కోవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రధాని మోడీ
posted on Mar 1, 2021 7:40AM
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొవిడ్ టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు మార్చి 1 నుంచి టీకా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం దిల్లీలోని ఎయిమ్స్ కు వెళ్లిన ప్రధాని మోడీ.. తొలి డోసు టీకాను తీసుకున్నారు.
దేశీయంగా హైదారాబాద్ లోని భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకాను ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారు. మోడీకి సిరంజీ ద్వారా ఎయిమ్స్ సిస్టర్ పి.నివేదా టీకా ఇచ్చారు. టీకా తీసుకున్న సమయంలో అసోంలో తయారు చేసిన గమ్చా ను ధరించి మోడీ కనిపించారు. అసోం మహిళల ఆశీస్సులకు చిహ్నంగా ఆయన ఈ వస్త్రాన్ని ధరించారు. గతంలోనూ చాలా సందర్భాల్లో మోడీ గమ్చా ను ధరించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయన ఉదయాన్నే ఎయిమ్స్‌కు వెళ్లి కొవిడ్ టీకా తీసుకున్నారు. టీకా వేసే సమయంలో కేరళకు చెందిన మరో నర్సు కూడా అక్కడ ఉన్నారు.
తాను తొలి డోసు టీకా తీసుకున్నట్లు మోడీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కొవిడ్‌కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. అర్హులందరూ కొవిడ్ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్‌ను కొవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.