పోలీసుల ఓవరాక్షన్.. ఎయిర్ పోర్టులో చంద్రబాబు నిర్బంధం
posted on Mar 1, 2021 @ 10:53AM
14 ఏళ్లు ముఖ్యమంత్రి. 30 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. ప్రస్తుతం ప్రతిపక్ష నేత. జగమెరిగిన రాజకీయ యోథుడు చంద్రబాబుకు రేణుగుంట విమానాశ్రయంలో తీవ్ర అవమానం. పోలీసుల ఓవరాక్షన్. గంటల తరబడి హైటెన్షన్. చంద్రబాబు తిరుపతిలో పర్యటించేందుకు అనుమతి లేదంటూ ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు పోలీసులు. లాంజ్ నుంచి బయటకు రాకుండా ఖాకీలు కట్టడి చేశారు. సీబీఎన్ టూర్ కు అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారు. కాలు బయట పెట్టకుండా చంద్రబాబును పోలీసులు చుట్టుముట్టారు. చంద్రబాబు దగ్గరున్న మొబైల్‌ను బలవంతంగా పోలీసులు లాక్కున్నారు. అంతేకాదు.. పీఏ, వైద్య అధికారితో పాటు ఆయన వెంట ఉన్న ఇతరుల నేతల ఫోన్లను కూడా బలవంతంగా పోలీసులు లాక్కున్నారు. ఖాకీల తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఎయిర్ పోర్టులోనే బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలిసి తెలుగు తమ్ముళ్లు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్ పోర్టుకు వచ్చిన టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎస్పీ, కలెక్టర్‌ను కలిసి తన పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో తెలుసుకుంటానని చంద్రబాబు చెప్పినా.. పోలీసులు అనుమతించలేదు. పర్యటనకు ఎందుకు వచ్చానో.. తననెందుకు ఎయిర్‌పోర్టులో నిలిపేశారో మీడియాకు వివరిస్తానని చెప్పినా పోలీసులు అందుకు నిరాకరించారు.
కలెక్టర్, ఎస్పీని కలవడానికి తాను వెళతానంటున్నా.. వెళ్లనివ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. వాళ్లను ఇక్కడికే పిలిపిస్తామని పోలీసులు చెప్పగా... తానేం అంత గొప్ప వ్యక్తిని కాదని.. తనకు తానుగా అక్కడికి వెళతానని అన్నారు. తనదగ్గరకే పిలిపిస్తామని చెప్పడాన్ని ఆయన తోసిపుచ్చారు. ప్రపంచానికి ప్రభుత్వం చేసే అరాచకాలు తెలియాల్సిందేనన్నారు. మీడియాతో కూడా మాట్లాడించకపోవడాన్ని కూడా ప్రశ్నించారు. ‘‘నేనేమైనా హత్య చేయడానికి వెళుతున్నానా.. 14 ఏళ్లు సీఎంగా ఉన్నాను. ప్రతిపక్ష నేతను నేను. నన్నెందుకు నిర్బంధించారో చెప్పండి’’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
చిత్తూరు నగరపాలక సంస్థలో కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచేందుకు సోమవారం జిల్లా పర్యటనకు వచ్చారు చంద్రబాబు. అభ్యర్థులకు వస్తున్న బెదిరింపులకు నిరసనగా ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నగరంలోని గాంధీ కూడలి వద్ద ధర్నా చేయాల్సి ఉంది. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి పుత్తూరు మీదుగానే తిరుపతి చేరుకుంటారు. సాయంత్రం 5.45 గంటలకు తిరుపతిలో జరిగిన అరాచక పర్వంపైనా ఆర్టీసీ బస్టాండు సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపాల్సి ఉంది. తర్వాత ఆటోనగర్‌లోని పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి 7.15 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళతారు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పలువురు తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో తెదేపా నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు.