పైలెట్ పై పిల్లి అటాక్..

మన టైం బాగాలేనపుడు పులికే కాడు..అప్పుడప్పుడు పిల్లికి కూడా బయపడాల్సిందే. ఆ దాడి ఏ ఇంట్లోనో బయటో చేస్తే ఎలాగో అలా తప్పించుకోవచ్చు. అదే గాల్లో ఎగురుతున్న విమానం నడుపుతున్న పైలెట్ పైన దాడి చేస్తే. ఆ పైలెట్ పరిస్థితి ఏంటి ? అందులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఏమవ్వాలి! విమానంలో పిల్లి ఏంటని అనుకుంటున్నారా.. చుడండి మీకే తెలుస్తుంది. ఎలా వెళ్లిందో ఏమో కానీ విమానం కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లిన ఓ పిల్లి పైలట్‌పై దాడికి దిగింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. సూడాన్‌లో జరిగిందీ ఘటన. టార్కో ఏవియేషన్‌కు చెందిన విమానం ఒకటి రాజధాని ఖర్టూమ్ నుంచి ఖతర్‌లోని దోహాకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కాక్‌పిట్‌లో ప్రత్యక్షమైన పిల్లి భయంతో పైలట్‌పై దాడిచేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పైలట్ గ్రౌండ్ కంట్రోల్‌కు సమాచారం అందించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. విమానాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదని చెబుతున్నారు. విమానం కాక్‌పిట్‌లోకి పిల్లి ఎలా వచ్చిందన్న విషయంలో స్పష్టత లేనప్పటికీ విమానాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో అది కాక్‌పిట్‌లోకి వెళ్లి ఉంటుందని అనుమానం పడుతున్నారు.  

కార్మికులకు వార్నింగ్‌లు.. కామ్రేడ్లకు కౌంటర్లు..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ బంద్. అన్ని పార్టీల మద్దతుతో రాష్ట్ర బంద్ సక్సెస్. ఇక ఉక్కు ఉద్యమ కేంద్రమైన విశాఖలో బంద్ విజయవంతం. బంద్ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఓవరాక్షన్ వివాదాస్పదమవుతోంది. ఆయన అహంకారపూరిత వైఖరిపై ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. టీడీపీ, వామపక్షాల నేతృత్వంలో బంద్ సక్సెస్ ఫుల్ గా జరుగుతుంటే.. బంద్ లో అధికార వైసీపీ రోల్ అంతంత మాత్రంగానే కనిపించింది. విజయసాయిరెడ్డి మాత్రం ఉదయం కాస్త హడావుడి చేసి నోరు పారేసుకుని విమర్శల పాలయ్యారు.  విశాఖ బంద్‌లో పాల్గొన్న విజయసాయిరెడ్డికి కార్మికుల నుంచి సెగ తగిలింది. ఓ కార్మిక సంఘానికి చెందిన నాయకుడు పోస్కోపై విజయసాయిని నిలదీశాడు. పోస్కోతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని ఆ కార్మిక నాయకుడు డిమాండ్ చేశాడు. దీంతో విజయసాయిరెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఒప్పందం చేసుకున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయిలో రహస్యంగా చేసుకున్న ఒప్పందం అంటూ ఆ వ్యక్తి మరోసారి జవాబిచ్చాడు. అధికారులకు కూడా తెలియకుండా జరిగిపోయిందని విమర్శించాడు. ఆ మాటకు విజయసాయి మండిపడ్డారు. ‘‘కరెక్టుగా మాట్లాడు.. నోరు అదుపులో పెట్టుకో.. నీకు లేని అధికారాన్ని ప్రదర్శించలేవు’’ అంటూ ఆ కార్మిక సంఘ నాయకుడిపై నోరు పారేసుకున్నారు. విసుక్కుంటూ వెంటనే అక్కడి నుంచి వెల్లిపోయారు. విజయసాయిరెడ్డి తీరుపై కార్మికులు మండిపడుతున్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు తమకేమీ తెలీనట్టుగా నటిస్తున్నారంటూ విజయసాయిపై, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశాఖ ఉక్కు కార్మికులు. కార్మికులతో పాటు కామ్రేడ్లపైనా నోరు పారేసుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. 'దీన్ని బంద్ అంటారా?' అంటూ మద్దిలపాలెంలో వామపక్ష నేతలపై విజయసాయి ఫైర్ అయ్యారు.  ‘‘ఒక్క వాహనం కూడా నిలపలేదు... అన్ని వాహనాలు యథావిధిగా వెళ్తున్నాయి. దీన్ని బంద్ అంటారా’’ అంటూ వామపక్ష నేతలను నిలదీశారు. విజయసాయి వ్యాఖ్యలకు సీపీఎం నేత కుమార్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ‘‘మీ పార్టీ వాళ్ళు ఎవరు రాలేదు. జెండా కూడా పట్టుకోలేదు’’ మీరు మాకు చెబుతున్నారా అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత విజయసాయి మాట్లాడుతూ.. ‘‘కరోనాకు భయపడేవాళ్ళు.. ఉద్యమాలు ఏం చేస్తారు’’ అంటూ వామపక్షాలను కసురుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా, రాష్ట్ర బంద్ సందర్భంగా విశాఖలో విజయసాయిరెడ్డి చాలా ఓవరాక్షన్ చేశారంటూ కార్మికులు, విపక్షాలు ఆయనపై మండిపడుతున్నాయి. 

1600 కోట్లు.. స్టీల్ ప్లాంట్ లో మరో భూబాగోతం!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఉక్కు కర్మాగారం కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. పార్టీలు కూడా రోడ్డెక్కుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలతో అధికార పార్టీ కూడా బందులో పాల్గొంటుంది. దీంతో ఏపీలో బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం ఉధృతం అవుతుండగానే.. మరో చీకటి ఒప్పందం బట్టబయలైంది. స్టీల్ ప్లాంట్, నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్  మధ్య జరిగిన డీల్ వెలుగులోనికి వచ్చింది. హెచ్‌బీ కాలనీలో స్టీల్ ప్లాంట్‌కు చెందిన క్వార్టర్స్ భూములు 22.9 ఎకరాలు.. సుమారు రూ. 1600 కోట్ల విలువైన భూమి..అభివృద్ధి, అమ్మకాల  పేరుతో  ఒప్పందం కుదిరింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో ఈ యాజమాన్యం ఒప్పందం చేసుకోవడం  కలకలం రేపుతోంది.  20 ఏళ్ల నుండి ఈ భూమిని అమ్ముతారనే ప్రతిపాదన ఉన్నప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే కదలిక వచ్చిందని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చెబుతున్నారు.   ఉక్కు కర్మాగారానికి విశాఖలో 22వేల ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో సగం మేర కర్మాగార నిర్మాణం ఉంది. మిగతా సగం ఖాళీ భూముల్లో విశాఖ ఉక్కు కంపెనీకి పోటీగా మరో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు దక్షిణ కొరియాకు  చెందిన పోస్కో కంపెనీ ముందుకొచ్చింది. అందుకు, కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.  2019 అక్టోబర్ లో పోస్కో- రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ సమయానికి జగన్ సీఎంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలీకుండా ఈ ఒప్పందం జరిగే అవకాశమే లేదు. అంటే  జగన్ కు తెలిసే.. పోస్కో వైజాగ్ లో ఎంట్రీ ఇచ్చిందనేగా అర్థం? అందుకు తగిన ఆధారాలు కూడా చూపుతున్నారు కార్మిక సంఘాల నేతలు, విపక్ష నేతలు. 

శశికళ సన్యాస వ్యూహం 

రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..

24  గంటల్లోనే బీజేపీ యూ టర్న్..  ఏంటో ఈ కన్ఫ్యూజన్ 

కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మెట్రో మ్యాన్ శ్రీధరన్ బీజేపీలో చేరడం.. ఆ తర్వాత నిన్న ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించడం జరిగిపోయాయి. ఐతే ఇంతలోనే ఏమైందో ఏమో.. 24 గంటలలోనే బీజేపీ యూటర్న్ తీసుకుంది. కేరళలో బీజేపీ సీఎం అభ్యర్ధిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తాజాగా హైకమాండ్ స్పష్టం చేసింది. నిన్న కేరళ బీజేపీ చీఫ్ కే. సురేంద్రన్ కీలక ప్రకటన చేస్తూ.. శ్రీధరన్‌ను తమపార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే సమయంలో శ్రీధరన్ నేతృత్వంలో ఇక కేరళ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత వి. మురళీధరన్ ట్వీట్ చేశారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో మాట్లాడానని.. సీఎం అభ్యర్ధిపై పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదని, ఆయన తెలిపారని పేర్కొన్నారు. దీంతో కేరళలో బీజేపీ సీఎం అభ్యర్థిపై పూర్తి అయోమయం నెలకొంది. మరోపక్క మెట్రో మ్యాన్‌గా గుర్తింపు పొందిన శ్రీధరన్ తానూ బీజేపీలో చేరుతున్నట్టు గత ఫిబ్రవరిలో ప్రకటించారు. బీజేపీ కేరళలో అధికారంలోకి వస్తే తాను సీఎంని అవుతానని అయన వెల్లడించారు. ఈ ఎన్నికలలో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేరళను అప్పుల ఊబి నుంచి బయట పడేసి.. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించాలి అని తాను అనుకుంటున్నట్లు శ్రీధరన్ కొద్దిరోజుల క్రితం ఒక మీడియా ఇంటర్ వ్యూలో తెలిపారు. అయితే దానికి సీఎం పదవే కావాలని ఎందుకు అనుకుంటున్నారు? గవర్నర్ కూడా కావొచ్చు కదా అని ప్రశ్నించగా, గవర్నర్ పదవి కంటే తాను సీఎం అయితేనే రాష్ట్రానికి ఎక్కువ సేవ చేయగలనని అయన అన్నారు. అంతేకాకుండా రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవికి పెద్దగా అధికారాలు ఉండవని అయన స్పష్టం చేసారు. సీఎం అభ్యర్థిని ప్రకటించిన 24 గంటలలోనే బీజేపీ యూ టర్న్ తీసుకోవడం పై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు  

రాసలీలల యువతి అదృశ్యం! చంపేశారా? 

కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన కర్ణాటక మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల అంశంలో మరో ట్విస్ట్. వీడియోలో మంత్రితో కనిపించిన యువతి కనిపించకుండా  పోయింది. ఆమె ఎక్కడ ఉందన్న విషయం తెలియకపోవడం సంచలనంగా మారింది. యువతి ఎక్కడికి వెళ్లింది.. ఎవరూ తీసుకెళ్లారన్నది మిస్టరీగా మారింది. రాసలీలల వీడియోలో ఉన్న యువతి అసలు క్షేమంగానే ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  యువతి ఆచూకి కనుగొనేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు. ఆమె మొబైల్ ఫోన్ నంబర్ కూడా లభ్యం కాలేదని పోలీసు వర్గాలు అంటున్నాయి.  రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో వాటిని  ఆపేందుకు కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు ఏడాది కాలంగా రమేశ్, ఆ యువతి మధ్య వివాహేతర బంధం నడుస్తోందని పోలీసులు గుర్తించారు. ఆ యువతి ఆచూకీ లభిస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. ఇటీవలే  రమేశ్ జార్కిహోళి,  సదరు యువతి ఏకాంత వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున  విమర్శలు  రావడంతో రమేశ్  జార్కిహోళి .. మంత్రి  పదవికి రాజీనామా  చేశారు. తనకు ప్రత్యర్థిగా ఉన్న ఓ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే సదరు యువతి వలపు వల విసిరిందని రమేశ్ అనుకూల వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రహస్యంగా వీడియోలు చిత్రీకరించారని చెబుతున్నారు.    

శుభలేఖలు పంచిన తరువాత పెళ్లి వద్దన్న పెళ్ళికొడుకు.. అమెరికాలో తెలుగు యువతి ఆత్మహత్య

వారిద్దరికీ పెళ్లి ఆరు నెలల క్రితమే ఫిక్స్ అయింది. ఈ నెల 3 న వివాహం చేసేందుకు రెండు పక్కల పెద్దలు ముహూర్తం కూడా ఖరారు చేసారు. చివరి నిమిషంలో ఏమైందో ఏమో.. ఈ పెళ్లి తనకు ఇష్టంలేదని పెళ్ళికొడుకు చెప్పడంతో తీవ్ర మనస్తాపం చెందిన వధువు మూడు రోజుల క్రితం అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన పూర్తీ వివరాల్లోకి వెళితే.. చిత్తూరు టౌన్ లోని పోలీసు కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తోంది. మరోపక్క పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన మురళి కుమారుడు భరత్‌ అమెరికాలోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితమే వీరిద్దరికీ పెళ్లి చేయాలనీ ఇరుపక్కలా పెద్దలు నిశ్చయించడంతో ఈ నెల 3వ తేదీ ఉదయం 3 గంటలకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. దీంతో పెళ్లి పత్రికలు ప్రింట్ చేయించి బంధువులకు స్నేహితులకు కూడా పంచిపెట్టారు. ఇది ఇలా ఉండగా.., వారం రోజుల క్రితం హఠాత్తుగా భారత్ సుష్మను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని తన తల్లిదండ్రులకు చెప్పాడు మరోపక్క ఈ విషయంపై సుష్మ, భరత్ మధ్య కొంత సంవాదం జరిగిందని తెలుస్తోంది. దీంతో ఈ విషయం పై రెండు కుటుంబాల మధ్య పంచాయితీ జరిగింది. అయినా భరత్‌ పెళ్లికి నిరాకరించడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మ సోమవారం అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త తెల్సిన ఆమె తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. భరత్ ఈ పెళ్లికి నిరాకరించడంతోనే సుష్మా ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుభలేఖలు పంచిన తరువాత.. పెళ్లి రోజున ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం తమను కలచివేసిందని ఆమె బంధువులు స్నేహితులు ఆవేదన వ్యక్తమ చేసున్నారు. ఈ ఘటనపై సుష్మ బంధువులు చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.        

40 దేశాలకు హైదరాబాద్ వ్యాక్సిన్! కొవాగ్జిన్ కు భారీగా డిమాండ్ 

దేశీయంగా తయారైన కోవిడ్ వ్యాక్సిన్ కు భారీగా డిమాండ్ వస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ కోసం ప్రపంచ దేశాలన్ని ఎగబడుతున్నాయి. కోవాగ్జిన్ టీకా కోసం  దాదాపు 40 దేశాలు తమను సంప్రదిస్తున్నాయని భారత్ బయోటెక్ ప్రకటించింది. నెలకు 4 కోట్ల డోస్ లను తయారు చేసేలా సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం మూడవ ప్లాంటును కూడా భారత్ బయోటెక్ సంస్థ నిర్మిస్తోంది.  కొవాగ్జిన్ ను తమకు సరఫరా చేయాలని కోరుతున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే బ్రెజిల్- భారత్ బయోటెక్ మధ్య డీల్ కుదరగా, తాజాగా ఫ్రాన్స్ కూడా ముందుకు వచ్చింది. కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న ఫ్రాన్స్ లో నివాసులందరికీ టీకాను ఇవ్వాలని ఇప్పటికే ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తక్కువ ధరలో లభిస్తూ, సత్ఫలితాలను ఇస్తున్న కొవాగ్జిన్ అయితే ఉత్తమమని భావిస్తోంది.ఇండియాలో ఫ్రాన్స్ రాయబారిగా పనిచేస్తున్న ఎమ్మాన్యుయేల్ లేనేయిన్ ఇటీవలే  హైదరాబాద్ కు వచ్చి భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లను కలిసి చర్చించారు కూడా. అయితే ఫ్రాన్స్ ప్రస్తుతం ఈయూ (యూరోపియన్ యూనియన్)లో భాగస్వామిగా ఉండటంతో.. ఏ దేశానికి టీకా రావాలన్నా యూరోపియన్ మెడిసిన్స్ ఏజన్సీ అనుమతి తప్పనిసరి. దీంతో ఈఎంయూ అనుమతి కోసం ఫ్రాన్స్ వేచిచూస్తోంది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ 81 శాతం సామర్థ్యాన్ని కలిగివుందని మూడవ దశ క్లినికల్ పరీక్షల తరువాత వెల్లడైంది. ఇప్పటికే అత్యవసర వినియోగానికి ఈ టీకాకు అనుమతులు లభించగా, త్వరలోనే  పూర్తి స్థాయి అనుమతులు కూడా వస్తాయని సమాచారం. అనుమతులు లభిస్తే ఇండియాలో భారీ ఎత్తున సరఫరా చేయడంతో పాటు.. టీకాను విదేశాలకు ఎగుమతి చేయాలని కూడా భారత్ బయోటెక్  భావిస్తోంది. మార్చి 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ కొవాగ్జిన్ తొలి డోసు తీసుకున్నారు. 

బీజేపీ గెలిస్తే రూ.60కే పెట్రోల్! 

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు స్పీడ్  పెంచాయి. కేరళలో పాగా వేయాలని చూస్తున కమలదళం.. ఈసారి సర్వశక్తులు ఒడ్డుతోంది. కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మెన్ శ్రీధర్ ను ప్రకటించింది. నిజానికి బీజేపీ ఎప్పుడు ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ఖరారు చేయదు. కాని కేరళలో మాత్రం శ్రీధరన్  పేరును ముందే ప్రకటించింది.శ్రీధరన్ ముందుండి నడిపిస్తే.. ఆశాజనక ఫలితాలు వస్తాయని బీజేపీ ఆశిస్తోంది. ఎన్నికల ప్రచారంలోనూ కేరళ బీజేపీ నేతలు హామీల వర్షం గుప్పిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్‌‌ను రూ.60కే అందిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత కుమ్మనం రాజశేఖరన్ అన్నారు. కొచ్చిలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌‌లో రాజశేఖరన్ ఈ హామీ ఇచ్చారు. బీజేపీ పవర్‌లోకి వస్తే పెట్రోల్, డీజిల్‌‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని, అప్పుడు చమురు ధరలు రూ.60 లోపే ఉంటాయని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నందున వాటిని జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని రాష్ట్రంలోని అధికార ఎల్డీఎఫ్‌‌ను ప్రశ్నించారు.

బెజవాడ మేయర్ అభ్యర్థిగా శ్వేత ! పంతం నెగ్గించుకున్న కేశినేని

విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పవర్ ఏంటో చూపించారు. విజయవాడ కార్పొరేషన్ మేయర్ గా తాను అనుకున్నది సాధించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత పేరును టీడీపీ ఖరారు చేసింది. కేశినేని శ్వేతను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ సర్క్యులర్ జారీ చేశారు.  విజయవాడ మేయర్ పదవికి టీడీపీ నుంచి చాలా మంది  పోటీపడ్డారు. అయితే ఇటీవల విజయవాడ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపింది. మేయర్ పదవి రేసులో శ్వేతకు నందిరెడ్డి గాయత్రి నుంచి చివరివరకు పోటీ ఎదురైంది. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ... నాని కుమార్తె శ్వేత పేరును తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది.బెజవాడ మున్సిపల్ ఎన్నికల్లో శ్వేత 11వ డివిజన్ లో కార్పొరేటర్ గా బరిలో ఉన్నారు.  మేయర్ అభ్యర్థిగా ప్రకటించినందుకు శ్వేత టీడీపీ అధిష్టానికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ కార్పొరేషన్‌ను టీడీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని తప్పుబట్టారు. ప్రభుత్వం సహకరించకున్నా వరల్డ్‌ క్లాస్‌ సిటీగా మారుస్తానని కేశినేని శ్వేత ప్రకటించారు.  ఇటీవల విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా శ్వేతను ఖరారు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే శ్వేత అభ్యర్థిత్వంపై మాజీ ఎమ్మెల్యే బొండ ఉమ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోను తూర్పు నియోజకవర్గం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన వారికి మేయర్ అభ్యర్థిగా ప్రకటించారని, ఈ సారి సెంట్రల్ నియోజకవర్గం నుంచి వేరే సామాజికవర్గానికి మేయర్ పదవి ఇవ్వాలని ఉమ వాదించారు. దీంతో పాటుగా కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు. అభ్యర్థుల ఎంపికలో కేశినేని నాని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య విభేదాలు వచ్చాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు శ్వేతను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేరారని మరో వాదం వినిపిస్తోంది. అయితే విజయవాడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

హైదరాబాద్ లో సగం మందికి కరోనా! సీసీఎంబీ సర్వేలో సంచలన విషయాలు

హైదరాబాద్ ను కరోనా మహమ్మారి ముంచెత్తుతోంది. సైలెంట్ గా, సౌండ్ లేకుండా.. అందరినీ కమ్మేస్తోంది. కరో్నా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు తగ్గిందో తెలీకుండా.. వ్యాపిస్తోంది. ఈ మాట ఎవరో అంటున్నది కాదు. ప్రతిష్టాత్మక సీసీఎంబీ ఈ విషయం ప్రకటించింది.  హైదరాబాద్‌లో 54శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నాయంటూ షాకింగ్ న్యూస్ వెల్లడించింది సీసీఎంబీ. 56శాతం మహిళలు, 53శాతం పురుషుల్లో యాంటీబాడీలు ఉన్నాయని తెలిపింది. యాంటీబాడీలు ఉన్న 75శాతం మందికి కరోనా వచ్చినట్టు కూడా తెలియలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్‌ బయోటెక్‌ - ఎన్‌ఐఎన్‌తో కలిసి సీరో సర్వే చేసింది సీసీఎంబీ. నగరంలోని 30 వార్డుల్లో తొమ్మిదివేల మంది నమూనాలు పరిశీలించి పరీక్షించారు. ఫలితాల్లో 54 శాతం మందికి కొవిడ్ యాంటీబాడీలు ఉండటం సంచలనంగా మారింది.  మరోవైపు, ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 2,99,406 మందికి వైరస్‌ సోకింది. వీరిలో 2,95,821 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1637 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1948 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే, ఇవన్నీ కరోనా అని తెలిసి, పరీక్ష చేసుకొని, నిర్ధారించుకున్న వారి సంఖ్య మాత్రమే. కానీ, సీసీఎంబీ సర్వే ప్రకారం ఇంకా లక్షలాది మందికి కొవిడ్ సోకినట్టు తెలుస్తోంది. బయటకు లక్షణాలేవీ కనిపించకపోవడంతో వారెవరికీ కరోనా సోకినట్టు తెలీలేదు. ఒక్క హైదరాబాద్ సిటీలోనే సగం మందిలో యాంటీబాడీలు ఉండటం కలవరానికి గురి చేస్తోంది.  

సీఎం అభ్యర్థిగా శ్రీధరన్.. మరో కిరణ్ బేడీనా?

అనుకున్నట్టే జరిగింది. మెట్రోమేన్ శ్రీధరన్ ను కేరళ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. పార్టీ జాతీయ కోర్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రన్ అధికారికంగా శ్రీధరన్ పేరు ప్రకటించారు.  కేరళలో బీజేపీకి ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులే ఖరారు కాలేదు. అందరికంటే ముందు సీఎం అభ్యర్థి మాత్రం డిసైడ్ అయిపోయారు. ఢిల్లీ మెట్రో మేన్ గా దేశమంతా సుపరిచితమైన శ్రీధరన్ ఇటీవలే బీజేపీలో చేరారు. సీఎం కేండిడేట్ కు సై అంటూ సిగ్నల్ ఇచ్చారు. ఇక శ్రీధరనే బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం కూడా జరిగింది. అనుకున్నట్టే.. ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది పార్టీ. గురువారంతో తాను పదవీ విరమణ చేస్తానని, ఆ తర్వాతే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని శ్రీధరన్ చెప్పారు.  శ్రీధరన్ ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారో అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కొచ్చి అర్బన్ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. రాజధాని నుంచి బరిలో దిగితే.. యావత్ రాష్ట్రంపై ఆయన ప్రభావం ఉంటుందని లెక్కలేస్తోంది కమలదళం. మిస్టర్ క్లీన్ గా, మెట్రో మ్యాన్ గా పాపులారిటీ ఉన్న శ్రీధరన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. పార్టీకి మంచి మైలేజీ వస్తుందని భావిస్తోంది.  గతంలో ఢిల్లీలోనూ బీజేపీ ఇలాంటి ప్రయోగమే చేసింది బీజేపీ. మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీని సీఎం కేండిడేట్ గా ప్రకటించి ఎన్నికల బరిలో దిగినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు కేరళలోనూ శ్రీధరన్ తో ఢిల్లీ తరహా ఎక్స్ పర్మెంట్ చేస్తోంది. LDF, UDF కూటములు బలంగా ఉన్న కేరళలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. ఎలాగూ గెలిచే అవకాశం లేని చోట మాత్రమే.. బీజేపీ కిరణ్ బేడీ, శ్రీధరన్ లాంటి మిస్టర్ క్లీన్ లను ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటిస్తూ.. ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తుంటుందనే ఆరోపణ ఉంది. అదే, పక్కా గెలిచే ఛాన్స్ ఉన్న రాష్ట్రాల్లో మాత్రం RSS మూలాలున్న లీడర్లను మాత్రమే ముఖ్యమంత్రులను చేస్తుందనేది విమర్శ వినిపిస్తుంటుంది. అయితే, విద్యాధికులు ఎక్కువగా ఉండే కేరళలో శ్రీధరన్ ఇమేజ్ కమలదళానికి ఏ మేరకు కలిసొస్తుందో...

ఏపీలో ఏబీసీడీ పాలన 

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కర్నూల్ కార్పొరేషన్ పరిధిలో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో  ఏబీసీడీ పాలన సాగుతోందని చంద్రబాబు విమర్శించారు.  ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన, బీ అంటే బాదుడు, సీ అంటే అవినీతి, డీ అంటే విధ్వంసమని చంద్రబాబు చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని చెప్పారు. పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని భయానక పరిస్థితి నెలకొందన్నారు చంద్రబాబు.  ఏపీలో మత సామరస్యం దెబ్బతిందని.. ఆలయాలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ పాలనలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే.. జగన్‌ విధ్వంసానికి పెద్దపీట వేశారని మండిపడ్డారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో  బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని ఏకగ్రీవాలున్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిచిన స్థానాలనూ వైసీపీ నేతలు వారి ఖాతాలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటేసే అవకాశమే లేకపోతే ప్రశ్నించే అవకాశం వస్తుందా?.. ప్రశ్నించే అవకాశం లేకపోతే నాయకులు భయపడతారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.  మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు చంద్రబాబు.   

బతికున్న వ్యక్తికి పోస్టుమార్టం! వైద్యుల నిర్లక్ష్యం

యాక్సిడెంట్ లో శంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. మూడో రోజూ అతడిలో చలనం లేదు. క్షతగాత్రుడు చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  శంకర్ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష చేయడానికి సిబ్బంది సిద్ధమయ్యారు. కత్తితో డెడ్ బాడీపై గాటు పెట్టబోతుండగా.. శంకర్ చేయి సడెన్ గా కదిలింది. పోస్ట్ మార్టం సిబ్బంది ఒక్కసారిగా బిత్తరపోయారు. అదేంటి? మృతదేహం చేయి కదలడమేంటి? అని షాక్ అయ్యారు. అంతలోనే తేరుకున్నారు. శంకర్ చనిపోలేదని, ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని నిర్ధారించుకున్నారు. వెంటనే అతన్ని మార్చురీ నుంచి ఆసుపత్రి వార్డుకు తరలించారు. ప్రభుత్వ వైద్యులు అతనికి చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు నిర్లక్ష్యంతోనే.. బతికున్న శంకర్ చనిపోయాడని పోస్ట్ మార్టంకు తరలించారని ప్రభుత్వ వైద్యులు మండిపడుతున్నారు. కర్ణాటక, బెల్గావిలో జరిగిన ఈ దారుణంతో.. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకంపై మరోసారి చర్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శంకర్ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆ ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు.

విశాఖలో రౌడీ దిగాడు.. పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు!

విశాఖకు కొత్త పరిశ్రమలు రావడం లేదు.. గతంలో వచ్చినవి మూత పడుతున్నాయి.. ఏపీకి రావాలంటనే పారిశ్రామిక వేత్తలు వణికిపోతున్నారు.. ఇవి విద్యార్థులతో జరిగిన సమావేశంలో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ఆరోపణలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలో విద్యార్థులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి సర్కార్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.  ఒక్క ఛాన్స్ అడిగి సీఎం జగన్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తారని  లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం పెంచారు. ఇప్పుడు నష్టాలు వచ్చాయి అని చెబుతున్నారన్నారు. పక్కనే ఉన్న జింక్ మూసేసారు ఇప్పుడు కార్మికులు రోడ్డున్న పడ్డారని మండిపడ్డారు. విశాఖలో ఆధాని డేటా సెంటర్ వచ్చి ఉంటే లక్షల ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు.  విశాఖపట్నానికి రెండేళ్లు ఏం చేశారో చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లోకేష్. విశాఖపట్నం రాజధాని అంటున్న జగన్.. రెండేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.  విశాఖలో రౌడీ దిగాడు.. A2 మొత్తం భూములు దోచుకుంటున్నాడని నారా లోకేష్ ఆరోపించారు. విశాఖకు ఐటీ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ కొత్త పరిశ్రమలు రావడం కన్నా ఉన్న పరిశ్రమలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలు ఏపీ రావడానికి భయపడుతున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా విశాఖలో కన్వెన్షన్ సెంటర్ కావాలన్నామని.. కానీ దాన్ని  వైసీపీ ప్రభుత్వం వెల్లగొట్టిందని మండిపడ్డారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై చాలా బాధగా ఉందన్నారు నారా లోకేష్.  రాష్ట్ర ప్రభుత్వం వైఖరీ ఇలాగే కొనసాగితే వడ్డీ కట్టలేని పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.    

శివుడిని నమ్ముకున్న దీదీ..

పశ్చిమ బెంగాల్ లో ఓట్లను పోలరైజ్ చేసేందుకు బీజేపీ జైశ్రీరామ్ నినాదం ఎత్తుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంస్మరణ సభలో ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్న సభలో మమతా బెనర్జీ లేచి ప్రసంగం చేయబోతుండగా.. బీజేపీ నాయకులు ఒక్కసారిగా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో.. ఆమె ప్రసంగించకుండానే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.  తాజాగా బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఇక బీజేపీ ఫాలో అవుతున్న "హార్డ్‌కోర్ హిందుత్వ" కి కౌంటర్ గా సీఎం మమత నేతృత్వంలోని తృణమూల్ ఇకపై "సాఫ్ట్ హిందుత్వ" ను ఫాలో కావాలని డిసైడ్ అయింది..రాముడికి విరుగుడుగా మమత శివుణ్ని తెరపైకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో ఆమె తన ఎన్నికల నామినేషన్‌ను మహా శివరాత్రి పర్వ దినాన దఙ్ఖలు చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించి కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో మమత నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగనున్న నేపథ్యంలో ఆమె అక్కడే తన నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పాటు అక్కడ ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరోపక్క బీజేపీని ఇరుకున పెట్టడానికే ఆమె నామినేషన్ వేయడానికి ఆ రోజును ఎంపిక చేసుకున్నట్లు గ తెల్సుస్తోంది. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం సందర్భంగా పాదయాత్రను చేపట్టాలని మమత డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ అయిన పాదయాత్రను మమత నమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రతి రోజు ఆమె కొన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని సంకల్పించినట్లుగా సమాచారం. అంతేకాకుండా "బెంగాల్ కూతురే ఇక్కడ సీఎం కావాలి" అనే నినాదంతోనే ఎన్నికల్లోకి దూసుకెళ్లాలని ఇప్పటికే మమత నిర్ణయించారు.    

అంగన్ వాడీ ఉద్యోగితో వెట్టిచాకిరీ! జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు 

జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తన నివాసంలో అంగన్ వాడీలతో వెట్టిచాకిరి చేయిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగం కోసం మూడున్నర లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించారు. అంగన్ వాడీలో పనిచేస్తున్న తనను ఇంట్లో పనిమనిషిగా పెట్టుకున్నారని.. కాళ్లు పట్టించుకోవడం సహా అన్ని పనులు చేయిస్తున్నారని వాపోయింది. ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరించడంతో రూ.2లక్షలు చెల్లించానని.. కానీ మరింత డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె తెలిపింది. అడిగినంత డబ్బు ఇవ్వనందుకు తనను చిత్రహింసలు పెడుతున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించింది బాధితురాలు.  ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిపై..  నెల్లూరు వైఎస్ఆర్ కాలనీలో అంగన్ వాడీ ఆయా రిహానా పోలీసులకు ఫిర్యాదు చేసింది.   జేసీ దగ్గర సీసీగా పనిచేసే శ్రీకాంత్, డ్రైవర్ వికార్ సు తనపై దూషణలకు దిగడమే కాకుండా దాడి చేశారని ఆరోపించింది. ఆరోగ్యం సరిగా లేక పనిలోకి వెళ్లకపోతే ఇంట్లో రూ.1.50 లక్షలు చోరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించింది. ఐదు రోజులుగా పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వివరించింది. చేయని తప్పులు నాపై వేసి డబ్బులు వసూల్ చేయడానికి నన్ను 5 రోజులు నుండీ పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని అవేదన వ్యక్తం చేసింది. స్థానిక పోలీస్ స్టేషన్లో జేసీతో పాటు ఆయన సిబ్బందిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి బంగ్లాలో వేధింపులకు గురైన అంగన్ వాడీ హెల్పర్ కు మద్దతుగా కోటమిట్టలో బాధితురాలు, ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ని సస్పెండ్ చేయాలని , వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసి విన్నవించారు.  మరోవైపు అంగన్ వాడీ ఉద్యోగితో తన ఇంట్లో వెట్టి చాకిరి చేయిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. తన పిల్లలిద్దరినీ ప్రభుత్వ పాఠశాలలో చెర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాంటి జేసీపై వెట్టిచాకిరి ఆరోపణలు రావడం నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.  

రియల్ బిచ్చగాడు..

అతడు కోటీశ్వరుడు. కానీ కూటికి చేతి చాస్తూ బిక్షాటన చేస్తున్నాడు. అతనికి ఉన్న అలవాటే అతన్నిబిచ్చగాడ్ని చేసింది. చివరికి గుడిమెట్ల దగ్గర బిచ్చమెత్తుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అధికారులు రమేష్ యాదవ్ ని తన ఇంటికి తీసుకెళ్లారు.. రమేష్ ఇంటిని చూసిన అధికారులు ఆశ్యర్యపోయారు.   దీనబంధు పునరావాస యోజన పథకంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మున్సిపల్ సిబ్బంది, జిల్లా అధికారులు ఫిబ్రవరి 24న ఒక ప్రత్యేక కార్యక్రమాన్నినిర్వహించారు.   సంయుక్తంగా అనాథ వ్యక్తులను ఆదుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి పునరావాసం కల్పించే పనులను చేపట్టారు.ఈ కార్యక్రమానికి మొత్తం 109 మంది అనాథలను తీసుకువచ్చారు. వారికి  తగిన వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులకు బిచ్చగానిగా మారిన రమేష్ అనే కోటీశ్వరుడు తారసపడ్డాడు.  రెండేళ్లుగా రమేష్ ఒక ఆలయం దగ్గర బిచ్చగానిగా కాలం గడుపుతున్నాడు. పెళ్లి కూడా చేసుకోలేదు. అధికారులకు రమేష్ ఇచ్చిన సమాచారం మేరకు వారు రమేష్ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటిలోని హంగులను చూసిన వారు తెగ ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. అయితే రమేష్‌కు ఉన్న ఒక్క అలవాటు అతనిని బిచ్చగానిగా మార్చివేసింది. అతని మద్యం అలవాటే అతనిని ఈ దుస్థితికి తీసుకువచ్చింది. రమేష్ కు ఒక సొంత భవనం, ప్లాట్ ఉన్నాయి. వాటి విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. అయితే విపరీతంగా మద్యం తాగే అలవాటు కారణంగా అతను ఆలయం దగ్గర బిచ్చమెత్తుకుంటూ కాలం గడుపుతున్నాడు. రమేష్ పరిస్థితిని గమనించిన అధికారులు అతనికి కౌన్సెలింగ్ ఇప్పించారు. దీంతో రమేష్ ఆరోగ్యం మెరుగుపడింది. తిరిగి రమేష్ తన ఇంటికి చేరుకున్నాడు.

కమీషన్లు రావనే ఐటీఐఆర్ పై నిర్లక్ష్యం! 

తెలంగాణలో పట్టభద్రుల మండలి ఎన్నికల హీట్ పెరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య లేఖలు, సవాళ్ల యుద్ధం సాగుతోంది. ఐటీఐఆర్ కేంద్రంగా ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ అంశంలోకి ఎంటరై.. రెండు  పార్టీలను కడిగి పారేశారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.  ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటేనని ఎద్దేవా చేశారు.   ఐటీఐఆర్‌కు కాంగ్రెస్ సర్కార్ అప్రూవల్ ఇచ్చిందని చెప్పారు రేవంత్ రెడ్డి. ఏడేళ్లయినా ఐటీఐఆర్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం డీపీఆర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం ఐటీఐఆర్‌ను కోల్పోయిందని విమర్శించారు. టీఆర్ఎస్ అంటే టోటల్ రివర్స్ స్టాండ్ అన్నారు రేవంత్ రెడ్డి. ఐటీఐఆర్‌కు సమానమైన ప్యాకేజీ .. మంత్రి కేటీఆర్ ఇవ్వాలనడం దారుణమన్నారు.  కేటీఆర్ .. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.  కేటీఆర్ దగ్గర అసలు ప్రణాళికనే లేదు .. లెటర్ రాయడం ఏంటి .? అని ప్రశ్నించారు.  కమిషన్లు వచ్చేదుంటే ఐటీఐఆర్‌కు కూడా కేసీఆర్ డీపీఆర్ ఇచ్చేవారని తెలిపారు. కమిషన్లు వచ్చినందుకే కాళేశ్వరాన్ని డీపీఆర్ లేకుండానే నిర్మించాడని చెప్పారు. దేశంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. పట్టభద్రులంతా బీజేపీ, టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.