పీకేకు పంజాబ్ సవాల్

ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు ఈ పేరుకు పరిచయం అక్కరలేదు. రాజకీయ పార్టీల జాతకాలను, రాజకీయ నాయకుల తల రాతలను మార్చే మాంత్రికుడిగా ప్రశాంత్ కిషోర్ పేరు తెలియని వారు రాజకీయ మీడియా వర్గాల్లో ఉండరు. నిజానికి రాజకీయ మీడియా వర్గాల్లో మాత్రమేకాదు, మాములు జనాలకు కూడా ఆయన పేరు సుపరిచితమే కావచ్చును. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అయితే, ఆయన  చాలా చాలా సుపరిచిత వ్యక్తి. ఆంధ్ర ప్రదేశ్’లో వైసీపీని గెలిపించింది, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించింది,ఈ మాంత్రికుడే అంటారు.గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో, నడిచింది వైఎస్ అయినా నడిపించివాడు కేవీపీ అన్నట్లుగా, జగన్ రెడ్డిని అధికార పీఠం ఎక్కించిన పాదయత్రలో నడిచింది, జగనే అయినా నడిపించిన వాడు మాత్రం ప్రశాంత్ కిషోర్’ అంటారు.  సుమారు గత దశాబ్దకాలంలో ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు,చాలా పార్టీలకు రాజకీయ, ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. అలా అందరికీ తెలిసిన రాజకీయ పండితుడిగా ప్రసిద్ధి చెందారు. మధ్యలో స్వయంగా రాజకీయ అరంగేట్రం చేశారు, స్వీయ రాజకీయ భవిష్యత్’ను పరీక్షించుకున్నారు. అయితే ఇప్పడు ఈ ఉపోద్ఘాం ఎందుకంటే, ఇప్పుడు ఆయన్ను మరో అదృష్టం వరిచింది. ఇప్పటికే అయన చేతిలో రెండు మూడు కీలక ప్రాజెక్టులున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని మళ్ళీ గెలిపించే బాధ్యతను ఆయన తీసుకున్నారు. ముఖ్యమంత్రికి రాజకీయ వ్యూహ కర్తగా, ప్రచార సలహా దారుగా ప్రశాంత్ కిశోర్ వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎన్నికల వ్యూహ కర్త, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నుతూ, నినాదాలకు ప్రతి నినాదాలు అందిస్తూ షా’కు చెక్ పెట్టేలా పావులు కడుపుతున్నారు. అంతే కాదు, బెంగాల్’లో బీజేపీకి 200 లకు పైగా స్థానాలు వస్తాయని అమిత షా ధీమా వ్యక్తం చేస్తే, ప్రశాంత్ కిషోర్’ అంతోటి ఆయన గాలి యిట్టె తీసేశారు.  టూ హండ్రెడ్  కాదు,బీజేపీ గెలిచే సీట్ల సంఖ్య టూ డిజిట్, రెండంకెలు దాటదు, దాటితే ట్విట్టర్  సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు. అదలా ఉంటే, ఇప్పుడు ఆయన్ని కొత్తగా వరించిన అదృష్టం, పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఆయన్ని, క్యాబినెట్ రాంక్ పోస్టు ఇచ్చి తమ సలహాదారుగా తీసుకున్నారు.ప్రశాంత్  కిషోర్, 2017లోనూ పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ నేపధ్యంలో, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మరో మారు ప్రశాంత్ కిషోర్’ను కీలక పదవిలోకి తెసుకోవడంతో, అయన నియామకం  మరింత ప్రాధాన్యత   సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒకరి కంటే ఎక్కువ ప్రాంతీయ పార్టీలే ప్రశాంత్ కిషోర్’తో టచ్’లో ఉన్నట్లు సమాచారం.  

శ్రీమతికి ప్రేమతో...

తెలుగు భాషాభిమాని వెంకయ్య నాయుడు. తన శ్రీమతి ఉషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అచ్చ తెలుగులో లేఖ రాశారు ఉపరాష్ట్రపతి. ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా.. తన ప్రేమాభిమానాలన్నీ ఏర్చి కూర్చి.. లేఖతో అక్షరమాల రచించారు. శ్రీమతి ఉషను కొనియాడుతూ వెంకయ్య రాసిన లేఖ.. నిజంగా అద్భుతం. ఆ లేఖ తెలుగు వన్ పాఠకుల కోసం..   న్యూఢిల్లీ, 1 మార్చి 2021. అర్ధాంగి లక్ష్మీ ఉషమ్మకు, నీ 66 ఏళ్ళ జీవితంలో, నేటికి ఐదుపదులకు మించిన జీవితాన్ని నా కోసం, మన కుటుంబం కోసం వెచ్చించిన నీ ప్రేమ, సహనం, ఆదరం, ఆప్యాయత, అవ్యాజానురాగం అనిర్వచనీయమైనవి.  జన్మదినమిదమ్ అయి ‘ప్రియసఖీ’ శం తనోతు తే సర్వదా ముదమ్ ।।  ప్రార్థయామహే భవ శతాయుషీ ఈశ్వరః సదా త్వాం చ రక్షతు ।। పుణ్య కర్మణా కీర్తిమర్జయ జీవనం తవ భవతు సార్థకమ్ ।। ఓ ప్రియసఖీ, నీకు జన్మదిన శుభాకాంక్షలు. నీకు ఎల్లప్పుడూ శుభమగుగాక. భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆయన నిన్ను ఎల్లప్పుడూ రక్షించు గాక, పుణ్యకర్మలాచరించి, కీర్తిని సంపాదించి, జీవితాన్ని మరింత సార్థకం చేసుకోవలెనని ఆకాంక్షిస్తున్నాను. స్నేహ బాంధవీ.. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి!  మన పెళ్ళి నాడు ఈ ప్రమాణం చేశాము. ఐదు పదుల మన వివాహ బంధాన్ని గుర్తు చేసుకున్నప్పుడు అడుగడుగునా నీవు పాటించి, నా చేత పాటింపజేసిన ప్రతి అంశాన్ని ఈ శ్లోకం గుర్తుకు తెస్తుంది. మన వివాహం నాటికి ముందు నుంచే, నా జీవితం ప్రజలతో పెనవేసుకుపోయింది. ఆ తర్వాత ప్రజలనే తప్ప, కుటుంబాన్ని పట్టించుకున్నది చాలా తక్కువని నీకు బాగా తెలుసు.  అయినప్పటికీ పిల్లలను ప్రయోజకులను చేయడమే గాక, వారి పిల్లల బాధ్యతను కూడా తీసుకుని, భారతీయ కుటుంబ వ్యవస్థకు చిరునామాగా మన కుటుంబాన్ని తీర్చిదిద్దిన తీరు ఉన్నతమైనది. నీదైన, మనదైన ప్రపంచంలో మన పిల్లలతో పాటు ప్రతి ఒక్కరికీ చోటునిచ్చిన ఆప్యాయతానురాగాలను పంచిన తీరు అపురూపం. చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన నాకు, అంతటి అనురాగాన్ని అందించిన అర్ధాంగికి, మనదైన కుటుంబాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన గృహలక్ష్మికి, నా జీవితానికి చేదోడుగా నిలిచిన సహధర్మచారిణికి ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. “శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. నాతో కలిసి ఏడడుగులు నడిచిన నీవు, నా తోడు నీడగా ఏడేడు జన్మలూ నడవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రేమాభినందనలతో...

ఆశ్రమంతో చీకటి డీల్! ఆ బీజేపీ నేతలేనా?

ఎపి బీజేపీకి చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు చిత్తూర్ జిల్లాకు చెందిన ఒక ఆశ్రమంపై జరిగిన ఐటి, ఇడి దాడులలో బయటపడ్డ వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల కేసును తాము ఢిల్లీ స్థాయిలో డీల్ చేసి సెటిల్ చేస్తామని చెప్పి 30 కోట్లు దండుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై ఎపి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖలు చేసారు. ఆ ఆశ్రమంతో డీల్ చేసుకుని 30 కోట్లు దండుకున్నది బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, జివిఎల్ నరసింహారావులే అని తెలుస్తోందని రామకృష్ణ అనంతపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో తెలిపారు. ఏపీలో ప్రజలంతా ఆ పేర్లే చెప్పుకుంటున్నారని.. తాజాగా వస్తున్న ఆరోపణలపై కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు క్లారిటీ ఇవ్వాలని అయన డిమాండ్ చేసారు. క్లారిటీ ఇవ్వాల్సిన బీజేపీ నేతలు తెలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని అయన విమర్సియించారు. మా పార్టీకి చెందిన ఆ ఇద్దరు నేతలు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని బీజేపీ నాయకత్వం స్పష్టమైన ప్రకటన చేయాలనీ అయన డిమాండ్ చేసారు అంతేకాకుండా ఆ ఇద్దరు నేతలు ఈ డీల్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే వారిపైన చర్యలు టీయూకోవాలని రామకృష్ణ డిమాండ్ చేసారు. నిత్యం హిందూ మతం అనే బీజేపీ నేతలు దొంగ స్వాములు కోట్లు కూడబెట్టుకుంటే ఈ దొంగ హిందూ భక్తులు మిలాఖత్ అవుతున్నారని అయన అన్నారు. సిపిఐ నేత రామకృష్ణ చేసిన ఈ సంచలన ఆరోపణలపై బీజేపీ నాయకత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఎస్ఈసీపై ప్రతిపక్షం ఫైర్..

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పై సుదీర్ఘ పోరాటం చేసి చివరకు ప్రభుత్వం దిగివచ్చేలా చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేష్ కుమార్ మారి పోయారా? ఇప్పుడు ఆయనలో ఆ పోరాట పటిమ లోపించిందా? అంటే అవుననే అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఈనెల 10న జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన అఖిలపక్ష సమవేశంలో పాల్గొన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు కమిషన్ తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచారు.  పంచాయతి ఎన్నికలలో అధికార పార్టీ అనేక అక్రమాలక పాల్పడినా,  కమిషన్ ఉదాసీనంగా వ్యవహరిచిందని, అదే విధానం మున్సిపల్,  కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కొనసాగితే మరింత ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుందని తెలుగు దేశం, కాంగ్రెస్, జనసేన, వామ పక్ష పార్టీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేశారు.   తెలుగు దేశం తరపున సమావేశంలో పాల్గొన్నపార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య,ప్రభుత్వం అనేక అవరోధాలు కలిపించినప్పటికీ ఎస్ఈసీ ధైర్యంగా పోరాడి స్థానిక ఎన్నికలు జరిపించడం అభినందనీయం అంటూనే, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిన ఎస్ఈసీ పట్టించుకోవడం లేదని అన్నారు. అలాగే ఇతర పార్టీల నాయకులు కూడా ఎస్ఈసీలో వ్యవహార సరళిలో మార్పు వచ్చిందని, గతంలో లాగా ఆయన కఠిన నిర్ణయాలు తీసుకోవడంలేదని అన్నారు. అయితే, ఎస్ఈసీ నిమ్మగడ్డ, ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకున్నామని, అదే విధంగా హై కోర్టు ఆదేశాలను పాటిస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు.

ఎంఐఎం విస్తరణకు అధినేత వ్యూహం.. తమిళనాడులో పోటీకి రెడీ అంటున్న ఒవైసీ

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర రావు, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇంకొందరు నాయకులు, అనేక సందర్భాలలో తమకున్న జాతీయ ఆకాంక్షలను వ్యక్తపరిచారు.జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామని ఒకరంటే, ఏకంగా ప్రదాని పీఠం మీదనే కన్నేశారు. జాతీయ స్థాయిలో బీజీపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరకంగా కూటములు కడతామని, ఫ్రంట్లు ఏర్పాటు చేస్తామని, టెంట్లు వేస్తామని చాలా చాలా ప్రకటనలు చేశారు. అయితే, ఆ ప్రయత్నాలు ఏవీ కార్యరూపం దాల్చలేదు,వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లుగా  ఒకడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి వేస్తూ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కదలకుండా ఉండిపోయింది. ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనలని ఎన్నికల హమీలతో పాటుగా నాయకులే కాదు, జనం కూడా మరిచి పోతున్నారు. అందుకే, తెలుగు చంద్రుల వెలుగులు సరిహద్దుల గడప దాటడం లేదు. అయితే, మరో వంక పాత  బస్తీ పార్టీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం  ఎలాంటి ప్రకటనలు,ప్రగల్బాలు లేకుండానే, చాలా కూల్ కూల్ ‘గా మెల్ల మెల్లగా ఒక్కొక్క రాష్ట్రలోకి తమ పార్టీ శాఖలను విస్తరించుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలోనే కాదు,దేశంలోనే  ఎన్నిక ఎన్నికకు ఎదుగుతూ, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి విస్తరిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే, అది ఎంఐఎం ఒక్కటే. ఎంఐఎం ఇప్పటికే నలుగు రాష్ట్రాల చట్ట సభలలో స్థానం సంపాదించింది. మహా రాష్ట్రలో గత సంవత్సరామ్ జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు శాసన సభ స్థాలను గెలుచుకున్న ఎంఐఎం ఆ తర్వాత జరిగిన ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో 53 చోట్ల పోటీ చేసి, 25 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకుంది.అంతే కాదు,  మొత్తం 113 స్థానాలున్నా కార్పొరేషన్’లో ఎంఐఎం మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.అలాగే, ఐదారు నెలల క్రితం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఐదు స్థానాలు దక్కించుకుంది.అదే విధంగా ఈమధ్యనే గుజరాత్’లో జరిగిన ఆరు మున్సిపల్  కార్పొరేషన్ల  ఎన్నికల్లో మెత్తం ఏడు చోట్ల విజయ కేతనం ఎగరేసింది . అంతకు ముందే కర్ణాటక స్థానిక సంస్థలలోనూ కాలు పెట్టింది. అలాగే, త్వరలో జరుగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై’ అంటోంది . పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సోమవారం (మార్చి 1)హైదరాబాద్’లో మీడియాతో మాట్లాడుతూ తమిళనాడుతో పాటుగా, బెంగాల్లో కూడా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అంతే కాదు,వచ్చే సంవత్సరం జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నామని ఒవైసీ చెప్పారు. అలాగే, రాజస్థాన్’ లో పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, అందుకోసం  పార్టీ సభ్యులతో కలిసి అక్కడకు   వెళ్తున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీని పరిచయం చేయడానికి ఇంతకన్నా మంచి సమయం లేదన్నారు. నేను ఒక్కడినే రాజకీయంగా బయల్దేరగా.. నాతో పాటు ఎందరో కుటుంబసభ్యులు కలిసి నడిచేందుకు నిర్ణయం తీసుకుంటున్నారని, వారి అండతోనే దేశమంతా ఎంఐఎంను విస్తరిస్తున్నట్లు ఒవైసీ పేర్కొన్నారు. ఇదలా ఉంటే ఒవైసీ బీజేపీతో చేతులు కలిపి, సెక్యులర్ పార్టీలను బలహీన పరిచి, పరోక్షంగా బీజేపీ మేలు చేస్తున్నారని కాంగ్రెస్ సహా సెక్యులర్ పార్టీలు,సెక్యులర్ మీడియా ఆరోపిస్తోంది. అయితేఇటు ఒవైసీ కానీ, అటు  బీజేపీ కానీ, ఈ ఆరోపణలను అసలు పట్టించుకోవడంలేదు.అయితే,, రాజ్దీప్ సర్దేశాయ్ సహా అనేక మంది సీనియర్ జర్నలిస్టులు సైతం ఆరోపిస్తున్నవిధంగా, బీజేపీ,ఎంఐఎం మధ్య ఏదైనా డీల్ ఉందా  లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే, పాతబస్తీ పార్టీ చాప కింద నీరులా ఒక్కొక రాష్ట్రాన్ని చుట్టేస్తోంది అనేది మాత్రం నిజం.  

తేయాకు తోటలో.. ఓట్ల వేటలో.. ప్రియాంక గాంధీ

ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ పార్టీ యువరాణి. చిటికేస్తే అస్సాం టీ.. టేబుల్ మీద రెడీ. అలాంటిది ప్రియాంక గాంధే స్వయంగా అసోం వెళ్లింది. తేయాకు తోటల్లో టీ ఆకులు తెంపింది. తలకు బుట్ట వేసుకొని.. కూలీలతో కలిసి తేయాకులను తెంపారు ప్రియాంక. యువరాణి ఇంతలా కష్టపడింది టీ తాగడం కోసం కాదు. అసోం ఓటర్లను ఆకట్టుకోడానికి.  త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అసోంలో కాంగ్రెస్‌ జోరుగా ప్రచారం సాగిస్తోంది. అసోంలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. ఆమె రెండో రోజులుగా అసోంలో పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రచారంలో భాగంగా బిశ్వనాథ్‌ ప్రాంతంలోని సాధురు టీ ఎస్టేట్‌కు వెళ్లి అక్కడి కూలీలతో మాట్లాడారు.    టీ తోటల్లోకి వెళ్లిన ప్రియాంక.. అక్కడి కూలీలతో కలిసి కాసేపు పనిచేశారు. తలకు బుట్టవేసుకుని తేయాకు తెంపారు. అనంతరం తోట పక్కనే కూర్చుని కూలీలతో ముచ్చటించారు. ‘‘తేయాకు కూలీలు అసోంతో పాటు ఈ దేశానికి కూడా విలువైనవారు. మీ హక్కులను పరిరక్షించేందుకు, మీకు గుర్తింపు తెచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎల్లవేళలా పోరాడుతూనే ఉంటుంది’’ అని ప్రియాంక తెలిపారు.    ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అసోంలో గత ఎన్నికలు హస్తం పార్టీకి గట్టి షాకిచ్చాయి. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దెదించి భాజపా అక్కడ కాషాయ జెండా ఎగురవేసింది. ఈ సారి అసోం ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయితే కీలక నేత, మాజీ సీఎం తరుణ్‌ గొగొయి మరణం కాంగ్రెస్‌కు లోటు. దీంతో ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను ప్రియాంక గాంధీ తీసుకున్నారు. రెండు రోజులుగా అసోంలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. తేయాకు తోటలో పని చేసి, కూలీలతో మాట్లాడి అక్కడి వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు ప్రియాంక గాంధీ. ఆమె అలా సాధారణ వ్యక్తిలా జనంతో కలిసిపోవడం ఆసక్తికరంగా మారింది. 

హరితహారం.. ఎమ్మెల్యే భూబాగోతం!

భూకబ్జాల ఆరోపణలతో నిత్యం వివాదాలలో మునిగి తేలుతున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో కొత్త వివాదానికి కారణమయ్యారు. ప్రధాన రహదారికి దూరంగా ఉన్న తన ఫాంహౌస్ భూముల ధరలు పెంచుకునేందుకు ముత్తిరెడ్డి తెలివిగా ఇత‌ర రైతుల పొలాన్ని ఆక్ర‌మించుకున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. జనగామ జిల్లా నర్మెట్ట మండలం హన్మంతాపూర్‌ వద్ద ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఫామ్‌హౌస్‌ ఉంది. అయితే, ఆ ఫామ్ హౌస్ కు వెళ్లే దారి ఇరుకుగా ఉంది. ఆ రోడ్డును విస్తరించుకుని తన భూముల రేట్లు పెంచుకునేందుకు.. అదేసమయంలో త‌న‌పై ఏ మాత్రం విమ‌ర్శ‌లు రాకుండా ముత్తిరెడ్డి ప‌క‌డ్బందీగా త‌న కబ్జా కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసారు. ఆ రోడ్డు విస్తరణ కోసం, ఎమ్మెల్యే పైసా ఖర్చు పెట్టకుండా.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికోసం ఫామ్ హౌస్ కు వెళ్లే రోడ్డు వెంట ఉన్న రైతుల పొలాలపై ఎమ్మెల్యే గురిపెట్టారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డు వెంట మొక్కలు నాటాలని, దీనికోసం రోడ్డు విస్తరణ చేపడుతున్నామని చెప్పి.. ముందుగా రైతుల పొలాల్లోని పంటలను తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా రైతుల‌కు సంబంధించి 45 ఫీట్ల వరకు పొలాలను కబ్జా చేసారు. అలా అక్రమంగా కబ్జా చేసిన దారి వెంట.. ఎమ్మెల్యే స్వ‌యంగా ద‌గ్గ‌రుండి మొక్క‌లు నాటించారు. ఆ మొక్కలు నాటేందుకు ఎలాంటి అనుమతులూ లేవని, భూమి ఇచ్చేందుకు తాము అంగీకరించకపోయినా.. తమ పంట పొలాల్లోకి జేసీబీలు తెచ్చి దౌర్జన్యంగా భూమిని చదును చేశారని జనగామ-హుస్నాబాద్‌ మార్గంలోని రైతులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే భూకబ్జా వ్యవహారంపై బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, పైగా వారు కూడా ఎమ్మెల్యేకే అనుకూలంగా మాట్లాడుతున్నారని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ కబ్జా వ్యవహారం మీడియా‌కు చేర‌డంతో.. లాభంలేదని .. కొంత మంది రైతుల‌ను పిలిపించుకుని ముత్తిరెడ్డి వారిని స‌మాధాన‌ప‌రిచే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్కువమంది రైతులు మాత్రం దీనిపై సీఎం స్పందించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు

గూగుల్ లో సెర్చ్.. నైట్రోజన్ గ్యాస్ తో బీటెక్ స్టూడెంట్ సూసైడ్.. 

రామకృష్ణ  మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక నైట్రోజన్ వాయువు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మద్దునూరి శివరామకృష్ణ (25) బీటెక్‌ ‌పూర్తి చేశాడు. కొద్ది రోజులుగా అతడు తనను ఎవరో వెంబడిస్తున్నారని, ఆత్మహత్య చేసుకుంటానని బంధువులతో అంటుండేవాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారు. అయినా ఫలితం లేకపోయింది. స్నేహితుడిని కలిసి వస్తానని  హైదరాబాద్‌ వచ్చిన అతను మసాబ్‌ట్యాంక్‌లో హైదరాబాద్‌ హైట్స్‌ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. ఉదయం గది తలుపులు తీయకపోవడంతో హోటల్‌ సిబ్బంది సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా అతడు చనిపోయి ఉన్నాడు. నైట్రోజన్‌ వాయువు పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడని. గూగుల్ లో చూసి నైట్రోజన్ వాయువు పీల్చి చనిపోయి ఉంటాడని పోలీసులు అంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నేటి విద్యార్థులే రేపటి నవభారతపు పునాదులు. ములుకో గమ్యాన్ని చేరుకో, అనే పదాలు పాఠ్యపుస్తకాలకే పరిమితం అవుతున్నాయి. పరీక్షలో ఫెయిల్ అయ్యామని, అమ్మాయి ప్రేమించలేదని, పక్కవాడు అవమానించదని.టీచర్ కొట్టిందని మానసిక ఒత్తిడి పెరిగిందని. ఇలా సమస్య ఏదైనా ప్రాణాలు తీసుకోవడమే సోలుషన్స్ అనుకుంటున్నారు నేటి విద్యార్థులు. తమ భవిష్యత్తుని మరిచి ఆవేదనలో ప్రాణాలు వీడుతున్నారు. బడి నేర్పించిన చదువు అదేనా. లేదా తల్లి దండ్రులు ప్రధమ గురువులుగా నేర్పిన పాఠం సమస్యలు వస్తే తనువుచాలించాలని చెప్పిందా.కారణం ఏదైనా నేటి విద్యార్థులు నిండు ప్రాణాలను బలికోరుకుంటాన్నారు.  

షర్మిలను కలిసిన శ్యామల.. వైసీపీలో చీలిక?

ఇంకా పార్టీయే పెట్టలేదు. జెండా, ఎజెండా ఖరారు కాలేదు. అప్పుడే షర్మిల పార్టీకి ఫుల్ డిమాండ్. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు షర్మిల పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. లోటస్ పాండ్ తో టచ్ లోకి వస్తున్నారు. వరుస భేటీలు, మంతనాలతో మేడమ్ ఫుల్ బిజీ.  లేటెస్ట్ గా ప్రముఖ యాంకర్ శ్యామల.. షర్మిలను కలిశారు. భర్త న‌ర‌సింహారెడ్డితో కలిసి లోటస్ పాండ్ వెళ్లారు శ్యామల. షర్మిలతో పావు గంటలకు పైగా భేటీ అయ్యారు. పార్టీ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. షర్మిల పెట్టబోయే పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు శ్యామల దంపతులు.  అయితే, గతంలో, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు శ్యామల, ఆమె భర్త ఇద్దరూ కలిసి ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. తాజాగా షర్మిలతో భేటీ కావడంతో త్వరలోనే వీరిద్దరూ కొత్త పార్టీలోకి వెళ్తున్నారని తెలుస్తోంది. అంటే.. వైసీపీలో చీలిక వస్తోందా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఇక ముందు కూడా తెలంగాణలో ఉండే వైసీపీ నేతలు ఫ్యాన్ పార్టీని వీడి షర్మిల పార్టీలో చేరబోతున్నారా? శ్యామల దంపతుల బాటలో మరింత మంది వైసీపీ నాయకులు జగన్ కు హ్యాండ్ ఇచ్చి షర్మిలకు జై కొడతారా?  శ్యామల కపుల్స్ లోటస్ పాండ్ వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరి 10న షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పుట్టిన రోజున విషెస్ చెప్పడానికి శ్యామల దంపతులు లోటస్‌పాండ్‌కు వెళ్లి కలిశారు. తాజాగా మరోసారి వీరు షర్మిలతో భేటీ అయ్యారు.  ప్రస్తుతం శ్యామల యాంకర్‌గా, సినిమాల్లో ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. నరసింహా పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. అటు, తెలంగాణలోని పలు జిల్లాల అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో షర్మిల వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 9న షర్మిల పార్టీ పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది.   

మందు కొడుతూ డ్రైవింగ్... నలుగురు మృత్యువాత 

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు.. ప్రజల ప్రాణాలు తీయవద్దు.. అని పోలీసులు, సెలబ్రిటీలు ఎంత మొత్తుకుని చెప్పినా మందుబాబులు మాత్రం తగ్గడంలేదు. మరికొంతమంది మందుబాబులు ఇంకో అడుగు ముందుకేసి మందు కొడుతూ డ్రైవ్ చేస్తుండడంతో ఘోర ప్రమాదాలు చోటు చేసుకుని ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పోలీసులు ఎన్ని డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినా మందుబాబులు ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి సమీపంలో నిన్న అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. బెంగళూరువైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక కారు కియా కార్ల కంపెనీ ప్రధాన గేట్ వద్ద ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న వారిలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు మృతి చెందారు. మృతులను బెంగళూరుకు చెందిన మనోజ్ మిట్టల్, ఢిల్లీకి చెందిన కాంచల్ సింగ్, రేఖ, మహబూబ్ ఆలంగా గుర్తించారు. వీరంతా కర్ణాటకలోని యశ్వంత్ పూర్ నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా కారు డ్రైవర్ బీరు తాగుతూ ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేయడమే ప్రమాదానికి ముఖ్యకారణమని పోలీసులు గుర్తించారు. మరణించిన వారి మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.          

మార్చి 2.. మహమ్మారి రోజు..

మార్చి రెండు. మరచి పోలేని, మరవ కూడని రోజు. గత ఏడాది ఇదే రోజున తెలంగాణలో కరోనా మహమ్మారి కాలు పెట్టింది, ఇదే రోజున రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఈ సంవత్సర కాలంలో, సుమారు మూడు లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 1,635 మందిని కొవిడ్ మహమ్మారి బలి తీసుకుంది. ఇంకా ఇప్పటికీ రాష్ట్రంలో సుమారు 2 వేల మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇంకా ఈ రోజుకూ వందకు పైగానే కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒకరో ఇద్దరో అయినా కన్నుమూస్తున్నారు. ప్రపంచంలో మరణమృదంగం మోగించిన కరోనా మహమ్మారి, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న తీసుకున్న వ్యూహాత్మక చర్యల వల్ల నామమాత్రపు హానితోనే బయటపడిందని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా కాలుపెట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా, మహమ్మారిపై పోరులో, ముందుండి పోరాటం చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ ను మంత్రి అభినందిచారు. “సొంత వారు కూడా దగ్గరికి రాని సమయంలో ప్రేమ, ఆప్యాయతలతో ధైర్యంగా చికిత్స అందించిన డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, హెల్త్ వర్కర్స్ కి,  పారిశుద్ధ్య కార్మికులకు,  పోలీసులకు కరోనా మహమ్మారి పై పోరాటం ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు” అంటూ అయన అభినందించారు.  ప్రభుత్వ చర్యలకు ప్రజల సహకారం కూడా తోడు కావడంతో కరోనా పై పోరాటం కూడా ఉద్యమ స్థాయిలో నడిచి జనజీవనం ఏడాది తిరగకుండానే సాధారణ స్థాయికి చేరుకుంది. కరోనా మహమ్మారి లాంటి ఆరోగ్య విపత్తు సంభవించినా ఎదుర్కొనే సామర్ధ్యాన్ని,  నైపుణ్యాన్ని,  అనుభవాన్ని తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకుంది. వాక్సిన్ ఒక్కటే ఈ మహమ్మారిని పారద్రోలడానికి మన ముందున్నశాశ్వత పరిష్కారం అన్నారు మంత్రి. భయాందోళనలు వీడి ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా, ప్రభుత్వం సూచించిన సలహాలు సూచనలు పాటిస్తూ మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం కొనసాగించాలని విజ్ఞప్తి మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు.  ఈ సంవత్సర కాలంలో కరోనా మహమ్మారి మహా విపత్తునే సృష్టించింది. మనుషుల మధ్య గోడలు కట్టింది. దురాన్ని పెంచింది. చివరకు చివరి చూపులకు కూడా నోచుకోలేని విషాదాన్ని మిగిల్చింది. అందుకే ఇది మరిచి పోలేని, మరిచి పోకూడని  రోజు.

ఇది రెడ్ల రాజ్యమా? ఎంతమందిని అడ్డుకుంటారు?

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నది రెడ్ల రాజ్యమా? లేక ప్రజారాజ్యమా? రెడ్డియేతర సామాజిక వర్గాలను తొక్కేస్తారా? అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వ వైఖరి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీరును తప్పుబట్టారు.  ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబును సొంత జిల్లాలో, నియోజకవర్గంలో తిరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఆయన సెల్‌ఫోన్‌ను పోలీసులు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో పర్యటించకుండా తననూ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు ఎంపీ రఘురామకృష్ణంరాజు.   పనిగట్టుకుని ఇతర సామాజిక వర్గాల ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారు. రెడ్డి కాకపోవడంవల్లే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రాజకీయంగా విజయసాయిరెడ్డి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యాసంస్థలకూ కులగజ్జి అంటించే స్థాయికి దిగజారడం బాధాకరం. ఎంతో విశిష్టత ఉన్న ఆంధ్రా యూనివర్సిటీని రెడ్డి కులానికి వేదిక చేస్తున్నారు. ఆంధ్రా వర్సిటీలో విజయసాయిరెడ్డి.. రెడ్డి కుల సభ నిర్వహంచడం ఎంతవరకు సబబు? తక్షణమే గవర్నర్‌ జోక్యం చేసుకుని వీసీ ప్రసాదరెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సాగుతున్న దమనకాండపై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.  

పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి, వైసీపీ డ్రెస్ వేసుకోండి..

  పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి, వైసీపీ డ్రెస్ వేసుకోండంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ కేంద్రమంత్రి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వమంటూ విమర్శించారు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.  వైసీపీ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోందన్నారు కోట్ల. ప్రభుత్వ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. అందుకే, ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే దైర్యం వైసీపీ నాయకులు లేదని విమర్శించారు.  కర్నూలు పార్లమెంట్ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం నాలుగు ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు నిధులు విడుదల చేశారని గుర్తుచేశారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే దమ్ము వైసీపీ ఎమ్మెల్యేలకు లేదంటూ విమర్శించారు. 

డెడ్ బాడీకి పింఛన్.. 

ఆమె ప్రతినెల పింఛన్ తీసుకుంటుంది. కానీ ఈనెల తన మృతదేహం పింఛన్ డబ్బులు తీసుకుంది. మృతదేహం పింఛన్ తీసుకోవడం ఏంటని అనుకుంటున్నారా. అవును ఇది నిజం. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో నారాయణమ్మ అనే వృద్ధురాలికి చనిపోయిన తర్వాత ఆమె చేతి నుంచి బయోమెట్రిక్‌ తీసుకుని పింఛన్ అందజేశారు. గ్రామంలోని ఒకటో వార్డు గొల్లవీధికి చెందిన ఎర్ర నారాయణమ్మ వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఒకటో తేదీన పింఛను ఇచ్చేందుకు ఎప్పటిలా ఆమె ఇంటికి వచ్చిన వలంటీర్‌ త్రినాథ్‌ వృద్ధురాలు ఇంటికి వచ్చాడు. ఆమె మృతిచెందడం గమనించాడు. కుటుంబ సభ్యులకు పింఛను డబ్బులు అందజేసి ప్రాణం కోల్పోయిన వృద్ధురాలు నారాయణమ్మ చేతి నుంచి బయోమెట్రిక్‌ తీసుకున్నాడు. అంతేకాకుండా మృతదేహంతో ఫొటో తీసుకుని సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

సినిమాల్లోకి ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంట్రీ!

తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా  ఎమ్మెల్యే రాజా సింగ్ గు చెప్పుకుంటారు.  2018తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్.   ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండే రాజా సింగ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. శంభాజీ మహా రాజ్ జీవిత గాధ ఆధారంగా సినిమాను తీయనున్నారు. అందులో శంభాజీ పాత్రను పోషించబోతున్నాడు రాజా సింగ్.   తాను నటించబోతున్న సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుసు కానీ ఆయన కుమారుడు శంభాజీ గురించి మాత్రం ఎవరికీ తెలియదన్నారు. శివాజీ కంటే ప్రమాదకరమైన నాయకుడు. శివాజీ మరణించిన తర్వాత .. ఔరంగజేబు సామ్రాజ్యంపై శంభాజీ దాడి చేసి 120 కోటలను స్వాధీనం చేసుకున్నారని శంభాజీ. ఆయన జీవిత గాధపై సినిమా చేయాలని.. అందులో నేనే నటించాలని అనుకున్నానని రాజా సింగ్ తెలిపారు.  ఈ సినిమా కోసం తన బరువు 170 కేజీలు ఉంటే 90 కేజీలకు తగ్గినట్లు చెప్పాడు రాజా సింగ్. శంభాజీ పాత్ర కోసం.. అప్పట్లో ఆయన ఫిజిక్ ఎలా ఉండేదో అలాంటి బాడీ కోసం కసరత్తులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు తెలుగు, హిందీ, మరాఠీ సహా మొత్తం 4 భాషల్లో సినిమా తీయనున్నట్లు చెప్పారు రాజా సింగ్. ప్రస్తుతం నిర్మాత కోసం వెతుకుతున్నామని  చెప్పారు. నిర్మాత దొరికితే వెంటనే చిత్రీకరణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. సినిమా తీసేంత ఆర్థిక స్థోమత తనకు లేదని.. ఒకవేళ ఉంటే తానే స్వయంగా శంభాజీ చిత్రాన్ని నిర్మించేవాడినని తెలిపారు. అందరి మాదిరి తన సినిమాలలో హీరోయిన్లతో పాటలు ఉండవని.. కామెడీ సన్నివేశాలు కనిపించవని.. కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుంది అని చెప్పారు రాజా సింగ్.  శంభాజీ రాజే భోంస్లే.. 1657, మే 14న జన్మించారు. ఈయన మరాఠా సామాజ్రానికి రెండో రాజు. మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు శివాజీ, ఆయన మొదటి భార్య సాయి భోంస్లేకు పెద్ద కుమారుడు.. ఈ శంభాజీ. శివాజీ తర్వాత ఆయన వారసునిగా మరాఠా సామ్రాజ్యాన్ని పాలించారు. 1689, మార్చి 11న శంభాజీ మరణించారు. ఆయన 20 జులై, 1860 నుంచి 11 మార్చి, 1689 వరకు మరాఠా సామ్రాజ్యాన్ని పాలించారు. శంభాజీని మొగల్ చక్రవర్తులు కుట్రచేసి బంధించి.. చిత్రహింసలు పెట్టి చంపారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నీ అప్పగించి.. ఇస్లాంలోకి మారితే.. వదలిపెడతానని మొగల్ చక్రవర్తులు చెప్పారు. కానీ ఆయన ప్రాణం పోయినా ఇస్లాంలోకి మారనని స్పష్టం చేశారు. దాంతో శంభాజీని జైల్లో బంధించి.. చిత్రహింసలు పెట్టి.. చంపేసినట్లు చరిత్ర చెబుతోంది. అలాంటి వీరుడి బయోపిక్‌లో రాజాసింగ్ నటించనుండడంతో ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

పార్లమెంట్ లో కేసీఆర్ దొంగ సంతకాలు!  

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలో తాను పార్లమెంటుకు హాజరు కాకున్నప్పటికీ, వచ్చినట్టుగా హాజరుపట్టికలో తన బదులు మరొకరితో సంతకాలు చేయించారని ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకుండానే హాజరైనట్టుగా మరొకరితో సంతకాలు చేయించారని వివరించారు. కేసీఆర్ పార్లమెంటును తప్పుదోవ పట్టించడంపై తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని, చర్యలు తీసుకునే ధైర్యం బీజేపీకి ఉందా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పార్లమెంటులో ఆ సంతకాలు ఎవరివో బండి సంజయ్ ఫోరెన్సిక్ పరీక్ష చేయించగలడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పార్లమెంటుకు ఎన్నిసార్లు హాజరయ్యాడో చెప్పాలన్నారు కేసీఆర్.  బండి సంజయ్, కేసీఆర్ విడివిడిగా కనిపించినా, వారిద్దరూ ఒక్కటేనని అన్నారు. బండి, కారు ఒక్కటేనని విమర్శించారు. కేసీఆర్ చదువుకుంది బీఏనే అని, కానీ ఎంఏ చదువుకున్నట్టు పార్లమెంటుకు తప్పుడు సమాచారం అందించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

63 మంది ఎమ్మెల్యేలకు నో ఛాన్స్! 

151 మంది ఎమ్మెల్యేలు. 22మంది లోక్ సభ, ఆరుగురు రాజ్యసభ ఎంపీలు. చట్ట సభల్లో అట్టహాసంగా కొలువుదీరింది జగన్ రెడ్డి ప్రభుత్వం. కాలం గిర్రున తిరిగింది. 21 నెలలు ముగిసింది. పాలు, నీళ్లు తేటతెల్లమవుతున్నాయి. జగన్ రెడ్డి అసలు స్వరూపం బట్టబయలవుతోంది. పార్టీ అధినేతగా ఆయనో మోనార్క్. ప్రభుత్వాధినేతగానూ అదే వన్ మ్యాన్ షో. వైసీపీకి ఆయనే సుప్రీం. సర్కారుకూ ఆయనే షో మ్యాన్. మరి, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల మాటేంటి? వారు ఎందుకూ పనికి రాని షో పీస్ లా? జగన్ దర్బార్ లో వారికి అసలు ప్రాధాన్యతే లేదా? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ అంతర్గత వర్గాలు.  వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 151. గ్రాండ్ ఫిగర్. అసెంబ్లీలో ఫుల్ పవర్. చెప్పుకోడానికి వాళ్లంతా ఎమ్మెల్యేలే. అయితేనేం.. జగన్ ముందు అంతా మోకరిల్లాల్సిందే. కనీసం ముఖ్యమంత్రిని కలవాలన్నా పడిగాపులు పడాల్సిందే. అయినా, సీఎం దర్శనం కలిగితేగా.  ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 151 మంది ఎమ్మెల్యేల్లో 63 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిని కలవలేదట. ఎన్నిసార్లు అడిగినా ఆ ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదట. నియోజక వర్గ సమస్యలు చెప్పుకుందామని, పార్టీ మేటర్ డిష్కస్ చేద్దామని సీఎం ఇంటికి వెళితే.. వారిని కలిసేందుకు జగన్ కు నో టైమ్. ఆ.. వారినేంటి కలిసేదనే ఫీలింగ్. ఇలా అనేక మంది తాడేపల్లిలోని జగన్ నివాసానికి రావడం.. సీఎంను కలవకుండానే తిరిగి వెళ్లిపోవడం జరిగిపోతోందట. ఇప్పటి వరకు సీఎం జగన్ ను ఒక్కసారి కూడా కలవని ఎమ్మెల్యేల సంఖ్య.. అక్షరాలా 63 అని లెక్కేసి మరీ చెబుతున్నారు వైసీపీ వర్గాలు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం అంటున్నారు. అసెంబ్లీ కొలువుదీరినప్పుడు సైతం జగన్ ప్రత్యేకంగా ఎమ్మెల్యేలను కలిసేది ఉండదు. దూరం నుంచే అలా నమస్కారం చేసి తన కుర్చీలో తాను కూర్చుంటారు. పార్టీ శాసన సభా పక్ష సమావేశాల్లోనూ ఇదే తీరు. ఎమ్మెల్యేలంతా ఒకవైపు.. డయాస్ పై జగన్ ఒక్కరూ మరోవైపు. సారొస్తారు. చెప్పాల్సింది చెప్పేస్తారు. వెళ్లిపోతారు. అంతే. ఎమ్మెల్యేలను కలిసేది.. వారితో మాట్లాడేది.. వారు చెప్పేది వినేది అంటూ ఏమీ ఉండదు. అక్కడ ప్రజాస్వామ్య పద్దతులు ఉండవు. అంతా నియంత్రుత్వమే. అదే జగన్ స్టైల్. ది రూలర్.  ఎమ్మెల్యేలనే కాదు ఎంపీలతోనూ అదే తీరు. వైసీపీకి 22+6 ఎంపీలు ఉంటే.. వారిలో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలకు మాత్రమే జగన్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇస్తారట. మిగతా పార్లమెంట్ సభ్యులు జగన్ ను కలవాలంటే అస్సలు కుదరదట. ఎంపీలైనా వారితో భేటీకి ముఖ్యమంత్రి ఆసక్తి చూపరని చెబుతున్నారు. ఈ రెండేళ్లలో సీఎంతో మీటింగ్ కు ఎన్నిసార్లు ప్రయత్నించినా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ లభించలేదట. వారంతా ఒక్కసారి కూడా జగన్ తో ఫేస్ టూ ఫేస్ భేటీ అవలేదంటే నమ్మాల్సిందే. ఇక ముఖ్యమంత్రే పట్టించుకోకపోతే నియోజక వర్గంలో పెండింగ్ పనులెలా పూర్తయ్యేది? గ్రామస్థాయిలో చిన్న చిన్న సమస్యలు ఉంటే.. వాలంటీర్లతో పని అయిపోతోంది. అందుకే, కింది స్థాయిలో ఎమ్మెల్యేకంటే వాలంటీర్లకే ఎక్కువ రెస్పెక్ట్ ఉంటోంది. ఇక పెద్ద సమస్యలేవైనా ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళితే.. ఆ పని పూర్తి చేయడం సదరు ప్రజాప్రతినిధికి చాలా కష్టం అవుతోందట. ఎంతకీ సీఎం అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో.. పనులన్నీ అలానే పెండింగ్ లో ఉంటున్నాయట. పనులు చేయించలేక కేడర్ లో పరువు పోతోంది. ముఖ్యమంత్రి తమను పట్టించుకోవడం లేదని బయటకు చెబితే పరపతి పోతుంది. అందుకే, కక్కలేక, మింగలేక.. అనేక మంది వైసీపీ ప్రజాప్రతినిధులు తెగ ఇదై పోతున్నారని అంటున్నారు.  జగన్ రెడ్డి నియంత్రుత్వ పోకడలపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆప్ లైన్లో అనేక ఆరోపణలు చేస్తున్నారు. మైక్ ముందుకు వచ్చే సరికి జననేతంటూ తెగ పొగుడుతున్నారు. తేలు కుట్టిన నేతల్లా.. లోలోన మదనపడుతున్నారు.

ఆ ఇద్దరు కీ ఇస్తే ఆడే బొమ్మ ఈ హోంమంత్రి! 

ఏపీ హోంమంత్రి సుచరిత పై టీడీపీ నేత, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సుచరిత కేవలం కీ ఇస్తే ఆడే ఒక బొమ్మ మాత్రమేనని, ఆ బొమ్మకు సీఎం జగన్ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి కీ ఇస్తేనే ఆడుతుందని ఆమె విమర్శించారు. 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగంలో రాష్ట్రంలో ఒక్క ఆడపిల్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని అనిత విమర్శించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన అనూషను హత్య చేసిన ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. నిందితుడి పేరు పక్కన రెడ్డి అని ఉంటే.. చర్యలు తీసుకోవడానికి పోలీసులు కూడా భయపడుతున్నారని అనిత ఎద్దేవా చేశారు. తమపేరులో రెడ్డి అని తోక ఉంటే రాష్ట్రంలో ఎంతటి అరాచకమైనా చేయవచ్చా అని అనిత ప్రశ్నించారు. ఇంకోపక్క జగన్ స్వంత పత్రిక సాక్షిలో నిందితుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరులో రెడ్డిని తీసేసి మరీ వార్త ప్రచురించారని ఆమె విమర్శించారు. దిశా చట్టం ఒక దిక్కుమాలిన చట్టమని... ఒక చట్టాన్ని సక్రమంగా తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందని అనిత విమర్శించారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందే జగన్ వస్తాడని మంత్రులు, వైసిపి నేతలు, ఊదరగొట్టారని, మరి నరసరావుపేట అనూష కేసుపై సీఎం జగన్ ఎందుకు స్పందించలేదని అనిత ప్రశ్నించారు. అనూష కేసులో 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడితే సీఎం జగన్‌కు తాము సలాం చేస్తామన్నారు. మరోపక్క ఒక విద్యార్థిని దారుణ హత్యకు గురైతే స్థానిక వైసిపి ఎమ్మెల్యే అయిన అంబటి రాంబాబు కనీసం స్పందించడా అని అనిత నిలదీశారు.

విజయసాయిపై 'ట్రోల్'తీత

విజయసాయిరెడ్డి. ట్విట్టర్ పక్షి. ఎప్పుడూ నీతులు చెప్పే నేత నీతి తప్పాడు. అధికారంలో ఉండి అడ్డదిడ్డంగా ప్రవర్తించాడు. నిబంధనలకు తూట్లు పొడిచాడు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. ఎంపీ బాటలోనే మంత్రి సైతం రూల్స్ బ్రేక్ చేశాడు.  జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విజయసాయి రెడ్డి నగరంలో ప్రచారం చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో గొప్పగా పోస్ట్ చేసుకున్నారు. ఆ బైక్ ర్యాలీ ఫోటోలను చూసిన నెటిజన్లు విజయసాయిని, అవంతి శ్రీనివాస్ ను తెగ ఆడుకుంటున్నారు. మేటర్ ఏంటంటే.. బైక్ నడుపుతూ వారిద్దరూ హెల్మెట్ పెట్టుకోలేదు.  అధికారంలో ఉన్న నేతలే ఇలా నిబంధనలు పట్టించుకోకుండా, హెల్మెట్ లేకుండా బైక్ నడపడమేంటని సోషల్ మీడియాలో తెగ ప్రశ్నిస్తున్నారు. కామెంట్లతో కుమ్మేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం ఓ నేరమైతే.. బహిరంగా ప్రదేశంలో ర్యాలీ నిర్వహిస్తూ ఆ ఇద్దరు నేతలు మాస్క్ కూడా పెట్టుకోకపోవడం కొవిడ్ నిబంధనలకు విరుద్ధం. బాధ్యత గల పదవుల్లో ఉండి.. హెల్మెట్ ధరించకుండా బుల్లెట్ నడపటంతో పాటు కొవిడ్ రూల్స్ అతిక్రమించడంతో ఇరువురు నేతలు విమర్శలకు గురవుతున్నారు. ఏపీలో ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఒక పక్క ప్రభుత్వమే భారీ జరిమానాలు విధిస్తుంటే... మరోపక్క ఆ ప్రభుత్వంలోని వారే నిబంధనలు గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏపీలో హెల్మెట్ లేని ప్రయాణానికి రూ.1000 జరిమానా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. యథారాజా తథాప్రజా అన్నట్టు.. ఆ ఇద్దరు నేతల వెనక ఉన్నవారూ హెల్మెట్ లేకుండా వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు. ఆ ఫొటోలు స్వయంగా విజయసాయిరెడ్డే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ట్రోల్స్ తో పండగ చేసుకుంటున్నారు నెటిజన్స్.