అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
posted on Mar 1, 2021 @ 3:28PM
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దైంది. మార్చి 4, 5 తేదీల్లో తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. తిరుపతి సమావేశానికి ఏపీతో పాటు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలు, లక్షద్వీప్ నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. అమిత్ షా తిరుపతి షెడ్యూల్ కూడా ఖరారైంది. తాజాగా అమిత్ షా తన తిరుపతి పర్యటన రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. అయితే అమిత్ షా తిరుపతి పర్యటన ఎందుకు రద్దయిందన్న దానిపై కారణాలు తెలియరాలేదు.
దేశంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో ప్రచారం సాగించేందుకు వీలుగా అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నట్టు భావిస్తున్నారు. ముఖ్యంగా, 8 విడతల్లో పోలింగ్ జరుపుకోనున్న పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దాంతో అమిత్ షా అధిక సమయం పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై దృష్టి సారించేందుకు ఈ పర్యటనకు రాబోవడంలేదని తెలుస్తోంది.
అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు కావడం ఏపీలో నిరుత్సాహం కల్గిస్తోంది. తిరుపతి లోక్ సభకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. తిరుపతి లోక్ సభలో ప్రయోజనం కల్గుతుందనే ఆలోచనతోనే అమిత్ షా పాల్గొనే దక్షిణాది రాష్ట్రాల సమావేశాన్ని తిరుపతిలో ఏర్పాటు చేశారనే ప్రచారం కూడా జరిగింది. తిరుపతికి అమిత్ షా వస్తుండటంతో.. ఆ ప్రభావం ఉప ఎన్నికపై ఉంటుందని ఏపీ కమలనాధులు భావించారు. తాజాగా అమిత్ షా టూర్ రద్దు కావడంతో వారంతా ఢీలా పడ్డారు.