కరోనా ఎఫెక్ట్.. మేడారం కు ఎవరూ రావద్దు..
posted on Mar 1, 2021 @ 9:55AM
మేడారంలో సమ్మక్క సారలమ్మ మినీ జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక పక్క రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అయితే ఈ మినీ జాతరలో కరోనా కలకలంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమ్మక్క సారలమ్మ ఆలయ సిబ్బందిలో ఇద్దిరికి కరోనా సోకడంతో 21 రోజులపాటు భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్టుగా తెలిపారు. భక్తులెవరు అప్పటి వరకు వనదేవతల దర్శనానికి రావొద్దని అధికారులు కోరుతున్నారు. మేడారంలో మినీ జాతర ఫిబ్రవరి 24న మొదలై 27వ తేదీ వరకు జరిగింది. అయితే అమ్మవార్ల దర్శనానికి నెల రోజుల ముందు నుండి భక్తులు తండోప తండాలుగా వచ్చారు. దీంతో ఆలయ సిబ్బందిలో ఇద్దరికీ రెండు రోజుల క్రితం కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయింది.
ఈ నేపథ్యంలో భక్తులు, గ్రామ ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని మూడు వారాల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో రాజేంద్రం, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. ఈ నెల 21 వరకు భక్తులు ఎవరూ దర్శనానికి రావొద్దని అభ్యర్థించారు. ఇదే సమయంలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నప్పటికీ ఆలయంలో పూజలు మాత్రం యధాతధంగా ఉంటాయని వారు తెలిపారు.