముస్లింలో పట్టు సాధించేలా ఎత్తులు వేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ కూడా పవార్ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉండనున్నారు.     బెంగాల్ లో బీజేపీతో యుద్ధం చేస్తున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, డీఎంకే అధికారం చేపడుతుందని సర్వేలు చెబుతున్న స్టాలిన్,జమ్మూకశ్మీర్ లో బలమైన నేతలుగా ఉన్న ఫరూక్ అబ్దుల్లా, అతని కొడుకు ఒమర్ అబ్దుల్లా కూడా శరద్ పవార్ తో చేతులు కలపబోతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, అతని కొడుకు ఆదిత్య ఠాక్రే కూడా పవార్ కూటమిలో చేరబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కూడా పవార్ తో మంతనాలు సాగిస్తున్నారని చెబుతున్నా.. చివరి వరకువాళ్లను నమ్మలేమనే అభిప్రాయంతో పవార్ టీమ్ ఉంది. తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన కమల్ హాసన్ , ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని పార్టీలతో పాటు తికాయత్ కూడా పవార్ తో కలిసి పని చేయబోతున్నారు.  శరద్ పవార్ సారథ్యంలో ఏర్పడబోయే కూటమిలో వామపక్షాలు కూడా భాగస్వామ్యం కానున్నాయి. సీపీఎం సీనియర్ నేతలు ప్రకాశ్ కారత్ , సీతారం ఏచూరీలు ఇప్పటికే పవార్ తో చర్చలు జరిపారు. గతంలో ఎన్టీఆర్ కూటమిలోనూ వామపక్షాలు ముఖ్య పాత్ర పోషించాయి. కాంగ్రెస్ అసమ్మతి టీమ్ కూడా పవార్ వెనుక ఉంది. పార్టీ నాయకత్వం తీరును ఎండగడుతూ గతంలో 23 కాంగ్రెస్ సీనియర్ నేతలు.. సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు కలకలం రేపారు. జీ23గా పిలవబడుతున్న ఆ నేతలో శనివారం జమ్మూలో గులాం నబీ ఆజాద్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఆ వేదిక నుంచే మరోసారి అధినాయకత్వంపై అసమ్మతి గళం వినిపించారు. ఈ నేపథ్యంలో ఆజాద్ నేతృత్వంలో కాంగ్రెస్ జీ23 నేతలంతా శరద్ పవార్ తో కలిసి పని చేయనున్నారు. పవార్ కూటమికి ఆజాదే కర్త, కర్మ , క్రియ.  శరద్ పవార్ కూటమి గురించి మరో చర్చ కూడా జరుగుతోంది. ఆ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాన మంత్రిగా ఎవరు ఉంటారనేది ప్రశ్నగా మారింది. కూటమికి సారథ్యం వహించే పవారే పీఎంగా ఉంటారని ప్రచారం జరిగినా.. తనకు ప్రధాని కావాలన్న కోరిక లేదని స్పష్టం చేశారు పవార్. ప్రత్యామ్నాయ కూటమిని ముందుడి నడిపిస్తాను కాని.. ప్రధాని పదవిని చేపట్టబోనని చెప్పారు. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అంగీకరిస్తే.. అతన్ని పీఎం అభ్యర్థిగా ముందుండనున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే కూటమికి బయటి దేశాల నుంచి మద్దతు ఉంది. ముఖ్యంగా అమెరికాలో అధికారంలో ఉన్న జోబిడెన్ టీమ్ బీజేపీ వ్యతిరేక కూటమికి సపోర్ట్ చేయబోతుంది.  గత నవంబర్ లో జరిగిన యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు ప్రధాని మోడీ సపోర్ట్ చేశారు. ఎన్నికలకు ముందు ఇండియాకు వచ్చిన ట్రంప్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ట్రంప్ కోసం మోడీ ఓపెన్ సపోర్ట్ చేయడంపై గుర్రుగా ఉన్న జోబిడెన్.. బీజేపీని ఓడించేందుకు కొత్త కూటమికి మద్దతు ఇవ్వనున్నారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న తాజా పరిణామాలతో దేశ రాజకీయాల్నని పవార్ చుట్టూనే తిరుగుతున్నాయి. 

హరీశ్, ఈటల జంపేనా! రేవంత్ చెప్పిందే నిజమా?

రేవంత్ రెడ్డి మాట వెనుక మర్మం దాగుంటుంది. ఆయన నెట్ వర్క్ ఓ రేంజ్ లో ఉంటుంది. రేవంత్ ఒక డైలాగ్ వేశారంటే దానికి ఎంతో లెక్క ఉంటుంది. తెలంగాణ ఆక్టోపస్ రేవంత్ రెడ్డి. గతంలో టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీని వీడుతారని అందరికన్నా ముందే చెప్పింది రేవంత్ రెడ్డినే. అచ్చం ఆయన చెప్పినట్టే జరిగింది. అప్పటి వరకూ కొండాపై ఎవరికీ అనుమానం  లేకుండే. కానీ, రేవంత్ చెప్పినట్టే జరిగింది. కొన్ని రోజులకే ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి మరో బాంబు వేశారు. టీఆర్ఎస్ లో ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ పని అయిపోయిందని.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ రావు పని కూడా అయిపోతుందని రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఈసారి కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టే జరుగుతుందా? అధికార పార్టీలో అలజడి పక్కానా? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. హరీశ్ రావు పని అయిపోయిందా? కల్వకుంట్ల ఫ్యామిలీలో జరిగే రాజకీయ డ్రామా ఓ పట్టాన బయటి వారికి అర్థం కాదు. ఒక్క రేవంత్ రెడ్డికి తప్ప. మామకు అల్లుడి గండం ఉందంటూ మొదటి నుంచీ ప్రచారం. హరీశ్ రావు ఎప్పటికైనా ఏకు మేకవుతాడని కేసీఆర్ కు భయం. అందుకే, కొడుకు కేటీఆర్ కు లైన్ క్లియర్ చేసేందుకు.. హరీశ్ ను నెంబర్ టూ పొజిషన్ నుంచి తప్పించారు. నెంబర్ జీరో చేశారు. ఒకప్పటి ట్రబుల్ షూటర్ ఇప్పుడు ట్రబుల్స్ లో ఉన్నారు. హరీశ్ రావు పేరుకే టీఆర్ఎస్ లో ఉన్నారు. పార్టీలో ఆయన రోల్ జీరో. పేరుకే ఆయన ఆర్థిక మంత్రిగా మంచి పదవిలో ఉన్నారు. ప్రభుత్వంలో ఆయనకు జరిగే మంచంటూ ఏమీ లేదు. హరీశ్ రావు కారు పార్టీకి గోడ మీది పిల్లిలా మారారని అంటుంటారు. ఇలా కేసీఆర్ గ్రాఫ్ పడిపోగానే.. పార్టీని చీల్చి అలా జంప్ అయిపోదామనే ఆలోచనతో ఉన్నాడనేది కొందరి మాట. గత ఎన్నికల్లో గజ్వేల్ లో స్వయానా కేసీఆర్ ను ఓడించేందుకు హరీశ్ రావు ప్రయత్నించారని అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్య్రర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏకంగా బహిరంగ సభ వేదిక మీది నుంచే ప్రకటించడం సంచలనం. హరీశ్ రావు కుట్రలు ఆ రేంజ్ లో ఉంటాయని చెబుతుంటారు. హరీశ్ రావుతో పడలేకే, ఒకప్పటి టీఆర్ఎస్ కీలక నేత, ప్రస్తుతం బీజేపీలో ఉన్న రఘునందన్ రావు పార్టీని వీడారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సైతం హరీశ్ రావు అంటే వామ్మో అంటారు. అంతటి ఖతర్నాక్ లీడర్ హరీశ్ రావు. అంతకుమించి మాస్టర్ మైండ్ కేసీఆర్. అందుకే మామ ముందు అల్లుడి పప్పులేమీ ఉడకడం లేదట. ఇక మామ చెంతన ఉంటే తనకు భవిష్యత్ ఉండదని భావిస్తున్న హరీశ్.. అదును కోసం ఎదురు చూస్తున్నారని చెబుతుంటారు. దుబ్బాక ఎన్నికతో పార్టీలో హరీశ్ రావు ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. అందుకే, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ రావు పని అయిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ త్వరలోనే నిజమైనా ఆశ్చర్యపోనక్కరలేదు అంటున్నారు. ఈటల పని కూడా అయిపోయిందా? ఆరోగ్యశాఖ మంత్రి ఈటల. ఉద్యమ సమయంలో పార్టీలో నెంబర్ టూ. ఫస్ట్ టర్మ్ ప్రభుత్వంలోనూ టాప్ ప్లేస్. సెకండ్ టర్మ్ వచ్చే సరికి అంతా ఉల్టా పల్టా. ఈటల పార్టీని వీడిపోతారంటూ ఒకటే ప్రచారం. కేసీఆర్ తో విభేదాలంటూ లీకులు. ప్రచారానికి తగ్గట్టే పరిస్థితులూ కనిపిస్తున్నాయి. కీలకమైన ఆర్ధికం నుంచి ఆరోగ్యానికి డిమోషన్. అంతర్గత సమావేశాల సమాచారం మీడియాకు, విపక్షాలకు లీక్ చేస్తున్నారంటూ ఈటలను దోషిగా నిలబెట్టే ప్రయత్నం. అందుకే, ఒళ్లు మండి, తీవ్ర అసహనానికి లోనై.. కడుపులోని ఆవేశం బయటకు కక్కేశారు ఈటల. గులాబీ జెండాకు అసలైన ఓనర్లం తామేనంటూ గులాబీ బాస్ పై ఎర్రజెండా ఎగరేశారు మంత్రి ఈటల. ఆ తర్వాత నుంచీ పార్టీలో ఆయన ప్రాధాన్యం మరింత తగ్గుతూ వస్తోంది. ఈలోగా కరోనా రావడంతో కేవలం ఆరోగ్య శాఖ కార్యకలాపాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇటు పార్టీ, అటు ప్రభుత్వంలో ఈటల గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతోంది. తాజాగా,  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ సన్నద్ధతపై సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్‌కు ఆహ్వానం అందలేదు. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాలు వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోకి వస్తాయి. అంటే, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఈటల సొంత నియోజకవర్గం గ్రామాలూ ఉన్నాయి. అయినప్పటికీ.. ఆయనను సీఎం వద్ద జరిగిన భేటీకి పిలవలేదు. ఈటల వైఖరి మారిన కారణంగానే ఆయనను టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కొంత దూరం పెడుతున్నట్లు ఇప్పటికే పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన వినోద్ కుమార్ కు ఈటల రాజేందర్ సహకరించలేదని, ఆయన కుట్రతోనే వినోద్ కుమార్ ఓడిపోయారని.. అప్పటి నుంచి కేసీఆర్ ఈటల రాజేందర్ ను పక్కన పెట్టారని అంటుంటారు. ఈటల సైతం కేసీఆర్ తీరుపై తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారని.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కోసం వేచి చూస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి సైతం టీఆర్ఎస్ లో ఈటల పని అయిపోయిందని అనడంతో.. ఇక ఈటల పని అయిపాయ్.. అంటూ అంతా ఫిక్స్ అయిపోతున్నారు.  టీఆర్ఎస్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఇద్దరు నేతలు ఈటల, హరీశ్ రావుల ప్రభ ఇప్పుడు మసకబారిపోయింది. తెలంగాణ ఆక్టోపస్ రేవంత్ రెడ్డి చెప్పినట్టు త్వరలోనే వారిద్దరి పని అయిపోతుందా? అనే చర్చ మొదలైంది. ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.

ఏపీ బీజేపీ నేతల చీకటి డీల్! ఆ ఇద్దరిపై వేటు ఖాయమేనా... 

దేశం మొత్తం మోడీ నేతృత్వంలోని బీజేపీ తన హవా చాటుకుంటుండగా ఏపీలో మాత్రం బీజేపీ నోటాతో పోటీ పడుతోంది. ఒకపక్క తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తన దూకుడుతో పార్టీకి విజయాలు అందిస్తుండగా ఏపీలో మాత్రం పార్టీని బలోపేతం చేయకుండా.. కొంత మంది నేతలు పార్టీని భ్రష్టు పట్టించే పనులలో బిజీగా ఉన్నట్లు  వార్తలు వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ బీజేపీలో కొత్తగా చక్రం తిప్పుతున్న ఇద్దరు నేతలు ఓ భారీ స్కాంలో పీకల్లోతు మునిగినట్లుగా తెలుస్తోంది. రాయలసీమలోని ఒక ప్రముఖ ఆశ్రమంలో గతేడాది జరిగిన ఐటీ, ఈడీ దాడుల కేసుల నుంచి బయట పడేస్తామంటూ ఆ ఇద్దరు నేతలు రూ. ముఫ్పై కోట్లను వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ స్కామ్ లో ఆ ఇద్దరు నేతల నిర్వాకం పై కేంద్ర నిఘా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయి.. ఎవరి నుండి ఎంత వసూలు చేశారు.. ఏ బ్యాంక్ నుండి లావాదేవీలు జరిగాయి అన్న అంశాలపై కూడా పూర్తి వివరాలను కేంద్ర నిఘా సంస్థలు సేకరించి… కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్కామ్ పై కేసు నమోదుకు కూడా ఆ సంస్థలు సిద్దమయ్యాయని వార్తలు వస్తున్నాయి.  గత ఏడాది చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ ఆశ్రమంలో ఐటి ఇడి సోదాలు జరిగాయి. ఆ సోదాలలో వందల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించి పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఆయా సంస్థలు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టడంతో.. ఈ కేసుల నుండి ఎలా బయటపడాలా అని ఆశ్రమ నిర్వాహకులు ఆలోచిస్తున్న సమయంలో రాయలసీమకు చెందిన ఒక బీజేపీ నాయకుడు ఈ వ్యవహారంలో తాను సహాయం చేస్తానని కబురు పెట్టాడు. తనకు కేబినెట్‌ మంత్రి హోదా పదవి ఉందని.. తాను చెబితే ఢిల్లీలో పని అవుతుందని ఆ నేత ఆశ్రమ నిర్వహకులను కన్విన్స్ చేసి.. ఈ కేసునుండి బయటపడేస్తామని చెప్పి మొత్తం 30 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు రాష్ట్రానికి తరచూ వచ్చి వెళ్లే మరో ప్రముఖ బీజేపీ నేతతో చర్చించి రాయలసీమ నేత ఈ డీల్ సెట్ చేసుకున్నట్లుగా సమాచారం. ఇది ఇలా ఉండగా ఇప్పటికే కొంత మంది ఏపీ బీజేపీ నేతలు కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని దందాలకు అలవాటు పడ్డారన్న ప్రచారం జరుగుతోంది.. ఈ తాజా వ్యవహారంతో.. తమ సొంత ప్రభుత్వానికే ఆ ఇద్దరు బీజేపీ నేతలు దొరికిపోయినట్లుగా తెలుస్తోంది. మరో నాలుగు రోజుల్లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన ఉండడంతో.. అయన పర్యటన ముగిసిన తర్వాత ఆ ఇద్దరు నేతలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోడీ అవినీతిని ఏమాత్రం సహించరని.. దీంతో ఆ ఇద్దరు నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని కొంత మంది, కాదు కాదు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని బీజేపీ నేతలు చెపుతన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో త్వరలోనే తేలనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తే ఆ నేతల రాజకీయ జీవితం ఇక్కడితో ముగిసిపోయినట్లేనని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు .

సామాన్యుడికి బండ భారం!

సామాన్యుడికి మ‌రో షాక్ త‌గిలింది. వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ మళ్లీ పెరిగింది. ఈ సారి వంట గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌లే కాకుండా వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌లు కూడా పెరిగాయి. వంటగ్యాస్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.95ను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ ధ‌ర‌లు వెంట‌నే అమ‌ల్లోకి వ‌చ్చాయి.  ఈ నెల 25వ తేదీన‌ వంట‌గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.25 పెరిగింది. అనంత‌రం‌ 4వ తేదీన సిలిండ‌ర్‌పై రూ.25 పెరిగింది. ఆ త‌ర్వాత 15వ తేదీన మ‌రో రూ.50 పెరిగింది. నాలుగుసార్లు గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లను పెంచడంలో ఈ నెల‌లో మొత్తం రూ.125 పెరిగిన‌ట్ల‌యింది. ఈ మూడు నెలల వ్యవధిలో గ్యాస్‌ బండపై  రూ.225 పెరిగింది. గత ఏడాది డిసెంబరు‌ 1న సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కి పెంచారు. ఆ తర్వాత జనవరి 1న రూ.644 నుంచి రూ.694కు పెంచారు. ఈ నెల  4న ధ‌ర‌ రూ.719కి చేరింది. 15న   రూ.769 చేరింది. 25న మ‌రో 25 రూపాయ‌లు, ఈ రోజు మ‌రో రూ.25 పెంపుతో ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ.819కి చేరింది. ఇక వాణిజ్య సిలిండర్‌పైనా ఈ రోజు రూ.95 పెరగడంతో, సిలిండర్‌ ధర రూ.1,614కు చేరింది.

ఆ పాపాన్ని బీ ఫారంతో కడిగేసుకుంటారా?

హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెరాస, బీజేపీ ఎమ్మెల్సీఅభ్యర్ధులు ప్రధానంగా బ్రాహ్మణ ఓటర్లపై దృష్టిని కేంద్రేకరించారు. బ్రాహ్మణ ఓటర్లు ఎటు మొగ్గుచూపితే అటే విజయం నడిచి వెళుతుందని పార్టీల  విశ్వాసం. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా పీవీ కుమార్తె వాణీ దేవిని చివరి నిముషంలో బరిలో దించారు. తెరాస నాయకులు ప్రత్యేకంగా బ్రాహ్మణ పట్టభద్రులు, ఉద్యోగుల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.  బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది వామన రావు దంపతుల హత్య వెనక తెరాస నాయకుల హస్తమున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో బ్రాహ్మణ ఓటర్లు కొంత ఆగ్రహంతో ఉన్నారు. బీజీపీ సీనియర్ నాయకురాలు, విజయ్ శాంతి, వామన రావు దంపతుల హంతకులపై ఎలాంటి చర్యలు తీసుకుననరో చెప్పకుండా బ్రాహ్మణ సామజిక వర్గం ఓట్లు అడిగే హక్కు తెరాసకు లేదని మండి పడ్డారు. 'కరీంనగర్ జిల్లా బ్రాహ్మణ హత్యల పాపాన్ని కౌన్సిల్ బీ ఫారంతో కడిగేసుకుందామన్న కుట్ర చెల్లుతుందా? వామనరావు దంపతులపై బ్రహ్మ హత్యా పాతకానికి పాల్పడి వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ప్రాయశ్చిత్తం అవుతుందా?' అని ఆమె ప్ర‌శ్నించారు. 'కేసీఆర్ గారి చర్యలను.... ఆవేదనతో రగిలిపోతున్న బ్రాహ్మణులు అంతర్గత సమావేశాలలో ఆత్మసాక్షిగా ప్రశ్నించుకుంటున్నట్లు సర్వత్రా వినిపిస్తోంది. మంథనిలో చేసిన పాపానికి మల్కాజిగిరితో పాటు మూడు ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణ ఓటర్లతో ప్రక్షాళన చేసుకోవాలని సీఎం దొరగారు చేస్తున్న కపట ప్రయత్నాలను అర్థం చేసుకోలేని అమాయక స్థితిలో బ్రాహ్మణ సామాజిక వర్గం లేదు' అని విజ‌య‌శాంతి పేర్కొన్నారు. 'బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునేందుకు పీవీ గారి బిడ్డ వాణీదేవిని బరిలోకి దించిన కేసీఆర్ గారు వామనరావు దంపతుల హత్యకు కారకులైనవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో... చెబితే తప్ప, ఓట్లు అడిగే నైతిక హక్కు ఉండదన్న స్పష్టమైన వైఖరితో బ్రాహ్మణ సమాజం ఉన్నట్లు కనిపిస్తోంది' అని విజ‌య‌శాంతి ట్వీట్ చేశారు.పీవీ గారి కుమార్తెకు టికెట్ కేటాయించానని ప్రచారం చేసుకుంటున్న గులాబీ బాస్... బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రామచందర్ రావు గారికి పడే బ్రాహ్మణ ఓట్లను చీల్చడానికి కుట్ర చేస్తున్నారనేది వాస్తవమన్నది మొత్తం తెలంగాణ సమాజపు అభిప్రాయం' అని విజ‌య‌శాంతి పేర్కొన్నారు. 

అప్పుడు విశాఖ.. ఇప్పుడు రేణిగుంట.. పోరాట యోధుడు చంద్రబాబు

ఫిబ్రవరి 27, 2020. విశాఖ విమానాశ్రయం ముందు యుద్ధ వాతావరణం. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించాక ప్రజా చైతన్య యాత్ర కోసం విశాఖ పర్యటనకు  వెళ్లారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. టీడీపీ అధినేతను బలవంతంగా అడ్డుకున్నారు వైసీపీ మూకలు. వైసీపీ శ్రేణులు విధ్వంసకారులుగా మారి చంద్రబాబు కాన్వాయ్ ను విమానాశ్రయం ముందు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అడ్డుకోవాల్సిన పోలీసులు చేతులెత్తేశారు. పరోక్షంగా వైసీపీ శ్రేణులకు సహకరించారు. పరిస్థితి అదుపు తప్పుతున్నా.. నిరసనకారుల రూపంలో ఉన్న అధికార పార్టీ కార్యకర్తలను కట్టడి చేయలేదు.  పోలీసుల తీరును తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు చంద్రబాబు. విశాఖలో పర్యటించే తన ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీల తీరుకు నిరసనగా వాహనం దిగి ఎయిర్ పోర్టు ముందు రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు తీసుకున్న అనూహ్య నిర్ణయానికి ఖాకీలు కంగుతిన్నారు. చంద్రబాబును నిరసన విరమించాల్సిందిగా కోరారు. అందుకు ప్రతిపక్ష నేత ససేమిరా అన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చంద్రబాబుని అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్టు చేయాలనుకుంటున్నారో పోలీసు అధికారులు తమకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఖాకీలు బలవంతంగా చంద్రబాబును విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించారు. అప్పట్లో ఈ ఘటన పెను సంచలనంగా మారింది. తనను ఎయిర్ పోర్టు ముందు అడ్డుకోవడం, విమానాశ్రయం నుంచి బలవంతంగా వెనక్కి పంపించడంపై చంద్రబాబు ఆ తర్వాత కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఏడాది క్రితం విశాఖలో జరిగిన ఘటనపై అప్పట్లో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా  వారిలో ఏమాత్రం మార్పు వచ్చ్చినట్టు లేదు. తాజాగా, చంద్రబాబు చిత్తూరు పర్యటన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును మరోసారి అడ్డుకొని ఖాకీలు విమర్శల పాలవుతున్నారు. ప్రతిపక్ష నేతను ఇబ్బందుల పాలు చేసేందుకే పోలీసులు ఇలా ఓవరాక్షన్ చేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు, ప్రజలు మండిపడుతున్నారు. ఓ పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా చిత్తూరులో పర్యటించే హక్కు చంద్రబాబుకు ఉంది. ఆ మేరకు ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి కూడా తీసుకున్నట్టు చంద్రబాబు తెలిపారు.  పోలీసులు SEC పర్మిషన్ గురించి తమకు తెలియదంటూ బాబును అడ్డుకోవడం హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. పోలీసులు కావాలనే ఇలా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ముందస్తు ఏర్పాట్లతో, నోటీసులు సిద్ధం చేసుకొని మరీ పోలీసులు చంద్రబాబును విమానాశ్రయంలో నిర్బంధించారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సాధారణ వ్యక్తి ఏమీ కారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకూ సీబీఎన్ అంటే తెలియని వారుండరు. అంతటి స్థాయి ఉన్న నాయకుడిని అడుగు ముందుకు వేయనీయకుండా అడ్డుకోవడం.. ఎయిర్ పోర్టు లాంజ్ లోనే కట్టడి చేయడం పోలీసుల ఓవరాక్షన్ కు నిదర్శనం అంటున్నారు. ఆయనేమైనా సంఘవిద్రోహ శక్తా? చంద్రబాబు నుంచి సెల్ ఫోన్ లాక్కోవడం ఏంటి? ఇదేమైన చిన్న విషయమా? ఇంత కంటే అవమానం ఇంకేముంటుంది? ప్రతిపక్ష నేతకు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ జిల్లాలో పర్యటించే అధికారం లేదా? అందులోనూ చంద్రబాబు సొంత జిల్లాలోనే ఆయనను పర్యటించకుండా అడ్డుకొని పైశాచిక ఆనందం పొందడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బాబు నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం మరింత దారుణమని మండిపడుతున్నారు.  పోలీసుల తీరును చంద్రబాబు గట్టిగా వ్యతిరేకించారు. తానేమైన హత్య చేయడానికి వెళుతున్నానా? తననెందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించారు. పదండి కలెక్టర్, ఎస్పీ దగ్గరికే వెళ్దామన్నా అక్కడి వారు వినిపించుకోలేదు. అందుకే, విమానాశ్రయంలో బైఠాయించి నిరసన తెలిపారు చంద్రబాబు. తగ్గేదే లేదు. ప్రజల దగ్గరికి వెళ్లకుండా తనను అడ్డుకోలేరంటూ చంద్రబాబు ట్విట్టర్ లోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు స్థాయి వ్యక్తి అలా ఒంటరిగా నేలపై కూర్చొని నిరసన తెలపి దృశ్యాలు అందరినీ కలిచి వేస్తున్నాయి. ఎంతటి నేతను ఎంతలా వేధిస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. సొంత జిల్లా పర్యటనకు వెళితే అడ్డుకోవడమేంటని ప్రభుత్వం తీరును అసహ్యించుకుంటున్నారు. అంతలోనే చంద్రబాబు పోరాట నైజం, ధైర్యం చూసి అంతా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. 

తగ్గేదే లేదు.. ఖబర్దార్..

తిరుపతి రేణుగుంట ఎయిర్ పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం ఏపీలో రచ్చగా మారింది. పోలీసులు, జగన్ సర్కార్ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. తిరుపతిలో తనను పోలీసులు అడ్డుకోవడంపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. ‘నన్ను అడ్డుకోలేరు.. నేను తగ్గేది లేదు. నన్ను ప్రజల్ని కలవనీయకుండా ఆపటం తగదు. భయంతో ఎన్ని రోజులు పాలన సాగిస్తావు?. ఇకనైనా జగన్ ఎదగాలి’ అని సీఎంపై ట్విట్టర్‌లో చంద్రబాబు ధ్వజమెత్తారు.   చంద్రబాబు నాయుడిని పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2019లో పల్నాడు వెళ్లకుండా ఇంటి గేటుకి తాళ్లు కట్టి అడ్డుపడ్డారని...2020లో విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు రాకుండా చుట్టుముట్టారని... 2021లో రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో నిర్బంధించారని గుర్తుచేశారు. పిరికి పాలకుడు జగన్ రెడ్డి అరాచకాలు ఇంకెన్నాళ్లు? అని ప్రశ్నించారు. ‘‘ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి కట్టిన తాళ్లే నీ పాలన అంతానికి ఉరితాళ్లు. డెమోక్రసిని జగనోక్రసీతో అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష నేత హక్కులు హరిస్తున్న ప్రతీ సంఘటన జగన్ రెడ్డి పతనానికి నాంది కాబోతోంది’’ అంటూ లోకేష్ హెచ్చరించారు.    

పోలీసుల ఓవరాక్షన్.. ఎయిర్ పోర్టులో చంద్రబాబు నిర్బంధం

14 ఏళ్లు ముఖ్యమంత్రి. 30 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. ప్రస్తుతం ప్రతిపక్ష నేత. జగమెరిగిన రాజకీయ యోథుడు చంద్రబాబుకు రేణుగుంట విమానాశ్రయంలో తీవ్ర అవమానం. పోలీసుల ఓవరాక్షన్. గంటల తరబడి హైటెన్షన్. చంద్రబాబు తిరుపతిలో పర్యటించేందుకు అనుమతి లేదంటూ ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు పోలీసులు. లాంజ్ నుంచి బయటకు రాకుండా ఖాకీలు కట్టడి చేశారు. సీబీఎన్ టూర్ కు అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారు. కాలు బయట పెట్టకుండా చంద్రబాబును పోలీసులు చుట్టుముట్టారు. చంద్రబాబు దగ్గరున్న మొబైల్‌ను బలవంతంగా పోలీసులు లాక్కున్నారు. అంతేకాదు.. పీఏ, వైద్య అధికారితో పాటు ఆయన వెంట ఉన్న ఇతరుల నేతల ఫోన్లను కూడా బలవంతంగా పోలీసులు లాక్కున్నారు. ఖాకీల తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఎయిర్ పోర్టులోనే బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలిసి తెలుగు తమ్ముళ్లు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్ పోర్టుకు వచ్చిన టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.     పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎస్పీ, కలెక్టర్‌ను కలిసి తన పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో తెలుసుకుంటానని చంద్రబాబు చెప్పినా.. పోలీసులు అనుమతించలేదు. పర్యటనకు ఎందుకు వచ్చానో.. తననెందుకు ఎయిర్‌పోర్టులో నిలిపేశారో మీడియాకు వివరిస్తానని చెప్పినా పోలీసులు అందుకు నిరాకరించారు.  కలెక్టర్, ఎస్పీని కలవడానికి తాను వెళతానంటున్నా.. వెళ్లనివ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. వాళ్లను ఇక్కడికే పిలిపిస్తామని పోలీసులు చెప్పగా... తానేం అంత గొప్ప వ్యక్తిని కాదని.. తనకు తానుగా అక్కడికి వెళతానని అన్నారు. తనదగ్గరకే పిలిపిస్తామని చెప్పడాన్ని ఆయన తోసిపుచ్చారు. ప్రపంచానికి ప్రభుత్వం చేసే అరాచకాలు తెలియాల్సిందేనన్నారు. మీడియాతో కూడా మాట్లాడించకపోవడాన్ని కూడా ప్రశ్నించారు. ‘‘నేనేమైనా హత్య చేయడానికి వెళుతున్నానా.. 14 ఏళ్లు సీఎంగా ఉన్నాను. ప్రతిపక్ష నేతను నేను. నన్నెందుకు  నిర్బంధించారో చెప్పండి’’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. చిత్తూరు నగరపాలక సంస్థలో కార్పొరేటర్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచేందుకు సోమవారం జిల్లా పర్యటనకు వచ్చారు చంద్రబాబు. అభ్యర్థులకు వస్తున్న బెదిరింపులకు నిరసనగా ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నగరంలోని గాంధీ కూడలి వద్ద ధర్నా చేయాల్సి ఉంది. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి పుత్తూరు మీదుగానే తిరుపతి చేరుకుంటారు. సాయంత్రం 5.45 గంటలకు తిరుపతిలో జరిగిన అరాచక పర్వంపైనా ఆర్టీసీ బస్టాండు సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపాల్సి ఉంది. తర్వాత ఆటోనగర్‌లోని పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి 7.15 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళతారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పలువురు తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో తెదేపా నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు.

సొంత జిల్లాలోకి బాబుకు నో ఎంట్రీ!           

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలోకి అడుగు పెట్టేందుకు అనుమతి లేకుండా పోయింది. తిరుపతిలో చంద్రబాబు తలపెట్టిన నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్నాయంటూ చంద్రబాబును ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు.చంద్రబాబు నిరసనలకు అనుమతించటం లేదని ఈస్ట్ డీఎస్పీ తెలిపారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు ధర్నా నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నానితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అందరిని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. టీడీపీ అధినేత  తిరుపతిలో సోమవారం సాయంత్రం 4 గంటలకు గాంధీ విగ్రహాల వద్ద  నిరసనలు  చేపట్టాలని  నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నిరసనలకు అనుమతిలేదని  టీడీపీ పార్టీ కార్యాలయానికి, తిరుపతి మాజీ ఎమ్మెలే సుగుణమ్మకు, నరసింహ యాదవ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి అనుమతి కోరుతూ ఆదివారం టీటీడీ నేతలు లేఖ ఇచ్చినా, అర్ధ రాత్రి అనుమతి నిరాకరిస్తున్నట్టు, సోషల్ మీడియాలో తమకు విషయం తెలిసినట్టు టీడీపీ నేతల ఇండ్లకు పోలీసులు నోటీసులు అతికించారు. చంద్రబాబు  ధర్నా కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. దీంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  చంద్రబాబు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. హౌస్ అరెస్టు చేసిన చిత్తూరు టీడీపీ నేతలను తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో  ప్రతిపక్ష నాయకుడు స్వేచ్ఛగా ప్రజల వద్దకు వెళ్లే హక్కులేదా అని నిలదీశారు. వేలాది మందితో కుల సంఘాల మీటింగులు, ర్యాలీలు, సభలు, పెట్టుకోడానికి అనుమతి ఇస్తున్న ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు.  ఎన్నికల్లో వైసీపీ మంత్రులు చేసిన అక్రమాలు బట్టబయలు అవుతాయన్న భయంతోనే అనుమతి ఇవ్వటం లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. చంద్రబాబు పర్యటన చూసి మండుటెండలో కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వణికిపోతున్నారన్నారు. ప్రజాక్షేత్రంలోనే తమ వైఫల్యాలు, అవినీతిని, గూండాగిరిని ప్రజలకు వివరిస్తామని...తమ పాలనపై ప్రజలు విసిగెత్తారు కాబట్టే ప్రజల తరపున నిలబడుతున్న నేతలను ఇళ్లలో నిర్భందిస్తున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

కరోనా ఎఫెక్ట్.. మేడారం కు ఎవరూ రావద్దు..

మేడారంలో సమ్మక్క సారలమ్మ మినీ జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక పక్క రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అయితే ఈ మినీ జాతరలో కరోనా కలకలంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమ్మక్క సారలమ్మ ఆలయ సిబ్బందిలో ఇద్దిరికి కరోనా సోకడంతో 21 రోజులపాటు భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్టుగా తెలిపారు. భక్తులెవరు అప్పటి వరకు వనదేవతల దర్శనానికి రావొద్దని అధికారులు కోరుతున్నారు. మేడారంలో మినీ జాతర ఫిబ్రవరి 24న మొదలై 27వ తేదీ వరకు జరిగింది. అయితే అమ్మవార్ల దర్శనానికి నెల రోజుల ముందు నుండి భక్తులు తండోప తండాలుగా వచ్చారు. దీంతో ఆలయ సిబ్బందిలో ఇద్దరికీ రెండు రోజుల క్రితం కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో భక్తులు, గ్రామ ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని మూడు వారాల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో రాజేంద్రం, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. ఈ నెల 21 వరకు భక్తులు ఎవరూ దర్శనానికి రావొద్దని అభ్యర్థించారు. ఇదే సమయంలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నప్పటికీ ఆలయంలో పూజలు మాత్రం యధాతధంగా ఉంటాయని వారు తెలిపారు.

కోవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ   కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా  60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు మార్చి 1 నుంచి టీకా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం దిల్లీలోని ఎయిమ్స్‌ కు వెళ్లిన  ప్రధాని మోడీ.. తొలి డోసు టీకాను తీసుకున్నారు.    దేశీయంగా హైదారాబాద్ లోని భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకాను ప్రధాని నరేంద్ర మోడీ  తీసుకున్నారు. మోడీకి సిరంజీ ద్వారా ఎయిమ్స్‌ సిస్టర్‌ పి.నివేదా టీకా ఇచ్చారు. టీకా తీసుకున్న సమయంలో అసోంలో తయారు చేసిన గమ్చా ను ధరించి మోడీ కనిపించారు. అసోం మహిళల ఆశీస్సులకు చిహ్నంగా ఆయన ఈ వస్త్రాన్ని ధరించారు. గతంలోనూ చాలా సందర్భాల్లో మోడీ గమ్చా ను ధరించారు.  ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయన ఉదయాన్నే ఎయిమ్స్‌కు వెళ్లి కొవిడ్‌ టీకా తీసుకున్నారు. టీకా వేసే సమయంలో కేరళకు చెందిన మరో నర్సు కూడా అక్కడ ఉన్నారు.   తాను తొలి డోసు టీకా తీసుకున్నట్లు మోడీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కొవిడ్‌కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. అర్హులందరూ కొవిడ్‌ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్‌ను కొవిడ్‌ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.  

 బీజేపీలోకి గులాం నబీ ఆజాద్? మోడీ ఆకర్ష్ ఫలించినట్టేనా!

ఆలిండియా కాంగ్రెస్ లో కొంత కాలంగా నెలకొన్న పరిస్థితులు,, ఆ పార్టీ సంక్షోభం దిశగా  వెళుతున్నట్లు కనిపిస్తోంది. సీనియర్ నేతలు సోనియా, రాహుల్ కు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే జీ23 నేతలుగా పిలవబడుతున్న సీనియర్లు సొంత కుంపటి పెట్టబోతున్నారనే వార్తలు వస్తుండగా.. తాజాగా జరిగిన ఘటనతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ లో అసలు వివాదానికి కారణమైన సీనియర్ రాజకీయ నేత గులాం నబీ ఆజాద్... అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా పదవి విరమణ చేసిన ఆజాద్.. కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. శనివారం జమ్మూలో ఆజాద్ ఆత్మీయ సమావేశం పేరుతో ఆయన బల ప్రదర్శన నిర్వహించారు. ఆజాద్ సమావేశానిరి కాంగ్రెస్ లో జీ23గా పిలువబడుతున్న నేతలు హాజరయ్యారు. గతంలో సోనియాను ధిక్కరిస్తూ బహిరంగ లేఖ రాసిన సీనియర్లు.. ఆజాద్ సమావేశంలో మళ్లీ కలుసుకోవడం కాంగ్రెస్ లో కలకలం రేపింది. అంతేకాదు కాంగ్రెస్ నాయకత్వంపై కొందరు నేతలు ఓపెన్ గానే తమ అసమ్మత్తిని వెళ్లగక్కారు.  కాంగ్రెస్ లో చీలక రానుందా అన్న సంకేతం ఇచ్చిన జమ్మూ సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే.. గులాం నబీ ఆజాద్ మరో సంచలనానికి తెర తీశారు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ ప్రకటన చేశారు. జమ్మూలో ఓ సభలో ప్రసంగిస్తూ..  తన నేపథ్యాన్ని దాచుకోవాలని మోడీ ఎప్పుడూ ప్రయత్నించలేదని అన్నారు. అనేకమంది నేతలకు సంబంధించిన పలు అంశాలను తాను ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించానని తెలిపారు ఆజాద్. తాను పల్లెటూరి నుంచి వచ్చానని..  అందుకు గర్విస్తుంటానని ఆజాద్ పేర్కొన్నారు. మన ప్రధాని మోడీ కూడా గ్రామం నుంచే వచ్చారని చెప్పారు. మోడీ టీ కూడా అమ్మేవారని వివరించారు. తాము రాజకీయ ప్రత్యర్థులమే కావొచ్చు కానీ, తన వ్యక్తిత్వాన్ని దాచుకోని వ్యక్తిగా ప్రధాని మోడీని అభినందించకుండా ఉండలేనని ఆజాద్ స్పష్టం చేశారు.  గత నెలలో  రాజ్యసభలో జరిగిన ఆజాద్ పదవి విరమణ చర్చలో ప్రధాని మోడీ... గులాంనబీ ఆజాద్ ను నిజమైన స్నేహితుడిగా అభివర్ణించారు. ఆయనను తాను రిటైర్ కానివ్వబోనని, ఆయన కోసం తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మోడీ వ్యాఖ్యానించారు. రాజ్యసభలో మోడీ ఆజాద్ ను పొగడటం... జమ్మూ సభలో ప్రధాని మోడీని ఆజాద్ ఆకాశానికెత్తడం చూస్తుంటే ... ఆజాద్ బీజేపీకి దగ్గర అవుతున్నారని తెలుస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.   

బెజవాడ వైసీపీకి బిగ్ షాక్

మున్సిపల్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. విజయవాడలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఇప్పటికే వైసీపీ నేతలు ఆందోళన చెందుతుండగా.. వాళ్లకు మరింత ఝలక్ ఇచ్చారు నగరంలోని కీలక నేత. వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు బోసు రాజేశ్.  వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. వైసీపీలో బీసీలను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్నా తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని బోసు రాజేశ్ ఆరోపించారు.జగన్ ఓదార్పు యాత్రలో విజయవాడలో జగన్‌తో కండువా కప్పించుకుని..నేటి వరకు పార్టీ కోసం పని చేశానని చెప్పారు. 2014లో టీడీపీ అభ్యర్థి‌పై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయానని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గం వంగవీటి రాధ వెళ్ళిపోయాక ఇంచార్జిగా మల్లాది విష్ణు వచ్చారు. ఆయన వద్ద కూడా పని చేశానని బోసు తెలిపారు.  తాను ఇదివరకు పోటీ చేసిన వార్డు ఇప్పుడు బీసీ అయింది.. సీటు ఇస్తారనుకున్నా..  ఒక బీసీ అభ్యర్థిగా పోటీలో నిలబడదామనుకున్నా.. నన్ను పక్కన పెట్టి వేరే వారికి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం పని చేసినా గుర్తించలేదన్నారు.పార్టీలో తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని రాజేశ్ ఆరోపించారు. ఇంకా పార్టీలోనే ఉంటే ఎదుగుదల ఉండదని భావించే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు బోసు రాజేశ్. పార్టీకి పని చేసిన వ్యక్తిని కాదని.. కనీసం సభ్యత్వం కూడా లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారని విమర్శించారు. సజ్జల రామకృష్ణ దగ్గరికి వెళ్లి అడిగినా ఇదే సమాధానం వచ్చిందన్నారు. రాజధాని నగరమైన విజయవాడలో ఒక బీసీ‌కి టికెట్ ఇవ్వని పరిస్థితి వైసీపీలో ఉందన్నారు బోసు రాజేశ్. జగన్ దాకా ఈ అంశాలను తీసుకువెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదు.. అందుకే పార్టీని వీడాను బోసు రాజేష్ తెలిపారు.

ఓయూ సాక్షిగా పొలిటికల్ వార్

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఇటీవల వరుసగా ఎదురైన షాకులతో కుదేలైన అధికార పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని భావిస్తోంది. వరుస విజయాల పరంపరంను ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కొనసాగించి.. టీఆర్ఎస్ కు మరో ఝలక్ ఇవ్వాలని బీజేపీ దూకుడుగా వెళుతోంది. పట్టభద్రుల మద్దతు సంపాదించి రాష్ట్రంలో తాము బలంగా ఉన్నామని నిరూపించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు గతంలో ఎప్పుడు లేనంతగా హోరాహోరీగా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఎక్కువగా నిరుద్యోగులే ఉంటారు... కాబట్టి నిరుద్యోగులు, ఉద్యోగాల భర్తీ చుట్టే రాజకీయ పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. నిరుద్యోగులు, యువత తమపై కోపంగా ఉన్నారని గ్రహించిన మంత్రి కేటీఆర్.. ఇటీవలే ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. గత ఆరేండ్లలో లక్షా 40 వేలకు పైగా ఖాళీలు భర్తీ చేశామంటూ శాఖల వారిగా వివరాలు విడుదల చేశారు. కేటీఆర్ ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. అసత్యాలు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ గన్ పార్క్ దగ్గరకు చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్ చేసి కాక రేపారు.  తాజాగా ఉద్యోగాల కల్పనపై ఓయూ సాక్షిగా చర్చకు రెడీనా అని మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నేత రామచంద్రరావు సవాల్‌ విసిరారు.  సోమవారం ఉదయం 11 గంటలకు ఓయూకి కేటీఆర్‌ రావాలని రామచంద్రరావు సూచించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో కేటీఆర్‌తో చర్చకు తాము సిద్ధమన్నారు. ఓయూకి వెళ్లేందుకు తమ నేతలకు పోలీసులు అనుమతించలేదన్నారు. ఆర్ట్స్‌ కాలేజీ దగ్గరికి ఎలాగైనా వెళ్తామని రామచంద్రరావు తెలిపారు.