సొంత జిల్లాలోకి బాబుకు నో ఎంట్రీ!
posted on Mar 1, 2021 @ 10:45AM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలోకి అడుగు పెట్టేందుకు అనుమతి లేకుండా పోయింది. తిరుపతిలో చంద్రబాబు తలపెట్టిన నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్నాయంటూ చంద్రబాబును ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు.చంద్రబాబు నిరసనలకు అనుమతించటం లేదని ఈస్ట్ డీఎస్పీ తెలిపారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు ధర్నా నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నానితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అందరిని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు.
టీడీపీ అధినేత తిరుపతిలో సోమవారం సాయంత్రం 4 గంటలకు గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నిరసనలకు అనుమతిలేదని టీడీపీ పార్టీ కార్యాలయానికి, తిరుపతి మాజీ ఎమ్మెలే సుగుణమ్మకు, నరసింహ యాదవ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి అనుమతి కోరుతూ ఆదివారం టీటీడీ నేతలు లేఖ ఇచ్చినా, అర్ధ రాత్రి అనుమతి నిరాకరిస్తున్నట్టు, సోషల్ మీడియాలో తమకు విషయం తెలిసినట్టు టీడీపీ నేతల ఇండ్లకు పోలీసులు నోటీసులు అతికించారు. చంద్రబాబు ధర్నా కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. దీంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చంద్రబాబు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. హౌస్ అరెస్టు చేసిన చిత్తూరు టీడీపీ నేతలను తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు స్వేచ్ఛగా ప్రజల వద్దకు వెళ్లే హక్కులేదా అని నిలదీశారు. వేలాది మందితో కుల సంఘాల మీటింగులు, ర్యాలీలు, సభలు, పెట్టుకోడానికి అనుమతి ఇస్తున్న ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ఎన్నికల్లో వైసీపీ మంత్రులు చేసిన అక్రమాలు బట్టబయలు అవుతాయన్న భయంతోనే అనుమతి ఇవ్వటం లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. చంద్రబాబు పర్యటన చూసి మండుటెండలో కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వణికిపోతున్నారన్నారు. ప్రజాక్షేత్రంలోనే తమ వైఫల్యాలు, అవినీతిని, గూండాగిరిని ప్రజలకు వివరిస్తామని...తమ పాలనపై ప్రజలు విసిగెత్తారు కాబట్టే ప్రజల తరపున నిలబడుతున్న నేతలను ఇళ్లలో నిర్భందిస్తున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.